Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 5-6

యూదా, దేవుని ద్రాక్షాతోట

ఇప్పుడు నేను నా స్నేహితునికి (దేవుడు) ఒక పాట పాడుతాను. నా స్నేహితునికి తన ద్రాక్షావనం మీద (ఇశ్రాయేలు) ఉన్న ప్రేమను గూర్చిన పాట ఇది.

మంచి సారవంతమైన భూమిలో
    నా స్నేహితునికి ఒక ద్రాక్షతోట ఉంది.
నా స్నేహితుడు పొలం దున్ని, చదును చేశాడు.
    అక్కడ మంచి ద్రాక్ష మొక్కల్ని అతడు నాటాడు.
ఆ పొలం మధ్యలో అతడు ఒక గోపురం కట్టాడు.
    అక్కడ మంచి ద్రాక్షలు పండుతాయని
నా స్నేహితుడు ఎదురు చూశాడు.
    కాని అక్కడ కారు ద్రాక్షలే పండాయి.

కనుక దేవుడు చెప్పాడు: “యెరూషలేములో నివసిస్తున్న ప్రజలారా, ఓ యూదా మనిషి,
    నన్ను గూర్చి, నా ద్రాక్షాతోట గూర్చి ఆలోచించు.
నా ద్రాక్షా తోటకు సహాయపడుటకు ఇంతకంటె ఎక్కువ నేనేం చేయాలి?
    నేను చేయగలిగింది అంతా చేశాను.
మంచి ద్రాక్షలు పండుతాయని నేను ఎదురు చూశాను.
    కానీ కారు ద్రాక్షాలే ఉన్నాయి
    ఎందుకు అలా జరిగింది?

“నా ద్రాక్షాతోటకు నేను ఏమి చేస్తానో ఇప్పుడు నేను మీతో చెబుతాను.
తోటను కాపాడుతోన్న ముళ్ల కంచెను
    నేను లాగివేసి, దాన్ని కాల్చేస్తాను.
దాని రాతి గోడను నేను కూలగొట్టేస్తాను.
    ఆ రాళ్లు కాళ్ల క్రింద తొక్కబడతాయి.
నా ద్రాక్షా తోటను నేను బీడు భూమిగా చేస్తాను.
    దాని మొక్కల్ని ఎవరూ లెక్క చేయరు. ఆ పొలంలో ఎవ్వరూ పని చేయరు.
    కలుపు మొక్కలు, ముళ్లపొదలు అక్కడ పెరుగుతాయి.
ఆ పొలం మీద వర్షించ వద్దని మేఘాలకు నేను ఆజ్ఞాపిస్తాను.”

సర్వశక్తిమంతుడైన యెహోవాకు చెందిన ద్రాక్షాతోట ఇశ్రాయేలు రాజ్యం. యెహోవాకు ప్రియమైన ద్రాక్షావల్లి యూదా మనిషి.[a]

యెహోవా న్యాయం కోసం నిరీక్షించాడు.
    కాని అక్కడ చంపటం మాత్రమే ఉంది.
అంతా లక్షణంగా ఉంటుంది అని యెహోవా నిరీక్షించాడు.
    కానీ అక్కడ బాధించబడిన ప్రజల ఆర్త ధ్వనులే ఉన్నాయి.

మీరు చాలా కిక్కిరిసి నివసిస్తారు. ఇంక దేనికి స్థలంలేనంతగా మీరు ఇళ్లు నిర్మించేస్తారు. కానీ యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దేశం మొత్తంలో మీరు మాత్రమే ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవా నాతో ఇలా చెప్పాడు, నేను అది విన్నాను, “ఇప్పుడు చాలా ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లన్నీ నాశనం చేయబడుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అందమైన పెద్ద భవనాలు ఉన్నాయి. కానీ ఆ ఇళ్లు ఖాళీ అయిపోతాయి. 10 ఆ సమయంలో ఒక పదెకరాల ద్రాక్షాతోట కొంచెం మాత్రమే ద్రాక్షారసం ఇస్తుంది. చాలా బస్తాల గింజలతో కొద్దిపాటి ధాన్యం మాత్రం దిగుబడి అవుతుంది.”

11 మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగాలని చూస్తుంటారు. ద్రాక్షామద్యంతో మత్తెక్కి రాత్రి చాలాసేపు మెళకువగా ఉంటారు. 12 మీరు ద్రాక్షామద్యంతో, సితారాలు, డప్పులు, పిల్లన గ్రోవులు, ఇతర సంగీత వాయిద్యాలతో మీరు విందులు చేసుకొంటారు. యెహోవా చేసిన కార్యాలు మీరు చూడరు. యెహోవా హస్తాలు ఎన్నెన్నో కార్యాలు చేశాయి. కాని మీరు వాటిని గమనించరు. అందుచేత అది మీకు చాలా కీడు.

13 యెహోవా చెబుతున్నాడు: “నా ప్రజలు బంధించబడి తీసుకొని పోబడతారు. ఎందుకంటే వారు నిజంగా నన్నెరుగరు. ఇశ్రాయేలులో నివసిస్తున్న మనుష్యులు ఇప్పుడు చాలా ప్రముఖలు. వారి సుఖ జీవనాలతో వారు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ గొప్ప వాళ్లంతా దప్పిగొంటారు, ఆకలితో ఉంటారు. 14 అప్పుడు వారు చనిపోతారు, పాతాళం మరింత మంది మనుష్యులతో నిండిపోతుంది. ఆ మరణ స్థానం అపరిమితంగా దాని నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ మనుష్యులంతా ఆ పాతాళంలోకి వెళ్లిపోతారు.”

15 ఆ మనుష్యులు తగ్గించబడతారు. ఆ గొప్పవాళ్లంతా తలలు వంచి నేలమీదికి చూస్తారు. 16 సర్వశక్తిమంతుడైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు, ఆయన గొప్పవాడని ప్రజలు తెలుసుకొంటారు. పవిత్ర దేవుడు సరైన వాటినే చేస్తాడు, ప్రజలు ఆయనను గౌరవిస్తారు. 17 ఇశ్రాయేలు ప్రజలు వారి దేశం విడిచి వెళ్లిపోయేట్టుగా దేవుడు చేస్తాడు, దేశం శూన్యం అవుతుంది. గొర్రెలు వాటికి ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాయి. ఒకప్పుడు ధనికులదైన భూమిమీద గొర్రె పిల్లలు నడుస్తాయి.

18 ఆ మనుష్యుల్ని చూడండి. మనుష్యులు తాళ్లతో బండ్లను లాగినట్టు, వాళ్లు తమ పాపాల్ని దోషాన్ని వారి వెనుక లాగుతున్నారు. 19 వాళ్లు అంటారు: “దేవుడు చేయాలనుకొనే పనులు ఆయన త్వరగా చేస్తే బాగుండును. అప్పుడు జరిగేది ఏమిటో మాకు తెలుస్తుంది. యెహోవా పథకం త్వరగా జరిగిపోతే బాగుండును. ఆయన పథకం ఏమిటో అప్పుడు మాకు తెలుస్తుంది.”

20 ఆ మనుష్యులు మంచివాటిని చెడ్డవి అంటారు, చెడ్డవాటిని మంచివి అంటారు. వెలుగును చీకటి అని, చీకటిని వెలుగు అని వాళ్లు అనుకొంటారు. వాళ్లు చేదును తీపి, తీపిని చేదు అనుకొంటారు. 21 వాళ్లు చాలా తెలివిగల వాళ్లు అని ఆ మనుష్యులు తలస్తారు. వాళ్లు చాలా జ్ఞానంగలవాళ్లు అని తలస్తారు. 22 ద్రాక్షామద్యం తాగటంలో ఆ మనుష్యులు చాలా ప్రసిద్ది. మద్యము కలపటంలో వారు ప్రముఖులు. 23 మీరు వారికి డబ్బు చెల్లిస్తే, వారు నేరస్థుల్ని క్షమించేస్తారు. కానీ వారు మంచి వాళ్లకు న్యాయం జరుగనివ్వరు. 24 ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. గడ్డి, ఆకులు అగ్నితో కాల్చివేయబడినట్టు, వారి సంతతివారు పూర్తిగా నాశనం చేయబడతారు. చచ్చి, ధూళిగా తయారయ్యే వేరులా వారి సంతానంవారు పూర్తిగా నాశనం చేయబడతారు. అగ్ని నాశనం చేసిన ఒక పువ్వులా వారి సంతతివారు నాశనం చేయబడతారు. దాని బూడిద గాలితో కొట్టుకొని పోతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ఉపదేశాలకు విధేయులయ్యేందుకు వారు నిరాకరించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) సందేశాన్ని ఆ ప్రజలు అసహ్యించుకొన్నారు. 25 అందుచేత యెహోవా తన ప్రజల మీద చాలా కోపగించాడు. యెహోవా తన చేయి పైకెత్తి, వాళ్లను శిక్షిస్తాడు. పర్వతాలు సహా భయపడి పోతాయి. చచ్చిన శవాలు చెత్తలా వీధుల్లో పడి ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన హస్తం ఇంకా పైకెత్తబడిఉంటుంది.

ఇశ్రాయేలును శిక్షించటానికి దేవుడు సైన్యాలను రప్పిస్తాడు

26 చూడండి! చాలా దూరంలో ఉన్న దేశాలకు దేవుడు ఒక సంకేతం ఇస్తున్నాడు. దేవుడు ఒక పతాకాన్ని ఎగుర వేస్తున్నాడు, మరియు ఆ ప్రజలను పిలిచేందుకు ఆయన ఈల వేస్తున్నాడు.

శత్రువు దూరదేశం నుండి వస్తున్నాడు. త్వరలోనే శత్రువు దేశంలో ప్రవేశిస్తాడు. వారు చాలా వేగంగా కదలుతున్నారు. 27 శత్రువు ఎన్నటికీ అలసిపోడు, పడిపోడు. వారెన్నటికీ నిద్రబోతులుగా నిద్రపోరు. వారి ఆయుధ పట్టాలు ఎల్లప్పుడూ సిద్దమే. వారి చెప్పుల తాళ్లు ఎప్పటికి తెగిపోవు. 28 శత్రువుల బాణాలు చాలా పదునుగా ఉంటాయి. వారి బాణాలన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉంటాయి. గుర్రాల డెక్కలు బండలా గట్టిగా ఉంటాయి. వాటి రథాల వెనుక ధూళి మేఘాలుగా లేస్తుంది.

29 శత్రువు గట్టిగా అరిస్తే, అది సింహగర్జనలా ఉంటుంది. అది కొదమ సింహపు గర్జన అంత గట్టిగా ఉంటుంది. శత్రువు తాను పోరాడుతున్న ప్రజలను ఎదురులేకుండా పట్టి లాగుకొని పోతాడు. ప్రజలు కొట్టుమిట్టాడి, తప్పించుకొనేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లను రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. 30 కనుక “సింహం” గట్టిగా సముద్ర ఘోషలా గర్జిస్తుంది. బంధించబడిన ప్రజలు నేలమీదికే చూస్తుంటారు, అప్పుడు చీకటి మాత్రమే ఉంటుంది. దట్టమైన ఈ మేఘంలో వెలుగంతా చీకటిగానే ఉంటుంది.

దేవుడు యెషయాను ప్రవక్తగా ఉండమని పిలుచుట

ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరం నా ప్రభువును నేను చూశాను. మహా ఎత్తయిన సింహాసనంమీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంగీతో దేవాలయం నిండిపోయింది. సెరాపులనే దేవదూతలు ఆయన పైగా నిలబడ్డారు. ఒక్కొక్క సెరాపు దేవదూతకు ఆరు రెక్కలు ఉన్నాయి. ఆ దేవదూతలు వారి ముఖాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు, పాదాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు మరియు ఎగిరేందుకు రెండేసి రెక్కలు ఉపయోగించారు. దేవదూతలు ఒకరితో ఒకరు, “ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన మహిమ భూలోకమంతా నిండిపోయింది” అని ఘనంగా స్తుతిస్తున్నారు. వారి స్వరాలు గడప కమ్ముల్ని కదలించి వేశాయి. అంతలో దేవాలయం ధూమంతో నిండిపోవటం మొదలయింది.

“అయ్యో! నాకు శ్రమ, నేను నాశనమయ్యాను. నేను అశుద్ధమైన పెదవులున్న వాడను, నేను అపరిశుద్ధమైన పెదవులున్న జనుల మధ్య నివసిస్తున్నాను. సైన్యములకధిపతియైన యెహోవాను నేను చూశాను.”

బలిపీఠం మీద అగ్ని ఉంది. సెరాపు దేవదూతల్లో ఒకరు ఆ అగ్నిలో నుండి మండుచున్న ఒక నిప్పుకణాన్ని తీయటానికి ఒక పట్టకారు ఉపయోగించారు. మండుతున్న ఆ నిప్పుకణం చేతపట్టుకొని ఆ దేవదూత నా దగ్గరకు ఎగిరి వచ్చాడు. ఆ సెరాపు దేవదూత ఆ వేడి నిప్పుకణంతో నా నోటిని తాకాడు. అప్పుడు ఆ దూత, “చూడు, ఈ వేడి నిప్పుకణం నీ పెదాలను తాకింది గనుక నీవు చేసిన తప్పులన్నీనీలో నుండి పోయాయి. ఇప్పుడు నీ పాపాలు తుడిచివేయబడ్డాయి.” అని చెప్పాడు.

అప్పుడు నా ప్రభువు స్వరం నేను విన్నాను. “నేను ఎవర్ని పంపగలను? మా కోసం ఎవరు వెళ్తారు?” అన్నాడు యెహోవా.

కనుక నేను “ఇదుగో నేను ఉన్నాను, నన్ను పంపించు” అన్నాను.

అప్పుడు యెహోవా చెప్పాడు, “వెళ్లి, ప్రజలతో ఇది చెప్పు: ‘మీరు దగ్గరగా వచ్చి వింటారు గాని గ్రహించరు! దగ్గరగా వచ్చి చూస్తారు గాని నేర్చుకోరు.’ 10 ప్రజల్ని గందరగోళం చేయి. ప్రజలు విని, చూచే విషయాలు వారు గ్రహించకుండా ఉండేటట్టు చేయి. నీవు ఇలా చేయకపోతే, ప్రజలు వారి చెవులతో వినే విషయాలను నిజంగానే గ్రహించవచ్చు. ప్రజలు వారి మనస్సుల్లో నిజంగానే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వారు అలా కనుక చేస్తే, ఆ ప్రజలు మళ్లీ నా దగ్గరకు తిరిగి వచ్చి, స్వస్థత పొందుతారేమో (క్షమాపణ)!”

11 అప్పుడు నేను “ప్రభూ, ఎన్నాళ్లు నేను ఇలా చేయాలి?” అని అడిగాను.

యెహోవా జవాబిచ్చాడు, “పట్టణాలు నాశనం చేయబడి, ప్రజలు వెళ్లిపోయేంత వరకు ఇలా చేయి. ఇళ్లలో మనుష్యులు ఎవ్వరూ నివసించకుండా ఉండే అంతవరకు ఇలా చేయి. దేశం నాశనం చేయబడి, నిర్జనం అయ్యేంతవరకు ఇలా చేయుము.”

12 ప్రజలు దూరంగా వెళ్లిపోయేట్టు యెహోవా చేస్తాడు. దేశంలో విస్తారమైన ప్రదేశాలు నిర్జనంగా ఉంటాయి. 13 అయితే పదోవంతు ప్రజలు దేశంలో ఉండేందుకు అనుమతించబడతారు. ఈ ప్రజలు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు గనుక వీరు నాశనం చేయబడరు. ఈ ప్రజలు సింధూర వృక్షంలాంటి వారు. చెట్టు నరికి వేయబడినప్పుడు, దాని మొద్దు విడువబడుతుంది. ఈ మొద్దు (మిగిలిన ప్రజలు) చాలా ప్రత్యేకమైన విత్తనం.

ఎఫెసీయులకు 1

దైవేచ్ఛవల్ల యేసుక్రీస్తు అపొస్తలుడు అయిన పౌలు నుండి యేసుక్రీస్తును విశ్వసించే ఎఫెసులోని[a] పవిత్రులకు:

మన ప్రభువైన యేసు క్రీస్తు, మన తండ్రియైన దేవుడు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించు గాక!

క్రీస్తులో ఆత్మీయ దీవెనలు

మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి కలుగుగాక! దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు. మనము తన దృష్టియందు పవిత్రంగా ఏ తప్పూ చెయ్యకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమవల్ల ఎన్నుకొన్నాడు. యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలని సృష్టికి ముందే నిర్ణయించాడు. ఇదే ఆయన ఉద్దేశ్యము. ఇలా చేయటమే ఆయన ఆనందం! కనుక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని తాను ప్రేమిస్తున్న క్రీస్తులో ఉన్న మనకు ఉచితంగా యిచ్చిన దేవుణ్ణి మనము స్తుతించుదాం.

ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది. ఆ అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. ఇది బాగా ఆలోచించి దివ్య జ్ఞానంతో చేసాడు. ఆయన తాను క్రీస్తు ద్వారా ఆనందముతో చెయ్యదలచిన మర్మాన్ని తన యిచ్ఛానుసారం మనకు తెలియచేసాడు. 10 సరియైన సమయం రాగానే తాను పూర్తి చేయదలచినదాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని, అంటే భూలోకాన్ని, పరలోకాన్ని ఒకటిగా చేసి దానికి క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు.

11 అన్నీ ఆయన ఉద్దేశ్యానుసారం, ఆయన నిర్ణయించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు నిర్ణయించిన విధంగా తన ఉద్దేశ్యం ప్రకారం మనము క్రీస్తులో ఐక్యత పొంది ఆయన ప్రజలుగా ఉండేటట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. 12 క్రీస్తు మనకు రక్షణ యిస్తాడని విశ్వసించినవాళ్ళలో మనము మొదటివాళ్ళము. మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలని ఆయన ఉద్దేశ్యము. ఆయన మహిమను బట్టి ఆయన్ను స్తుతించుదాం. 13 మీరు రక్షణను గురించి చెప్పబడిన సువార్త విన్నారు. ఆ గొప్ప సత్యం మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తులో ఐక్యత కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్రే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ. 14 తన ప్రజలందరికీ రక్షణ కలిగే వరకూ వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం జరిగింది.

పౌలు యొక్క ప్రార్థన

15 ఈ కారణాన నేను మీకు యేసు ప్రభువుపట్ల ఉన్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసులపట్ల మీకున్న ప్రేమను గురించి విన్నప్పటినుండి 16 దేవునికి కృతజ్ఞతలు చెప్పటం మానలేదు. ప్రార్థించినప్పుడు మిమ్మల్ని తలుచుకోవటం మానలేదు. 17 నేను ఎల్లప్పుడు మన క్రీస్తు ప్రభువు యొక్క దేవుడు అయిన ఆ మహిమగల తండ్రి మీకు పరిశుద్ధాత్మను యివ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ మీకు జ్ఞానాన్నిచ్చి, దేవుణ్ణి తెలియజేయాలని నా అభిలాష. అప్పుడు మీరు దేవుణ్ణి యింకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు.

18 మీ మనోనేత్రాలు తెరుచుకోవాలని, మీరు ఆశిస్తున్న వారసత్వాన్ని గురించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఆ వారసత్వం మీకివ్వటానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. అప్పుడు ఆయన తన విశ్వాసులకు వాగ్దానం చేసిన ఆశీస్సులు ఎంత అద్భుతమైనవో మీరు చూడగలుగుతారు. 19 క్రీస్తును విశ్వసించే మనలో పని చేస్తున్న ఆయన శక్తి ఎంత ఉత్తమమైనదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన. 20 ఈ శక్తి ద్వారా క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడివైపు కూర్చోబెట్టుకున్నాడు. 21 దేవుడు క్రీస్తుకు యిచ్చిన స్థానం అన్ని హోదాలకన్నా, అన్ని అధికారాలకన్నా, అన్ని శక్తులకన్నా, అన్ని రాజ్యాలకన్నా గొప్పది. అది ప్రస్తుతమున్న బిరుదులకన్నా, భవిష్యత్తులో లభించే బిరుదులకన్నా గొప్పది. 22 దేవుడు అన్నిటిని ఆయన పాదాల క్రింద ఉంచి, ఆయన్ని సంఘానికి సంబంధించిన వాటన్నిటిపై అధిపతిగా నియమించాడు. 23 సంఘము ఆయన శరీరం. ఆయన అన్నిటికీ అన్ని విధాల పరిపూర్ణత కలిగిస్తాడు. సంఘం కూడా ఆయన వల్ల పరిపూర్ణత పొందుతుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International