Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 116-118

116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
    నాకు ఎంతో సంతోషం.
సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
    ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
    సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
    నేను భయపడి చింతపడ్డాను.
అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
    “యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
    యెహోవా దయగలవాడు.
నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
    నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
నా ఆత్మా, విశ్రమించు!
    యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
    నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
    నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.

10 “నేను నాశనమయ్యాను!”
    అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే”
    అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను.

12 యెహోవాకు నేను ఏమివ్వగలను?
    నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు.
13 నన్ను రక్షించినందుకు
    నేను ఆయనకు పానార్పణం యిస్తాను.
    యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
    ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను.

15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము.
    యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను.
    యెహోవా, నీవే నా మొదటి గురువు.
17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను.
    యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
    ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను.
19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను.
    యెహోవాను స్తుతించండి!

117 సర్వ దేశములారా, యెహోవాను స్తుతించండి.
    సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు.
    దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు.

యెహోవాను స్తుతించండి!

118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యాజకులారా, మీరు చెప్పండి.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.

నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
    యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
    నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
యెహోవా నా సహాయకుడు;
    నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
మనుష్యులను నమ్ముకొనుటకంటే
    యెహోవాను నమ్ముట మేలు.
మీ నాయకులను నమ్ముకొనుట కంటే
    యెహోవాను నమ్ముకొనుట మేలు.

10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
    కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
    యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.

17 నేను జీవిస్తాను! కాని మరణించను.
    మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
    కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
    నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
    ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
    మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
    అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
    ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
    దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26     యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”

యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
    బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”

28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
    నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

1 కొరింథీయులకు 7:1-19

వివాహం

ఇక మీరు వ్రాసిన ప్రశ్నలకు నా సమాధానం ఇది: ఔను. వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది. కాని లైంగిక అవినీతి చాలా వ్యాపించిపోయింది కనుక స్త్రీపురుషులు వివాహం చేసుకోవటం మంచిది. ప్రతీ పురుషుడు భర్తగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. అలాగే ప్రతీ స్త్రీ భార్యగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. భార్యకు తన శరీరంపై అధికారం లేదు. భర్తకు మాత్రమే ఆమె శరీరంపై అధికారం ఉంది. అలాగే భర్తకు తన శరీరంపై అధికారం లేదు. అతని శరీరంపై అతని భార్యకు మాత్రమే అధికారం ఉంది. భార్యాభర్తలు ఇరువురు సమ్మతించి దేవుని ప్రార్థించటంలో తమ కాలాన్ని గడపదలిస్తే తప్ప వేరువేరుగా ఉండకూడదు. ప్రార్థనా సమయం ముగిసాక మళ్ళీ మీరు కలిసికొనండి. మీలో ఆత్మనిగ్రహంలేదు. కనుక సాతాను ప్రేరేపణకు లొంగిపోకుండా జాగ్రత్త పడటానికి ఇలా చెయ్యటం అవసరం. ఇలా చెయ్యమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను. అందరూ నాలా ఉండాలని నా కోరిక. కాని ప్రతి ఒక్కనికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకనికి ఒక వరం, ఇంకొకనికి ఇంకొక వరం ఇచ్చాడు.

అవివాహితులకు, వితంతువులకు నా సలహా ఇది: వాళ్ళు నాలాగే పెళ్ళి చేసుకోకుండా ఉండటం మంచిది. కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే పెళ్ళి చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా పెళ్ళి చేసుకోవటం మంచిది.

10 వివాహితులకు నా ఆజ్ఞ ఇది. ఇది నా ఆజ్ఞ కాదు. ప్రభువుయొక్క ఆజ్ఞ. భార్య తన భర్తను వదిలివేయరాదు. 11 అలా వదిలివేస్తే ఆమె తిరిగి పెళ్ళి చేసుకోకూడదు. లేదా భర్తతో సమాధాన పడాలి. అలాగే భర్త తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు.

12 మిగతా వాళ్ళకు నా ఆజ్ఞ యిది. ఇది ప్రభువు ఆజ్ఞ కాదు. నా ఆజ్ఞ. ఒక విశ్వాసి భార్య ప్రభువును నమ్మనిదై అతనితో ఉండటానికిష్టపడితే అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 13 అలాగే ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి అతడు ఆమెతో జీవించాలని అనుకొంటే ఆమె అతనికి విడాకులు ఇవ్వకూడదు. 14 అంటే, విశ్వాసం లేని భర్త విశ్వాసురాలైన భార్యతో కలిసి జీవించటంవల్ల పవిత్రమౌతాడు. అదే విధంగా అవిశ్వాసియైన భార్య విశ్వాసియైన భర్తతో కలసి జీవించటం వల్ల పవిత్రమౌతుంది. అలాకానట్లయితే మీ సంతానం అపవిత్రంగా ఉంటుంది. కాని ఇప్పుడున్న ప్రకారం వాళ్ళు పవిత్రులే.

15 కాని, విశ్వాసి కానివాడు వెళ్ళిపోవాలని అనుకొంటే వెళ్ళిపోనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసికి కాని, విశ్వాసురాలికి కాని ఏ నిర్భంధం ఉండకూడదు. దేవుడు శాంతితో జీవించటానికే మనల్ని పిలిచాడు. 16 ఓ స్త్రీ! నీ వల్ల నీ భర్త రక్షింపబడుతాడో లేదో! నీకేమి తెలుసు? ఓ పురుషుడా! నీ వల్ల నీ భార్య రక్షింబడుతుందో లేదో! నీకేమి తెలుసు?

దేవుడు నిన్ను పిలిచినట్లే జీవించు

17 ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదించిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం ప్రభువు నియమించిన ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా ఉండాలి. ఈ నియమాన్ని అన్ని సంఘాలు పాటించాలని ఆజ్ఞాపిస్తున్నాను. 18 సున్నతి చేయించుకొన్నవాడు దేవుని పిలుపును అంగీకరిస్తే, అతడు ఆ సున్నతి లేనివానిగా ఉండుటకు ప్రయత్నించరాదు. సున్నతి చేయించుకొననివాడు దేవుని పిలుపును అంగీకరిస్తే అతడు సున్నతి చేయించుకోవటానికి ప్రయత్నం చేయరాదు. 19 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోక పోయినా జరిగేది ఏమిలేదు. దేవుని ఆజ్ఞల్ని పాటించటం ముఖ్యం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International