Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
పరమ గీతము 4-5

అతను ఆమెతో అంటున్నాడు

నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు!
    ఆహా, నువ్వు సుందరంగా ఉన్నావు!
నీ మేలి ముసుగు క్రింద
    నీ కళ్లు పావురాల కళ్లలా ఉన్నాయి.
నీ శిరోజాలు పొడుగ్గా గిలాదు పర్వత సానువుల కింద
    నృత్యం చేసే మేకపిల్లల్లా జారుతున్నాయి.
గొడ్డువి కాక, కవలపిల్లల్ని కలిగి,
    కత్తరించబడి, కడుగబడి, పైకి వస్తున్న
తెల్ల గొర్రె మందల్ని పోలినవి నీ పళ్లు.
నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి.
    నీ నోరు అందంగా ఉంది
నీ మేలి ముసుగు క్రింద నీ చెక్కిళ్లు రెండు
    దానిమ్మపండు చెక్కల్లా ఉన్నాయి.
నీ మెడ పొడుగ్గా సన్నగా
    జయ సూచకాల్ని ఉంచే దావీదు గోపురంలా ఉంది
శక్తిమంతులైన సైనికుల డాళ్లు
    వెయ్యి డాళ్ళు దాని గోడల మీద
    అలంకరించడం కోసం ఆ గోపురాన్ని కట్టారు.
నీ స్తనాలు,
    తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక పిల్లల్లా ఉన్నాయి
    కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి.
సూర్యాస్తమయ వేళ, నీడలు కనుమరుగయ్యే వేళ
    నేను ఆ గోపరస పర్వతానికి వెళ్తాను
    ఆ సాంబ్రాణి కొండకు వెళ్తాను.
నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది.
    నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు!
నా వధువా! లెబానోను నుండి
    నాతోరా! లెబానోనునుండి నాతోరా.
అమాన పర్వత శిఖరాన్నుండి
    శెనీరు హెర్మోనుల కొండకొనల నుండి
    సింహపు గుహల నుండి
    చిరుత పులుల పర్వతాలనుండి రమ్ము!
నా ప్రియురాలా![a] నా ప్రియ వధువా,
    నీవు నన్ను ఉద్రేక పరుస్తావు.
ఒకే ఒక చూపుతో
    నీ హారంలోని ఒకే ఒక రత్నంతో
    నా హృదయాన్ని దోచుకున్నావు.
10 నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీ ప్రేమ చాలా సుందరమైనది
    ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ మధురమైంది,
నీ పరిమళ ద్రవ్యపు సువాసన
    ఏ రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది!
11 నా ప్రియవధువా, నీ పెదవులు తేనె లూరుతున్నాయి
    నీ నాలుక (కింద) నుంచి తేనే, పాలూ జాలువారుతున్నాయి
నీ దుస్తులు మధుర పరిమళాన్ని[b] గుబాళిస్తున్నాయి.
12 నా నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నిష్కళంకురాలివి.
    మూయబడిన ఉద్యానవనం వలె,
మూయబడిన జలాశయంవలె,
    మూయబడిన జలధారలవలె స్వచ్ఛమైనదానవు.
13 నీ శరీరమొక తోటను పోలినది
    దానిమ్మ వృక్షాలతో తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా మాంసి,
14     కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది
అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో
    నిండిన సుందర వనాన్ని పోలినది.

15 నీవు ఉద్యాన జలాశయం వంటిదానివి,
    మంచినీటి ఊటల బావిలాంటిదానివి,
లెబానోను పర్వతం నుంచి జాలువారే సెలయేరు వంటిదానివి.

ఆమె అంటుంది

16 ఉత్తర పవనమా లే!
    దక్షిణ పవనమా రా!
నా ఉద్యానవనంపై వీచి,
    దాని మధుర సౌరభాన్ని వెద జల్లండి.
నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి
    అందలి మధుర ఫలాలు ఆరగించాలి.

అతను అంటాడు

నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను,
    నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను,
తేనె త్రాగాను. తేనె పట్టును తిన్నాను
    నేను నా ద్రాక్షాక్షీరాలు సేవించాను.

ప్రేమికులతో స్త్రీలు అంటారు

ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, త్రాగండి!
    ప్రేమను త్రాగి మత్తిల్లండి!

ఆమె అంటుంది

నేను నిద్రించానేగాని
    నా హృదయం మేల్కొనేవుంది.
నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను
    “నా ప్రియ సఖీ, ప్రేయసీ, నా పావురమా, పరిపూర్ణవతీ! తలుపు తెఱువు.
    నా తల మంచుతో తడిసింది
    నా జుట్టు రేమంచు జడికి నానింది.”

“నేను నా పైవస్త్రం తొలగించాను,
    దాన్ని తిరిగి ధరించాలని అనిపించలేదు.
నేను నా పాదాలు కడుక్కున్నాను.
    అవి తిరిగి మురికి అవడం ఇష్టం లేక పోయింది.”

తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు[c]
    నేనతని పట్ల జాలినొందాను.[d]
నా చేతుల నుంచి జటామాంసి జారగా,
    నా వేళ్ల నుంచి జటామాంసి పరిమళ ద్రవ్యం తలుపు గడియ పైకి జాలువారగా
    నేను నా ప్రియునికి తలుపు తీయ తలంచాను.
నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను,
    కాని అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు!
అతడు వెళ్లిపోయినంతనే
    నా ప్రాణం కడగట్టింది.[e]
నేనతని కోసం గాలించాను.
    కాని అతడు కనిపించలేదు.
నేనతన్ని పిలిచాను,
    కాని అతడు బదులీయలేదు.
నగరంలో పారా తిరిగేవారు నాకు తారసిల్లారు
    నన్ను కొట్టి,
    గాయపరిచారు.
ప్రాకారం కావలివారు
    నా పైవస్త్రాన్ని కాజేశారు.

యెరూషలేము స్త్రీలారా,
    నా ప్రియుడు మీ కంట పడితే చెప్పండి, నీ ప్రియురాలు నీ ప్రేమతో కృంగి కృశించి పోతోందని.

ఆమెకు యెరూషలేము స్త్రీల ప్రశ్నలు

అతిసుందరవతీ, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి?
ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు దేనిలో ఎక్కువ?
    అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు?

యెరూషలేము స్త్రీలకు ఆమె సమాధానం

10 నా ప్రియుడు ఎర్రగా ప్రకాశించు శరీరం కలవాడు, తెల్లనివాడు.
    పదివేలలోనైన గుర్తింపుగలవాడు.
11 మేలిమి బంగారు పోలిన శిరస్సు గలవాడు తుమ్మెద రెక్కలవంటి
    నొక్కునొక్కుల కారునల్లటి శిరోజాలవాడు.
12 అతని కనులేమో సెలయేటి ఒడ్డున ఎగిరే పావురాలకళ్లలాంటివి.
    పాల మునిగిన పావురాలవలెను,
    బంగారంలో పొదిగిన రత్నాల వలెను,
13 అతడి చెక్కిళ్లు సుగంధ ఉద్యానాల
    పరిమళ పుష్పరాశులవలెను,
అతని పెదవులు అత్తరువారి బోళంతో
    తడిసిన కెందామరలు (ఎర్ర తామరలు).
14 అతని చేతులు వజ్రాలు పొదిగిన
    బంగారు కడ్డీల సమానం
అతని శరీరం నీలాలు తాపిన నున్నటి
    దంత దూలము వలెను,
15 అతని పాదాలు బంగారు దిమ్మమీది
    పాలరాతి స్తంభాల వలెను,
అతని సుదీర్ఘ శరీరం లెబానోను పర్వతం మీది
    నిటారైన దేవదారు వృక్షాన్ని తలపింపజేయును.
16 ఔనౌను, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు అత్యంత వాంఛనీయుడు,
    అతని అధరం పెదవి అత్యంత మధురం
అతనే నా ప్రియుడు,
    నా ప్రాణ స్నేహితుడు.

గలతీయులకు 3

ధర్మశాస్త్రమా? లేక విశ్వాసమా?

గలతీయ ప్రజలారా! మీరు అవివేకులు. మిమ్ములను ఎవరు మోసగించారు? యేసు క్రీస్తు సిలువకు వేయబడినదానిలో ఉన్న అర్థం మీ కళ్ళ ముందు స్పష్టంగా చిత్రించాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ధర్మశాస్త్రం అనుసరించటం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందారా? లేక సువార్తను విశ్వసించటం వల్ల పొందారా? మీరింత అవివేకులా? పరిశుద్ధాత్మతో ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నం ద్వారా నీతిమంతులు కావాలని చూస్తున్నారా? మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను. దేవుడు పరిశుద్ధాత్మను పంపి మీ కోసం మహత్కార్యాలు చేస్తున్నది మీరు ధర్మశాస్త్రం అనుసరించినందుకా? లేక సువార్తను విశ్వసించినందుకా?

అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”(A) కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి. యూదులు కానివాళ్ళను దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు వ్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహాముతో, “అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులౌతారు!”(B) అని ముందే చెప్పాడు. కనుక అబ్రాహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదే విధంగా అతని వలె విశ్వసించిన వాళ్ళు కూడా ధన్యులౌతారు.

10 ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని అన్ని వేళలా ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి ఔతాడు”(C) అని వ్రాయబడి ఉంది. 11 ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు”[a] అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది.

12 ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా, “ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు”[b] అని వ్రాయబడి ఉంది. 13 “చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాపగ్రస్తుడు!”(D) అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు. 14 దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కానివాళ్ళకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం.

ధర్మశాస్త్రము, వాగ్దానము

15 సోదరులారా! ఇక మన నిత్యజీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకొంటాను. అంగీకరించిన ఒడంబడికను మనం రద్దు చెయ్యలేము, లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే. 16 అబ్రాహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేసాడు.[c] కాని ధర్మశాస్త్రంలో, “వారసులకు” అని వ్రాయబడలేదు. కాని “అనేకులు” అని అర్థం రాకుండా “ఒకనికి” అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు. 17 నేను చెప్పేది ఏమిటంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో దేవుడు చేసిన ఒడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చెయ్యలేదు.

18 అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి వుందన్న మాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు యిచ్చాడు.

19 మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశ్యమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడిన అబ్రాహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది. 20 కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి.

మోషే ధర్మశాస్త్రం యెక్క ఉద్దేశ్యం

21 మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్ధమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి ఉండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం. 22 కాని లేఖనాల్లో, “ప్రపంచం పాపాల్లో చిక్కుకు పోయింది.” అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్నవాళ్ళకే యివ్వబడుతుంది.

23 విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. 24 మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. 25 ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు.

26 యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. 27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. 28 ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం. 29 మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International