Old/New Testament
కోరహు కుమారుల స్తుతి కీర్తన.
87 యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
2 ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
3 దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబుతారు.
4 దేవుడు తన ప్రజలందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబులోనులోను జీవిస్తున్నారు.
ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది.
5 సీయోనుగడ్డ మీద జన్మించిన
ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును.
సర్వోన్నతుడైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు.
6 దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు.
ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు.
7 దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు.
దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు.
“మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.
కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.
88 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
2 దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
3 నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
4 జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
5 మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
6 యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
7 నీవు నా మీద కోపగించావు.
నీవు నన్ను శిక్షించావు.
8 నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
9 నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10 యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!
11 చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14 యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
శిక్ష నన్ను చంపేస్తుంది.
17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
చీకటి మాత్రమే నాకు మిగిలింది.
అధికారులు
13 ప్రభుత్వాన్ని దేవుడే నియమించాడు కనుక ప్రతి ఒక్కడూ ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యాలి. ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని కూడా దేవుడే నియమించాడు. 2 అందువల్ల ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడు దేవుని ఆజ్ఞను ఎదిరించిన వానితో సమానము. వాళ్ళు శిక్షననుభవించవలసి వస్తుంది. 3 సక్రమంగా నడుచుకొనేవాళ్ళు పాలకులకు భయపడరు. తప్పు చేసినవాళ్ళకే ఆ భయం ఉంటుంది. ప్రభుత్వానికి భయపడకుండా ఉండాలంటే, సక్రమంగా నడుచుకోండి. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చుకుంటుంది.
4 మీ మంచి కోసం ప్రభుత్వ అధికారులు దేవుని సేవకులుగా పని చేస్తున్నారు. కాని మీరు తప్పు చేస్తే భయపడవలసిందే! వాళ్ళు ఖడ్గాన్ని వృథాగా ధరించరు. దేవుని సేవకులుగా వాళ్ళు తప్పు చేసినవాళ్ళను శిక్షించటానికి ఉన్నారు. 5 అందువల్ల శిక్షింపబడుతారనే కాకుండా మీ అంతరాత్మల కోసం కూడా అధికారులు చెప్పినట్లు చెయ్యటం అవసరం.
6 అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ కాలాన్నంతా దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అందువల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు. 7 ఎవరికేది ఋణపడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు ఋణపడి ఉంటే పన్నుల్ని, సుంకాలు ఋణపడి ఉంటే సుంకాల్ని, మర్యాదను ఋణపడి ఉంటే మర్యాదను, గౌరవాన్ని ఋణపడి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
ప్రేమ
8 తోటివాళ్ళను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతర్లను ప్రేమించటం అనే ఋణంలో తప్ప మరే ఋణంలో పడకండి. 9 “వ్యభిచారం చెయ్యరాదు; హత్య చెయ్యరాదు; దొంగతనం చెయ్యరాదు; ఇతర్లకు చెందిన వాటిని ఆశించరాదు”(A) అనే మొదలగు ఆజ్ఞలన్నీ, “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నాయి. 10 ప్రేమ పొరుగు వానికి హాని కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకొన్నదాన్ని ప్రేమ సాధిస్తుంది.
11 యేసు క్రీస్తును మనం నమ్మిన నాటి కంటే నేడు రక్షణ దగ్గరగా ఉంది కనుక ప్రస్తుత కాలాన్ని అర్థం చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక నిద్రనుండి మేలుకోండి. 12 రాత్రి గడిచిపోతోంది. అంతం కాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల చీకట్లో చేసే పనుల్ని ఆపి, పగటి వేళ ధరించే ఆయుధాల్ని ధరించండి. 13 పగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్యకుండా, త్రాగి మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతి లేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు లేకుండా ప్రవర్తించండి. 14 యేసు క్రీస్తు ప్రభువును వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా తృప్తి పరుచుకోవాలా అని ఆలోచించటం మానుకోండి.
© 1997 Bible League International