Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ప్రసంగి 4-6

చనిపోవడం మెరుగా?

నేను చూసిన మరో విషయం ఏమిటంటే, చాలా మంది సరిగ్గా చూడరు. వాళ్లు కన్నీళ్లు పెట్టు కోవడం నేను చూశాను. ఆ విచారగ్రస్తుల్ని ఓదార్చే వాళ్లు ఎవరూ లేరన్న విషయం, క్రూరులైనవాళ్ల చేతుల్లోనే అధికారమంతా ఉందన్న విషయం కూడా నేను గమనించాను. ఆ క్రూరుల చేతుల్లో బాధలుపడేవాళ్లకు ఉపశమనం కలిగించే వాడెవడూ లేడని నేను గమనించాను. ఇంకా బ్రతికున్నవాళ్ల కంటె చనిపోయిన వాళ్ల పరిస్థితులే మెరుగ్గా ఉన్నాయని నేను తీర్మానించుకున్నాను. (పురింట్లోనే చనిపోయే వాళ్ల) పరిస్థితి అంతకంటే కూడా మెరుగ్గా ఉంది! ఎందుకంటే, ఈ ప్రపంచంలో జరిగే ఏ చెడుగునూ వాళ్లెన్నడూ చూడరు.

మరీ కష్టపడి పనిచెయ్యడం ఎందుకు?

తర్వాత నేనిలా అనుకున్నాను, “మనుష్యులు మరింత కష్టపడి పనిచేస్తారెందుకు?” కొందరు విజయం సాధించి ఇతరులకంటె మెరుగవాలని ప్రయత్నించడం నేను చూశాను. ఎందుకంటే, వాళ్లలో ఈర్ష్య ఉంది. తమకి ఉన్నదానికంటె ఇతరులు అధికంగా కలిగివుండటం వాళ్లకి ఇష్టం లేదు. ఇది కూడా బుధ్ది హీనత. ఇది గాలిని పట్టుకొనే ప్రయత్నం.

కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం మూర్ఖత్వం. మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.” బహుశాః ఈ మాట నిజమే కావచ్చు. మరికొన్ని సంపాదించు కోవాలని సదా తంటాలు పడటం కంటె, ఉన్న కొద్దివాటితో తృప్తి చెందడం మెరుగని నా ఉద్దేశం.

మతిమాలిన మరో విషయం నేను గమనించాను, ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి కుటుంబం ఉండకపోవచ్చు. ఒక కొడుకో, ఒక సోదరుడో ఉండక పోవచ్చు. అయితేనేమి, అతను రెక్కలు విరుచుకొని అతిగా పని చేస్తూనే ఉంటాడు. తనకి ఉన్నదానితో అతను ఎన్నడూ తృప్తిచెందడు. అతను నిర్విరామంగా కష్టించి పనిచేసి, “నేనిలా ఎందుకు రెక్కలు విరుచుకొని పనిచేస్తున్నట్లు? నేను నా జీవితాన్ని హాయిగా ఎందుకు గడపకూడదు?” అని అనుకో. ఇది కూడా చెడ్డదే అర్థరహితమైనదే.

మిత్రులు, కుటుంబం బలం యిస్తారు

ఒకరికంటె ఇద్దరు మెరుగు. ఇద్దరు కలిసి పనిచేస్తే, తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు.

10 ఒకడు పడిపోతే రెండోవాడు అతనికి సహాయం చెయ్యగలుగుతాడు. ఒంటరిగాడు పడి పోయినప్పుడు అతను నిస్సహాయుడవుతాడు. అక్కడ అతనికి సాయపడేవాడు ఎవడూ వుండడు.

11 ఇద్దరు జంటగా పడుకుంటే, వాళ్లకి వెచ్చగా ఉంటుంది. ఒంటిగా నిద్రించేవాడికి వెచ్చదనం ఉండదు.

12 ఒంటరి వ్యక్తిని శత్రువు ఓడించగలుగుతాడు. అయితే, అదే శత్రువు ఇద్దర్ని ఓడించలేడు. అదే ముగ్గురుంటే, ఇంకా ఎక్కువ బలం కలిగివుంటారు. ముప్పేట తాడును తెంచలేనట్లే, వాళ్లని దెబ్బతియ్యడం చాలా కష్టసాధ్యమవుతుంది.

జనం, రాజకీయాలు, పలుకుబడి

13 వృద్ధుడే అయినా బుద్ధిహీనుడైన రాజుకంటె, బీదవాడే అయినా బుద్ధిశాలి అయిన యువ నాయకుడు మేలు. ఆ ముసలి రాజు హెచ్చరికలను చెవిన పెట్టడు. 14 ఆ యువ రాజు రాజ్యంలో పేదవాడై పుట్టి ఉండవచ్చు. బహుశాః అతను చెరనుండి బయటకు వచ్చిన రాజు అవ్వొచ్చు. 15 నేనీ ప్రపంచంలో మనుష్యుల్ని పరిశీలించాను. నాకీ విషయం తెలుసు: జనం ఆ యువకుణ్ణే అనుసరిస్తారు. అతనే కొత్త రాజు అవుతాడు. 16 తండోపతండాలుగా జనం అ యువకుణ్ణి అనుసరిస్తారు. అయితే, దరిమిలా, ఆ జనమే అతనంటే ఇష్టపడరు. ఇది అర్థరహితమే. ఇది గాలిని పట్టుకొన ప్రయత్నించడం లాంటిదే.

వాగ్దానం చేయుటలో జాగ్రత్తగా వుండండి

దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మూఢ జనం మాదిరిగా బలులు ఇవ్వడం కంటె (దైవవాణిని) వినడం మేలు. మూఢులు తరచు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకి తమ పనులు చెడ్డవని కూడా తెలియదు. దేవునికి మీరు మొక్కులు మొక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించండి. దేవునికి మీ సమర్పణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో తొందరపడి నోరుజారకండి. దేవుడు పైన పరలోకంలో ఉన్నాడు, మీరు క్రింద భూమిమీద వున్నారు. అందుకని దేవునికి వేడుకొనుట కొద్దిగా మాత్రమే మీరు చెయ్యండి. (ఈ కింది లోకోక్తి లోని వాస్తవాన్ని గమనించండి)

అధిక వ్యాకుల మనస్కులు పీడకలలు కంటారు,
    బుద్ధిహీనులు అతిగా వాగుతారు.

దేవునికి నీవేదైనా మొక్కకుంటే, దాన్ని చెల్లించు. నీవు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు ప్రసన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని నీవాయనకు ఇవ్వు. ఏదైనా వాగ్దానం చేసి దాన్ని చేయలేక పోవడం కంటె, అసలేమి మొక్కుకోక పోవడమే మేలు. అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు.[a] నీవాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నీవు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు. నీ పనికిమాలిన స్వప్నాలు, బింకాలు (నీకు హాని కలిగించకుండా) చూసుకో. నీవు దేవుని పట్ల భక్తి కలిగి ఉండు.

ప్రతి అధికారిపైన మరొక అధికారి ఉంటాడు

ఏ దేశమైనా తీసుకో. బీదవాళ్లు బలవంతముగా కఠిన పని చేయడం నీవు చూడవచ్చు. బీదల విషయంలో ఇది అన్యాయ వర్తన అని, బీదల హక్కులకు ఇది విరుద్ధమని నీవు చూడగలుగుతావు. అయితే, నీవు యిందుకు ఆశ్చర్యపడబోకు! వాళ్లచేత అలా బలవంతాన పనిచేయించే అధికారి పైన, మరో అధికారి ఉంటాడు. ఈ ఇద్దరు అధికారులపైనా పెత్తనం చలాయించి పనిచేయించే మరో పై అధికారి వుంటాడు. రాజు కూడా బానిసే. అతని రాజ్యం అతనికి యజమాని.

ధనం సంతోషమును కొనలేదు

10 డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు తనకు ఉన్న డబ్బుతో ఎన్నడూ తృప్తి చెందడు. ఐశ్వర్యాన్ని ప్రేమించేవాడు తనికు ఇంకా ఇంకా వచ్చి పడినా తృప్తి చెందడు. ధన వ్యామోహం కూడా అర్థరహిత మైనదే.

11 ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే, దాన్ని ఖర్చు పెట్టడంలో తోడ్పడే “మిత్రులు” అంత ఎక్కువ మంది ఉంటారు. దానితో, వాస్తవంలో ఆ ధనికుడు పొందే లాభమేమీ ఉండదు. అతను తన సంపదని చూసుకుని మురిసిపోగలడు. అంత మాత్రమే.

12 రోజంతా చెమటోర్చి కష్టపడేవాడు యింటికి తిరిగి వచ్చి తక్కువగా తిన్నా లేక ఎక్కువగా తిన్నా నిశ్చింతగా నిద్రపోతాడు. శ్రమజీవికి తినేందుకు కొంచెమే వున్నా, ఎక్కువ వున్నా అతనికి అదేమంత ముఖ్యంకాదు. కాని, ధనికుడికి తన సంపద విషయంలో దిగులుతో నిద్రపట్టదు.

13 ఈ ప్రపంచంలో చాలా విచారకరమైన విషయం ఒకటి నేను గమనించాను. ఒకడు భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేస్తాడు. 14 తర్వాత ఏదో విపత్తు వచ్చి, తన ఆస్తి సర్వస్వం కోల్పోతాడు. అప్పుడిక తన కొడుక్కి ఇచ్చేందుకు అతని దగ్గర చిల్లి గవ్వకూడా మిగలదు.

15 తల్లి గర్భం నుంచి వ్యక్తి పుట్టినప్పుడు అతని దగ్గర ఏమీ ఉండదు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తనతో తీసుకెళ్లేది ఏమీ ఉండదు. అతను ఆయా వస్తువుల కోసం చచ్చేలా శ్రమిస్తాడు. కాని, తాను చనిపోయినప్పుడు అతను తన వెంట తీసుకువెళ్లగలిగింది ఏమీ ఉండదు. 16 ఇది చాలా విచారకరమైన విషయం. తను ఈ లోకంలోకి ఎలా వస్తాడో అలాగే పోతాడు. కాగా, “గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నం” వల్ల మనిషికి ఒరిగేదేమిటి? 17 దుఃఖంతో, విచారంతో నిండిన రోజులు. నిరాశా నిస్పృహలు అనారోగ్యాలు, చికాకులు చివరికి అతనికి మిగిలేవి ఇవే!

మీ జీవిత కృషి ఫలితాన్ని అనుభవించండి

18 ఈ భూమిమీద ఉత్తమమైనది ఏమనగా, తనకున్న స్వల్ప జీవితకాల వ్యవధిలో మనిషి అన్న పానాలు తృప్తిగా సేవించాలి, తన పని ఫలితాన్ని సుఖంగా అనుభవించాలి. దేవుడు అతనికి ఇచ్చినది ఈ కొద్ది రోజులు మాత్రమే అన్న విషయాన్ని దృష్టిలో వుంచుకోవాలి ఇదే మనిషి చేయగలిగినదన్న విషయాన్ని నేను గమనించాను.

19 దేవుడు ఒక వ్యక్తికి సంపదని, ఆస్తిని హాయిగా అనుభవించే శక్తిని ఇస్తే, ఆ వ్యక్తి వాటిని అనుభవించాలి. ఆ వ్యక్తి తనకున్న వాటిని స్వీకరించాలి. దేవుని వరమైన తన పనిని సంతోషంగా చెయ్యాలి. 20 మనిషి ఆయుష్షు సుదీర్ఘమైనది కాదు కనుక, అతని విషయాలన్నీ తన జీవితం పొడుగునా గుర్తుంచు కోవాలి. ఆ మనిషి ఇష్టంగా చేసే పనిలో దేవుడు అతన్ని నిమగ్నుణ్ణి చేస్తాడు.[b]

ఐశ్వర్యం సంతోషాన్ని ఇవ్వదు

నేను ఈ ప్రపంచంలో అసమంజసమైన మరో విషయాన్ని గమనించాను. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దేవుడు ఒక మనిషికి గొప్ప సంపద, ఆస్తి మరియు గౌరవమూ ప్రసాదిస్తాడు. అతనికి కావలసినవన్నీ, అతను కోరుకోగలిగిన సమస్తం వుంటాయి. అయితే, ఆ వ్యక్తి వాటిని అనుభవించకుండా చేస్తాడు దేవుడు. ఒక అపరిచితుడు వస్తాడు, వాటన్నింటినీ చేజిక్కించుకుంటాడు. ఇది కూడా అర్థరహితమైన చాలా చెడ్డ విషయమే.

ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించవచ్చు. అతనికి వంద మంది సంతానం ఉండవచ్చు. అయితే, ఈ మంచి విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణానంతరం[c] ఏ ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ అనుకోండి, అప్పుడు అతనికంటె పురిట్లోనే చనిపోయే శిశువు మెరుగని నేనంటాను. మృత శిశువుగా పుట్టడం నిజంగానే అర్థరహితం. పేరైనా లేని ఆ శిశువుని వెంటనే తీసుకుపోయి సూర్యరశ్మి చొరని చీకటి సమాధిలో పూడ్చేస్తారు. సూర్యరశ్మినైనా చూడని ఆ శిశువుకి బొత్తిగా ఏది ఏమాత్రం తెలియదు. కాని, దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని ఆ మనిషికంటె ఆ శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవిస్తుంది. ఆ మనిషి రెండు వేల సంవత్సరాలు బతకవచ్చు. అయినా అతను తనకు ఇచ్చిన జీవితాన్ని అనుభవించక పోతే అతనికంటె గర్భంలో చనిపోయిన శిశువు సులభమయిన మార్గంలో ఆ అంత్యదశను పొందిందనవచ్చు.

తిండి కోసం మనిషి చచ్చేలా పాటుపడతాడు. అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు. వివేకవంతుడు అవివేకికంటె విశేషమైనవాడు కాడు. అంతకంటె, ఉన్నవి ఉన్నట్లు జీవితాన్ని స్వీకరించడం తెలిసిన బీదవాడు మేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా ఏదో కావాలని ఆశించడంకంటె, ఉన్నదానితో తృప్తి చెంది సంతోషంగా ఉండటంమేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని పట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే.

10-11 మనిషి ఎందుకు సృష్టింపబడ్డాడు? మనిషిగా ఉండేందుకు మాత్రమే. దీన్ని గురించి చర్చించడం వృధా ప్రయాసమే. దీన్ని గురించి మనిషి దేవునితో చర్చించలేడు. ఎందుకంటే, మనిషికంటె దేవుడు శక్తిమంతుడు. సుదీర్ఘంగా వాదించినంత మాత్రాన ఈ వాస్తవం మారిపోదు.

12 భూమిమీద స్వల్ప కాలం జీవించే మనిషికి, ఆ స్వల్ప కాలంలో అతనికి ఏది అత్యుత్తమమైనదో ఎవరికి తెలుస్తుంది? అతని జీవితం నీడలా గడిచిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ అతనికి చెప్పలేరు.

2 కొరింథీయులకు 12

పౌలుకు దర్శనం, ముల్లు

12 లాభం లేకపోయినా నేను గర్వంగా చెప్పుకొంటూ పోవాలి. ప్రభువు వలన కలిగిన దర్శనాలు, ప్రత్యక్షతలు గురించి చెప్పనివ్వండి. క్రీస్తును విశ్వసించే ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశమునకు తీసుకు వెళ్ళాడు. అతణ్ణి శరీరంతో తీసుకొని వెళ్ళాడో లేక అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడో, నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. నాకు తెలిసిన ఈ వ్యక్తి శరీరంతో వెళ్ళాడో లేక అతని ఆత్మ మాత్రమే వెళ్ళిందో నాకు తెలియదు. దేవునికే తెలుసు. దేవుడు యితణ్ణి పరదైసునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు. నేను అతణ్ణి గురించి గర్వంగా చెపుతున్నాను. కాని నా గురించి నేను గర్వంగా చెప్పుకోను. నా బలహీనతను గురించి మాత్రమే గర్వంగా చెప్పుకొంటాను.

ఒకవేళ నేను గర్వంగా మాట్లాడినా, నేను ఎప్పుడూ నిజం చెబుతాను కనుక తెలివిలేనివాణ్ణని అనిపించుకోను. నేను చెప్పినవాటి కన్నా, చేసినవాటి కన్నా నన్ను గురించి మీరు గొప్పగా అనుకోరాదని నా అభిలాష. కనుక నేను నన్ను గురించి గర్వంగా చెప్పుకోకుండా నిగ్రహించుకొంటాను.

దేవుడు కనుపరచిన ఈ గొప్పవిషయాల వల్ల నాకు గర్వం కలుగరాదని నా శరీరంలో ఒక ముల్లు ఉంచబడింది. అది సాతాను దూత. అది నన్ను బాధపెడుతూ ఉంటుంది. ఆ ముల్లు తీసివేయమని ప్రభువుతో మూడు సార్లు మొరపెట్టుకొన్నాను. కాని ప్రభువు నాతో, “నీకు నా అనుగ్రహం చాలు. నా శక్తి నీ బలహీనత ద్వారా పరిపూర్ణత పొందుతుంది” అని అన్నాడు. అందువల్ల క్రీస్తు శక్తి నాలో ఉండాలని నా బలహీనతను గురించి ఇంకా ఎక్కువ ఆనందంతో, గర్వంగా చెప్పుకొంటాను. 10 అందువల్లే క్రీస్తు కోసం నేను బలహీనతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, కష్టాల్లో ఆనందం పొందుతూ ఉంటాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉంటాను.

కొరింథు ప్రజల విషయంలో చింత

11 నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను. కాని దీనికి మీరే కారకులు. నేను ఏమీకాకపోయినా ఆ “గొప్ప అపొస్తలుల” కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను మెచ్చుకోవలసింది. 12 అపొస్తలుడని అనిపించుకొనుటకు తగిన రుజువులు, అద్భుతాలు, మహత్కార్యాలు మీ మధ్య నేను పట్టుదలతో చేసాను. అని నేను మీ కోసం పట్టుదలతో చేసాను. 13 నేను మీకు ఎన్నడూ భారంగా ఉండలేదు అన్న విషయంలో తప్ప ఇతర సంఘాలకన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? దీనికి నన్ను క్షమించండి.

14 ఇక యిప్పుడు మూడవసారి మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా నేను మీకు భారంగా ఉండను. నాకు కావలసింది మీ దగ్గరున్న వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తిని కూడపెట్టరు. కాని తల్లిదండ్రులే తమ పిల్లల కోసం ఆస్తి కూడబెడ్తారు. 15 అందువల్ల నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయంచేస్తాను. “నన్ను” మీకోసం ఉపయోగించుకోండి. నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే నన్ను మీరు తక్కువగా ప్రేమిస్తారా?

16 అది అలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదని తెలుసు కాని, “నేను పన్నాగాలు పన్ని మిమ్మల్ని వలలో వేసుకొన్నానని” కొందరు అనవచ్చు. 17 నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకొన్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొన్నానా? 18 నేను తీతును మీ దగ్గరకు వెళ్ళమని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట పంపాను. తీతు మిమ్మల్ని వంచించలేదు కదా? వంచించాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో, ఒకే మార్గాన్ని అనుసరించామని మీకు తెలుసు.

19 మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవాలని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకొంటున్నారా? లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లాడుతున్నాము. సోదరులారా! మీ విశ్వాసాన్ని ధృఢపరచాలని మేము యివి చేస్తున్నాము. 20 ఎందుకంటే, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకొన్నట్లు మీరు, మీరనుకొన్నట్లు నేను ఉండమేమోనని నాకు భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, కక్షలు, వదంతులు, గుస గుసలు, అహంభావాలు, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాము. 21 నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందనివాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివాళ్ళవల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International