Old/New Testament
జ్ఞానము, ఒక మంచి స్త్రీ
8 జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి!
మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది.
2 మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట
కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి.
3 పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి.
తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి.
4 జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని
నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా.
5 మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి.
అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి.
6 వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి.
సరైన విషయాలు నేను మీకు చెబుతాను.
7 నా మాటలు సత్యం.
చెడు అబద్ధాలు నాకు అసహ్యం.
8 నేను చెప్పే విషయాలు సరైనవి.
నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు.
9 తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి.
తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు.
10 నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది.
ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది.
11 జ్ఞానము ముత్యాలకంటె విలువగలది.
ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది.
జ్ఞానము విలువ
12 “నేను జ్ఞానాన్ని,
నేను మంచి తీర్పుతో జీవిస్తాను.
తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు.
13 ఒక మనిషి యెహోవాను గౌరవిస్తే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు.
నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను.
చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం.
14 కాని మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను.
తెలివిని, శక్తిని నేను వారికి ఇస్తాను!
15 రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు.
న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు.
16 భూమిమీద ప్రతి మంచి పాలకుడూ తన క్రింద ఉన్న
ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు.
17 నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను.
నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు.
18 నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి.
నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను.
19 నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి.
నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి.
20 నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను.
సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను.
21 నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను.
అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను.
22 “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట
యెహోవాచేత చేయబడింది నేనే
23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను.
ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను.
24 నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను.
నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను.
25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను.
26 యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను.
ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను.
27 యెహోవా ఆకాశాలను చేసినప్పుడు
నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు,
మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు
నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
28 ఆకాశంలో యెహోవా మేఘాలను
ఉంచకముందే నేను పుట్టాను.
మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు
నేను అక్కడ ఉన్నాను.
29 సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు
నేను అక్కడ ఉన్నాను.
యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు,
భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను.
30 నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు.
ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను.
31 యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు.
అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు.
32 “పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి.
మీరు నా మార్గాలు వెంబడిస్తే
మీరు కూడా సంతోషంగా ఉండగలరు
33 నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి.
వినుటకు తిరస్కరించకుడి.
34 ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు.
అతను అనుదినం నా ద్వారాల దగ్గర వేచి యుంటాడు.
35 నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును
యెహోవా వద్దనుండి అతడు మంచివాటిని పొందును.
36 అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి
తనకు తానే హాని చేసుకొంటాడు.
నన్ను అసహ్యించుకొనువారు మరణమును ప్రేమించెదరు.”
జ్ఞానము ఆహ్వానించుట
9 జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. 2 ఆమె (జ్ఞానము) భోజనం సిద్ధం చేసి, ద్రాక్షారసమును కలిపి, భోజనమును బల్లపైఉంచెను. 3 అప్పుడు ఆమె (జ్ఞానము) తన సేవకులను, ప్రజలను నగరములోని ఎత్తయిన స్థలమునకు తనతో పాటు తినుటకు ఆహ్వానించెను. కొండ మీదికి వచ్చి, ఆమెతో కూడ భోజనం చేసేందుకు మనుష్యులను ఆహ్వానించుటకు తన సేవకులను ఊళ్లోనికి పంపింది. 4 “నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న మనుష్యులారా, మీరు రండి” అని ఆమె చెప్పింది. బుద్దిహీనులను కూడా ఆమె పిలిచింది. 5 “నా జ్ఞాన భోజనం ఆరగించండి, రండి. నేను చేసిన ద్రాక్షారసం తాగండి. 6 మీ పాత బుద్ధిహీన పద్ధతులు విడిచి పెట్టండి. మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుసరించండి” అని ఆమె చెప్పింది.
7 ఒక గర్విష్ఠికి, అతడు చేసింది తప్పు అని చూపించటానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఆ మనిషి దేవుని జ్ఞానము గూర్చి హేళన చేస్తాడు. ఒక దుర్మార్గుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను హేళన చేస్తాడు. 8 కనుక ఒకడు ఇతరుల కంటే తాను మంచి వాడినని తలిస్తే అతనిది తప్పు అని అతనికి చెప్పవద్దు. దానివల్ల అతడు నిన్ను ద్వేషిస్తాడు. కాని జ్ఞానముగల ఒక మనిషికి సహాయం చేయటానికి నీవు ప్రయత్నిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు. 9 జ్ఞానముగల ఒక మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా జ్ఞానము గలవాడవుతాడు. ఒకవేళ మంచి మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు.
10 యెహోవా యెడల భయము కలిగి యుండుట జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు. యెహోవాను గూర్చిన జ్ఞానము తెలివి సంపాదించుటకు మొదటి మెట్టు. 11 నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. 12 నీవు జ్ఞానివి అయితే నీ మంచి కోసమే నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. కాని నీవు గర్వంగలవాడవై, యితరులను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే నిందించుకోవాలి.
బుద్ధిహీనత—ఇతర స్త్రీ
13 బుద్ధిహీనుడు గట్టిగా అరిచే చెడు స్త్రీలాంటివాడు. ఆమెకు తెలివి లేదు. 14 ఆమె తన ఇంటి గుమ్మంలో కూర్చుంటుంది. పట్టణంలో కొండ మీద తన కుర్చీలో ఆమె కూర్చుంటుంది. 15 ప్రజలు ఆ ప్రక్కగా నడిచినప్పుడు ఆమె వారిని పిలుస్తుంది. ఆ మనుష్యులకు ఆమెయందు ఆసక్తి లేదు. కాని 16 “నేర్చుకోవాల్సిన ప్రజలారా, రండి” అని ఆమె అంటుంది. బుద్ధిహీనులను కూడ ఆమె ఆహ్వానించింది. 17 “మీరు నీళ్లు దొంగిలిస్తే అవి మీ స్వంత నీళ్లకంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. మీరు రొట్టెను దొంగిలిస్తే మీరు స్వయంగా తయారు చేసుకొనే రొట్టెకంటె అది ఎక్కువ రుచిగా ఉంటుంది” అని ఆమె చెబుతుంది. 18 ఆమె ఇల్లు దయ్యాలతో మాత్రమే నిండి వుందని ఆ బుద్ధిహీనులకు తెలియదు. మరణస్థానపు లోతుల్లోకి వారిని ఆహ్వానించింది!
క్రొత్త నిబంధన యొక్క సేవకులు
3 ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగడుకొంటున్నట్లు అనిపిస్తోందా? మీ నుండి మాకు పరిచయపత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చినప్పుడు యితరులవలే పరిచయ పత్రాలు తీసుకురావాలా? 2 మీరే మా పరిచయ పత్రం. మిమ్మల్ని గురించి మా హృదయాలపై వ్రాయబడి ఉంది. ఇది అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు. 3 మీరు క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పత్రం సిరాతో కాక, సజీవమైన దేవుని ఆత్మతో వ్రాయబడింది. అది రాతి పలకపై కాక, మానవుల హృదయాలపై వ్రాయబడింది. మీరు మా సేవా ఫలితం.
4 మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము. కనుక మాకానమ్మకం ఉంది. 5 మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు. 6 దేవుడు మేము క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్లు మాకు శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు. అది దేవుని ఆత్మ రూపంలో ఉంది. వ్రాత రూపంలో ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి. కాని దేవుని ఆత్మ జీవాన్నిస్తాడు.
క్రొత్త నిబంధన యొక్క మహిమ
7 రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియమాలను దేవుడు యిచ్చినప్పుడు, మోషే ముఖం మీద మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ తగ్గుతూ పోయింది. అయినా ఇశ్రాయేలు ప్రజలు అతని ముఖం చూడలేక పోయారు. చావును కలిగించే పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే, 8 దేవుని ఆత్మనిచ్చే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. 9 శిక్షను కలిగించే పాలనలో అంత మహిమ ఉంటే, నీతిని స్థాపించే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. 10 ఇప్పుడు మనకు లభించిన గొప్ప మహిమతో పోలిస్తే, గతంలో ఉండిన ఆ మహిమకు ప్రకాశం లేదు. 11 నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి.
12 మాకు అంత నిరీక్షణ ఉంది కనుకనే మాలో యింత ధైర్యముంది. 13 తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి ముసుగు వేసుకొన్నాడు. మేము మోషేలాంటివాళ్ళము కాదు. 14 వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ నాటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు. 15 ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది. 16 కాని ప్రభువు వైపుకు మళ్ళినవాళ్ళ “ముసుగు తీసివేయబడింది.”(A) 17 ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది. 18 ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.
© 1997 Bible League International