Old/New Testament
జ్ఞాన బోధల సేకరణ
7 మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు.
జన్మ దినం కంటె మరణ దినం మేలు.
2 విందుకి పోవడంకంటె, మరణించినవారి అంత్య క్రియలకి హాజరవడం మేలు.
ఎందుకంటే, పుట్టిన వాళ్లెవరూ గిట్టకమానరు, బ్రతికున్న ప్రతివాడు ఈ విషయం గుర్తుంచుకోవాలి.
3 నవ్వుకంటె దుఃఖం మరింత మేలు,
ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్తమైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది.
4 అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే ఆలోచిస్తాడు,
కాని, వివేకి మృత్యువు గురించి ఆలోచిస్తాడు.
5 మూర్ఖుడి పొగడ్త పొందడం కంటె,
వివేకిచే విమర్శింప బడటం మేలు.
6 మూర్ఖుల నవ్వులాటలు
కుండ కింద చిటపట మండే ముళ్లలా ఉంటాయి.
(కుండ వేడైనా ఎక్కకముందే, ఆ ముళ్లు చురచుర మండి పోతాయి.)
ఇది కూడా నిష్ర్పయోజనమే.
7 ఎవడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే
వివేక వంతుడైనా తన వివేకాన్ని విస్మరిస్తాడు.
ఆ డబ్బు అతని విచక్షణను నాశనం చేస్తుంది.
8 ఏదైనా మొదలెట్టడం కంటె
దాన్ని ముగించడం మేలు.
అహంభావం, అసహనం కంటె
సాధుత్వం, సహనము మేలు.
9 తొందరపడి కోపం తెచ్చుకోకు
ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు)
10 “గడిచి పోయిన రోజులే మేలు” అనబోకు.
“అప్పుడు జరిగినదేమిటి?”
ఇది అవివేకమైన ప్రశ్న.
11 నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు. 12 వివేకవంతుడు సంపన్నుడవగలడు. ధనం అండ అయినట్టే వివేకం అండ అవుతుంది. కాని జ్ఞానంయొక్క ప్రయోజనం ఏమంటే, వివేకం తన యజమానికి అండ అవుతుంది.
13 దేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. వాటిలో ఏదైనా ఒకటి పొరపాటైనదని నీవు అనుకున్నా వాటిలో ఏ ఒక్కదాన్ని నీవు మార్చలేవు! 14 రోజులు బాగున్నప్పుడు, నీవు దాన్ని అనుభవించు. కాని, రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి మంచి రోజులు, చెడ్డ రోజులు వ్రాసి పెట్టాడన్న విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు.
మంచివాళ్లుగా ఉండటం నిజంగా అసాధ్యం
15 నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. మంచివాళ్లు చిన్న వయస్సులోనే మరణించడం చూశాను. చెడ్డవాళ్లు సుదీర్ఘకాలం జీవించడం చూశాను. 16-17 అందుకని అకాలంగా నిన్ను నీవు చంపుకోవడం దేనికి? అతి మంచిగా కాని, అతి చెడ్డగా కాని ఉండకు. అతి తెలివిగా కాని అతి మూర్ఖంగా కాని ఉండకు. నీ ఆయువు తీరక ముందే నువ్వెందుకు చనిపోవాలి?
18 దీనిని పట్టుకో గాని దానిని చేయి విడువకుండా ఉండటం మేలు. దేవునికి భయపడేవారు కూడా కొన్ని మంచికార్యాలు, కొన్ని చెడ్డకార్యాలు చేస్తారు. 19-20 ఎప్పుడు మంచి పనులే చేసి, ఎన్నడూ పాపాలు చేయని మంచివాడంటూ లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్ఞానం మనిషికి శక్తిని చేకూరుస్తుంది. నగరంలో పదిమంది (మూర్ఖులైన) నాయకులకంటె ఒక్క వివేకవంతుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు.
21 జనం చెప్పే మాటలన్ని చెవిని చొరనీయకు. నీ స్వంత నౌకరే నీ గురించి చెడ్డ మాటలు చెప్పడం నీవు వినవచ్చు. 22 నీవు కూడా అనేకసార్లు యితరులను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని నీకు తెలుసు.
23 నేను నా వివేకాన్ని వినియోగించి, ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించాను. నేను సరైన వివేకిగా వుండాలని కోరుకున్నాను. కాని అది దుస్సాధ్యం. 24 విషయాలెందుకిలా ఉన్నాయో నేను అర్థం చేసుకోలేను. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే. 25 నేను అధ్యయనం చేసి, సరైన జ్ఞానాన్ని అన్వేషించేందుకు చాలా గట్టి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కదానికి హేతువును కనుక్కునేందుకు నేను ప్రయత్నించాను. (నేనేమి తెలుసుకున్నాను?)
చెడ్డగా ఉండటం మూర్ఖత్వమనీ, మూర్ఖంగా వ్యవహరించడం పిచ్చితనమనీ నేను తెలుసుకున్నాను. 26 (కొందరు) స్త్రీలు వలల మాదిరిగా ప్రమాద కారులు అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ల హృదయాలు వలల్లాంటివి, వాళ్ల చేతులు గొలుసుల్లాంటివి. ఆ స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటె హీనం. దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అలాంటి స్త్రీలనుండి పారిపోతాడు. అయితే, పాపులు సరిగ్గా వాళ్లకే చిక్కుతారు.
27-28 ప్రసంగి ననే నేను చెప్పేదేమిటంటే, “వీటన్నింటికీ సమాధానాలు కనుగొనగలనేమోనని నేను పై విషయాలన్నీ మొత్తంగా పరిశీలించాను. సమాధానాల కోసం నేనిప్పటికీ అన్వేషిస్తూనే వున్నాను. అయితే, నేను కనుగొన్నది ఇది: నాకు వెయ్యి మందిలో ఒక్క మంచి మగాడు కనిపించగా, వెయ్యి మందిలో ఒక్క మంచి స్త్రీ కూడా కనిపించలేదు.
29 “నేను తెలుసుకున్న మరో విషయం: దేవుడు మనుష్యుల్ని నిజాయితీగల (మంచి) వాళ్లుగా సృష్టించాడు. కాని, మనుష్యులు చెడ్డగా ఉండేందుకు అనేక మార్గాలు కనుగొన్నారు.”
జ్ఞానం మరియు అధికారం
8 ఆయా విషయాలను ఒక జ్ఞాని అర్థం చేసుకుని, వివరించి చెప్పగలిగినట్లు మరొకరెవరూ చెయ్యలేరు. అతని జ్ఞానం అతనికి ఆనందాన్నిస్తుంది. జ్ఞానంవల్ల ముఖంలో విచారం తొలగి, ఆనందం చోటు చేసుకుంటుంది.
2 నేను చెప్పేదేమిటంటే, నీవు ఎల్లప్పుడూ రాజాజ్ఞను పాటింలించాలి. నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కనుక నీవీ పని చెయ్యాలి. 3 రాజుకు సలహాలు ఇచ్చేందుకు భయపడకు. చెడ్డదాన్ని దేన్ని సమర్థించకు. కాని ఒక విషయం గుర్తుంచుకో: రాజు తనకు సంతోషం కలిగించే ఆజ్ఞలు ఇస్తాడు. 4 రాజుకు ఆజ్ఞలు ఇచ్చే అధికారం ఉంది. రాజు ఏమి చెయ్యాలో అతనికి ఎవరూ చెప్పలేరు. 5 రాజాజ్ఞను పాటించే వ్యక్తి క్షేమంగా వుంటాడు. అయితే, వివేకవంతుడికి ఈ పని చేయవలసిన సరైన తరుణం ఏదో, ఆ సరైన పని ఎప్పుడు చెయ్యాలో తెలుస్తుంది.
6 మనిషి ఏ పనైనా చెయ్యవలసినప్పుడు, దానికి సరైన సమయం, సరైన మార్గం వుంటాయి. (ప్రతి వ్యక్తీ ప్రయత్నించి, తాను చెయ్యవలసింది ఏమిటో నిర్ణయించుకోవాలి.) తనకి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా అతనీ పని చెయ్యాలి. 7 ఎందుకంటే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరూ చెప్పలేరు గనుక.
8 తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఏ ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి ఏ ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన చోటికి పోగల స్వేచ్ఛ సైనికుడికి ఎలా వుండదో, అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ పాపం అతన్ని స్వేచ్ఛగా వుండనివ్వదు.
9 నేనీ విషయాలన్నీ గమనించాను. ఈ ప్రపంచంలో జరిగే విషయాలను గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. మనుష్యులు ఎప్పుడూ యితరుల మీద అధికారం చలాయించే శక్తిని సంపాదించుకునేందుకు తంటాలు పడుతూ ఉంటారన్న విషయం నేను గమనించాను. ఇది వాళ్లకి చెరుపు చేస్తుంది.
10 దుర్మార్గులకు ఘనంగా అంత్యక్రియలు జరగడం కూడా నేను చూశాను. అంత్యక్రియలు ముగించి, మనుష్యులు ఇళ్లకి తిరిగివెళ్లేటప్పుడు, చనిపోయిన దుర్మార్గుణ్ణి గురించి మంచి మాటలు చెప్పడం నేను విన్నాను. ఆ దుర్మార్గులు అనేకానేకమైన చెడ్డ పనులు చేసిన పట్టణాల్లో కూడా అర్థరహితమైన పని జరిగింది. అది అర్థరహితమైనది.
న్యాయం, బహుమతులు, దండన
11 కొన్ని సందర్భాల్లో, మనుష్యులు చేసిన చెడ్డ పనులకుగాను, వాళ్లు వెంటనే శిక్షింపబడరు. శిక్ష తాపీగా వస్తుంది. దానితో, యితరులకు కూడా చెడ్డ పనులు చెయ్యాలన్న కోర్కె కలుగుతుంది.
12 ఒకానొక పాపి నూరు చెడు పనులు చేసియుండవచ్చు, అతను దీర్ఘాయుష్షు కలిగియుండవచ్చు. అయినప్పటికీ, దేవుడిపట్ల విధేయత, గౌరవం కలిగివుండటం మేలన్న విషయం నాకు తెలుసు. 13 దుర్మార్గులు దేవుణ్ణి గౌరవించరు. అందుకని, నిజంగానే వాళ్లకి మంచి ఫలితాలు లభించవు. ఆ దుర్మార్గులు దీర్గకాలం జీవించరు. (సూర్యుడు క్రిందకి వాలిన కొద్ది) పొడుగయ్యే నీడల్లాగా వాళ్ల జీవితాలు దీర్ఘంకావు.
14 న్యాయంగా కనిపించని మరొకటి కూడా భూమి మీద సంభవిస్తూ ఉంటుంది. చెడ్డవాళ్లకి చెడు, మంచి వాళ్లకి మంచి జరగాలి. కాని, కొన్ని సందర్భాల్లో మంచి వాళ్లకి చెడు, చెడ్డవాళ్లకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇది సరైనది కాదు. 15 అందుకని, జీవితాన్ని హాయిగా అనుభవించడం మరింత మెరుగైనదని నేను తీర్మానించుకున్నాను. ఈ ప్రపంచంలో మనుష్యులు చెయ్యగలిగిన అత్యుత్తమమైన పనేమిటంటే, తినడం, తాగడం, జీవితాన్ని హాయిగా అనుభవించడమే. కనీసం అలా చేస్తేనైనా, తమ జీవితకాలంలో దేవుడు తమకిచ్చిన కఠిన శ్రమని మనుష్యులు సరదాగా సంతోషంగా చేసేందుకు అది తోడ్పడుతుంది.
దేవుడు చేసేవన్ని మనకు బోధపడవు
16 ఈ ప్రపంచంలో మనుష్యులు చేసే పనులను నేను శ్రద్ధగా పరిశీలించాను. మనుష్యులు ఎంత హడావుడిగా ఉంటారో నేను చూశాను. వాళ్లు రాత్రింబగళ్లు శ్రమిస్తారు. వాళ్లు దాదాపు నిద్రేపోరు. 17 దేవుడు చేసేవాటిలో అనేకం కూడా నేను చూశాను. ఈ భూమిమీద దేవుడు చేసేదాన్నంతటినీ మనుష్యులు అర్థంచేసుకోలేరు. మనిషి వాటిని అర్థం చేసుకునేందుకు ఎంతైనా ప్రయత్నించవచ్చు. కాని, అతను అర్థంచేసుకోలేడు. దేవుడు చేసినదాన్ని తాను అర్థం చేసుకున్నానని ఒక జ్ఞాని అనవచ్చు. కాని, అది నిజంకాదు. వాటన్నింటినీ ఏ ఒక్కడూ అర్థం చేసుకోలేడు.
చావు న్యాయమైనదేనా?
9 నేనీ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించాను. సజ్జనులు, వివేకవంతులు చేసేవాటినీ, వాళ్లకు సంభవించేవాటినీ దేవుడు అదుపుచేస్తాడన్న విషయం నేను గమనించాను. తాము ప్రేమించబడతారో లేక ద్వేషింప బడతారో మనుష్యులకి తెలియదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనుష్యులకి తెలియదు.
2 అయితే, మనుష్యులందరికీ ఉమ్మడి అంశం ఒకటుంది మనుష్యులందరూ మరణించడమే అది! మంచివాళ్లూ మరణిస్తారు, చెడ్డవాళ్లూ మరణిస్తారు. చావు పరిశుద్ధులకీ వస్తుంది అపరిశుద్ధులకీ వస్తుంది. చావు బలులు ఇచ్చేవాళ్లకీ వస్తుంది, ఇవ్వనివాళ్లకీ వస్తుంది. పాపి ఎలా చనిపోతాడో, మంచివాడూ సరిగ్గా అలాగే చనిపోతాడు. దేవునికి ప్రత్యేకమైన ప్రమాణాలు చేసేవాళ్లూ ఆ ప్రమాణాలు చెయ్యనివాళ్ల మాదిరిగానే చనిపోతారు.
3 ఈ జీవితంలో సంభవించే వాటన్నింట్లోనూ పరమ దౌర్భాగ్యమైనదేమిటంటే, అందరూ ఒకేలాగ గతించడమే. అయితే, మనుష్యులు ఎల్లప్పుడూ పాపపు ఆలోచనలూ, మూర్ఖపు ఆలోచనలూ చేస్తూ వుంటారు, ఇది చాలా చెడ్డది. ఆ ఆలోచనలు మరణానికి దారితీస్తాయి. 4 మనిషి ఇంకా బ్రతికివుంటే, అతను ఎవరైనా సరే,, అతనికి ఆశ ఉంటుంది. అయితే, ఈ నానుడి నిజం!
చచ్చిన సింహం కంటె, బతికివున్న కుక్క మేలు.
5 బ్రతికివున్న మనుష్యులకి తాము చనిపోతామన్న విషయం తెలుసు. అయితే చనిపోయిన మనుష్యులకి యేమీ తెలియదు. చనిపోయినవాళ్లకి యిక యే ప్రతిఫలము ఉండదు. జనం వాళ్లని త్వరలోనే మరచిపోతారు. 6 ఒక వ్యక్తి చనిపోయాక, అతని ప్రేమ, ద్వేషం, ఈర్ష్య అన్నీ అంతరించిపోతాయి. చనిపోయినవాళ్లు భూమిమీద జరిగే వేటిలోనూ ఏమీ, ఎన్నడు ఇక పాలుపంచుకోలేరు.
నీకు సాధ్యమైనప్పుడే జీవితాన్ని అనుభవించు
7 అందుకని, పో, పోయి తిండి తిను, దాంట్లోని ఉల్లాసాన్ని అనుభవించు. నీ ద్రాక్షారసం సేవించి, ఆనందం పొందు. ఈ పనులు దేవుని దృష్టిలో తప్పేమీ కావు. 8 చక్కటి దుస్తులు ధరించి, నిన్ను నీవు బాగా కనిపించేలా చూసుకో. 9 నీవు ప్రేమించే భార్యతో సుఖం అనుభవించు. నీ స్వల్పకాలిక జీవితంలో ప్రతి ఒక్క రోజునూ సుఖంగా గడుపు. దేవుడు నీకీ భూమిమీద ఈ స్వల్ప జీవితాన్ని ఇచ్చాడు, నీకున్నదంతా ఇంతే. అందుకని, నీవు ఈ జీవితంలో చేయవలసిన పనిని సరగాదా చెయ్యి. 10 నీకు పని దొరికిన ప్రతి సారి, నీవు దాన్ని నీ శాయశక్తులా అత్యుత్తమంగా చెయ్యి. సమాధిలో పనేమీ ఉండదు. అక్కడ ఆలోచన, జ్ఞానం, వివేకం ఏ ఒక్కటి ఉండదు. మనందరి గమ్యమూ ఆ మృత్యు స్థానమే.
ఈ జీవన పోరాటం అగమ్య గోచరం
11 ఈ ప్రపంచంలో నేను చూసిన సక్రమం కాని విషయాలు ఇంకా ఉన్నాయి: అతి వేగంగా పరిగెత్తేవాడు పరుగు పోటీలో ఎల్లప్పుడూ గెలవలేడు. అత్యంత బలీయమైన సైన్యమైనా యుద్ధంలో ఎల్లప్పుడూ గెలవలేదు. మిక్కిలి వివేకవంతుడు కూడా తాను సంపాదించిన ఆహారాన్ని ఎల్లప్పుడూ పొందలేడు. మిక్కిలి చురుకైనవాడు కూడా సంపదను ఎల్లప్పుడూ సాధించుకోలేడు. విద్యావంతుడికైనా ఎల్లప్పుడూ తనికి యోగ్యమైన ప్రశంస లభ్యంకాదు. చెడు కాలము దాపురించినప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి.
12 తనకు మరు క్షణంలో ఏమి జరగనున్నదో మనిషికి ఎన్నడూ తెలియదు. మనిషి వలలో చిక్కిన చేపలాంటివాడు. ముందేమి జరగబోతున్నదీ ఆ చేపకి తెలియదు. అతను పంజరంలో చిక్కిన పక్షిలాంటివాడు, ఆ పక్షికి ముందేమి జరగనున్నది తెలియదు. అదే విధంగా, మనిషి కూడా తనకి ఆకస్మికంగా సంభవించే కీడుల బోనులో చిక్కుకుంటాడు.
జ్ఞాన శక్తి
13 ఈ భూమిమీద ఒక వ్యక్తి వివేకవంతమైన ఒక పని చెయ్యడం కూడా నేను చూశాను. అది చాలా ముఖ్యమైన పని అని నాకు అనిపించింది. 14 స్వల్ప జనాభా కలిగిన ఒక చిన్న పట్టణం వుంది. ఒక గొప్ప రాజు ఆ పట్టణం మీదకి దండెత్తి, దాని చుట్టూ తన సేనలను నిలిపాడు. 15 కాని, ఆ పట్టణంలో ఒక జ్ఞాని వున్నాడు. ఆ జ్ఞాని పేదవాడు. అయితే, అతను తన జ్ఞానాన్ని తన పట్టణాన్ని కాపాడేందుకు వినియోగించాడు. అన్నీ ముగిసిపోయాక, జనం అతన్ని గురించి మరచిపోయారు. 16 అయినప్పటికీ, ఆ జ్ఞానం ఆ బలం కంటె మెరుగైనదని నేనంటాను. ఆ జనం ఆ పేదవాని జ్ఞానం గురించి మరిచిపోయారు. అతని మాటలను ఆ జనం పట్టించుకోవడం మానేశారు. (అయినా కూడా ఆ జ్ఞానం మెరుగైనదని నేను నమ్ముతాను.)
చివరి హెచ్చరికలు
13 మూడవసారి మీ దగ్గరకు వస్తున్నాను. “ప్రతి విషయం యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యాలతో రుజువు పరచాలి.”(A) 2 నేను రెండవ సారి వచ్చి మీతో ఉన్నప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని యిదివరకే హెచ్చరించాను. నేను యిప్పుడు మీ సమక్షంలో లేను కనుక మళ్ళీ చెపుతున్నాను. 3 కనుక నేను ఈ సారి వచ్చినప్పుడు ఇదివరలో పాపంచేసినవాళ్ళను ఇప్పుడు పాపంచేసినవాళ్ళను శిక్షిస్తాను. క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడన్న దానికి మీరు రుజువు అడుగుతున్నారు. మీ పట్ల క్రీస్తు బలహీనంగా ఉండడు. ఆయన మీ మధ్య శక్తివంతంగా ఉన్నాడు. 4 బలహీనతల్లో ఆయన సిలువ వేయబడ్డాడు. అయినా, దైవశక్తివల్ల జీవిస్తున్నాడు. అదే విధంగా మేము ఆయనలో బలహీనంగా ఉన్నా, దైవశక్తి వల్ల ఆయనతో సహా జీవించి మీ సేవ చేస్తున్నాము.
5 మీరు నిజమైన “విశ్వాసులా, కాదా” అని తెలుసుకోవాలనుకొంటే మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు. 6 మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను. 7 మీరు ఏ తప్పూ చేయకుండా ఉండాలని మేమే దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్లు ప్రజలు గమనించాలని కాదు కాని, మేము పరీక్షల్లో నెగ్గినట్లు కనపడకపోయినా మీరు మంచి చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము. 8 మేము సత్యానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేము. అన్నీ సత్యంకొరకే చేస్తాము. 9 మీరు బలంగా ఉంటే, మేము బలహీనంగా ఉండటానికి సంతోషిస్తాం. మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. 10 అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు యివి వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మీ విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి యిచ్చాడు, కాని నాశనం చేయటానికి కాదు.
11 తుదకు, సోదరులారా! పరిపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నించండి. నేను చెప్పేవాటిని చెయ్యండి. ఒకరితో ఒకరు సహకరిస్తూ జీవించండి. ప్రేమను, శాంతినిచ్చే దేవుడు మీతో ఉంటాడు.
12 పవిత్రమైన ముద్దుతో పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇక్కడున్న విశ్వాసులందరు తమ శుభాకాంక్షలు తెలుపమన్నారు.
13 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండుగాక!
© 1997 Bible League International