Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
పరమ గీతము 1-3

సొలొమోను గీతాలలో ఉన్నత గీతం

వరునితో వధువు

తన నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొననిమ్ము
    ఎందుకంటే ద్రాక్షా రసంకన్నా మధురమయింది నీ ప్రేమ.
నీ పరిమళ ద్రవ్యం అద్భుతమైన సువాసననిస్తుంది,
    కాని మిక్కిలి ఉత్తమ పరిమళ ద్రవ్యం కన్నా నీ పేరు[a] తియ్యనైనది.
అందుకే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
నన్ను ఆకర్షించుకొనుము!
    మేము నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాము!

రాజు తన రాజ గృహానికి నన్ను తీసుకు వెళ్ళాడు.

యెరూషలేము స్త్రీలు వరునితో

మేము ఆనందిస్తాం. నీకోసం సంతోషంగా ఉంటాం.
    నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుందని జ్ఞాపకముంచుకొనుము.
    మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.

వధువు స్త్రీలతో అంటుంది

యెరూషలేము పుత్రికలారా,
    కేదారు, సల్మా[b] గుడారముల నలుపువలె
    నేను నల్లగా అందంగా ఉన్నాను.

నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు,
    సూర్యుడు నన్నెంత నల్లగా చేశాడో చూడవద్దు.
నా సోదరులు నా మీద కోపగించారు.
    వాళ్ల ద్రాక్షా తోటలకు కాపలా కాయుమని నన్ను బలవంత పెట్టారు.
    అందువల్ల నన్ను గురించి నేను శ్రద్ధ తీసుకోలేక పోయాను.[c]

ఆమె అతనితో అంటుంది

నా ప్రాణం అంతటితో నిన్ను ప్రేమిస్తాను!
నీ గొర్రెల్ని ఎక్కడ మేపుతావో,
    మధ్యాహ్నం వాటిని ఎక్కడ పడుకో బెడతావో నాకు చెప్పు.
    నీతో ఉండటానికి నేను రావాలి లేకపోతే నీ మిత్రుల గొర్రెల కోసం పాటుపడే అద్దెకు తీసుకున్న స్త్రీని[d] అవుతాను!

అతను ఆమెతో అంటున్నాడు

నీవు అంత అందమైనదానవు! కనుక
    నిజంగా నీకు తెలుసు ఏమి చెయ్యాలో.
వెళ్లు, గొర్రెలను వెంబడించు.
    నీ చిన్న మేకల్ని కాపరుల గుడారాల వద్ద మేపు.

నా ప్రియురాలా, ఫరో రథాలు[e] లాగుతున్న నా ఆడ గుర్రాలతో నిన్నుపోల్చియున్నాను.
10-11 నీకోసం చేసిన అలంకరణలివిగో,
    బంగారు తలకట్టు[f], వెండి గొలుసు.
నీ చెక్కిళ్లు ఎంతో అందంగా ఉన్నాయి
బంగారు అలంకరణలతో,
    నీ మెడ ఎంతో అందంగా ఉంది వెండి అల్లికలతో.

ఆమె అంటుంది

12 నా పరిమళ ద్రవ్యపు సువాసన తన మంచంమీద పడుకున్న రాజును చేరింది.
13 నా స్తనాల మధ్య పడివున్న
    నా మెడలో వున్న చిన్న గోపరసం[g] సంచిలాంటి వాడు నా ప్రియుడు.
14 ఏన్గెదీ ద్రాక్షాతోటల దగ్గరున్న గోరంటు[h] పూల
    గుత్తిలాంటివాడు నా ప్రియుడు.

అతడు అంటున్నాడు

15 నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు!
    ఓహో! నువ్వు సుందరంగా ఉన్నావు!
నీ కళ్లు పావురపు కళ్లలా వున్నాయి.

ఆమె అంటుంది

16 నా ప్రియుడా, నువ్వెంతో సొగసుగా ఉన్నావు!
    అవును, అత్యంత మనోహరంగా ఉన్నావు!
మన శయ్య ఆకుపచ్చగా ఆహ్లాదంగా ఉంది[i]
17 మన యింటి దూలాలు దేవదారువి
    అడ్డకర్రలు సరళమ్రానువి.

నేను షారోనులోని గులాబి పువ్వును. లోయలలోని సుగంధ పుష్పాన్ని[j].

అతడు అంటున్నాడు

నా ప్రియురాలా, ఇతర స్త్రీలలో నీవు
    ముళ్ల మధ్య గులాబి పుష్పంలా ఉన్నావు!

ఆమె అంటుంది

నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య నీవు
    అడవిచెట్ల మధ్య జల్దరు చెట్టులా ఉన్నావు!

ఆమె స్త్రీలతో అంటుంది

ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను!
    నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని ఫలం నాకెంతో రుచికరంగా వుంది.
నా ప్రియుడు నన్ను ద్రాక్షారసశాలకు తీసుకుని వచ్చాడు,
    నా మీద అతని ఉద్దేశం ప్రేమ.
ఎండు ద్రాక్షాలతో[k] నాకు బలాన్నివ్వండి,
    జల్దరు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను.[l]
నా ప్రియుని ఎడమ చేయి నా తల క్రింద ఉంది,
    అతని కుడి చేయి నన్ను కౌగలించుకొంది.

యెరూషలేము స్త్రీలారా, దుప్పులమీద, అడవి లేళ్ల మీద ఒట్టేసి నాకు వాగ్దానం చెయ్యండి, నేను సిద్ధపడేవరకూ.[m]
    ప్రేమను లేపవద్దు,
    ప్రేమను పురికొల్పవద్దు.

ఆమె మళ్లీ అంటుంది

నా ప్రియుని గొంతు వింటున్నాను.
అదిగో అతడు వస్తున్నాడు.
    పర్వతాల మీది నుంచి దూకుతూ
    కొండల మీది నుంచి వస్తున్నాడు.
నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు
    లేదా లేడి పిల్లలా ఉన్నాడు.
మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు,
    కిటికీలోనుంచి తేరి పార చూస్తూ,
    అల్లిక కిటికీలోనుంచి[n] చూస్తూ
10 నా ప్రియుడు నాతో అంటున్నాడు,
“నా ప్రియురాలా, లెమ్ము,
    నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!
11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది,
    వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి.
12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి
    ఇది పాడే సమయం![o]
    విను, పావురాలు తిరిగి వచ్చాయి.
13 అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి.
    పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు.
నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా,
    మనం వెళ్లిపోదాం!”

అతడు అంటున్నాడు

14 కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా!
    నిన్ను చూడనిమ్ము,
    నీ గొంతు విననిమ్ము,
నీ గొంతు ఎంతో మధురం,
    నువ్వెంతో సుందరం!

ఆమె స్త్రీలతో అంటుంది

15 మాకోసం గుంటనక్కల్ని
    ద్రాక్షాతోటల్ని పాడుచేసే చిన్న గుంటనక్కల్ని పట్టుకోండి!
మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది.
16 నా ప్రియుడు నావాడు,
    నేను అతని దానను!
అతడు సుగంధ పుష్పాల పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!
17 నా ప్రియుడా, సూర్యాస్తమయమై, ఇక నీడలు మాయమయ్యే వేళలో
    చీలిన పర్వతాల[p] మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు!

ఆమె అంటుంది

రాత్రి నా పరుపు మీద,
    నేను ప్రేమించిన వానికోసం వెదికాను.
అతని కోసం చూశాను,
    కాని అతణ్ణి కనుగొనలేకపోయాను!
ఇప్పుడు లేచి,
    నగరమంతా తిరుగుతాను.
వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ
    నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను.

అతని కోసం చూశాను,
    కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను!
నగరంలో పాహరా తిరిగే కావలివాళ్లు నన్ను చూశారు.
    వారినడిగాను, “నేను ప్రేమించిన వ్యక్తిని మీరు చూశారా?” అని.

కావలివాళ్లను దాటిన వెంటనే
    నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను!
అతణ్ణి పట్టుకున్నాను.
    అతణ్ణి పోనివ్వలేదు,
    నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని వచ్చాను.
    నన్ను కన్న తల్లి గదికి తీసుకొని వచ్చాను.

ఆమె స్త్రీలతో అంటుంది

యెరూషలేము స్త్రీలారా, దుప్పులమీద, అడవి లేళ్లమీద ఒట్టు పెట్టి, నాకు వాగ్దానం చెయ్యండి, నేను సిద్ధపడేవరకూ
    ప్రేమను లేపవద్దు,
    ప్రేమను పురికొల్పవద్దు.

యెరూషలేము స్త్రీలు మాట్లాడుట

పెద్ద జనం గుంపుతో
    ఎడారినుండి వస్తున్న[q] ఈ స్త్రీ ఎవరు?
కాలుతున్న గోపరసం, సాంబ్రాణి[r] ఇతర సుగంధ ద్రవ్యాల[s] సువాసనలతో
    పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.

చూడు, సొలొమోను ప్రయాణపు పడక![t]
    అరవైమంది సైనికులు దానిని కాపలా కాస్తున్నారు.
    వారు బలశాలురైన ఇశ్రాయేలు సైనికులు!
వారందరూ సుశిక్షుతులైన పోరాటగాండ్రు,
    వారి పక్కనున్న కత్తులు,
    ఏ రాత్రి ప్రమాదానికైనా సిద్ధం!
రాజు సొలొమోను తనకోసం ఒక ప్రయాణపు పడక చేయించాడు,
    దాని కొయ్య లెబానోనునుండి వచ్చింది.
10 దాని స్తంభాలు వెండితో చేయబడ్డాయి,
    ఆధారాలు (కోళ్ళు) బంగారంతో చేయబడ్డాయి,
పడుకొనే భాగం ధూమ్ర వర్ణం వస్త్రంతో కప్పబడింది.
    యెరూషలేము స్త్రీల ప్రేమతో అది పొదగబడింది.

11 సీయోను స్త్రీలారా, బయటకు రండి
    రాజు సొలొమోనును చూడండి
అతని పెండ్లి రోజున అతడు చాలా సంతోషంగా ఉన్న రోజున
    అతని తల్లి పెట్టిన కిరీటాన్ని[u] చూడండి!

గలతీయులకు 2

అపొస్తలులు పౌలును అంగీకరించటం

పద్నాలుగు సంవత్సరాల తర్వాత బర్నబాతో కలిసి నేను మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాను. తీతు కూడా నా వెంట ఉన్నాడు. దేవుడు ఆదేశించటం వల్ల నేను అక్కడికి వెళ్ళాను. యూదులు కానివాళ్ళకు నేను ప్రకటిస్తున్న సువార్తను రహస్యంగా ముందు అక్కడి నాయకులకు చెప్పాను. నేను ప్రస్తుతం చేస్తున్న సేవ, యిదివరకు చేసిన సేవ వ్యర్థంకాకూడదని నా అభిప్రాయం.

నా వెంటనున్న తీతు గ్రీకు దేశస్థుడైనా సున్నతి చేయించుకోమని వాళ్ళు బలవంతం చెయ్యలేదు. మాలో కొందరు దొంగ సోదరులు చేరారు. వాళ్ళలో కొందరు తీతు సున్నతి పొందాలని బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. వీళ్ళు గూఢచారులుగా సంఘంలో మేము యేసుక్రీస్తులో విశ్వాసులముగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని పరిశీలించాలని వచ్చారు. మమ్మల్ని మళ్ళీ బానిసలుగా చెయ్యాలని వాళ్ళ ఉద్దేశ్యం. సువార్తలో ఉన్న సత్యం మీకు లభించాలని మేము వాళ్ళకు కొంచెం కూడా లొంగలేదు.

సంఘంలో ముఖ్యమైనవాళ్ళలా కనిపించే వాళ్ళు, వాళ్ళ అంతస్థు ఏదైనా సరే నేను లెక్క చెయ్యను. అంతేకాక అంతస్థును బట్టి దేవుడు తీర్పు చెప్పడు, నేను చెప్పిన సందేశాన్ని మార్చలేదు. పైగా యూదులకు బోధించే బాధ్యత పేతురుకు ఇవ్వబడినట్లే, యూదులు కాని వాళ్ళకు బోధించే బాధ్యత నాకివ్వబడిందని వాళ్ళు గమనించారు. పేతురు యూదులకు అపొస్తలుడుగా చేసిన సేవలో దేవుడు సహకరించినట్లే, అపొస్తలుడనుగా యూదులు కానివాళ్ళ కోసం నేను చేస్తున్న సేవలో కూడా దేవుడు నాకు సహకరించాడు. ముఖ్యమైన వాళ్ళని పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను దేవుడు నాపై చూపిన అనుగ్రహాన్ని గుర్తించి నాకు, బర్నబాకు సహాయం చెయ్యటానికి అంగీకరించారు. మేము యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్ళేటట్లు, వాళ్ళు యూదుల దగ్గరకు వెళ్ళేటట్లు నిర్ణయించుకొన్నాము. 10 మేము పేదవాళ్ళకు సహాయం చెయ్యాలని మాత్రం వాళ్ళు కోరారు. మాకును అదే అభిలాష వుంది.

పౌలు పేతురును విమర్శించటం

11 పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు అతని తప్పు స్పష్టంగా కనిపించటం వల్ల అది నేను అతని ముఖం ముందే చెప్పాను. 12 ఇదివరలో ఏం జరిగిందంటే యాకోబు దగ్గరనుండి కొందరు వ్యక్తులు పేతురు దగ్గరకు వెళ్ళారు. అప్పటి దాకా పేతురు యూదులు కానివాళ్ళతో కలిసి తింటూవుండేవాడు. కాని, వీళ్ళు రాగానే, సున్నతి గుంపుకు చెందిన వీళ్ళకు భయపడి, వాళ్ళతో కలిసి తినటం మానుకొని వాళ్ళకు దూరంగా వెళ్ళాడు. 13 మిగతా యూదులు కూడా అతడు చేస్తున్న ఈ వంచనలో పాల్గొన్నారు. దీని ప్రభావం వల్ల బర్నబా కూడా తప్పుదారి పట్టాడు. 14 సువార్త బోధించిన విధంగా వాళ్ళు నడుచుకోవటం లేదని నేను గ్రహించి పేతురుతో అందరి ముందు, “నీవు యూదుడు కానివానివలె జీవిస్తున్నావు. మరి అలాంటప్పుడు యూదులు కానివాళ్ళను యూదుల సాంప్రదాయాల్ని అనుసరించమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు?” అని అడిగాను.

15 పుట్టుకతో మనము యూదులము. యూదులు కానివాళ్ళలా పాపం చేసేవాళ్ళము కాదు. 16 ధర్మశాస్త్రాన్ని ఆచరించటం వల్ల నీతిమంతుడు కాడని, యేసుక్రీస్తును విశ్వసించటం వల్ల మాత్రమే ఒకడు నీతిమంతుడౌతాడని మనకు తెలుసు. ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరూ నీతిమంతులుగా కాలేరు. కనుక మనం కూడా ధర్మశాస్త్రం వల్ల కాకుండా యేసుక్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం వల్ల నీతిమంతులం కావాలనే ఉద్దేశ్యంతో ఆయన్ని విశ్వసించాము.

17 మనము క్రీస్తు వల్ల నీతిమంతులం కావాలని ఆయన్ని విశ్వసించామంటే దాని అర్థం మనం పాపులమనే కాదా! అంటే క్రీస్తు పాపానికి తోడ్పడుతున్నాడా? ఎన్నటికీ కాదు. 18 నేను వదిలివేసిన ధర్మశాస్త్రాన్ని నేనే మళ్ళీ బోధిస్తే నేను ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినవాణ్ణవుతాను. 19 నేను దేవుని కోసం జీవించాలని ధర్మశాస్త్రం పట్ల మరణించాను. ధర్మశాస్త్రమే నన్ను చంపింది. 20 నేను క్రీస్తుతో సహా సిలువ వేయబడ్డాను. కాబట్టి నేను జీవించటం లేదు. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఈ దేహంలో నన్ను ప్రేమించి నా కోసం మరణించిన దేవుని కుమారుని పట్ల నాకున్న విశ్వాసంవల్ల నేను జీవిస్తున్నాను. 21 దేవుని దయను నేను కాదనలేను. ధర్మశాస్త్రంవల్ల ఒకడు నీతిమంతుడు కాగలిగితే మరి క్రీస్తు ఎందుకు మరణించినట్లు?

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International