Old/New Testament
13 కాని, ఆ సమయంలో దావీదు కుటుంబానికి, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకొరకు ఒక నీటి జల తీయబడుతుంది. ఆ జలం వారి పాపాలను కడిగి, వారిని పవిత్రులుగా చేయటానికి ఉద్దేశించబడుతుంది.
బూటకపు ప్రవక్తలు ఇక వుండరు
2 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో విగ్రహాలన్నిటినీ భూమిపైనుండి తొలగిస్తాను. ప్రజలు కనీసం వాటి పేర్లయినా గుర్తు పెట్టుకోలేరు. ఈ భూమిపైనుండి బూటకపు ప్రవక్తలను, మురికి దయ్యాలను నేను తొలగిస్తాను. 3 ఎవ్వరైనా భవిష్య ప్రకటనలు చేస్తే అట్టి వ్యక్తి శిక్షింపబడతాడు. అతని తల్లిదండ్రులు సహితం అతనితో, ‘యెహోవా పేరుమీద నీవు అబద్ధాలు చెప్పావు. కావున నీవు తప్పక చనిపోవాలి!’ అని అంటారు. అతని స్వంత తల్లిదండ్రులు అతడు భవిష్య ప్రకటనలు చేసినందుకు కత్తితో పొడుస్తారు. 4 అప్పుడు ప్రవక్తలు తమ దర్శనాలపట్ల, తమ ప్రకటనలపట్ల సిగ్గు చెందుతారు. తాము ప్రవక్తలమని తెలియజేసే ముతక బట్టను వారు ధరించరు. భవిష్య ప్రకటనల పేరుతో అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించటానికి వారు ఆ బట్టలు ధరించరు. 5 ఆ జనులు ఇలా అంటారు: ‘నేను ప్రవక్తను కాను. నేనొక వ్యవసాయదారుడిని. నా చిన్నతనంనుండి నేను వ్యవసాయదారునిగానే పని చేశాను.’ 6 ‘అయితే, నీ చేతులమీద ఈ గాయాలు ఏమిటి?’ అని ఇతరులు అడుగుతారు. అందుకతడు, ‘నా స్నేహితుల ఇంటిలో నాకు దెబ్బలు తగిలాయి’ అని అంటాడు.”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “ఖడ్గమా, గొర్రెల కాపరిని నరుకు! నా స్నేహితుని నరుకు! కాపరిని నరుకు! గొర్రెలన్నీ పారిపోతాయి. నేను ఆ చిన్నవాటిని శిక్షిస్తాను. 8 దేశ జనాభాలో మూడింట రెండు వంతులు బాధింపబడగా చనిపోతారు. మూడింట ఒకవంతు బతుకుతారు. 9 చనిపోగా మిగిలినవారిని నేను పరీక్షిస్తాను. వారికి నేను ఎన్నో కష్టాలు కలుగ జేస్తాను. వెండిని శుద్ధి చేయటానికి కాల్చబడే అగ్నిలా ఆ కష్టాలు వుంటాయి. ఒకడు బంగారాన్ని పరీక్ష చేసినట్లు నేను వారిని పరీక్ష చేస్తాను. అప్పుడు సహాయం కొరకు వారు నన్ను పిలుస్తారు. నేను వారికి సమాధానమిస్తాను. ‘మీరు నా ప్రజలు’ అని నేను అంటాను. అప్పుడు వారు ఇలా అంటారు: ‘యెహోవా మా దేవుడు.’”
తీర్పు రోజు
14 చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుంది. 2 యెరూషలేము మీదికి దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టుకొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్త్రీలు మానభంగం చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా పట్టుకుపోబడతారు. కాని, మిగిలిన ప్రజలు నగరంనుండి తీసుకుపోబడరు. 3 అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది. 4 ఆ సమయంలో ఆయన యెరూషలేముకు తూర్పున వున్న ఒలీవల కొండమీద నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీలి పోతుంది. ఆ కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి తిరుగుతాయి. తూర్పునుండి పడమటికి ఒక లోతైన లోయ ఏర్పడుతుంది. 5 ఆ పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని, నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయనయొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు.
6-7 అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండవు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది. 8 ఆ సమయంలో యెరూషలేమునుండి నీరు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం రెండు పాయలై ఒకటి తూర్పుగా పారుతుంది. రెండవది పడమటిగా మధ్యధరా సముద్రంవైపు ప్రవహిస్తుంది. అది సంవత్సరం పొడవునా వేసవిలోను, శీతాకాలంలోను ప్రవహిస్తుంది. 9 ఆ సమయంలో యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే. 10 అప్పుడు యెరూషలేము చుట్టూ వున్న ప్రాంతమంతా అరాబా ఎడారిలా నిర్మానుష్య మవుతుంది. గెబ నుండి దక్షిణాన రిమ్మోను వరకు దేశం ఎడారిలా మారిపోతుంది. కాని యెరూషలేము నగరమంతా బెన్యామీను ద్వారం నుండి మొదటి ద్వారం (మూల ద్వారం) వరకు, మరియు హనన్యేలు బురుజు నుండి రాజు యొక్క ద్రాక్ష గానుగల వరకు మళ్లీ నిర్మింపబడుతుంది. 11 నిషేధం తొలగింపబడుతుంది. ప్రజలు మళ్లీ అక్కడ ఇండ్లు కట్టుకుంటారు. యెరూషలేము సురక్షితంగా ఉంటుంది.
12 కాని యెరూషలేముతో యుద్ధం చేసిన దేశాలన్నిటినీ యెహోవా శిక్షిస్తాడు. ఆ మనుష్యులకు ఒక భయంకర వ్యాధి సోకేలా ఆయన చేస్తాడు. ఆ జనులు జీవించి వుండగానే వారి శరీరాలు కుళ్లిపోవటం ప్రారంభిస్తాయి. వారి కండ్లు కనుగుంటలలోనే కుళ్లిపోతాయి. నాలుక నోటిలోనే కుళ్లనారంభిస్తుంది. 13-15 ఆ భయంకర వ్యాధి శత్రు స్థావరంలో ప్రబలుతుంది. పైగా వారి గుర్రాలు, కంచర గాడిదలు, ఒంటెలు మరియు గాడిదలు కూడ ఆ భయంకర వ్యాధికి గురౌతాయి.
ఆ సమయంలో ఆ ప్రజలు యెహోవా అంటే నిజంగా భయపడతారు. వారు ఒకరి కొకరు విరోధులై, ఒకరినొకరు పట్టుకుంటారు. యూదా ప్రజలు కూడా యెరూషలేముకు విరుద్ధంగా యుద్ధం చేస్తారు. నగరం చుట్టూవున్న దేశాలనుండి వారికి ధనం లభిస్తుంది. వారికి బంగారం, వెండి, బట్టలు విస్తారంగా లభిస్తాయి. 16 యెరూషలేముపై యుద్ధానికి వచ్చినవారిలో కొంతమంది బ్రతుకుతారు. వారు ప్రతి సంవత్సరం రాజును, సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి వస్తారు. పర్ణశాలల పండుగను చేసుకోటానికి వారు వస్తారు. 17 ఈ భూమిమీద ఏ వంశంవారైనా సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి యెరూషలేముకు వెళ్ళకపోయినట్లయితే, యెహోవా వారికి వర్షాలు లేకుండా చేస్తాడు. 18 ఈజిప్టు (ఐగుప్తు) నుండి ఏ వంశంవారైనా పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రాకపోయినట్లయితే, యెహోవా శత్రు దేశాలకు సంభవింపజేసిన ఆ భయంకర వ్యాధి వారికి సోకేలా చేస్తాడు. 19 పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రానటువంటి ఈజిప్టుకు, మరి ఏ ఇతర దేశానికైనా అదే శిక్ష.
20 ఆ సమయంలో ప్రతిదీ దేవునికి చెందివుంటుంది. గుర్రాలమీది జీనులకు కూడ “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసిన చీటీలు కట్టబడతాయి. బలిపీఠంవద్ద వుంచబడిన గిన్నెలవలె యెహోవా ఆలయంలో వాడబడే పాత్రలన్నీ ప్రాముఖ్యంగల వస్తువులే. 21 వాస్తవానికి యెరూషలేము, యూదాలలోగల ప్రతి పాత్రమీద “సర్వశక్తిమంతుడైన యెహోవాకు పవిత్రమైనది” అని వ్రానిన చీటి అంటించబడుతుంది. యెహోవాను ఆరాధించే ప్రతి వ్యక్తి ఆ పాత్రలలో వండి, తినగలిగినవారై ఉంటారు.
ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారస్తులెవ్వరూ వుండరు.
క్రొత్త యెరూషలేము
21 ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని[a] చూసాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సముద్రము లేదు. 2 నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది దేవుని నుండి, పెళ్ళి కుమారుని కోసం పెళ్ళికూతురిలా అలంకరించుకొని దిగి వచ్చింది.
3 సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు. 4 వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు” అని అన్నది.
5 సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు.
6 ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. 7 జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము. 8 కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు.
9 ఏడు పాత్రలతో ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉన్నవారిలో ఒక దూతవచ్చి నాతో, “పెళ్ళికూతుర్ని, అంటే గొఱ్ఱెపిల్ల భార్యను చూపిస్తాను, రా!” అని అన్నాడు. 10 అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు.
11 అది దేవుని మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్య కాంతమణిలా ఉంది. అది స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. 12 దాని చుట్టూ ఎత్తైన ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి. పన్నెండుమంది దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి. 13 తూర్పు వైపు మూడు ద్వారాలు, ఉత్తరం వైపు మూడు ద్వారాలు, దక్షిణం వైపు మూడు ద్వారాలు, పడమర వైపు మూడు ద్వారాలు ఉన్నాయి. 14 ఆ నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటి మీద గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుగురు అపొస్తలుల పేర్లు ఉన్నాయి.
15 నాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన కొలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు. 16 ఆ పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొలతబద్దతో పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, 1,500 మైళ్ళు[b] ఉన్నట్లు కనుగొన్నాడు. 17 ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని కొలిచి దాని ఎత్తు ఆ నాటి కొలత పద్ధతి ప్రకారం 144 మూరలు[c] ఉన్నట్లు కనుగొన్నాడు. 18 ఆ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి ఉంది. ఆ పట్టణం బంగారంతో కట్టబడి ఉంది. అది గాజువలె స్వచ్ఛంగా ఉంది.
19 ఆ ప్రాకారాల పునాదులు రకరకాల రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాదిరాయి సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమున, నాలుగవది పచ్చ, 20 ఐదవది వైఢూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, పదకొండవది పద్మరాగము, పన్నెండవది సుగంధము. 21 ఆ పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగారంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్ఛంగా ఉన్నాయి.
22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. 23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.
24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. 25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. 26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. 27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.
© 1997 Bible League International