Old/New Testament
సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.
66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.
5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
6 సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.
8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.
16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.
67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
దయచేసి మమ్ములను స్వీకరించుము.
2 దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
4 దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
6 దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
7 దేవుడు మమ్మల్ని దీవించుగాక.
భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.
వివాహ బంధం
7 సోదరులారా! నేను ధర్మశాస్త్రం తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రానికి ఒక వ్యక్తిపై అతడు బ్రతికి ఉన్నంతవరకే అధికారం కలిగి ఉంటుందని మీకు తెలియదా? 2 ఉదాహరణకు, ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ ఆమె భర్త జీవించి ఉన్నంతవరకే అతనికి బద్ధురాలై ఉంటుంది. ఒకవేళ అతడు మరణిస్తే ధర్మశాస్త్ర బంధం నుండి ఆమెకు విముక్తి కలుగుతుంది. 3 ఆమె భర్త జీవించి ఉండగా ఇంకొకణ్ణి వివాహమాడితే ఆమె వ్యభిచారి అనబడుతుంది. కాని ఆమె భర్త మరణిస్తే ఆమెకు ఆ చట్టం నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఆమె ఇంకొకణ్ణి వివాహం చేసుకొన్నా ఆమె వ్యభిచరించినదానిగా పరిగణింపబడదు.
4 అదే విధంగా నా సోదరులారా! మీరు కూడా క్రీస్తు శరీరంతో పాటు చనిపోయి ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి పొందారు. మీరు బ్రతికింపబడ్డ క్రీస్తుకు చెందినవారై దేవుని కొరకు ఫలిస్తారు. 5 ధర్మశాస్త్రం మూలంగా కలిగిన దురాశలు మన శరీరాల్లో పని చేయటంవల్ల మనం మరణాన్ని పొందాము. 6 మనల్ని బంధించి ఉంచిన ధర్మశాస్త్రం విషయంలో మనం మరణించాము కనుక ఇప్పుడు మనము ఆ బంధం నుండి స్వేచ్ఛను పొందాము. అందువల్ల వ్రాత పూర్వకంగా ఉన్న ధర్మశాస్త్రానికి మనమిక బానిసలము కాము. దేవుని ఆత్మ చూపించిన క్రొత్త మార్గాన్ని అనుసరించి మనము ఆయన సేవ చేస్తున్నాము.
ధర్మశాస్త్రము, పాపము
7 అంటే, ధర్మశాస్త్రం పాపంతో కూడుకున్నదని అర్థమా? కాదు. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే పాపమంటే నాకు తెలిసేది కాదు. “ఇతర్లకు చెందిన వాటిని ఆశించవద్దని”(A) ధర్మశాస్త్రం చెప్పి ఉండకపోతే, ఆశించటమంటే ఏమో నాకు తెలిసేది కాదు. 8 ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞను ఉపయోగించి పాపం నాలో అన్ని రకాల దురాశల్ని కలిగించింది. ధర్మశాస్త్రం లేకపోయినట్లైతే పాపంలో ప్రాణముండేది కాదు. 9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించాను. కాని ఆజ్ఞ రాగానే పాపం మొలకెత్తింది. దానితో నేను మరణించాను. 10 జీవాన్నివ్వటానికి ఉద్దేశింపబడిన ఆ ఆజ్ఞ నాకు మరణాన్ని కలుగ చెయ్యటం గమనించాను. 11 ఆజ్ఞ కలుగ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకొని, పాపం నన్ను మోసంచేసి ఆ ఆజ్ఞద్వారా నన్ను చంపివేసింది.
12 సరే! మరి, ధర్మశాస్త్రం పవిత్రమైంది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ పవిత్రమైంది. దానిలో నీతి, మంచితనము ఉన్నాయి. 13 అలాగైతే, మరి ఆ మంచి ధర్మశాస్త్రం నాకు మరణాన్ని కలిగించిందా? ఎన్నటికి కాదు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి పాపం నాకు మరణాన్ని కలిగించి తన నిజ స్వరూపాన్ని వ్యక్త పరిచింది. అందువల్ల ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ ద్వారా పాపం ఇంకా గొప్ప పాపంగా కనిపించింది.
మనలోని యుద్ధం
14 ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. కాని నేను బలహీనమైన మనిషిని, పాపానికి బానిసగా అమ్ముడుపోయినవాణ్ణి. 15 నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెయ్యలనుకొన్నదాన్ని చెయ్యటంలేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. 16 నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. 17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. 18 నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. 19 చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను. 20 చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.
21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. 22 నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. 23 కాని, నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది. 24 నేనంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరంనుండి నన్ను ఎవరు రక్షిస్తారు? 25 అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం.
స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.
© 1997 Bible League International