Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 132-134

యాత్ర కీర్తన.

132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
    ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
    నేను నా పడక మీద పండుకొనను,
నేను నిద్రపోను,
    నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
    ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”

ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
    ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
    దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
    యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
    నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
    నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
    దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
    అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.

13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
    తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
    నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
    ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
    మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
    నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
    కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”

దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.

133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
    ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
    అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
    సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.

యాత్ర కీర్తన.

134 యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి!
    రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.
సేవకులారా, మీ చేతులు ఎత్తి
    యెహోవాను స్తుతించండి.
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!
    యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.

1 కొరింథీయులకు 11:17-34

ప్రభువు భోజనం

17 మీ సంఘ సమావేశాలు మంచికన్నా చెడును ఎక్కువగా చేస్తున్నాయి. కనుక ఈ క్రింది ఆజ్ఞలు మిమ్మల్ని పొగుడుతూ వ్రాయటం లేదు. 18 మీరు సమావేశమైనప్పుడు మీలో విభాగాలు కలుగుతున్నట్లు నేను విన్నాను. ఇందులో నిజముండవచ్చు. 19 సక్రమ మార్గాల్లో నడుచుకొనేవాళ్ళు రుజువు కావాలంటే మీలో విభేదాలు ఉండటం అవసరం.

20 మీరు సమావేశమైనప్పుడు నిజమైన “ప్రభు రాత్రి భోజనం” చెయ్యటం లేదు. 21 ఎందుకంటే మీరు తినేటప్పుడు ఎవరికోసం కాచుకోకుండా తింటారు. బాగా త్రాగుతారు. కాని కొందరు ఆకలితో ఉండిపోతారు. 22 తినటానికి, త్రాగటానికి మీకు ఇళ్ళు లేవా? మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. అంటే, మీరు దేవుని సంఘాన్ని లెక్క చెయ్యనట్లే కదా! మీరు ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో మిమ్మల్ని పొగడను.

23 నేను ప్రభువు నుండి పొందిన సందేశాన్ని మీకు చెప్పాను. యేసు ప్రభువు అప్పగింపబడిన రాత్రి రొట్టె చేత పట్టుకొని 24 దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని విరిచి, “ఇది మీ కొరకైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడి” అని అన్నాడు. 25 అదే విధముగా వారు భోజనమయిన తర్వాత ద్రాక్షారసం ఉన్న పాత్రను తీసుకొని, “ఈ పాత్ర నా రక్తంవలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనండి” అని అన్నాడు. 26 కనుక మీరు ఈ రొట్టెను తిని, ద్రాక్షారసమును త్రాగినప్పుడెల్ల ఆయన మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు.

27 కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి త్రాగుతారో అతడు ప్రభువు శరీరం పట్ల, ఆయన రక్తం పట్ల పాపం చేసినవాడగును. 28 ప్రతీ వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్రనుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి. 29 ప్రభువు శరీరమని గ్రహించక రొట్టెను తినువాడు, మరియు ద్రాక్షారసం త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు. 30 అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగగ్రస్తులు అయినారు, కొందరు మరణించారు. 31 కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు. 32 కాని, మనకు సరియైన శిక్షణ యివ్వాలని ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. ప్రపంచంతో పాటు మనకు శిక్ష లభించరాదని ఆయన ఉద్దేశ్యం.

33 అందువల్ల నా సోదరులారా! మీరు భోజనానికి సమావేశమైనప్పుడు ఒకరి కోసం ఒకరు కాచుకోండి. 34 మీరు సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఆకలి వేస్తే, అలాంటివాడు యింట్లోనే తిని రావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా ఆజ్ఞలు యిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International