Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 81-83

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
సంగీతం ప్రారంభించండి.
    గిలక తప్పెట వాయించండి.
    స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
    పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
    ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
    దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
    నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
    తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
    నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”

“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
    ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
    ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

ఆసాపు స్తుతి కీర్తన.

82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
    ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
    దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.

“అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
    న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
    దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.

“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
    వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
    వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
నేను (దేవుడు) మీతో చెప్పాను,
    “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
    ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”

దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
    దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.

ఆసాపు స్తుతి గీతం.

83 దేవా, మౌనంగా ఉండవద్దు!
    నీ చెవులు మూసికోవద్దు!
    దేవా, దయచేసి ఊరుకోవద్దు.
దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
    నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
    నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
“ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
    అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.
దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతో చేసిన
    ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు.
6-7 ఆ శత్రువులు మనకు విరోధంగా పోరాడేందుకు ఏకమయ్యారు. ఎదోము, ఇష్మాయేలు ప్రజలు; మోయాబు, హగ్రీ సంతతివారు;
    గెబలువారు; అమ్మోను, అమాలేకీ ప్రజలు;
    ఫిలిష్తీ ప్రజలు; తూరులో నివసించే ప్రజలంతా మనతో పోరాడుటకు ఏకమయ్యారు.
అష్షూరు సైన్యం లోతు వంశస్థులతో చేరి,
    వారంతా నిజంగా బలముగలవారయ్యారు.

దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరాను,
    యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు.
    వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.
11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబుకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము.
    జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము.
12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు
    ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు.
13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె[d] ఆ ప్రజలను చేయుము.
    గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు
    కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము.
    సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము.
    అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
    వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
    అని వారు తెలుసుకొంటారు.

రోమీయులకు 11:19-36

19 మమ్మల్ని అంటు కట్టాలని కొమ్మలు కొట్టివేయబడ్డాయి అని మీరనవచ్చు. 20 నిజమే! విశ్వాసం లేనందువల్ల అవి కొట్టి వేయబడ్డాయి. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీరా చెట్టునంటుకొని ఉన్నారు. అలా అని గర్వించకండి. భయంతో ఉండండి. 21 ఎందుకంటే, సహజంగా పెరిగిన కొమ్మల్ని దేవుడు లెక్క చేయలేదంటే మిమ్మల్ని కూడా లెక్క చేయడు.

22 అందువల్ల దేవుని కరుణను, కోపాన్ని అర్థం చేసుకొనండి. విశ్వసించని కొమ్మల్ని నరికి వేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మీరు ఆయన కరుణను అంటి పెట్టుకొని జీవిస్తుంటే కరుణను చూపుతూ ఉంటాడు. లేని పక్షాన మిమ్మల్ని కూడా కొట్టివేస్తాడు. 23 వాళ్ళు, మేము విశ్వాసహీనంగా ఉంటామని మొండి పట్టు పట్టకుండా ఉంటే, దేవుడు మళ్ళీ వాళ్ళను అంటు కడతాడు. వాళ్ళను తిరిగి అంటుకట్టే శక్తి దేవునికి ఉంది. 24 స్వాభావికంగా అడవి జాతికి చెందిన ఒలీవల చెట్లనుండి కొట్టిన కొమ్మలవలెనున్న మిమ్మల్ని మేలురకపు చెట్టుకు అంటు వేయగలిగితే, మేలు రకపు ఒలీవల చెట్ల కొమ్మల్ని స్వజాతికి చెందిన చెట్టుకు అంటు వేయటం ఇంకెంత సులభమో ఆలోచించండి.

25 సోదరులారా! మీరు తెలుసుకోవాలని మీకీ రహస్యం చెప్పాలనుకొంటున్నాను. మీరు అజ్ఞానులుగా ఉండటం నాకిష్టం లేదు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖత్వంతో ఉన్నారు. నాటబడాలని కోరుకొంటున్న యూదులుకాని ప్రజలు నాటబడే వరకు ఈ మూర్ఖత్వం వీళ్ళలో ఉంటుంది. 26 శాస్త్రాల్లో వ్రాసినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా రక్షింపబడతారు:

“రక్షకుడు సీయోను నుండి వస్తాడు;
    అతడు యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును తొలగిస్తాడు.
27 నేను వాళ్ళ పాపాలను తొలగించినప్పుడు,
    వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.”(A)

28 ఒక విధంగా చూస్తే వాళ్ళు సువార్తను బట్టి మీకు శత్రువులు. మరొక విధంగా చూస్తే వాళ్ళు దేవుడు ఎన్నుకొన్నవాళ్ళు కనుక, వాళ్ళ మూలపురుషుల్ని బట్టి వాళ్ళు ప్రేమించబడ్డారు. 29 ఎందుకంటే, దేవుడు “వరాల” విషయంలో, “పిలుపు” విషయంలో మనస్సు మార్చుకోడు. 30 యూదులు కాని మీరు ఒకప్పుడు దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు సువార్తను నిరాకరించటం వల్ల దైవానుగ్రహం మీకు లభించింది. 31 అదే విధంగా ఇప్పుడు యూదులు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. అందువల్ల, మీకు లభించిన అనుగ్రహం ద్వారా వాళ్ళకు కూడా దైవానుగ్రహం లభిస్తుంది. 32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు.

స్తుతి

33 దేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు.

34 “ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు?
    ఆయనకు సలహా చెప్పేవాడెవరు?”(B)

35 “దేవునికి ఎవరు అప్పిచ్చారు?
    ఆయన ఎవరికీ ఋణపడలేదు.”(C)

36 అన్ని వస్తువులు, ఆయన్నుండి వచ్చాయి. ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International