Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 33-34

ఇశ్రాయేలుకు కావలివానిగా దేవుడు యెహెజ్కేలును ఎంపిక చేయటం

33 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీ ప్రజలతో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పు, ‘ఈ దేశం మీదికి నేను శత్రు సైన్యాలను రప్పించవచ్చు. అది జరిగినప్పుడు ప్రజలు ఒకనిని కావలివానిగా ఎంపిక చేస్తారు. ఈ కావలివాడు శత్రుసైన్యాలు రావటం చూచి బూర ఊది ప్రజలను హెచ్చరిస్తాడు. ప్రజలు ఆ హెచ్చరికను విని కూడా జాగ్రత్త పడకపోతే శత్రువు వచ్చి వారిని బందీలుగా పట్టుకుపోతాడు. అటువంటి వ్యక్తి తన మరణానికి తనే బాధ్యుడవుతాడు. అతడు బాకా విన్నాడు. అయినా అతడు హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందించాలి. ఆ హెచ్చరికను గనుక అతడు లక్ష్యపెట్టి ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడుకొనగలిగేవాడు.

“‘ఒకవేళ కావలివాడు శత్రుసైనికులు రావటం గమనించి కూడా బూర ఊదకపోవచ్చు. అనగా కావలివాడు ప్రజలను హెచ్చరించలేదన్నమాట. అప్పుడు శత్రువు వారిని పట్టుకొని బందీలుగా తీసుకుపోతాడు. తన పాపం కారణంగా ఒక వ్యక్తి పట్టుబడతాడు. అయినా కావలివాడు ఆ మనిషి చావుకు బాధ్యుడైవున్నాడు.’

“నరపుత్రుడా, ఇప్పుడు నేను ఇశ్రాయేలు వంశానికి నిన్ను కావలివానిగా నియమిస్తున్నాను. నీవు నా నోటి నుండి ఒక వర్తమానం వింటే, నా తరఫున ప్రజలను హెచ్చరించాలి. ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు’ అని నేను నీకు చెప్పవచ్చు. అప్పుడు నా తరపున నీవు వెళ్లి అతనిని హెచ్చరించాలి. నీవు వెళ్లి ఆ దుష్ట వ్యక్తిని హెచ్చరించక, తన జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పకపోతే తన పాప ఫలంగా అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నేను నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. ఒక వేళ నీవా దుష్టవ్యక్తిని తన దుర్మార్గపు జీవితాన్ని మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పినావనుకో, అయినా ఆ వ్యక్తి పాపం చేయటం మానక పోతే తన పాపాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. కానీ నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.

ప్రజా నాశనం చూడటం దేవునికి ఇష్టంకాదు

10 “కావున నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడు. అప్పుడు వారు, ‘మేము పాపం చేశాము. ధర్మాన్ని అతిక్రమించాము. మా పాపాలు భరింపరానివి. ఆ పాపాల కారణంగా మేము కుళ్లిపోతున్నాము. మేము జీవించాలంటే ఏమి చేయాలి?’ అని అడుగవచ్చు.

11 “నీవు వారితో ఇలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా జీవం తోడుగా ప్రజలు చనిపోతూ ఉంటే చూడటం నాకు ఇష్టముండదని మీకు మాట ఇస్తున్నాను. దుష్టులు చనిపోవటం కూడా నాకు ఇష్టంలేనిపని. వారు చనిపోవాలని నేను కోరను. ఆ దుష్ట జనులంతా నా వద్దకు తిరిగి రావాలనే నేను కోరుకుంటాను. వారు తమ జీవితాలను మార్చుకొని నిజంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను! అందువల్ల నా వద్దకు తిరిగి రండి! చెడు కార్యాలు చేయటం మానండి! ఓ ఇశ్రాయేలు వంశీయులారా, మీరెందుకు మరణించాలి?’

12 “నరపుత్రుడా, నీ ప్రజలకు ఇలా చెప్పు, ‘ఒక మంచి వ్యక్తి దుష్టుడై పాపం చేయటం మొదలు పెడితే, అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు. ఆ చెడ్డ వ్యక్తి చెడునుండి పరివర్తన చెంది మంచివాడై సత్కార్యాలు చేస్తే, గతంలో అతడు చేసిన పాపపు పనులు అతనిని నాశనం చేయలేవు. కావున ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఒక మంచి వ్యక్తి దుర్మార్గుడై పాపం చేయడం మొదలుపెడితే అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు.’

13 “ఒక మంచి మనిషికి అతడు జీవిస్తాడని నేను చెప్పవచ్చు. తద్వారా ఆ మంచి మనిషి తను పూర్వం చేసిన సత్కార్యాలు అతనిని రక్షించగలవని అనుకోవటం మొదలు పెట్టవచ్చు. ఆ రకమైన భావనతో అతడు చెడు కార్యాలు చేయటానికి పాల్పడవచ్చు. కాని గతంలో అతడు చేసిన మంచి పనులను నేను గుర్తు పెట్టుకోను! తాను చేయ మొదలు పెట్టిన పాప కార్యాల కారణంగా అతడు చనిపోతాడు.

14 “లేదా, ఒక దుర్మార్గునితో అతడు చచ్చిపోతాడని నేను చెప్పవచ్చు. అయితే అతడు తన జీవితాన్ని మార్చుకోవచ్చు. అతడు పాపం చేయటం మాని, సన్మార్గాన్ని అవలంబించవచ్చు. అతడు మంచివాడై న్యాయశీలి కావచ్చు. 15 అతడు అప్పులిచ్చినప్పుడు తాను కుదువపెట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చి వేయవచ్చు. అతడు దొంగిలించిన వస్తువులకు తగిన పరిహారం చెల్లించవచ్చు. జీవాన్ని ఇచ్చే కట్టడలను అతడు అనుసరించటం మొదలు పెట్టవచ్చు. అతడు చెడు పనులు చేయటం మానవచ్చు. అప్పుడా వ్యక్తి ఖచ్చితంగా జీనిస్తాడు. అతడు మరణించడు. 16 అతడు గతంలో చేసిన చెడ్డ పనులను నేను గుర్తు పెట్టుకోను. ఎందుకంటే అతడిప్పుడు న్యాయవర్తనుడై మంచి మనిషి అయ్యాడు గనుక. అందుచే అతడు జీవిస్తాడు!

17 “కాని నీ ప్రజలు, ‘అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా అలా వుండజాలడు!’ అని అంటారు.

“కాని వారే నిజానికి న్యాయవర్తనులు కాకపోతే! మారవలసిన మనుష్యులు వారే! 18 ఒక మంచి వ్యక్తి సత్కార్యాలు చేయటం మానివేసి పాపం చేస్తే, అతని పాప ఫలితంగా అతడు చనిపోతాడు. 19 ఒక దుర్మార్గుడు చెడు పనులు చేయటం మాని, న్యాయవర్తనుడై మంచి జీవితాన్ని ప్రారంభిస్తే అతడు జీనిస్తాడు! 20 అయినా నేను న్యాయంగా లేనని మీరంటారు. కాని నేను మీకు నిజం చెప్పుచున్నాను. ఇశ్రాయేలు వంశమా, ప్రతి ఒక్కడూ తాను చేసిన పనులను బట్టి తీర్పు పొందుతాడు!”

యెరూషలేము వశపర్చుకొనబడింది

21 అది చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరంలో పదవ నెల (జనవరి) ఐదవరోజు. ఆ రోజున ఒక వ్యక్తి యెరూషలేము నుండి నా వద్దకు వచ్చాడు. అతడక్కడ యుద్ధం నుండి తప్పించుకుని వచ్చాడు. అతడు, “ఆ నగరం (యెరూషలేము) వశపర్చుకోబడింది!” అని అన్నాడు.

22 ఆ మనిషి రావడానికి ముందు నా ప్రభువైన యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. నాకు మాట్లాడే శక్తి లేకుండా దేవుడు చేశాడు. ఆ వ్యక్తి నా వద్దకు వచ్చే సమయానికి యెహోవా నా నోరు తెరపించి, నేను మాట్లాడేలాగు చేశాడు. 23 అప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 24 “నరపుత్రుడా, పాడుపడిన ఇశ్రాయేలు నగరాలలో కొందరు ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నారు. వారు ఇలా అంటున్నారు, ‘అబ్రాహాము ఒక్కడే ఒక్కడు. ఆయినా దేవుడు అతనికి ఈ దేశాన్నంతటినీ ఇచ్చినాడు. ఇప్పుడు మేము చాలా మంది ప్రజలమయ్యాము. కావున ఈ దేశం ఖచ్చితంగా మాకు చెందుతుంది. ఇది మా దేశం!’

25 “ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తప్పక తెలియజేయాలి, ఇంకా ‘రక్తం ఉన్న మాంసాన్ని మీరు తింటున్నారు. సహాయం కొరకు మీరు మీ విగ్రహాలవైపు చూస్తున్నారు. మీరు ప్రజలను హత్య చేస్తారు. కావున ఈ దేశాన్ని మీకు నేనెందుకు ఇవ్వాలి? 26 మీరు మీ కత్తిమీద ఆధారపడతారు. మీలో ప్రతి ఒక్కడూ భయంకరమైన పనులు చేస్తాడు. మీలో ప్రతి ఒక్కడూ మీ పొరుగు వాని భార్యతో వ్యభిచరించి పాపం చేస్తాడు. అందువల్ల మీరు ఈ రాజ్యాన్ని పొందలేరు!’

27 “‘ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవు వారికి తెలియజేయుము, “శిథిలమైన ఆ నగరాలలో నివసిస్తున్న ప్రజలు నా కత్తిచేత చనిపోతారని నా ప్రాణము మీద ప్రమాణం చేసి నేను చెపుతున్నాను. ఆ సమయంలో ఎవరైనా బయట పొలాలలోనికి వెళితే జంతువులు వారిని చంపి తినివేసేలా చేస్తాను. కోటలలోను, గుహలలోను ప్రజలు దాగివుంటే వారు రోగాలతో చనిపోతారు. 28 దేశాన్ని నిర్మానుష్యంగా, ఎడారిగా మార్చేస్తాను. వేటిని చూసుకొని ఆ దేశం గర్వపడుతూ వుందో ఆ వస్తువులనన్నిటినీ అది కోల్పోతుంది. ఇశ్రాయేలు పర్వతాలు శూన్యంగా తయారవుతాయి. ఆ ప్రదేశం గుండా ఎవ్వరూ పయనించరు. 29 ఆ ప్రజలు ఎన్నో భయంకరమైన పనులు చేశారు. అందువల్ల ఆ దేశాన్ని శూన్యమైన ఎడారిలా నేను మార్చివేస్తాను. అప్పుడు నేను యెహోవానని ఈ ప్రజలు తెలుసుకుంటారు.”

30 “‘నరపుత్రుడా, ఇప్పుడు నీ విషయంలో నీవు ఒక మాట చెప్పాలి. నీ ప్రజలు గోడలకు ఆనుకొని, వాకిళ్లలో నిలబడి నిన్ను గురించి మాట్లాడుకుంటారు. వారు ఒకరితో ఒకరు, “రండి, యెహోవా ఏమి చెపుతున్నాడో విందాం” అని చెప్పుకుంటారు. 31 కావున వారు నా ప్రజలవలె నీవద్దకు వస్తారు. నా ప్రజలవలె వారు నీ ముందు కూర్చుంటారు. వారు నీ మాటలు వింటారు. కాని నీవు చెప్పినది మాత్రం వారు ఆచరించరు. వారు ఏది మంచిదనుకుంటే దానినే చేస్తారు. వారు ప్రజలను మోసగించి అధిక ధనవంతులు కావాలని కోరుకుంటారు.

32 “‘వారికి నీవు కేవలం ప్రేమ గీతాలు పాడే ఒక గాయకుడివి మాత్రమే. నీకు మధురమైన కంఠం ఉంది. నీవు సొంపుగా వాద్యం వాయిస్తావు. నీ మాటలు వారు వింటారు గాని, వాటిని ఆచరించరు. 33 అయినా నీవు పాడే విషయాలు తప్పక జరిగి తీరుతాయి. అప్పుడు ప్రజలు తమలో నిజంగా ఒక ప్రవక్త నివసించాడని తెలుసుకుంటారు!’”

గొర్రెల మందవంటి ఇశ్రాయేలు

34 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీవు నా తరఫున ఇశ్రాయేలు గొర్రెల కాపరులకు (పాలకులకు) వ్యతిరేకంగా మాట్లాడు. నా తరఫున వాళ్లతో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలుపు: ‘ఇశ్రాయేలు కాపరులారా మీకు మీరే బాగా తింటున్నారు. అది మీకు చాలా హానికరం! ఓ కాపరులారా, మీరు మందను ఎందుకు మేపరు? బాగా బలిసిన గొర్రెలను మీరు తింటారు. మీ దుస్తులకై వాటి ఉన్నిని వినియోగించుకుంటారు. బలిసిన గొర్రెలను మీరు చంపుతారు; కాని మందను మాత్రం మీరు మేపరు. బలహీనంగా ఉన్న వాటిని మీరు బలంగా తయారు చేయలేదు. జబ్బు చేసిన గొర్రెల విషయమై మీరు శ్రద్ధ తీసుకోలేదు. గాయ పడిన గొర్రెలకు మీరు కట్టు కట్టలేదు. కొన్ని గొర్రెలు అటు ఇటు చెదరి వెళ్లిపోయాయి. అయినా మీరు వెళ్లి వాటిని తీసుకురాలేదు. తప్పిపోయిన గొర్రెలను వెదకటానికి మీరు వెళ్లలేదు. మీరు చాలా క్రూరులు, కఠినాత్ములు—ఆ రకంగా మీరు మందను నడిపించ ప్రయత్నించారు!

“‘కాపరిలేని కారణంగా ఇప్పుడు మంద చెల్లాచెదరై పోయింది. ప్రతి అడవి జంతువుకు అవి ఆహారమైనాయి. అలా అవి చిందర వందరై పోయాయి. నా మంద ప్రతి పర్వతం మీద, ప్రతి కొందమీద తిరుగాడింది. నా మంద భూమిమీద అంతటా చెల్లాచెదరై పోయింది. వాటిని వెదకటానికి గాని, చూడటానికి గాని ఎవ్వరూ లేరు.’”

కావున ఓ గొర్రెల కాపరులారా! యెహోవా మాట వినండి. నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నా జీవముతోడుగా మీకు నేనిలా మాట ఇస్తున్నాను. అడవి జంతువులు నా మందను పట్టుకున్నాయి. అవును, నా మంద అన్ని క్రూర జంతువులకూ ఆహారమయ్యింది. ఎందువల్లనంటే వాటికి నిజమైన కాపరిలేడు. నా గొర్రెల కాపరులు నా మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకోలేదు. మరియు ఆ కాపరులు కేవలం నా మందను చంపుకు తిన్నారే గాని, దానిని మేపలేదు.”

అందువల్ల, ఓ కాపరులారా, యెహోవా మాట వినండి! 10 యెహోవా ఇలా చెపుతున్నాడు: “నేను ఆ కాపరులకు విరోధిని! నా గొర్రెల కొరకు నేను వారిని అడుగుతాను. నేను వారిని తీసివేస్తాను ఇక ఎంతమాత్రం వారు నా మందకు కాపరులుగా కొనసాగరు! దానితో వారు మందను చంపి తమ పొట్టను నింపుకోలేరు. వారి బారినుండి నా మందను నేను రక్షించుకోగలుగుతాను. అప్పుడు నా గొర్రెలు వారికి ఆహారం కాజాలవు.”

11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నాకు నేనే వారికి కాపరిగా వ్యవహరిస్తాను. చెదరి పోయిన నా గొర్రెలను నేనే వెదకుతాను. నేను వాటి విషయమై జాగ్రత్త తీసుకుంటాను. 12 తన గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక కాపరి వాటి వెంట ఉంటే, అతడు వెళ్లి వాటికొరకు వెదకగలడు. అదే విధంగా, నేను నా గొర్రెల కొరకు వెదకుతాను. నేను నా గొర్రెలను రక్షించుకుంటాను. ఒకానొక ముసురు పట్టిన చీకటి రోజూ చెదరిపోయిన నా గొర్రెలను ఆయా ప్రాంతాల నుండి వెదకి తీసుకు వస్తాను. 13 ఆయా దేశాలనుండి వాటిని తిరిగి తీసుకొని వస్తాను. ఆ ప్రాంతాల నుండి వాటిని కూదీస్తాను. వాటి స్వదేశానికి వాటిని తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు పర్వతాల పైన, సెలయేటి గట్ల మీద, ప్రజలు నివసించే అన్ని ప్రాంతాలలోను నేను వాటిని మేపుతాను. 14 నేను వాటిని పచ్చిక బీళ్లకు నడిపిస్తాను. ఇశ్రాయేలు కొండలశిఖరాల పైకి అవి వెళతాయి. అవి అక్కడ పచ్చిక మేసి, మంచి ప్రదేశంలో హాయిగా పండుకొంటాయి. ఇశ్రాయేలు పర్వతాల మీద మంచి పచ్చిక భూములలో అవి మేత మేస్తాయి. 15 అవును, నా మందను నేనే మేపుతాను. వాటిని ఒక విశ్రాంతి స్థలానికి నడిపిస్తాను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

16 “పోయిన గొర్రెలను నేను వెదకుతాను. చెదరి పోయిన గొర్రెలను నేను తిరిగి తోలుకు వస్తాను. గాయపడిన గొర్రెలకు కట్లు కడతాను. నీరసపడిన గొర్రెలు బలపడేలా చేస్తాను. కాని ఆ బలిసిన, శక్తివంతమైన గొర్రెల కాపరులను మాత్రం నేను నాశనం చేస్తాను. వారికి అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”

17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మీరు, నా గొర్రెల మంద. నేను మీలో ఒక్కొక్కదానికి తీర్పు ఇస్తాను. పొట్టేళ్లకు, మేక పోతులకు మధ్య తీర్పు తీర్చుతాను. 18 సారవంతమైన భూముల్లో పెరిగే గడ్డిని మీరు తినవచ్చు. అటువంటప్పుడు ఇతర గొర్రెలు మేసే గడ్డిని మీలో కొందరు మీ కాళ్లతో ఎందుకు తొక్కి పాడుచేస్తారు? మీరు స్వచ్ఛమైన నీటిని కావలసినంత తాగవచ్చు! అలా కాకుండా ఇతర గొర్రెలు తాగదల్చుకున్న నీటిని కూడా మీరెందుకు కెలికి మురికి చేస్తున్నారు? 19 మీ కాళ్లతో తొక్కి పాడుచేసిన గడ్డిని నా మంద తింటున్నది. మీ కాళ్లతో కెలికి మురికి చేసిన నీటిని అవి తాగవలసి ఉందా!”

20 కావున నా ప్రభువైన యెహోవా వాటికి ఇలా చెపుతున్నాడు: “నాకై నేనే బలిసిన గొర్రెలకు, బక్క చిక్కిన గొర్రెలకు మధ్య తీర్పు ఇస్తాను! 21 బక్క జీవాలు అవతలికి పారిపోయే వరకు వాటిని మీరు మీ భుజాలతోను, పార్శ్వాలతోను తోసి, మీ కొమ్ములతో కుమ్ముతారు. 22 కావున నా మందను నేనే రక్షించు కుంటాను. అవి ఇక ఎంత మాత్రం క్రూర జంతువుల బారిన పడవు. గొర్రెకు మరొక గొర్రెకు మధ్య నేనే తీర్పు ఇస్తాను. 23 తరువాత నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటిని మేపుతాడు. అతడు వాటిని స్వయంగా మేపి, వాటికి కాపరి అవుతాడు. 24 ప్రభువును యెహోవాను అయిన నేను అప్పుడు వాటికి దేవుడనవుతాను. నా సేవకుడగు దావీదు వాటి మధ్య నివసిస్తూ పాలకుడవుతాడు. యెహోవానైన నేనే చెపుతున్నాను.”

25 “మరియు నా గొర్రెలతో నేను శాంతి ఒడంబడిక చేసుకుంటాను. దేశంలో క్రూర జంతువులు లేకుండా చేస్తాను. అప్పుడే గొర్రెలు ఎడారిలో నిర్భయంగా తిరిగి, అడవులలో హాయిగా నిద్రిస్తాయి. 26 నేను నా గొర్రెలను, నా కొండ (యెరూషలేము) చుట్టూ ఉన్న ప్రదేశాలను దీవిస్తాను. సకాలంలో వర్షాలు కురిసేలా చేస్తాను. దీవెనకరమైన జల్లులు పడతాయి. 27 పొలాల్లో పెరిగే చెట్లు ఫలాల నిస్తాయి. భూమి తన పంటనిస్తుంది. కావున గొర్రెలు తమ భూమిమీద సురక్షితంగా ఉంటాయి. బానిసత్వానికి చిహ్నమైన వాటి మెడమీది కాడిని[a] నేను విరుగగొడతాను. వాటిని బానిసలుగా చేసిన మనుష్యుల అధికారం నుండి వాటికి విముక్తి కలుగజేస్తాను. అప్పుడు నేనే యెహోవానని అవి గుర్తిస్తాయి. 28 అవి ఇక ఎంతమాత్రం మామూలు జంతువులవలె అన్యదేశీయులచే పట్టుబడవు. ఆ క్రూర మృగాలు వాటిని ఇక ఎంతమాత్రం తినవు. అవి సురక్షితంగా జీవిస్తాయి. ఎవ్వరూ వాటిని భయ పెట్టలేరు. 29 మంచి ఉద్యానవనంగా తయారయ్యే కొంత భూమిని వాటికి ఇస్తాను. ఆ భూమిలో అవి ఇక ఎంతమాత్రం ఆకలితో బాధపడవు. ఇక ఏ మాత్రం అవి అన్యదేశాల నుండి అవమానాన్ని పొందవు. 30 అప్పుడవి నేనే వాటి దేవుడనగు యెహోవానని తెలుసుకుంటాయి. నేను వాటితో ఉన్నానని అవి తెలుసుకుంటాయి. మరియు ఇశ్రాయేలు వంశం వారు తాము నా ప్రజలేనని తెలుసుకుంటారు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

31 “నా గొర్రెల్లారా, నా పచ్చిక బయలులో ఉండే నా గొర్రెల్లారా మీరు కేవలం మానవ మాత్రులు. నేను మీ దేవుడను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

1 పేతురు 5

దేవుని మంద

మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయట మేమనగా, మీలాగే నేను కూడ ఒక పెద్దను. క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసినవాణ్ణి. దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్థుణ్ణి. సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే! డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభీష్టంతో ఆ కార్యాన్ని చేయండి. దేవుడు మీకప్పగించిన వాళ్ళపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి. ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నిటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది.

అదే విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి యితర్ల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో:

“దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు,
    కాని, వినయంతో ఉన్నవాళ్ళకు కృపననుగ్రహిస్తాడు.”(A)

అని వ్రాయబడి ఉంది. అందువల్ల దేవుని బలమైన చేతి క్రింద వినయంతో ఉండండి. సరియైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదలివేయండి.

మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సాతాను సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని మ్రింగివేయాలని మీ చుట్టు తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు యిలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు. గనుక దృఢవిశ్వాసంతో ఉండి సాతానుకి ఎదురు తిరగండి.

10 దయామయుడైన దేవుడు, మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలనుభవించాక, ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని యిచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. 11 ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండుగాక! ఆమేన్.

చివరి వందనాలు

12 నా సోదరునిగా భావించే విశ్వాసనీయుడైన సిల్వాను సహయంతో మీకీ లేఖను పంపుచున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి ఈ లేఖను వ్రాస్తున్నాను. ఆ అనుగ్రహాన్ని వదులుకోకండి.

13 మీతో సహా ఎన్నుకోబడి బబులోనులో ఉన్న సంఘం, నా కుమారునితో సమానమైన మార్కు, మీకు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 14 ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకొని శుభాకాంక్షలు తెలుపుకోండి.

క్రీస్తులో నున్న మీ అందరికి శాంతి కలుగుగాక!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International