Old/New Testament
సమాధాన ప్రభువు వస్తున్నాడు
11 యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది. 2 ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది. 3 ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు.
ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు. 4-5 బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.
6 ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు. 7 ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు. 8 ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది.
9 అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.
10 ఆ సమయంలో యెష్షయి కుటుంబంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఒక పతాకంలా ఉంటాడు. రాజ్యాలన్నీ తన చుట్టూ సమావేశం కావాలని ఈ “పతాకం” చూపిస్తుంది. తాము చేయాల్సిన వాటిని గూర్చి రాజ్యాలు అతణ్ణి అడుగుతాయి. అతడు ఉండే స్థలం మహిమతో నిండిపోతుంది.
11 ఆ సమయంలో నా ప్రభువు (దేవుడు) మరల తన చేయిచాచి, మిగిలిన తన ప్రజలను తీసుకొంటాడు. దేవుడు ఇలా చేయటం రెండోసారి. (అష్షూరు, ఉత్తర ఈజిప్టు, దక్షిణ ఈజిప్టు, ఇథియోపియ, ఏలాము, బబులోను, హమాతు ప్రపంచంలోని దూర దేశాలన్నింటిలో మిగిలి ఉన్న దేవుని ప్రజలు వీరు.) 12 దేవుడు ఈ “పతాకాన్ని” మనుష్యులందరికీ ఒక సంకేతంగా నిలబెడతాడు. ఇశ్రాయేలు, యూదా ప్రజలు బలవంతంగా వారి దేశంనుండి వెళ్ల గొట్టబడ్డారు. ఆ ప్రజలు భూమిమీద దూర దేశాలన్నింటికీ చెదర గొట్టబడ్డారు. అయితే దేవుడు వాళ్లందరినీ మళ్లీ ఒక చోట సమావేశపరుస్తాడు.
13 ఆ సమయంలో ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) యూదాపై అసూయపడదు. యూదాకు శత్రువులు ఎవ్వరూ మిగిలి ఉండరు. మరియు యూదా, ఎఫ్రాయిముకు కష్టం కలిగించదు. 14 అయితే ఎఫ్రాయిము, యూదా కలిసి ఫిలిష్తీయుల మీద దాడిచేస్తారు. ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఒక చిన్న జంతువును పట్టుకొనేందుకు, క్రిందగా ఎగిరే రెండు పక్షుల్లా ఉంటారు. వారిద్దరూ కలిసి తూర్పు ప్రజల ఐశ్వర్యాలు దోచుకొంటారు. ఎదోము, మోయాబు, అమ్మోను ప్రజలను ఎఫ్రాయిము, యూదా తమ ఆధీనంలో ఉంచుకొంటారు.
15 యెహోవా కోపగించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అదే విధంగా యూఫ్రటీసు నదిమీద యెహోవా తన చేయి ఊపుతాడు. ఆయన నదిని కొడ్తాడు. ఆ నది ఏడు చిన్న నదులుగా విభజించబడుతుంది. ఆ చిన్న నదులు లోతుగా ఉండవు. ప్రజలు చెప్పులతోనే ఆ నదులు దాటగలుగుతారు. 16 దేవుని శేషజనం అష్షూరును విడిచి వెళ్లటానికి వారికి దారి ఉంటుంది. అది, ఇశ్రాయేలీయులను దేవుడు ఈజిప్టు నుండి బయటకు నడిపించినప్పటిలా ఉంటుంది.
దేవునికి ఒక స్తుతిపాట
12 ఆ సమయంలో మీరంటారు:
“యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
నీకు నామీద కోపం వచ్చింది.
కానీ ఇప్పుడు నామీద కోపగించకుము.
నీ ప్రేమ నాకు చూపించు.”
2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు.
యెహోవా, యెహోవాయే నా బలం.[a]
ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి.
అప్పుడు మీరు సంతోషిస్తారు.
4 “యెహోవాకు స్తోత్రాలు!
ఆయన నామం ఆరాధించండి!
ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి”
అని అప్పుడు మీరు అంటారు.
5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి.
ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక.
దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి.
పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
6 సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు.
అందుచేత, సంతోషంగా ఉండండి!
బబులోనుకు దేవుని సందేశం
13 బబులోను విషయంలో విచారకరమైన ఈ సందేశాన్ని ఆమోజు కుమారుడు యెషయాకు దేవుడు చూపించాడు.
2 దేవుడు చెప్పాడు: “పతాకాన్ని బోడి కొండమీద[b] ఎగుర వేయండి.
మగ సిపాయిలను పిలువండి.
మీ చేతులు ఊపండి.
ప్రముఖుల ద్వారాల్లోంచి ప్రవేశించమని వారితో చెప్పండి.”
3 దేవుడు చెప్పాడు: “వాళ్లను నేను ప్రజల్లో నుండి వేరు చేశాను.
నేనే వాళ్లకు సారథ్యం వహిస్తాను.”
నేను కోపంగా ఉన్నాను. ప్రజలను శిక్షించటం కోసం నేను నా పరాక్రమవంతుల్ని సమావేశపర్చాను.
ఆనంద భరితులైన ఈ మనుష్యులను గూర్చి నేను గర్విస్తున్నాను.
4 “కొండల్లో పెద్ద శబ్దం అవుతోంది. ఆ శబ్దం వినండి!
అది విస్తారమైన ప్రజల శబ్దంలా ఉంది.
అనేక రాజ్యాల ప్రజలు కూడుకొంటున్నారు.
సర్వశక్తిమంతుడైన యెహోవా తన సైన్యాలను ఒక్కటిగా చేరుస్తున్నాడు.
5 ఈ సైన్యం, యెహోవా, చాలా దూరదేశంనుండి వస్తున్నారు.
ఆకాశపు అంచుల ఆవలినుండి వారు వస్తున్నారు.
యెహోవా తన కోపం ప్రదర్శించటానికి ఈ సైన్యాన్ని ఒక ఆయుధంలా వాడుకొంటాడు.
ఈ సైన్యం దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది.”
6 యెహోవా ప్రత్యేక దినం దగ్గర్లో ఉంది. అందు చేత ఏడ్చి, మీ కోసం దుఃఖపడండి. శత్రువు మీ ఐశ్వర్యాలు దొంగిలించే సమయం వస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు దానిని సంభవింపజేస్తాడు. 7 ప్రజలు వారి ధైర్యం కోల్పోతారు. భయం ప్రజలను బలహీనులను చేస్తుంది. 8 ప్రతి వ్యక్తీ భయపడుతూంటాడు. స్త్రీ ప్రసవవేదనలా, వారి భయం వారికి కడుపులో బాధ పుట్టిస్తుంది. వారి ముఖాలు అగ్నిలా ఎర్రగా మారుతాయి. ఈ భయంచూపులు వారి పొరుగువారందరి ముఖాలమీద కూడా కనబడతాయి గనుక ప్రజలు ఆశ్చర్య పడతారు.
బబులోనుకు విరుద్ధంగా దేవుని తీర్పు
9 చూడండి, యెహోవా ప్రత్యేక దినం వచ్చేస్తుంది. అది చాలా భయంకర దినం. దేవుడు మహా కోపంతో, దేశాన్ని నాశనం చేస్తాడు. పాపం చేసే వాళ్లందరినీ దేవుడు దేశంలోనుండి బలవంతంగా వెళ్లగొట్టేస్తాడు. 10 ఆకాశాలు చీకటి అవుతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశించవు.
11 దేవుడు చెబుతున్నాడు, “నేను ప్రపంచానికి కీడు జరిగిస్తాను. చెడ్డవాళ్ల పాపాన్ని బట్టి వాళ్లను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల గర్వం పోయేట్టు నేను చేస్తాను. ఇతరుల యెడల నీచంగా ప్రవర్తించే వారి అతిశయాన్ని నేను నిలిపివేస్తాను. 12 కొద్దిమంది ప్రజలు మాత్రమే మిగిలి ఉంటారు. బంగారం దొరకటం అరుదులాగే మనుష్యులు కూడ అరుదుగా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ మనుష్యులు స్వచ్చమైన బంగారం కంటె ఎక్కువ విలువగలిగి ఉంటారు. 13 నేను, నా కోపంతో ఆకాశాన్ని వణికిస్తాను. భూమి స్థానం తప్పుతుంది.”
సర్వశక్తిమంతుడైన యెహోవా తన కోపం ప్రదర్శించిన రోజున అది జరుగుతుంది. 14 అప్పుడు బబులోను ప్రజలు గాయపడిన జింకల్లా పారిపోతారు. కాపరి లేని గొర్రెల్లా వారు పారిపోతారు. యుద్ధానికి వచ్చే ప్రతి సైనికుడూ వెనుదిరిగి తన స్వదేశానికి, స్వజనుల దగ్గరకు పారిపోతాడు. 15 అయితే శత్రువు బబులోను ప్రజలను తరుముతాడు. మరియు శత్రువు ఒక మనిషిని పట్టుకొన్నప్పుడు, అతనిని శత్రువు ఖడ్గంతో చంపేస్తాడు. 16 వారి ఇండ్లలో సమస్తం దోచుకోబడుతుంది. వారి భార్యలు మానభంగం చేయబడతారు. ప్రజలు చూస్తూ ఉండగానే వారి పిల్లలను చచ్చేవరకు కొడతారు.
17 దేవుడు చెబుతున్నాడు: “చూడండి, మాదీయ సైన్యాలు బబులోను మీద దాడి చేసేట్టు నేను చేస్తాను.” మాదీయ సైన్యాలకు వెండి బంగారాలు చెల్లించినా సరే, వారు దాడి చేయటం ఆపు చేయరు. 18 సైనికులు దాడి చేసి బబులోను యువకులను చంపేస్తారు. పిల్లల మీద కూడ ఆ సైనికులు జాలి చూపించరు. బాలుర యెడల ఆ సైనికులు దయ చూపించరు. బబులోను నాశనం చేయబడుతుంది. అది సొదొమ గొమొర్రాల సర్వనాశనంలా ఉంటుంది. దేవుడు ఈ వినాశం కలుగచేస్తాడు, అక్కడ ఏమీ మిగిలి ఉండదు.
19 “రాజ్యాలన్నింటిలో బబులోను చాలా అందమయింది. బబులోను ప్రజలకు వారి పట్టణం గూర్చి చాలా అతిశయం. 20 కానీ బబులోను అందంగా ఇక ఉండదు. భవిష్యత్తులో ప్రజలు యికమీదట అక్కడ నివసించరు. అరబ్బులు అక్కడ వారి గుడారాలు వేయరు. గొర్రెలను అక్కడ మేపేందుకు కాపరులు వాటిని అక్కడికి తీసుకొనిరారు. 21 అక్కడ నివసించే జంతువులు అడవి మృగాలు మాత్రమే. ప్రజలు బబులోనులోని ఇండ్లలో నివసించరు. ఆ ఇండ్ల నిండా గుడ్లగూబలు, పెద్ద పక్షులు ఉంటాయి. అడవి మేక పోతులు ఆ ఇండ్లలో ఆడుతూంటాయి. 22 బబులోనులోని అందమైన గొప్ప భవనాలలో అడవి కుక్కలు, తోడేళ్లు మొరుగుతూ ఉంటాయి. బబులోను అంతం అయిపోతుంది. బబులోను అంతం దగ్గర్లో ఉంది. బబులోను నాశనాన్ని నిదానం కానివ్వను.”
క్రీస్తు దేహంలో ఐక్యత
4 ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించమని ప్రభువు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2 అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి. 3 శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. 4 శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. 5 ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. 6 ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు.
7 క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. 8 అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:
“ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు.
మానవులకు వరాలిచ్చాడు.”(A)
9 “ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి నాడనే అర్థం కదా! 10 క్రిందికి దిగినవాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి సమస్తమును నింపి వేసాడు. 11 పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. 12 అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. 13 కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు.
14 అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. 15 మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. 16 శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది.
వెలుగు పిల్లలుగా జీవించటం
17 ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి. 18 వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. 19 వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. 20 కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు. 21 మీరు యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు. 22 మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. 23 మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. 24 దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి.
25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. 26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. 27 సాతానుకు అవకాశమివ్వకండి. 28 దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు.
29 దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్నవాళ్ళకు లాభం కలగాలి. 30 మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 31 మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. 32 దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
© 1997 Bible League International