Old/New Testament
113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
యెహోవా నామాన్ని స్తుతించండి.
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
5 ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
ఆయన తప్పక కిందికి చూడాలి.
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
8 ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.
యెహోవాను స్తుతించండి!
114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
2 మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
3 దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
6 వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
7 వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
8 ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.
9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.
12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.
14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15 యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!
యెహోవాను స్తుతించండి!
క్రైస్తవుల మధ్య వివాదాలు
6 ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? 2 పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? 3 మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? 4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? 5 సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? 6 సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.
7 మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది. 8 దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.
9 దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే వాళ్ళకు, 10 దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు, దేవుని రాజ్యం దొరకదు. 11 మీలో కొందరు ఆ విధంగా జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్దోషులుగా పరిగణింపబడ్డారు.
లైంగిక అవినీతి
12 “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.” కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను కాను, 13 “తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు. 14 దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు. 15 మీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? మరి అలాంటప్పుడు క్రీస్తు అవయవాల్ని, వేశ్య దేహంతో కలుపమంటారా? అసంభవము. 16 తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపినవాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి”(A) అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. 17 కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు.
18 లైంగిక అవినీతికి దూరంగా ఉండండి, మనిషి చేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి కావు. కాని వ్యభిచారం చెయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత దేహంపట్ల పాపం చేసినట్లౌతుంది. 19 మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు. 20 మీ కోసం వెల చెల్లించబడింది. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి.
© 1997 Bible League International