Old/New Testament
సంగీత నాయకునికి: ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.
70 దేవా, నన్ను రక్షించుము.
దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
2 మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
వారిని నిరాశపరచుము.
వారిని అవమానించుము.
మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు.
వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
3 మనుష్యులు నన్ను హేళన చేసారు.
వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
4 నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.
నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.
5 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము.
దేవా, నన్ను తప్పించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే.
ఆలస్యం చేయవద్దు!
71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
2 నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
నా మాట వినుము. నన్ను రక్షించుము.
3 భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
4 నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
5 నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
6 నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
7 ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను.
ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం.
8 నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.
9 కనుక నేను ముసలివాడినని నన్ను త్రోసివేయకుము.
నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము.
10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు.
ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు.
11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి.
అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు.
12 దేవా, నన్ను విడిచిపెట్టకుము.
దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము.
13 నా శత్రువులను ఓడించుము.
వారిని పూర్తిగా నాశనం చేయుము.
వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు.
వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ.
14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను.
నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.
15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను.
నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను.
లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.
16 యెహోవా, నా ప్రభూ, నీ గొప్పతనాన్ని గూర్చి నేను చెబుతాను.
నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను.
17 దేవా, నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు.
నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే ఉన్నాను.
18 దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు.
నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి క్రొత్త తరానికీ నేను చెబుతాను.
19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది.
దేవా, నీవంటి దేవుడు మరొకడు లేడు.
నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు.
20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు.
కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు.
భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు.
21 ఇదివరకటి కంటె గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము.
నన్ను ఆదరిస్తూనే ఉండుము.
22 స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను.
నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను.
23 నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది.
నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను.
24 అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది.
నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.
22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. 23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. 24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? 25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము.
26 అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. 27 ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.
28 దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. 29 దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. 30 దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.
క్రీస్తు యేసులో దేవుని ప్రేమ
31 మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? 32 మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? 33 దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. 34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? 36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము,
మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”(A)
37 ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.
© 1997 Bible League International