Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
పరమ గీతము 6-8

యెరూషలేము స్త్రీలు ఆమెకు చెప్తారు

అతి సుందరవతీ,
    ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు?
ఏ దిక్కు కెళ్లాడు?
    నీ ప్రియుని సంగతి మాకు చెప్పు, వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము.

ఆమె వారికిచ్చిన సమాధానం

సుగంధ పుష్పాల ఉద్యాన వనానికి నా ప్రియుడు వెళ్లాడు.
    తన సుగంధాలు వెదజల్లు పూలమొక్కల తోటకు గొర్రెలు మేపడానికి వెళ్లాడు
నేను ఎర్రని పుష్పాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను.
    నా ప్రియుడు నా వాడు.

అతడు ఆమెతో అంటాడు

ఓ నా ప్రియసఖీ, నీవు తిర్సా[a] నగరమంత సుందర మైనదానివి,
    యెరూషలేమంత ఆహ్లాదకరమైనదానివి,
    నగర దుర్గాలంతటి భయంకరురాలివి.[b]
నీవు నా వైపు చూడకు!
    నీ చూపులు నన్ను పురికొల్పి ఉన్మత్తున్ని చేస్తాయి
గిలాదు పర్వత చరియల నుండి గెంతులేస్తూ దిగివచ్చే గొర్రెపిల్లల మాదిరిగా
    నీ సుదీర్ఘ శిరోజాలు జాలువారు తున్నాయి.
గొడ్డువి కాక, కవలపిల్లల్ని కలిగి,
    కత్తరించబడి, కడుగబడి, పైకి వస్తున్న
తెల్ల గొర్రె మందల్ని పోలినవి నీ పళ్లు.
నీమేలి ముసుగు క్రింద నీ కణతలు
    దానిమ్మ చెక్కల్లా వున్నాయి.
అరవై మంది రాణులు
    ఎనభై మంది సేవకురాండ్రు[c]
    లెక్కకు మించిన కన్యలు ఉందురుగాక నాకు.
కాని, నా పావురము,
    నిష్కళంకురాలు ఒక్కతే (నాకైన స్త్రీ)
ఆమె తన తల్లికి ముద్దుబిడ్డ.
    తన కన్న తల్లికి గారాల చిన్నది.
కన్యలు, రాణులు, సేవకురాండ్రు కూడా
    ఆమెను చూచినంతనే ప్రశంసిస్తారు.

ఆమెకు స్త్రీల ప్రశంసలు

10 ఎవరా యువతి?
    అరుణోదయంలా మెరుస్తోంది.
    చంద్రబింబమంత అందమైనది
    సూర్యుడంత ధగ ధగలాడుతోంది,
    పరలోక సేనలంతటి[d] విభ్రాంతి గొలుపు ఆ యువతి ఎవరు?

అతడు ఆమెతో మాట్లాడుతాడు

11 నేను బాదం తోపుకి వెళ్లాను
    ఫలసాయమెలా ఉందో చూసేందుకు
    ద్రాక్షా తీగెలు పూశాయేమో చూసేందుకు
    దానిమ్మలు మొగ్గతొడిగాయేమో చూసేందుకు,
12 నేనింకా గ్రహించక ముందే[e] నా తనువు నన్ను రాజోద్యోగుల[f] రథాల్లోకి చేర్చినది

యెరూషలేము స్త్రీలు ఆమెను పిలుస్తారు

13 షూలమ్మీతీ[g] తిరిగిరా, తిరిగిరా
    మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా,

మహనయీము[h] నాట్యము చేస్తూండగా
    షూలమ్మీతీని ఎందుకు చూస్తారు?

అతను ఆమె అందాన్ని ప్రశంసిస్తాడు

రాకుమారీ,[i] నీ పాదరక్షల్లో నీ అడుగులెంతో అందంగా ఉన్నాయి
నీ తొడల వంపులు శిల్పి మలిచిన ఆభరణాల్లా ఉన్నాయి.
నీ నాభి గుండ్రటి కలశం (జాడి)లా ఉంది
    దానికెన్నడూ ద్రాక్షారసం కొరత లేకుండుగాక.
నీ ఉదరం (కడుపు) పద్మ వలయితమైన
    గోధుమ రాశిలా ఉంది.
నీ స్తనాలు తామరలో మేసే ఒక
    కవల జింక పిల్లల్లా ఉన్నాయి.
నీ మెడ దంతపు గోపురంలా ఉంది
నీ నేత్రాలు బాత్ రబ్బీన్ సరసన ఉన్న
    హెష్బోనులోని రెండు తటాకాల్లా ఉన్నాయి.
నీ నాసిక దమస్కు దిక్కుకి చూచే
    లెబానోను శిఖరంలా ఉంది.
నీ తల కర్మెలు పర్వతంలా,
    నీ తల నీలాలు పట్టుకుచ్చుల్లా వున్నాయి.
నీ సుదీర్ఘ కేశాలు చూసిన రాజు కూడా
    నీ వశం అవుతాడు.
నీవు అతీత సుందరివి! అత్యంత మనోహరివి!
    అందమైన, ఆహ్లాదకరమైన యువతివి!
నీవు తాళవృక్షంలా పొడుగరివి.
    నీ స్తనాలు తాటిపళ్ల గెలల్లా వున్నాయి.
నాకు ఆ చెట్టుపైకి ఎక్కాలని,
    దాని మట్టలు పట్టాలని ఉంది.

నీ స్తనాలు ద్రాక్షా గుత్తుల్లా, నీ ఊపిరి
    జల్దరు సువాసనలా ఉన్నాయి.
నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా,
    అది నిద్రించే వారి ప్రేమ పెదవులకు జాలువారేదిలా ఉంది.

ఆమె అతనితో అంటుంది

10 నేను నా ప్రియునిదానను
    నాయందు అతనికి వాంఛ ఉంది!
11 ఓ నా ప్రియుడా రమ్ము,
    పొలానికి వెళదాము రమ్ము,
    పల్లెల్లో రేయి గడుపుదాము రమ్ము,
12 పెందలకడ లేచి ద్రాక్షాతోటలకు పోదాము
    ద్రాక్షా తీగలు మొగ్గ తొడిగాయో లేదో
ఆ మొగ్గలు విచ్చుకున్నాయో లేదో
    దానిమ్మ చెట్లు విరబూశాయో లేదో తనివితీరా చూద్దాము, రమ్ము.
అక్కడ నేనిచ్చునా ప్రేమ అందుకొన రమ్ము.

13 ప్రేమ వర్ధక మండ్రేక ఔషధుల్నీ
    మా గుమ్మాన వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు!
ఓ నా ప్రియుడా, నీకై దాచి ఉంచాను ఎన్నెన్నో పండువీ,
    దోరవీ పండ్లు, తిని చూడు!

నీవు నా తల్లి పాలు త్రాగిన నా సహోదరుడివైయుంటే,
    నీవు నాకు బయట అగుపిస్తే,
నిన్ను నేను ముద్దాడగలిగి ఉండేదాన్ని.
    అప్పుడు నన్నెవరూ తప్పు పట్టేవారు కారు!
నేను నిన్ను నాకు అన్నీ నేర్పిన మా తల్లి
    ఇంటి గదిలోనికి తీసుకుపోయి ఉండేదాన్ని.
దానిమ్మ పళ్లరసంతో చేసిన సురభిళ మధువును
    నీకు ఇచ్చి ఉండేదాన్ని.

ఆమె స్త్రీలతో అంటుంది

అతను తన ఎడమ చేతిని నా తల క్రింద ఉంచి
    తన కుడిచేతితో నన్ను కౌగలించుకొంటాడు.

యెరూషలేము స్త్రీలారా మీరు నాకొక వాగ్దానం చేయండి
    నా ప్రేమ స్వయం ప్రేరితమయ్యేదాకా,
    ప్రేమను జాగృతం చేయకండి ప్రేమను పురిగొల్పకండి.

యెరూషలేము స్త్రీలు అంటారు

ఎడారి మార్గంలో, తన ప్రియుని ఆనుకొని
    వస్తున్న ఈ స్త్రీ ఎవరు?

ఆమె అతనితో అంటుంది

జల్దరు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను.
    అచ్చటే నిన్ను మోసిన నీ తల్లి నిన్ను కన్నది.
నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు,
    నీ వేలికి ముద్రికలా ధరించు.
మృత్యువంత బలమైనది ప్రేమ
    పాతాళమంత కఠనమైంది ఈర్శ్య.
అగ్ని జ్వాలల్లాంటివి దాని మంటలు
    అవి పెచ్చు మీరి మహాజ్వాల[j] అవుతాయి.
ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్పజాలదు.
    నదీ జలాలూ ప్రేమను ముంచెత్తజాలవు.
ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధారపోస్తే,
    అతణ్ణి ప్రజలు మూర్ఖుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్ట జాలడు!

ఆమె సోదరులు అంటారు

మాకు ఉన్నదొక చిన్న చెల్లెలు
    ఆమెకింకా యుక్త వయస్సు రాలేదు.
ఆమెను వివాహం చేసుకొనుటకు ఒక పురుషుడు వస్తే,
    మా చెల్లెలి విషయంలో మేమేమి చెయ్యాలి?

అది ప్రాకారమైతే,
    దాని చుట్టూ వెండి నగిషీ[k] చేస్తాము
అది తలుపైతే, దాని చుట్టూ దేవదారు
    పలకలతో అంచులు అలంకరిస్తాము.

ఆమె తన సోదరులతో అంటుంది

10 నేను ప్రాకారం వంటిదాన్ని
    నా వక్షోజాలు గోపుర ప్రాయాలు
అతనికి నేనంటే తనివి, తృప్తి![l]

అతను అంటాడు

11 బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది.
    ఆ తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు.
వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు[m] ఇచ్చాడు.

12 సొలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీవే ఉంచుకో,
వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రైతుకు
    అతడు తెచ్చిన ద్రాక్షాలకోసం యివ్వు.
నా ద్రాక్షాతోట నా స్వంతంగా ఉంటుంది!

అతను ఆమెతో అంటాడు

13 ద్రాక్షాతోటలో కూర్చున్న ఓ సఖీ,
    నీ చెలికత్తెలు నీ స్వరం వింటున్నారు,
నీ మధుర స్వరాన్ని నన్నూ విననీయి.

ఆమె అతనితో

14 నా ప్రాణ స్నేహితుడా, వేగిరం వచ్చెయ్యి.
    జింకల్లా, లేడి పిల్లల్లా పరిమళవృక్ష సముదాయం పెరిగిన పర్వతాలపై నుంచి చెంగుచెంగున వచ్చెయ్యి.

గలతీయులకు 4

నేను చెప్పేదేమిటంటే వారసుడు చిన్నవానిగా ఉన్నంత కాలం, అతడు ఆస్తికంతా వారసుడైనా అతనికి, బానిసకు వ్యత్యాసం లేదు. అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే. అదే విధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై జీవించాము. కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు.

మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ “అబ్బా![a] తండ్రీ!” అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు. కనుక మీరు బానిసలు కారు. మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు.

గలతీయుల పట్ల పౌలు శ్రద్ధ

ఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు వట్టి దేవుళ్ళకు బానిసలై జీవించారు. కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన, నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? 10 మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు. 11 మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది.

12 సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు. 13 నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. 14 నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసు క్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు. 15 మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. 16 నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా?

17 వాళ్ళు మిమ్మల్ని లోబరచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మానుండి మిమ్మల్ని వేరు చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి. 19 నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదన పడ్తూ ఉండవలసిందే. 20 మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది.

హాగరు మరియు శారా

21 ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా? 22 అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది. 23 బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు.

24 ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. “హాగరు” ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును. 25 అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా “హాగరు” ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. 26 కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి. 27 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా!
    ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా!
గట్టిగా కేకలు వేయి!
ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త
    లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.”(A)

28 కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు. 29 ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది. 30 కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి”(B) అని వ్రాయబడి ఉంది. 31 సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International