Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
జెకర్యా 5-8

ఎగిరే చుట్టబడిన పత్రం

నేను మళ్లీ పైకి చూడగా, చుట్టబడిన ఒక ఎగిరే పత్రాన్ని చూశాను. “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు.

“నేనొక చుట్టగా వున్న ఎగిరే పత్రాన్ని చూస్తున్నాను. ఆ చుట్ట ముప్పై అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పు ఉంది” అని నేను చెప్పాను.

అప్పుడు దేవదూత నాతో చెప్పాడు, “ఆ చుట్టబడిన పత్రంమీద ఒక శాపం వ్రాయబడి ఉంది. ఆ పత్రంలో ఒక ప్రక్కన దొంగలకు ఒక శాపం ఉంది. ఆ పత్రానికి మరొక పక్కన అబద్ధపు వాగ్దానాలు చేసేవారికి ఒక శాపం ఉంది. సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘దొంగల ఇండ్లకు, నా పేరు మీద దొంగ వాగ్దానాలు చేసేవారి ఇండ్లకు ఆ చుట్టబడిన పత్రాన్ని నేను పంపిస్తాను. ఆ పత్రం అక్కడ వుండి, ఆ ఇండ్లను నాశనం చేస్తుంది. రాళ్లు, కొయ్యస్తంభాలు సహితం నాశనం చేయబడతాయి.’”

స్త్రీ మరియు తొట్టి

తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూత బయటికి వెళ్లాడు. అతడు నాతో, “చూడు! నీవు ఏమి జరుగుతున్నట్లు చూస్తున్నావు?” అని అన్నాడు.

“అదేమిటో నాకు తెలియదు” అని నేను అన్నాను.

అతడు ఇలా చెప్పాడు: “అది ఒక కొలతొట్టి. ఈ దేశంలో ప్రజలు చేసే పాపాలను కొలవటానికి ఆ బుట్ట ఉద్దేశించబడింది.”

ఆ తొట్టి మీదనుంచి సీసపు మూత తొలగించబడింది. ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. దానితో బరువైన (డెబ్బై ఐదు పౌనులు) సీసపు తూనికరాయి ఉంది. “ఈ స్త్రీ చెడును తెలియజేస్తుంది” అని దేవ దూత చెప్పాడు. పిమ్మట దేవదూత ఆ స్త్రీని తొట్టిలో పడదోసి, దానిమీద సీసపు మూతను పెట్టాడు. పాపాలు ఘోరమైనవని (బరువైనవని) ఇది తెలుపుతుంది. తరువాత నేను పైకి చూశాను. అక్కడ సంకుబుడ్డి కొంగవలె రెక్కలు గల ఇద్దరు స్త్రీలను చూశాను. వారు ఎగిరి వచ్చారు. వారి రెక్కల్లో గాలి ఉంది. వారు బుట్టను పట్టి లేవనెత్తారు. బుట్టను పట్టుకొని వారు గాలిలోకి పోయారు. 10 “వారు ఆ బుట్టను ఎక్కడికి మోసుకు పోతున్నారు?” అని నాతో మాట్లాడుతూవున్న దేవదూతను నేనడిగాను.

11 దేవదూత నాతో ఇలా చెప్పాడు: “షీనారులో[a] దానికొక ఆలయం నిర్మించటానికి వారు వెళ్తున్నారు. వారా ఆలయాన్ని నిర్మించాక ఆ బుట్టను అక్కడ ఉంచుతారు.”

నాలుగు రథాలు

నేను పిమ్మట నలు పక్కలా తిరిగి, పైకి చూశాను. అక్కడ నాలుగు రథాలు నాలుగు కంచుపర్వతాల మధ్యగా వెళ్లుచున్నట్లు నేను చూశాను. ఎర్రగుర్రాలు మొదటి రథాన్ని లాగుతున్నాయి. నల్లగుర్రాలు రెండవ రథాన్ని లాగుతున్నాయి. తెల్లగుర్రాలు మూడవ రథాన్ని లాగుతున్నాయి. మరియు ఎర్రమచ్చలున్న గుర్రాలు నాలుగో రథాన్ని లాగుతున్నాయి. నాతో మాట్టాడుచున్న దేవదూతను, “అయ్యా వీటి అర్థమేమిటి?” అని అడిగాను.

దేవదూత ఇలా సమాధానమిచ్చాడు: “ఇవి నాలుగు గాలులు.[b] ఇవి కేవలం ఈ సర్వలోకానికి ప్రభువైన దేవుని ముందునుండి వచ్చాయి. నల్లగుర్రాలు ఉత్తరానికి వెళతాయి. ఎర్రగుర్రాలు తూర్పుకు వెళతాయి. తెల్ల గుర్రాలు పడమటికి వెళతాయి. ఎర్ర మచ్చల గుర్రాలు దక్షిణానికి వెళతాయి.”

ఎర్రమచ్చల గుర్రాలు తమకు చెందిన భూభాగాన్ని చూడాలని ఆత్రంగా ఉన్నాయి. కావున దేవదూత వాటితో, “వెళ్లి, భూమి మీద నడవండి” అని అన్నాడు. అందుచే అవి వాటికి చెందిన ప్రాంతంలో నడుస్తూ వెళ్లాయి.

తరువాత యెహోవా నన్ను బిగ్గరగా పిలిచి ఇలా అన్నాడు: “చూడు, ఉత్తరానికి వెళ్తున్న గుర్రాలు బబులోనులో తమ పని పూర్తి చేశాయి. అవి నా ఆత్మను శాంతింపజేశాయి. నేనిప్పుడు కోపంగా లేను!”

యాజకుడైన యెహోషువ కిరీటాన్ని పొందటం

పిమ్మట యెహోవానుండి నేను మరొక వర్తమానం అందుకున్నాను. 10 ఆయన ఇలా చెప్పాడు: “బబులోనులో బందీలుగాఉన్న వారిలోనుండి హెల్దయి, టోబీయా, యెదాయా అనేవారు వచ్చారు. వారి వద్దనుండి వెండి బంగారాలు తీసికొని, జెఫన్యా కుమారుడైన యోషీయా ఇంటికి వెళ్లు. 11 ఆ వెండి బంగారాలను ఒక కిరీటం చేయటానికి వినియోగించు. ఆ కిరీటాన్ని యెహోషువ తలమీద పెట్టు. (యెహోషువ ప్రధాన యాజకుడు. యెహోజాదాకు కుమారుడే యెహోషువ) తరువాత యెహోషువకు ఈ విషయాలు చెప్పు. 12 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“కొమ్మ అని పిలువబడే ఒక మనిషి ఉన్నాడు.
    అతడు బలంగా పెరుగుతాడు.
    అతడు యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు.
13 అతడు యెహోవా ఆలయాన్ని నిర్మించి,
    గౌరవాన్ని పొందుతాడు.
అతడు తన సింహాసనంపై కూర్చుని, పాలకుడవుతాడు.
    ఒక యాజకుడు అతని సింహాసనంవద్ద నిలబడతాడు.
ఈ ఇద్దరు మనుష్యులూ శాంతియుత వాతావరణంలో కలిసి పనిచేస్తారు.

14 వారు కిరీటాన్ని ప్రజల జ్ఞాపకార్థం ఆలయంలో ఉంచుతారు. ఆ కిరీటం హెల్దయి, టోబీయా, యెదాయా మరియు జెఫన్నా కుమారుడైన యోషీయాలకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.”

15 మిక్కిలి దూరంలో నివసిస్తున్నవారు వచ్చి ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పుడు ప్రజలైన మీవద్దకు యెహోవా నన్ను పంపినట్లు మీరు నిశ్చయంగా తెలుసుకుంటారు. యెహోవా ఏమి చెపుతున్నాడో అది మీరు చేస్తే ఈ విషయాలన్నీ జరుగుతాయి.

యెహోవా దయాదాక్షిణ్యాలను కోరుట

దర్యావేషు పర్షియా రాజుగావున్న కాలంలో నాలుగవ సంవత్సరంలో యెహోవానుండి జెకర్యా ఒక వర్తమానం అందుకున్నాడు. ఇది తొమ్మిదవ నెలలో (కిస్లేవు) నాల్గవ రోజున జరిగింది. బేతేలు ప్రజలు షెరెజెరును, రెగెమ్మెలెకును, వారి మనుష్యులను యెహోవా వద్దకు ఒక ప్రశ్న అడగటానికి పంపారు. వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో ఉన్న ప్రవక్తలు, యాజకుల వద్దకు వెళ్లారు. ఆ మనుష్యులు వారిని ఈ ప్రశ్న అడిగారు: “ఆలయ వినాశనానికి కొన్ని సంవత్సరాలుగా మా విషాదాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాము. ప్రతి సంవత్సరం ఐదవ నెలలో ఒక ప్రత్యేక సంతాపదినాన్ని, నిరాహార దీక్షను పాటిస్తున్నాము. మేము ఇలా చేస్తూ ఉండవలసిందేనా?”

సర్వశక్తిమంతుడైన యెహోవానుండి నేను ఈ వర్తమానం అందుకున్నాను: “ఈ దేశంలోని యాజకులకు, తదితర ప్రజలకు ఈ విషయం చెప్పు, ‘మీరు ఉపవాసాలు చేసి, మీ సంతాపాన్ని ఐదవ నెలలోను, ఏడవ నెలలోను ప్రకటించారు. నిజానికి ఆ ఉపవాసం నా కొరకకేనా? కాదు! మరియు మీరు తినటం, తాగటం కూడ నా కొరకేనా? కాదు! అది మీ మంచి కొరకు మాత్రమే. దేవుడు ఏనాడో ఈ విషయాలు చెప్పటానికి ఆనాటి ప్రవక్తలను వినియోగించాడు. యెరూషలేము జనంతో నిండి, ఐశ్వర్యంతో తులతూగేనాడే ఆయన ఈ విషయాలు చెప్పాడు. యెరూషలేము చుట్టూవున్న పట్టణాలలో, దక్షిణ పల్లపు ప్రాంతంలో, పడమటి కొండవాలులలో ప్రజలు నివసిస్తున్న రోజులలోనే దేవుడు ఈ విషయాలు చెప్పాడు.’”

యెహోవా నుండి జెకర్యాకు వచ్చిన వర్తమానం ఇది:
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“ఏది ధర్మమో, ఏది న్యాయమో మీరది చేయాలి.
    మీరందరూ ఒకరికొకరు దయ,
    కరుణ కలిగి ఉండాలి.
10 విధవ స్త్రీలను, అనాథ పిల్లలను,
    కొత్తవారిని, పేదవారిని బాధించవద్దు.
కనీసం ఒకరికొకరు కీడు చేసుకోవాలనే
    ఆలోచన కూడా మీరు రానీయకండి!”

11 కాని ఆ ప్రజలు ఇది వినటానికి నిరాకరించారు.
    ఆయన కోరింది చేయటానికి వారు నిరాకరించారు.
దేవుడు చెప్పింది వినకుండా వుండేటందుకు వారు
    తమ చెవులు మూసుకున్నారు.
12 వారు చాలా మొండి వైఖరి దాల్చారు.
    వారు న్యాయాన్ని పాటించరు.
ఆత్మ ప్రేరణతో సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలకు
    ప్రవక్తల ద్వారా వర్తమానాలు పంపాడు.
కాని ప్రజలు వాటిని వినలేదు.
    అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా మిక్కిలి కోపగించాడు.
13 కావున సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు,
“నేను వారిని పిలిచాను,
    కాని వారు పలకలేదు.
అందువల్ల ఇప్పుడు వారు పిలిస్తే
    నేను పలకను.
14 ఇతర దేశాలను వారి మీదికి ఒక తుఫానులా తీసుకువస్తాను.
    వారెవరో వీరికి తెలియదు;
కాని వారు దేశంలో తిరిగాక
    అది నాశనమై పోతుంది.
రమ్యమైన ఈ దేశం నాశనమై పోతుంది.”

యెరూషలేమును ఆశీర్వదించటానికి యెహోవా మాట యిచ్చుట

సర్వశక్తిమంతుడైన యెహోవానుండి వచ్చిన ఒక వర్తమానం ఇది. సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనును నిజంగా ప్రేమిస్తున్నాను. నేనామెను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, ఆమె నాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు నాకు కోపం వచ్చింది.” యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనుకు తిరిగి వచ్చాను. నేను యెరూషలేములో నివసిస్తున్నాను. యెరూషలేము విశ్వాసంగల నగరం అని పిలవబడుతుంది. నా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడుతుంది.”

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “వృద్ధులైన స్త్రీ వురుషులు మళ్లీ యెరూషలేము బహిరంగ ప్రదేశాలలో కనబడతారు. ప్రజలు నడవటానికి చేతి కర్రలు కావలసివచ్చే వయసువరకు నివసిస్తారు. వీధుల్లో ఆడుకునే పిల్లలతో నగరం నిండిపోతుంది. చావగా మిగిలినవారు ఇదంతా అద్భుతం అనుకుంటారు. నేనూ ఇది అద్భుతం అనుకుంటాను!”

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “చూడు, తూర్పు, పడమటి దేశాలలో ఉన్న నా ప్రజలను నేను రక్షిస్తున్నాను. వారిని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తాను. వారు యెరూషలేములో నివసిస్తారు. వారు నా ప్రజగా పుంటారు. నేను వారికి మెచ్చదగిన, విశ్వసనీయమైన దేవునిగా వుంటాను.”

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ధైర్యంగా ఉండండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ముందుగా తన ఆలయాన్ని నిర్మించటానికి పునాదులు వేసినప్పుడు ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్నే ప్రజలైన మీరు ఈనాడు వింటున్నారు. 10 అంతకు ముందు, పనివారిని పెట్టటానికి, జంతువులను బాడుగకు తీసుకోటానికి మనుష్యులవద్ద డబ్బు లేదు. పైగా మనుష్యులు రావటానికి, పోవటానికి కూడ క్షేమకరం కాని సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను. 11 కాని ఇప్పుడు పూర్వం మాదిరిగా లేదు. బతికివున్నవారికి ఇక అలా జరుగదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

12 “ఈ ప్రజలు శాంతియుత వాతావరణంలో మొక్కలు. నాటుతారు. వారి ద్రాక్షాతోటలు కాయలు కాస్తాయి. భూమి విస్తారంగా పంటనిస్తుంది. ఆకాశం వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన వీరికి ఇస్తాను. 13 ప్రజలు తమ శాపాలతో ఇశ్రాయేలును, యూదాను వాడటం మొదలు పెట్టారు. కాని ఇశ్రాయేలును, యూదాను నేను రక్షిస్తాను. ఆ పేర్లు ఒక దీవెనగా మారుతాయి. కావున భయపడవద్దు. ధైర్యంగా ఉండండి!”

14 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీ పూర్వీకులు నాకు కోపం కలిగించారు. అందువల్ల వారిని నేను నాశనం చేయ సంకల్పించాను. నా మనస్సు మార్చుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 15 “కాని ఇప్పుడు నా మనస్సు మార్చుకున్నాను. అదేమాదిరి నేను యెరూషలేముపట్ల, యూదాప్రజలపట్ల మంచిగా వుండటానికి నిర్ణయించుకున్నాను. కావున భయపడవద్దు! 16 అయితే మీరు మాత్రం ఇవి తప్పక చేయండి: మీ పొరుగు వారికి నిజం చెప్పండి. మీరు మీ నగరాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు సరిగా ప్రవర్తించండి. ధర్మమైన శాంతికి దోహదపడే పనులు చేయండి. 17 మీ పొరుగు వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయకండి! బూటకపు వాగ్దానాలు చేయకండి! అటువంటి పనులు చేయటంపట్ల ఆసక్తి కనపరచకండి. ఎందుకంటే, వాటిని నేను అసహ్యించుకుంటాను!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

18 నేనీ వర్తమానం సర్వశక్తిమంతుడైన యెహోవానుండి అందుకున్నాను. 19 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీరు ప్రత్యేక సంతాప దినాలు, ఉపవాస దినాలు నాల్గవ నెలలోను, ఐదవ నెలలోను, ఏడవ నెలలోను, పదవ నెలలోను కలిగి ఉన్నారు. ఆ సంతాప దినాలు సంతోష దినాలుగా తప్పక మార్చబడాలి. అవి యోగ్యమైన, సంతోషదాయకమైన విశ్రాంతి దినాలవుతాయి. కావున మీరు సత్యాన్ని, శాంతిని ప్రేమించండి!”

20 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు,
“భవిష్యత్తులో అనేక నగరాలనుండి ప్రజలు యెరూషలేముకు వస్తారు.
21 ఒక నగరంనుండి వచ్చిన ప్రజలు, వారు కలిసిన మరొక నగరవాసులతో ఇలా అంటారు,
    వేరేవాళ్లు మేము మీతో వస్తాము అని అంటారు.
    ‘సర్యశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి మేము వెళ్తున్నాము.
    మాతో రండి!’”

22 అనేక బలమైన రాజ్యాలనుండి అనేకమంది ప్రజలు సర్యశక్తిమంతుడైన యెహోవాను వెదుక్కుంటూ యెరూషలేముకు వస్తారు. ఆయనను ఆరాధించటానికి వారు అక్కడికి వస్తారు. 23 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో వివిధ భాషలు మాట్లాడేవారు ఒక యూదా మనిషి వద్దకు వచ్చి, ‘దేవుడు నీతో ఉన్నాడని మేము విన్నాము. ఆయనను ఆరాధించటానికి మేము నీతో రావచ్చునా?’ అని అడుగుతారు.”

ప్రకటన 19

దేవుణ్ణి స్తుతించండి

19 ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి యిలా అన్నది:

“దేవుణ్ణి స్తుతించండి!
రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే.
ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు.
తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన
    ఆ వేశ్యను ఆయన శిక్షించాడు.
తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.”

వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు:

“దేవుణ్ణి స్తుతించండి!
కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.”

ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు:

“ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!”

అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది:

“ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి.
ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.”

ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు యిలా అన్నారు:

“దేవుణ్ణి స్తుతించండి.
    సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన
    దేవుడు మనల్ని పాలిస్తున్నాడు.
మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం.
గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది.
    ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది.
సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి యివ్వబడ్డాయి.
    అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి.”

(సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి.)

ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొఱ్ఱెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని మాటలు.”

10 ఇది విన్నాక అతన్ని ఆరాధించాలని నేను అతని కాళ్ళ మీద పడ్డాను. కాని అతడు నాతో, “అలా చేయవద్దు. నేను నీ తోటి సేవకుణ్ణి. యేసు చెప్పిన దాన్ని అనుసరించే సోదరుల సహచరుణ్ణి. దేవుణ్ణి ఆరాధించు. యేసు చెప్పిన విషయాలనే ప్రవక్తలు కూడా చెప్పారు” అని అన్నాడు.

తెల్లటి గుర్రంపై రౌతు

11 నేను తెరుచుకొని ఉన్న పరలోకాన్ని చూసాను. నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు నమ్మకమైన వాడని, సత్యవంతుడని పేరున్న వాడు. అతడు నీతిగా తీర్పు చెబుతాడు. న్యాయంగా యుద్ధం చేస్తాడు. 12 ఆయన కళ్ళు నిప్పులా మండుతూ ఉన్నాయి. ఆయన తలమీద ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు. 13 ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆయన పేరు దేవుని వాక్యం. 14 తెల్లగా పరిశుద్ధంగా ఉన్న సున్నితమైన దుస్తులు వేసుకొని పరలోకంలో ఉన్న సైనికులు తెల్లటి గుర్రాలపై స్వారీ చేస్తూ ఆయన్ని అనుసరించారు. 15 దేశాలను ఓడించటానికి ఆయన నోటినుండి పదునైన కత్తి బయటకు వచ్చింది. ఆయన దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుని ఆగ్రహమనబడే ద్రాక్షా గానుగను త్రొక్కుతాడు. ఆ ఆగ్రహం తీవ్రమైనది. 16 ఆయన వస్త్రంమీద, ఆయన తొడమీద:

రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు

అని వ్రాయబడి ఉంది.

17 ఒక దూత సూర్యునిలో నిలబడి ఉండటం చూసాను. అతడు బిగ్గరగా గాలిలో ఎగురుతున్న పక్షులతో, “దేవుని గొప్ప విందుకొరకు అందరూ సమావేశం కండి. 18 మీరు వస్తే రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, వీరుల మాంసం, గుఱ్ఱాల మాంసం, రౌతుల మాంసం, ప్రజల మాంసం, బానిసలుకానివాళ్ళ మాంసం, బానిసల మాంసం, ముఖ్యమైనవాళ్ళ మాంసం, తినటానికి లభిస్తుంది” అని అన్నాడు.

19 ఆ తదుపరి మృగము మరియు భూపాలకులు, వాళ్ళ సైన్యాలు, అంతా కలిసి గుఱ్ఱంపై స్వారీ చేస్తున్న వానితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయటానికి సిద్ధం అయ్యారు. 20 కాని ఆ మృగము బంధింపబడింది. ఆ మృగం పక్షాన మహత్వపూర్వకమైన సూచనలు చూపిన దొంగ ప్రవక్త కూడా బంధింపబడ్డాడు. వాడు ఈ సూచనలతో మృగం యొక్క ముద్రను పొందినవాళ్ళను, ఆ మృగాన్ని ఆరాధించినవాళ్ళను మోసం చేస్తూపోయాడు. వీళ్ళందరిని గంధకంతో మండుతున్న భయానకమైన గుండంలో ఆ గుఱ్ఱంపై స్వారీ చేస్తున్నవాడు సజీవంగా పడవేసాడు. 21 గుఱ్ఱపు రౌతు నోటినుండి వచ్చిన కత్తితో మిగతా వాళ్ళు చంపబడ్డారు. పక్షులు వచ్చి వీళ్ళ దేహాలను కడుపు నిండా తిన్నాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International