Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 1-2

పరిచయం

ఈ మాటలు దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన సామెతలు. సొలొమెను ఇశ్రాయేలీయుల రాజు. ప్రజలు జ్ఞానము కలిగి, సరైన వాటిని చేయటం తెలుసుకొనేందుకు ఈ సంగతులు వ్రాయబడ్డాయి. నిజమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు ఈ మాటలు సహాయం చేస్తాయి. ప్రజలు జీవించేందుకు శ్రేష్ఠమైన విధానాన్ని ఈ మాటలు నేర్పిస్తాయి. నీతి, నిజాయితీ, మంచితనం కలిగి ఉండేందుకు సరైన మార్గాన్ని ప్రజలు నేర్చుకుంటారు. జ్ఞానమును నేర్చుకోవాల్సిన సాధారణ మనుష్యులకు జ్ఞానముగల ఈ మాటలు నేర్చిస్తాయి. యువతీ యువకులు ఈ మాటల మూలంగా జ్ఞానము, దాని ప్రయోగాన్ని నేర్చుకొంటారు. ఈ మాటల్లోని ఉపదేశాలను జ్ఞానముగలవారు కూడ జాగ్రత్తగా అనుసరించాలి. అప్పుడు వాళ్లు ఇంకా ఎక్కువ నేర్చుకొని, ఇంకా జ్ఞానముగల వారు అవుతారు. మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవటంలో నిపుణతగల వారు యింకా ఎక్కువ అవగాహన సంపాదిస్తారు. అప్పుడు జ్ఞానముగల కథలు, పొడుపు కథలు మనుష్యులు గ్రహించగలుగుతారు. జ్ఞానముగల వారు చెప్పే విషయాలను మనుష్యులు గ్రహించగలుగుతారు.

ఒక వ్యక్తి యెహోవాను గౌరవించి, ఆయనకు విధేయత చూపించటమే, నిజమైన తెలివికి మూలము. కాని పాపాన్ని ప్రేమించే మనుష్యులు జ్ఞానాన్ని, సరైన ఉపదేశాన్ని ద్వేషిస్తారు.

సొలొమోను మనకు ఇచ్చిన సలహా

నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశానికి నీవు విధేయుడవు కావాలి. మరియు నీ తల్లి ఉపదేశాలు కూడ నీవు పాటించాలి. నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి.

10 నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే ప్రజలు తమతో కూడ పాపాన్ని చేయించటానికి పయత్నిస్తారు. నీవు వారిని అనుసరించకూడదు. 11 ఆ పాపులు ఇలా చెప్పవచ్చు: “మాతో వచ్చేయి! మనం దాక్కొని, ఎవరినైనా అమాయకుణ్ణి చంపటానికి కనిపెడదాం. 12 ఎవరైనా ఒక నిర్దోషిమీద మనం దాడి చేద్దాం. మనం అతణ్ణి చంపుదాం. ఆ మనిషిని పితృ లోకానికి మనం పంపిద్దాం. అతణ్ణి మనం నాశనం చేసి, సమాధికి పంపిద్దాం. 13 చాలా ధనం, విలువ చేసే అన్ని రకాల వస్తువులు మనం దొంగిలిద్దాం. ఈ వస్తువులతో మనం మన గృహాలు నింపుకొందాం. 14 కనుక మాతో వచ్చి, వీటిని చేయటానికి మాకు సహాయం చేయి. మనకు దొరికే వస్తువులన్నింటినీ మనం అందరం పంచుకొందాం.”

15 నా కుమారుడా, పాపాన్ని ప్రేమించే మనుష్యులను వెంబడించవద్దు. వారు జీవించే విధానంలో మొదటి మెట్టు కూడా నీవు ఎక్కవద్దు. 16 ఆ చెడ్డ మనుష్యులు కీడు చేయటానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. వారు ఎంతసేపూ మనుష్యులను చంపాలని ఆశిస్తూంటారు.

17 ఒక పక్షి నిన్ను చూస్తూండగా ఆ పక్షిని పట్టాలని వల వేయటం నిష్ప్రయోజనం. కనుక ఆ దుర్మార్గులను కనిపెట్టి ఉండు. జాగ్రత్తగా ఉండు. ఆ దుర్మార్గులు ఇతరులను చంపాలని ఉచ్చు వేస్తున్నారు. 18 కాని నిజానికి వారికి వారే ఉచ్చు వేసుకొంటారు. వారి స్వంత ఉచ్చుతో వారే నాశనం చేయబడుతారు. 19 ఇవి దురాశపరుల పద్ధతులు అలాంటి దురాశ అది కలిగివున్నవారికి ప్రాణాంతక మవుతుంది.

మంచి స్త్రీ—జ్ఞానము

20 ఇలా విను! జ్ఞానము ప్రజలకు ఉపదేశించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె (జ్ఞానము) వీధుల్లో, సంతల్లో అరుస్తుంది. 21 రద్దీగల వీధి మూలల్లో ఆమె (జ్ఞానము) పిలుస్తోంది. ఆమె (జ్ఞానము) తన మాటలు వినేందుకు ప్రజలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టణ ద్వారాల దగ్గర ఉంటూ (జ్ఞానము) చెపుతుంది:

22 “మీరు వెర్రివాళ్లు. ఇంకెన్నాళ్లు మీరు ఇలా వెర్రి పనులు చేస్తూనే ఉంటారు? ఎన్నాళ్లు మీరు తెలివిని ద్వేషీస్తూ ఉంటారు? 23 మీరు పశ్చాత్తాపపడి నా సలహా, నా ఉపదేశం విని ఉంటే, నాకు తెలిసింది అంతా నేను మీతో చెప్పి ఉండేదాన్ని. నాకు ఉన్న తెలివి అంతా మీకు ఇచ్చి ఉండేదాన్ని.

24 “కాని మీరు నా మాట వినేందుకు తిరస్కరించారు. సహాయం చేయటానికి నేను ప్రయత్నించాను. నేను నా చేయి అందించాను. కాని నా సహాయం స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 25 నా సలహా అంతటినీ మీరు నిర్లక్ష్యం చేసి, తిప్పికొట్టారు. నా మాటలు స్వీకరించటానికి మీరు నిరాకరించారు. 26 అందుచేత నేను మీ కష్టం చూచి నవ్వుతాను. మీకు కష్టం కలగటం చూచి నేను సరదా పడతాను. 27 గొప్ప కష్టం తుఫానులా మీ మీదికి వస్తుంది. సమస్యలు ఒక బలమైన గాలిలా మీ మీద కొడతాయి. మీ కష్టాలు, మీ విచారం మీ మీద మహా గొప్ప భారంగా ఉంటాయి.

28 “ఈ సంగతులన్నీ జరిగినప్పుడు మీరు నా సహాయం కోసం అడుగుతారు. కాని నేను మీకు సహాయం చేయను. మీరు నాకోసం వెదుకుతారు, కాని మీరు నన్ను కనుగొనలేరు. 29 మీరు ఎన్నడూ నా తెలివిని కోరుకోలేదు, గనుక నేను మీకు సహాయం చేయను. మీరు యెహోవాకు భయపడి ఆయనను గౌరవించుటకు నిరాకరించారు. 30 నా సలహా మాటలు వినేందుకు ప్రజలారా మీరు నిరాకరించారు. నేను సరైనదారి మీకు చూపించినప్పుడు మీరు నా మాట వినేందుకు నిరాకరించారు. 31 కనుక మీరు మీ స్వంత విదానంలోనే పనులు చేసుకోవాలి. మీ స్వంత కీడు మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు.

32 “అవివేకులు జ్ఞానాన్ని అనుసరించేందుకు నిరాకరించిన మూలంగా మరణిస్తారు. వారి బుద్ధిహీన పధ్ధతులలో కొనసాగటం వారికి సంతోషం, అదే వారిని చంపుతుంది. 33 కాని, నాకు విధేయత చూపే వ్యక్తి క్షేమంగా జీవిస్తాడు. ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. అతడు కీడుకు భయపడాల్సిన అవసరం ఉండదు.”

జ్ఞానం చెప్పేది వినండి

నా కుమారుడా, నేను చెప్పే ఈ సంగతులు అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. జ్ఞానం చెప్పేది విని, గ్రహించటానికి నీ శక్తి కొలది ప్రయత్నించు. జ్ఞానం కోసం గట్టిగా మొరపెట్టు, అవగాహన కోసం గట్టిగా అడుగు. వెండికోసం వెదకినట్టు జ్ఞానం కోసం వెదుకు. దాచబడిన ధనం కోసం వెదకినట్టు దానికోసం వెదకు. వీటిని నీవు చేస్తే అప్పుడు నీవు యెహోవాను గౌరవించటం నేర్చుకొంటావు. నీవు నిజంగా దేవుణ్ణి గూర్చి నేర్చుకొంటావు.

యెహోవా జ్ఞానము ప్రసాదిస్తాడు. జ్ఞానము, అవగాహన ఆయన నోటి నుండి వస్తాయి. ఆయన నిజాయితీ పరులకు మంచి జ్ఞానం దాచి సమకూర్చి ఇస్తాడు. ఆయన నిజాయితీగా నడుచుకొనేవారికి కవచం లాంటివాడు. ఇతరుల యెడల న్యాయంగా ఉండేవాళ్లను ఆయన కాపాడతాడు. ఆయన తన పవిత్ర ప్రజలను కాపాడతాడు.

కనుక యెహోవా తన జ్ఞానమును ప్రసాదిస్తాడు. అప్పుడు మంచివి, న్యాయమైనవి మరియు సరియైనవి నీవు గ్రహిస్తావు. 10 నీ హృదయంలోనికి జ్ఞానం వస్తుంది, నీ ఆత్మ జ్ఞానం కలిగి ఆనందిస్తుంది.

11 జ్ఞానం నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుంది. 12 దుర్మార్గులు జీవించే చెడు మార్గంలో జీవించకుండ జ్ఞానము, వివేచన మిమ్మల్ని వారిస్తాయి. ఆ మనుష్యులు వారు చెప్పే వాటిలో కూడా దుర్మార్గులు 13 వారు మంచితనం విడిచి పెట్టి, ఇప్పుడు చీకట్లో (పాపంలో) జీవిస్తున్నారు. 14 వారు తప్పుచేసి సంతోషిస్తూ, దుర్మార్గపు చెడు మార్గాలలో ఆనందిస్తున్నారు. 15 ఆ మనుష్యులు నమ్మదగిన వారు కారు, వారు అబద్ధాలాడి మోసం చేస్తారు. కాని మీ జ్ఞానం, వివేచన వాటన్నిటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.

16 మరో దేశపు స్త్రీ ఎవరైనా నీవు ఆమెతో పాపము చేసేందుకు నిన్ను ఒప్పించేందుకని, దుర్మార్గులు తియ్యటి మాటలు ప్రయోగించవచ్చు. 17 ఆమె చిన్నదిగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంది కాని ఆమె తన భర్తను విడిచి పెట్టింది. ఆమె తన వివాహ ప్రమాణాన్ని నిలుపుకోవటం లేదు. ఆమె తన దేవుని నిబంధనను మర్చిపోతుంది. కాని లేదు అని ఆమెతో చెప్పేందుకు జ్ఞానం నీకు సహాయం చేస్తుంది. 18 నీవు బలహీనుడవై ఆమె ఇంట ప్రవేశిస్తే నాశనం (మరణం) వైపు మొదటి మెట్టు మీద నడచినట్టే. నీవు ఆమెను అలానే వెంబడిస్తే ఆమె నిన్ను సమాధికి నడిపిస్తుంది. 19 ఆమె ఒక సమాధిలా ఉంది. ఒకవేళ ఏ పురుషుడైనా ఆ స్త్రీ దగ్గరకు వెళ్తే, అతడు ఎన్నటికీ తిరిగి రాడు. ఆ మనిషి జీవితం మరలా ఎన్నటికి మొదటిలా ఉండదు.

20 కనుక నీవు మంచి మనుష్యుల అడుగుజాడలను అనుసరించేలా, మంచి మనుష్యులు జీవించే విధంగా జీవించునట్లు జ్ఞానం సహాయం చేస్తుంది. 21 సరిగ్గా జీవించే ప్రజలు దేశాన్ని తామే స్వంతంగా కలిగి ఉంటారు. మంచిని జరిగించే మనుష్యులు వారి భూమిలో జీవిస్తారు. 22 కాని దుర్మార్గులు వారి భూమిని పోగొట్టుకొంటారు. ఆ దుర్మార్గులు దేశం నుండి తొలగించి వేయబడతారు.

1 కొరింథీయులకు 16

పరిశుద్ధుల కోసం చందా

16 పరిశుద్ధుల కోసం సేకరించవలసిన చందాల విషయంలో ఏం చెయ్యాలో, గలతీయలో ఉన్న సంఘాలకు చెప్పాను. మీరు కూడా అదే విధంగా చెయ్యండి. తన సంపాదనను బట్టి ప్రతి ఒక్కడూ కొంత డబ్బు ఆదివారం రోజు దాచాలి. అలా చేస్తే నేను వచ్చిన రోజెల్లా చందానెత్తనవసరం ఉండదు. నేను వచ్చాక మీరెన్నుకొన్నవాళ్ళకు పరిచయ పత్రాలు వ్రాసి వాళ్ళతో మీరు సేకరించిన డబ్బును యెరూషలేము పంపుతాను. నేను కూడా వెళ్ళటం ఉచితమని అనిపిస్తే అంతా కలిసి వెళ్తాం.

పౌలు ప్రణాళికలు

నేను మాసిదోనియ ద్వారా వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళి, మీ దగ్గరకు వస్తాను. అలా చేస్తే నేను మీతో కొంతకాలం గడపవచ్చు. బహుశా చలికాలమంతా అక్కడే ఉంటానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు. అందుకే ప్రస్తుతం మీ దగ్గరకు రావాలని లేదు. అలా చేస్తే, నేను వెళ్తూ మిమ్మల్ని చూసినట్లు మాత్రమే ఔతుంది. అలా కాక, ప్రభువు చిత్తమైతే మీతో కొంతకాలం గడపాలని ఉంది. నేను ఎఫెసులో పెంతుకొస్తు పండుగ దాకా ఉంటాను. అక్కడ ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం కలిగింది. కాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

10 తిమోతి మీ దగ్గరకు వస్తే అతనికి ధైర్యం చెప్పండి. ఎందుకంటే, నాలాగే అతడు కూడా ప్రభువు కార్యాన్ని చేస్తున్నాడు. 11 ఎవ్వరూ అతణ్ణి నిరాకరించకండి. అతని ప్రయాణం శాంతంగా సాగేటట్లు చూడండి. అతడు యితర సోదరులతో కలిసి నా దగ్గరకు రానున్నాడు. అతని కోసం నేను ఎదురు చూస్తున్నాను.

12 ఇక మన సోదరుడైన అపొల్లోను గురించి: నేను మిగతా సోదరులతో కలిసి మీ దగ్గరకు వెళ్ళమని చాలా వేడుకొన్నాను. అతనికి ప్రస్తుతం వెళ్ళటానికి కొంచెం కూడా యిష్టం లేదు. కాని తనకు మనస్సున్నప్పుడు అతడు వస్తాడు.

పౌలు తన ఉత్తరాన్ని ముగించటం

13 మెలకువగా ఉండండి. సంపూర్ణంగా విశ్వసించండి. ధైర్యంగా ఉండండి. శక్తిని వదులుకోకండి. 14 చేసే కార్యాలు ప్రేమతో చెయ్యండి.

15 అకయ ప్రాంతంలో విశ్వాసులుగా మారినవాళ్ళలో స్తెఫను కుటుంబం మొదటిది. ఇది మీకు తెలుసు. వాళ్ళు తమ జీవితాన్ని విశ్వాసుల సేవకు అంకితం చేసారు. 16 వాళ్ళను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. వాళ్ళనే కాక వాళ్ళతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కణ్ణీ మీరు అనుసరించాలి.

17 స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు వచ్చి మీరు తీర్చలేని కొరత తీర్చారు. వాళ్ళు రావటం వల్ల నాకు ఆనందం కలిగింది. 18 వాళ్ళు మీ ఆత్మలకు, నా ఆత్మకు ఆనందం కలిగించారు. వాళ్ళను గౌరవించటం సమంజసం.

19 ఆసియ ప్రాంతంలోని సంఘాలు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల మరియు వాళ్ళింట్లో సమావేశమయ్యే సంఘము మీకు ప్రభువు పేరిట తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 20 ఇక్కడున్న సోదరులందరు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోదరుల ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకోండి. పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పండి.

21 నేను పౌలును. ఈ శుభాకాంక్షలు నా స్వహస్తాలతో వ్రాస్తున్నాను.

22 ప్రభువును ప్రేమించనివాడు శాపగ్రస్థుడు అవుతాడు!

ప్రభువా రమ్ము![a]

23 యేసు ప్రభువు యొక్క అనుగ్రహము మీకందరికి లభించుగాక.

24 యేసు క్రీస్తు పేరిట నా ప్రేమ మీకందరికీ తెలుపుతున్నాను. ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International