Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 140-142

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము.
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
    వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
    వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.

యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
    నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
    నా దారిలో వారు ఉచ్చు పెడతారు.

యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
    యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
    నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
    వారి పథకాలు నెగ్గనీయకు.

యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
    ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
    నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
    వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
    ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
    నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
    నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.

దావీదు స్తుతి కీర్తన.

141 యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
    నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము.
    త్వరపడి నాకు సహాయం చేయుము.
యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము.
    నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.

యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము.
    నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు.
    చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము.
    చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
ఒక మంచి మనిషి నన్ను సరిదిద్ది విమర్శించవచ్చు.
    అది నాకు మంచిదే.
వారి విమర్శను నేను అంగీకరిస్తాను.
నా ప్రార్థన ఎల్లప్పుడూ చెడు చేసేవారి పనులకు విరోధంగా వుంటుంది.
ఎత్తయిన కొండ శిఖరం నుండి వారి పాలకులు కిందికి పడదోయబడతారు.
    అప్పుడు నేను చెప్పింది సత్యం అని ప్రజలు తెలుసుకుంటారు.

మనుష్యులు నేలను తవ్వి దున్నుతారు. మట్టి వెదజల్లబడుతుంది.
    అదే విధంగా ఆ దుర్మార్గుల యెముకలు వారి సమాధిలో వెదజల్లబడతాయి.
యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను.
    నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము.
ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము.
    ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
10 నేను హాని లేకుండా తప్పించుకొనగా
    ఆ దుర్మార్గులు తమ ఉచ్చులలోనే పట్టుబడనిమ్ము.

దావీదు ధ్యాన గీతం. అతడు గుహలో ఉన్నప్పటి ప్రార్థన.

142 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను.
    యెహోవాను నేను ప్రార్థిస్తాను.
నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
    నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు.
    నా ప్రాణం నాలో మునిగిపోయింది.
    అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.

నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు.
    పారిపోవుటకు నాకు స్థలం లేదు.
    నన్ను రక్షించటానికి ఏ మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను.
    యెహోవా, నీవే నా క్షేమ స్థానం.
    యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
యెహోవా, నా ప్రార్థన విను.
    నీవు నాకు ఎంతో అవసరం.
నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము.
    యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను.
నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై,
    నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.

1 కొరింథీయులకు 14:1-20

వరాలు, వాటి ప్రాముఖ్యత

14 కనుక ప్రేమ మార్గాన్ని అనుసరించండి. ఆత్మీయ శక్తి లభించాలని, ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం లభించాలని ఆశించండి. తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మానవులతో కాదు. అతని మాటలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు పవిత్రాత్మ శక్తితో రహస్యాలను చెబుతూ ఉంటాడు. కాని దైవసందేశం చెప్పేవాడు విశ్వాసాన్ని బలపరచాలని ప్రజల్లో ఉత్సాహము, శాంతి కలిగించాలని దైవసందేశం చెపుతాడు. తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు తనకు మాత్రమే మేలు కలిగించుకొంటాడు. కాని దైవసందేశం చెప్పేవాడు సంఘానికి మేలు కలిగిస్తాడు.

మీలో ప్రతి ఒక్కడూ తెలియని భాషల్లో మాట్లాడితే నాకు యిష్టమే. కాని మీరు దైవసందేశం చెప్పటం నాకు ఇంకా ఎక్కువ యిష్టం. తెలియని భాషల్లో మాట్లాడేవాని మాటలకు అర్థం విడమర్చి చెప్పేవాడు ఉంటే సంఘానికి లాభం కలుగుతుంది. అది సంభవించకపోతే తెలియని భాషల్లో మాట్లాడేవానికన్నా దైవసందేశం చెప్పేవాడే గొప్ప.

సోదరులారా! నేను అక్కడికి వచ్చి తెలియని భాషలో మాట్లాడితే మీకు ఏం లాభం కలుగుతుంది? నా ద్వారా మీకు దేవుడు ఒక క్రొత్త విషయం తెలియచెయ్యాలి. లేక నా ద్వారా మీకు జ్ఞానం కలగాలి. లేక మీకు నా ద్వారా దైవసందేశం తెలియాలి. లేక నేను మీకు ఒక క్రొత్త విషయం బోధించగలగాలి. అలా జరగనట్లయితే లాభం ఏమిటి? పిల్లన గ్రోవి, వీణ వంటి ప్రాణం లేని వస్తువులు కూడా శబ్దం చేస్తాయి. వాటి స్వరాల్లో భేదం లేకుంటే ఏ వాయిద్యం వాయిస్తున్నారో ఎట్లా తెలుస్తుంది? బాకా సక్రమంగా ఊది పిలవకుంటే యుద్ధానికి ఎవరు సిద్ధమౌతారు?

అదే విధంగా మీ నాలుకతో అర్థం అయ్యే పదాలు మాట్లాడితే తప్ప మీరేం మాట్లాడుతున్నారో యితరులకు ఎట్లా అర్థం అవుతుంది? మీరు గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది. 10 ప్రపంచంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. సందేహం లేదు. కాని అర్థం లేని భాష ఏదీ లేదు. 11 ఒకడు మాట్లాడే విషయం నేను అర్థం చేసుకోలేకపోతే, నేను అతనికి పరదేశీయునిగా, అతడు నాకు పరదేశీయునిగా ఉంటాము. 12 మీకు ఆత్మీయ శక్తి లభించాలని ఆసక్తి ఉంది. కనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను అమితంగా కోరుకొండి.

13 కనుక తనకు తెలియని భాషల్లో మాట్లాడేవాడు తాను మాట్లాడిన వాటికి అర్థం చెప్పగలిగే శక్తినివ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి. 14 ఎందుకంటే నేను నాకు తెలియని భాషల్లో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది కాని నా బుద్ధి అందులో పాల్గొనదు. 15 మరి నేను ఏం చెయ్యాలి? నేను నా ఆత్మతో మాత్రమే కాక, నా బుద్ధితో కూడా ప్రార్థిస్తాను. నా ఆత్మతోను నా మనస్సుతోను కూడా పాడుతాను. 16 మీరు దేవుణ్ణి ఆత్మతో స్తుతిస్తున్నారనుకోండి. మీ సమావేశంలో సభ్యుడు కానివాడుంటే, అతనికి మీరు ఏమంటున్నారో తెలియదు. కనుక, మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎప్పుడు, “ఆమేన్” అని అనాలో అతనికి ఎట్లా తెలిస్తుంది? 17 మీరు సక్రమంగా స్తుతించినా ఆ వ్యక్తికి దాని వల్ల మేలు కలుగదు.

18 మీ అందరికంటే ఎక్కువగా యితర భాషల్లో మాట్లాడగలందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 19 నేను సంఘంలో మాట్లాడినప్పుడు తెలియని భాషల్లో పదివేల పదాలు మాట్లాడటం కన్నా నాకు తెలిసిన భాషల్లో ఐదు పదాలు ఉపయోగించి బోధించటం ఉత్తమమని నా అభిప్రాయము.

20 సోదరులారా! చిన్నపిల్లలవలె ఆలోచించకండి. చెడు విషయంలో చిన్నపిల్లల్లా ఉండండి. కాని ఆలోచించేటప్పుడు పెద్దవాళ్ళలా ఆలోచించండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International