Old/New Testament
జనముల అభివృద్ధి, విస్తరణ
10 నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:
యాఫెతు సంతానము
2 యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
3 గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా
4 యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
5 మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివసించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతులవారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.
హాము సంతానము
6 హాము కుమారులు కూషు, మిస్రాయిము,[a] పూతు, కనాను.
7 కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా.
రాయమా కుమారులు షేబ, దదాను.
8 కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు. 9 నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి యెహోవా యెదుట గొప్ప వేటగాడైన నిమ్రోదువంటివాడు” అంటారు.
10 షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదుకల్నే అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది. 11 నిమ్రోదు అష్షూరుకు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె, రహోబోతీరు, కాలహు, 12 రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు పట్టణానికి మధ్య రెసెను ఉంది.)
13 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, 14 పత్రుసీయులు, కస్లూహీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయిము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారే.)
15 సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను. హేతుకు కనాను తండ్రి. 16 యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, 17 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, 18 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికిని కనాను తండ్రి.
కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి. 19 ఉత్తరాన సీదోను నుండి దక్షిణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొఱ్ఱా, అద్మా, సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే.
20 ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయి. వారు వేరు వేరు జాతులయ్యారు.
షేము సంతానము
21 యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.
22 షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
23 అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాష.
24 అర్పక్షదు షేలహుకు తండ్రి.
షేలహు ఏబెరుకు తండ్రి.
25 ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు[b] అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.
26 యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 27 హదోరము, ఊజాలు, దిక్లాను 28 ఓబాలు, అబీమాయెలు, షేబ, 29 ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు. 30 మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది.
31 వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది.
32 నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే.
బాబెలు గోపురం
11 జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు. 2 తూర్పు నుండి ప్రజలు కదిలిపోయారు. షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు. బ్రతుకుదెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు. 3 “మనం ఇటుకలు చేసి, అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలి” అనుకొన్నారు ప్రజలు. ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు కాక తారు ఉపయోగించారు.
4 అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం. ప్రపంచమంతటా మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలసి ఉంటాం.”
5 ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. 6 యెహోవా ఇలా అన్నాడు: “ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్లంతా కలసి ఉమ్మడిగా ఈ పని చేస్తున్నట్లు నాకు కనబడుతోంది. వారు చేయగలిగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వాళ్లు యోచించినదేదైనా చేయ గలుగుతారు. 7 అందుచేత మనం క్రిందికి వెళ్లి, వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు.”
8 ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్లు యెహోవా చేశాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ఆ ప్రజలు ముగించలేకపోయారు. 9 మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక ఆ స్థలం బాబెలు[c] అని పిలువబడింది. కనుక ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.
షేము కుటుంబ చరిత్ర
10 షేము కుటుంబ చరిత్ర ఇది. జలప్రళయం తర్వాత రెండు సంవత్సరాలకు, షేము 100 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు అర్పక్షదు పుట్టాడు. 11 ఆ తర్వాత షేము 700 సంవత్సరాలు జీవించాడు. అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
12 అర్పక్షదు 35 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు షేలహు పుట్టాడు. 13 షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
14 షేలహుకు 30 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు ఏబెరు పుట్టాడు. 15 ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
16 ఏబెరుకు 34 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు పెలెగు పుట్టాడు. 17 పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
18 పెలెగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు రయూ పుట్టాడు. 19 రయూ పుట్టిన తర్వాత, పెలెగు ఇంకా 209 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
20 రయూకు 32 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారుడు సెరూగు పుట్టాడు. 21 సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమార్తెలు, కుమారులు పుట్టారు.
22 సెరూగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు నాహోరు పుట్టాడు. 23 నాహోరు పుట్టిన తర్వాత, సెరూగు 200 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
24 నాహోరుకు 29 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు తెరహు పుట్టాడు. 25 తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
26 తెరహుకు 70 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారులు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.
తెరహు కుటుంబ చరిత్ర
27 తెరహు కుటుంబ చరిత్ర ఇది. అబ్రాము, నాహోరు, హారానులకు తండ్రి తెరహు. లోతుకు హారాను తండ్రి. 28 కల్దీయుల ఊరు అనే తన స్వగ్రామంలో హారాను మరణించాడు. తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే హారాను చనిపోయాడు. 29 అబ్రాము, నాహోరు పెళ్లి చేసుకొన్నారు. అబ్రాము భార్యకు శారయి అని పేరు పెట్టబడింది. నాహోరు భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది. మిల్కా హారాను కుమార్తె. మిల్కా, ఇస్కాలకు హారాను తండ్రి. 30 శారయికి పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు లేరు.
31 తెరహు తన కుటుంబముతోబాటు కల్దీయుల ఊరు అను పట్టణమును విడచిపెట్టేశాడు. కనానుకు ప్రయాణం చేయాలని వారు ఏర్పాటు చేసుకొన్నారు. తన కుమారుడు అబ్రామును, మనుమడు లోతును (హారాను కుమారుడు), కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి, అక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకొన్నారు. 32 తెరహు 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు.
దేవుడు అబ్రామును పిలచుట
12 అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు,
“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు.
నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి,
నేను నీకు చూపించు దేశానికి వెళ్లు.
2 నిన్ను ఆశీర్వదిస్తాను.
నిన్ను ఒక గొప్ప జనముగా నేను చేస్తాను.
నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను.
ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు
నీ పేరు ఉపయోగిస్తారు.
3 నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను.
నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను.
భూమి మీదనున్న మనుష్యులందరిని ఆశీర్వదించడానికి
నేను నిన్ను ఉపయోగిస్తాను.”
అబ్రాము కనానుకు వెళ్లుట
4 కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు, లోతు అతనితో కూడ వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు. 5 అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరివాడు కాడు. తన భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము, అతని వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం చేశారు. 6 అబ్రాము కనాను దేశంగుండా సంచారం చేశాడు. అబ్రాము షెకెము పట్టణానికి పయనించి మోరేలో ఉన్న మహా వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనానీ ప్రజలు ఈ దేశంలో నివసించారు.
7 అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయి, “ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు.
ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. 8 తర్వాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకొన్నాడు. పడమటికి బేతేలు పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు. 9 ఆ తర్వాత అబ్రాము మరల ప్రయాణం మొదలు పెట్టాడు. నెగెబు[d] దిశగా అతడు ప్రయాణం చేశాడు.
ఈజిప్టులో అబ్రాము
10 ఆ కాలంలో భూమి చాలా ఎండిపోయింది. వర్షం లేదు కనుక ఏ పంటా పెరగటం లేదు. కనుక అబ్రాము నివసించటానికి ఈజిప్టుకు వెళ్లాడు. 11 తన భార్య శారయి చాలా అందంగా ఉండటం అబ్రాము గమనించాడు. కనుక వారు ఈజిప్టు చేరకముందే అబ్రాము శారయితో ఇలా చెప్పాడు: “నీవు చాలా అందమైన స్త్రీవని నాకు తెలుసు. 12 ఈజిప్టీయులు నిన్ను చూస్తారు. ఈ స్త్రీ అతని భార్య అని వాళ్లు అంటారు. తర్వాత వాళ్లు నిన్ను ఆశించి నన్ను చంపేస్తారు. 13 కనుక నీవు నా సోదరివి అని ప్రజలతో చెప్పు. అప్పుడు వాళ్లు నన్ను చంపరు. నేను నీ సోదరుణ్ణి అని అనుకొంటారు గనుక వాళ్లు నామీద దయ చూపిస్తారు. ఈ విధంగా నీవు నా ప్రాణం కాపాడుతావు.”
14 కనుక అబ్రాము తన భార్యతో ఈజిప్టు దేశంలో ప్రవేశించాడు. శారయి చాలా అందగత్తె అని ఈజిప్టు ప్రజలు చూశారు. 15 ఈజిప్టు నాయకులు కూడ కొందరు ఆమెను చూశారు. ఆమె చాలా అందగత్తె అని ఫరోతో వాళ్లు చెప్పారు. ఆ నాయకులు శారయిని ఫరో యింటికి తీసుకెళ్లారు. 16 శారయికి అబ్రాము సోదరుడు అనుకొని ఫరో అబ్రాము మీద దయ చూపించాడు. గొర్రెలు, పశువులు, గాడిదలను ఫరో అబ్రాముకు ఇచ్చాడు. సేవకులు, సేవకురాండ్రు, ఒంటెలను కూడా అబ్రాముకు ఇచ్చాడు.
17 అబ్రాము భార్యను ఫరో తీసుకొన్నాడు. కనుక ఫరోకు అతని ఇంటిలోని మనుష్యులందరికి చాలా తీవ్రమైన రోగాలు వచ్చేటట్లు యెహోవా చేశాడు. 18 అందుచేత ఫరో అబ్రామును పిలిచాడు. ఫరో ఇలా అన్నాడు, “నీవు నాకు చాలా అపకారం చేశావు. శారయి నీ భార్య అని నాతో ఎందుకు నీవు చెప్పలేదు? 19 ఈమె నీ సోదరి అని చెప్పావు. నీవు ఎందుకలా చెప్పావు? ఆమె నా భార్యగా ఉండాలని అమెను నేను తీసుకొన్నాను. అయితే ఇప్పుడు నీ భార్యను మరల నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఆమెను తీసుకొని వెళ్లిపో!” 20 తర్వాత అబ్రామును ఈజిప్టు నుండి పంపించి వేయమని ఫరో తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. కనుక అబ్రాము, అతని భార్య ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. వాళ్లకు ఉన్న సమస్తాన్ని తీసుకొని వెళ్లిపోయారు.
యేసుకు కలిగిన పరీక్షలు
(మార్కు 1:12-13; లూకా 4:1-13)
4 ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. 2 అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. 3 సైతాను ఆయన దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు” అని అన్నాడు.
4 యేసు సమాధానంగా,
“‘మనుష్యులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు.
కాని దేవుడు పలికిన ప్రతి మాటవలన బ్రతకగలడు’(A)
అని వ్రాసారు” అని అన్నాడు.
5 ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచో బెట్టి, 6 “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకంటే,
‘నీకు సహాయం చెయ్యమని, దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు.
వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికీ తగలకుండా
నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకొంటారు,’(B)
అని వ్రాసివుంది కదా!” అని అన్నాడు.
7 యేసు వానితో,
“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు!’(C)
అని కూడా వ్రాసి వుంది” అని అన్నాడు.
8 సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకు వెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపి, 9 “నీవు నా ముందు మోకరిల్లి నన్ను పూజిస్తే వీటన్నిటిని నీకిస్తాను” అని అన్నాడు.
10 యేసు:
“సైతానా! నా ముందునుండి వెళ్ళిపో!
ఎందుకంటే ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సేవ మాత్రమే చెయ్యాలి!’(D)
అని కూడా వ్రాసి ఉంది” అని అన్నాడు.
11 అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసారు.
గలిలయలో యేసుని సేవా ప్రారంభం
(మార్కు 1:14-15; లూకా 4:14-15)
12 యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు. 13 ఆయన నజరేతును వదిలి, అక్కడి నుండి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాడు. కపెర్నహూము, జెబూలూను మరియు నఫ్తాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున ఉంది. 14 ఈయన ఇలా చెయ్యటం వల్ల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి. యెషయా ప్రవక్త ఈ విధంగా అన్నాడు:
15 “జెబూలూను ప్రాంతమా! నఫ్తాలి ప్రాంతమా!
సముద్రం ప్రక్కన ఉన్న ఓ జనమా! యొర్దాను నదికి అవతలి వైపుననున్న ప్రదేశమా!
యూదులుకాని వాళ్ళు నివసించే ఓ గలిలయా!
16 చీకట్లో నివసిస్తున్న ప్రజలు
గొప్ప వెలుగును చూసారు!
మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న
ప్రజలపై వెలుగు ప్రకాశించింది.”(E)
17 ఆ నాటి నుండి యేసు, “దేవుని రాజ్యం దగ్గర లోనే వుంది. కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించటం మొదలు పెట్టాడు.
యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం
(మార్కు 1:16-20; లూకా 5:1-11)
18 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టేవారు. వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు. 19 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి! మీరు మనుష్యుల్ని పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 20 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.
21 యేసు అక్కడ నుండి వెళ్తూ మరో యిద్దర్ని చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలసి పడవలో కూర్చొని వలను సరిచేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. 22 వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు.
యేసు బోధించి రోగులను నయం చేయటం
(లూకా 6:17-19)
23 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధపడ్తున్న ప్రతి వ్యక్తిని బాగు చేసాడు. 24 ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపిస్తూవుండింది. ప్రజలు రకరకాల రోగాలు ఉన్నవాళ్ళను, బాధ పడ్తున్న వాళ్ళను, దయ్యాలు పట్టిన వాళ్ళను, మూర్చరోగుల్ని, పక్షవాత రోగుల్ని, ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. ఆయన వాళ్ళను నయం చేశాడు. 25 గలిలయ నుండి, దెకపొలి[a] నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను నది అవతలి వైపుననున్న ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
© 1997 Bible League International