Old/New Testament
సిరియాతో చిక్కు
7 ఆహాజు యోతాము కుమారుడు. యోతాము ఉజ్జియా కుమారుడు. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు, పెకహు ఇశ్రాయేలు రాజు. ఆహాజు యూదాకు రాజుగా ఉన్న కాలంలో, రెజీను, పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్లారు. కాని వారు ఆ పట్టణాన్ని ఓడించలేక పోయారు.
2 దావీదు కుటుంబానికి ఒక సందేశం ఇవ్వబడింది. “అరాము (సిరియా) సైన్యం, ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) సైన్యం ఒకటిగా కలిశాయి. రెండు సైన్యాలు కలిసి బసచేస్తున్నాయి” అనేది ఆ సందేశం. అహాజు రాజు ఈ సందేశం విన్నప్పుడు అతడు, ప్రజలు చాలా భయపడిపోయారు. అరణ్యంలో గాలికి కొట్టుకొనే చెట్లలా వారు భయంతో వణకి పోయారు.
3 అప్పుడు యెషయాతో యెహోవా చెప్పాడు, “నీవూ, నీ కుమారుడూ షెయార్యాషూబు వెళ్లి ఆహాజుతో మాట్లాడండి. పైకోనేటిలోకి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లండి. ఇది చాకలివాని పొలానికి పోయే దారిలో ఉంది.
4 “ఆహాజుతో చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, గాని నెమ్మదిగా ఉండండి. భయపడవద్దు. వాళ్లిద్దరు మనుష్యులు, అంటే రెజీను, రెమల్యా కుమారుడు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. వాళ్లు కాలిపోయిన రెండు కట్టెల్లాంటి వాళ్లు. గతంలో వాళ్లు వేడిగా మండుతూండేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లు వట్టి పొగ మాత్రమే. రెజీను, సిరియా, రెమల్యా కుమారుడు కోపంగా ఉన్నారు. 5 వారు మీకు విరోధంగా పథకాలు వేశారు. 6 మనం వెళ్లి యూదా మీద యుద్ధం చేయాలి. యూదాను మనలో మనం పంచుకొందాం. టాబెయేలు కుమారుణ్ణి యూదాకు క్రొత్త రాజుగా చేద్దాము” అని వారన్నారు.
7 నా దేవుడైన యెహోవా చెబుతున్నాడు, “వారి పథకం పనిచేయదు. అది సంభవించదు. 8 రెజీను దమస్కుకు పాలకునిగా ఉన్నంతవరకు అది జరుగదు. ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) ఇప్పుడు ఒక రాజ్యం. కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) రాజ్యంగా ఉండదు. 9 ఎఫ్రాయిముకు షోమ్రోను రాజధానిగా ఉన్నంత వరకు, రెమల్యా కుమారుడు దాని పాలకునిగా ఉన్నంతవరకు వారి పథకం నెరవేరదు. ఈ సందేశాన్ని నీవు నమ్మకపోతే ప్రజలు నిన్ను నమ్మగూడదు.”
ఇమ్మానుయేలు-దేవుడు మనతో ఉన్నాడు
10 అప్పుడు యెహోవా ఆహాజుతో మాట్లాడటం కొనసాగించాడు. 11 యెహోవా చెప్పాడు: “ఈ సంగతులు సత్యం అని నీ మట్టుకు నీవు రుజువు చేసుకొనేందుకు ఒక సూచన కోసం అడుగు. నీకు కావాల్సిన ఏ సూచన కోసమైనా నీవు అడగవచ్చు. ఆ సూచన పాతాళమంత లోతునుండి రావచ్చు, లేక ఆ సూచన ఆకాశమంత ఎత్తునుండి అయినా రావచ్చును.”
12 కాని ఆహాజు, “రుజువుగా సూచన కావాలి అని నేను అడగను. యెహోవాను నేను పరీక్షించను” అన్నాడు.
13 అప్పుడు యెషయా చెప్పాడు, “దావీదు వంశమా, జాగ్రత్తగా ఆలకించు. మీరు ప్రజల సహనాన్ని పరీక్షిస్తారు. కానీ అది మీకు ముఖ్యంకాదు. కనుక మీరు ఇప్పుడు నా దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు. 14 కాబట్టి ఆయనే మీకు ఒక సూచన చూపిస్తాడు.
ఇదిగో ఒక కన్య గర్భము ధరించి, ఒక కుమారుడ్ని కని,
ఆయన్ని ఇమ్మానుయేలు అనే పేరుతో పిలుస్తుంది.
15 అతను పెరుగు, తేనె తినును
చెడును విసర్జించి మంచిని చేపట్టి తెలివి వచ్చేవరకు అతను ఇలా జీవిస్తాడు.
16 కానీ ఆ బాలుడు మంచి, చెడులను తెలుసుకొనక ముందే
ఎఫ్రాయిము (ఇశ్రాయేలు), సిరియా నిర్జనం అయిపోతాయి. మీరు ఆ ఇద్దరు రాజులను గూర్చి భయపడుతున్నారు.
17 “కానీ మీరు యెహోవాను గూర్చి భయపడాలి. ఎందుకంటే యెహోవా మీకు కొన్ని కష్టకాలాలను తీసుకొని వస్తాడు. మీ ప్రజలకు, మీ తండ్రివంశ ప్రజలకు ఆ కష్టాలు వస్తాయి. దేవుడేమి చేస్తాడు? మీ మీద యుద్ధం చేయటానికి అష్షూరు రాజును యెహోవా తీసుకొని వస్తాడు.
18 “ఆ సమయంలో యెహోవా ‘జోరీగల్ని’ రప్పిస్తాడు. (ఆ ‘జోరీగలు’ ఇప్పుడు ఈజిప్టు నదుల దగ్గర ఉన్నాయి) మరియు యెహోవా కందిరీగల్ని రప్పిస్తాడు. (కందిరీగలు ఇప్పుడు అష్షూరు దేశంలో ఉన్నాయి.) ఈ శత్రువులు మీ దేశానికి వస్తారు. 19 ఈ శత్రువులు అరణ్యపు బండ సందుల దగ్గర మెట్టల లోయల్లోను, పొదల దగ్గర, నీటి మడుగుల దగ్గర ఉంటాయి. 20 యూదాను శిక్షించటానికి యెహోవా అష్షూరును వాడుకొంటాడు. అష్షూరు కూలికి వినియోగించబడే మంగలి కత్తిలా ఉపయోగించబడుతుంది. అది యూదా తలమీద, కాళ్లమీద, వెంట్రుకలను యెహోవా తానే గీసేస్తున్నట్టుగా ఉంటుంది. అది యూదా గడ్డాన్ని యోహోవా గీసేస్తున్నట్టుగా ఉంటుంది.
21 “ఆ సమయంలో ఒక మనిషి ఒక ఆవును, రెండు గొర్రెలను మాత్రమే ప్రాణంతో ఉంచుకో గలుగుతాడు. 22 ఆ ఒక్క మనిషి తినడానికి సరిపోయే పెరుగు, పాలు మాత్రమే ఉంటాయి. దేశంలో ప్రతి మనిషి పెరుగు, తేనె మాత్రమే తింటాడు. 23 ఈ దేశంలో వెయ్యేసి ద్రాక్షావల్లులు ఉన్న పొలాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక్కో ద్రాక్షావల్లి వెయ్యి వెండి నాణాల విలువ చేస్తుంది. కాని ఈ పొలాలు గచ్చపొదలు, బలురక్కసి చెట్లతో నిండిపోతాయి. 24 దేశం అడవిగా తయారై, వేట ప్రదేశంగా మాత్రమే ఉపయోగపడుతుంది. 25 ఒకప్పుడు ఈ కొండల మీద ప్రజలు పనిచేసి, ఆహారం పండించారు. కానీ ఆ సమయంలో మనుష్యులు అక్కడికి వెళ్లరు. దేశమంతా గచ్చపొదలతో, బలురక్కసి చెట్లతో నిండిపోతుంది. గొర్రెలు, పశువులు మాత్రమే ఆ స్థలాలకు వెళ్తాయి.”
అష్షూరు త్వరలో వస్తుంది
8 యెహోవా నాతో చెప్పాడు, “వ్రాయటానికి ఒక పెద్ద పలక తీసుకో. ఘంటంతో (పెన్నుతో) ఈ మాటలు వ్రాయి: ‘మహేరు, షాలాల్, హాష్ బజ్.’ (అంటే ‘త్వరలోనే దోపిడి, దొంగతనం జరుగుతుంది’ అని అర్థం.)”
2 సాక్షులుగా నమ్మదగిన కొందరు మనుష్యుల్ని నేను సమావేశపర్చాను. (వీళ్లు ఊరియా, యెబెరెక్యా, జెకర్యా) నేను ఈ విషయాలు వ్రాయటం ఈ మనుష్యులు గమనించారు. 3 తర్వాత నేను ప్రవక్త్రి దగ్గరకు వెళ్లాను. నేను ఆమెతో ఉన్న తర్వాత ఆమె గర్భవతియై, ఒక కుమారుని కన్నది. అప్పుడు యెహోవా నాతో చెప్పాడు, “పిల్లవాడికి మహేరు షాలాల్ హాష్‌బజ్” అని పేరు పెట్టు. 4 ఎందుకంటే ఆ పిల్లవాడు “అమ్మా” “నాన్నా” అనటం నేర్చుకొనక ముందే దమస్కు, షోమ్రోనుల ధనం, ఐశ్వర్యాలు దేవుడు తీసుకొని, వాటిని దేవుడు అష్షూరు రాజుకు ఇచ్చివేస్తాడు.
5 దేవుడు మళ్లీ నాతో మాట్లాడాడు. 6 నా ప్రభువు చెప్పాడు: “ఈ ప్రజలు నిదానంగా ప్రవహించే షిలోహు[a] జలాలను స్వీకరించేందుకు నిరాకరించారు. రెజీను, రెమల్యా కుమారునితో (పెకహు) వీళ్లు సంతోషపడి పోతున్నారు. 7 అందుచేత చూడు, నా యెహోవా మహా గొప్ప యూఫ్రటీసు నదీ ప్రవాహంలాగా అష్షూరును దాని శక్తి అంతటిని తీసుకొని వస్తున్నాడు. వారు ఒక నది పొంగి పొర్లేలా, ప్రవాహంలా మీ దేశంలోనికి వస్తారు. 8 ఆ నదిలోంచి నీళ్లు పొంగి యూదాలోకి ప్రవహిస్తాయి. యూదా గొంతుల వరకు నీళ్లు పొంగి, యూదాను దాదాపుగా ముంచేస్తాయి.
“ఇమ్మానుయేలూ, నీ దేశం అంతటినీ ముంచివేసేంతగా ఈ వరద విస్తరిస్తుంది.”
9 సర్వ దేశాల్లారా, యుద్ధానికి సిద్ధపడండి.
కాని మీరు ఓడిపోతారు.
దూర దేశాలన్నీ ఆలకించండి.
యుద్ధానికి సిద్ధపడండి.
కానీ మీరు ఓడిపోతారు
10 యుద్ధానికి మీ వ్యూహాలు పన్నండి.
కానీ మీ వ్యూహాలు అన్నీ ఓడిపోతాయి.
మీ సైన్యాలకు ఆజ్ఞాపించండి.
కానీ మీ ఆజ్ఞలు నిష్ప్రయోజనమే. ఎందుకంటే, దేవుడు మాతో ఉన్నాడు[b] గనుక.
యెషయాకు హెచ్చరికలు
11 యెహోవా తన మహా శక్తితో నాతో మాట్లాడాడు. ఈ ఇతర మనుష్యుల్లా ఉండొద్దని యెహోవా నన్ను హెచ్చరించాడు. 12 “ప్రతివారూ ఇతరులు తమకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నట్టు చెబుతున్నారు. నీవు ఆ విషయాలు నమ్మవద్దు. ఆ ప్రజలు భయపడే వాటికి నీవు భయపడవద్దు. వాటిగూర్చి నీవు భయపడవద్దు” అని యెహోవా నాతో చెప్పాడు.
13 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక్కడికే మీరు భయపడాలి. మీరు గౌరవించాల్సిన వాడు ఆయనే. మీరు భయపడాల్సింది ఆయనకే. 14 మీరు యెహోవాను గౌరవించి, ఆయనను పవిత్రునిగా ఎంచుకొంటే, అప్పుడు ఆయనే మీకు క్షేమస్థానంగా ఉంటాడు. కానీ మీరు ఆయనను గౌరవించరు. కనుక మీరు పడిపోయేట్టు చేసే బండ ఆయనే. ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబాలను తొట్రిల్లేలా చేసే బండ ఆయనే. యెరూషలేము ప్రజలందరినీ పట్టుకొనే బోను యెహోవాయే. 15 (అనేకమంది మనుష్యులు ఈ బండ తగిలి పడిపోతారు. వాళ్లు పడిపోయి, విరిగిపోతారు. వారు బోనులో పట్టుబడతారు.)
16 యెషయా చెప్పాడు, “ఒక ఒడంబడిక చేసి, దాన్ని ముద్రించండి. నా ఉపదేశాలను భవిష్యత్తు కోసం భద్రపర్చండి. నన్ను అనుసరించే వాళ్లు చూస్తూ ఉండగా దీనిని చేయండి.”
17 ఆ ఒడంబడిక ఇదేః యెహోవా మాకు సహాయం చేసేవరకు నేను వేచి ఉంటాను.
యాకోబు (ఇశ్రాయేలు) వంశం విషయం యెహోవా సిగ్గు పడుతున్నాడు. ఆయన వాళ్లను చూచేందుకు నిరాకరిస్తున్నాడు.
కానీ నేను యెహోవా కోసం నిరీక్షిస్తాను.
ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు.
18 “ఇశ్రాయేలు ప్రజలకు నేనూ, నా పిల్లలే సూచనగా రుజువుగా ఉన్నాము. సీయోను కొండమీద నివాసం చేసే సర్వశక్తిమంతుడైన యెహోవా మమ్మల్ని పంపించాడు.”
19 కొంతమంది, “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు పిట్టల్లా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను అడుగుతారు. బ్రతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్లను ఏదైనా ఎందుకు అడగాలి? 20 మీరు ఉపదేశాలను, ఒడంబడికను అనుసరించాలి. ఈ ఆదేశాలు మీరు అనుసరించకపోతే, మీరు తప్పు ఆదేశాలను పాటించవచ్చు. (తప్పు ఆదేశాలు అంటే జ్యోతిష్కులు, మాంత్రికులు దగ్గర్నుండి వచ్చేవి. అవి ఎందుకూ పనికి రాని ఆదేశాలు. ఆ ఆదేశాలను పాటించటం వల్ల మీకేమీ లాభం ఉండదు.) 21 ఆ తప్పు ఆదేశాలను మీరు పాటిస్తే దేశంలో కష్టాలు, ఆకలి ఉంటాయి. ప్రజలు ఆకలితో ఉంటారు. అప్పుడు వాళ్లకు కోపం వచ్చి రాజును, అతని దేవుళ్లను తిడతారు. అప్పుడు వాళ్లు సహాయం కోసం దేవునివైపు చూస్తారు. 22 వారు వారి దేశంలో చుట్టూరా చూస్తే, కష్టం కృంగదీసే చీకటి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల దుఃఖపు చీకటి మాత్రమే వారికి కనబడుతుంది. మరియు ఆ చీకట్లో పట్టుబడిన మనుష్యులు తమను తాము విడిపించుకోలేరు.
క్రీస్తులో పునర్జీవం
2 ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు. 2 అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ పని చేస్తుంది. 3 నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్నవాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము.
4 కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. 5 మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. 6 మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. 7 యేసు క్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు.
8 మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు. 9 అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. 10 దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.
మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము
11 మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 12 అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 13 కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు.
14 మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. 15 ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. 16 ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. 17 క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. 18 ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.
19 అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. 20 మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. 21 ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. 22 ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.
© 1997 Bible League International