Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
విలాప వాక్యములు 3-5

శ్రమ భావం

నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని.
    యెహోవా కోపపు కర్ర క్రింద నేను సంకట పరిస్థితులు చూశాను.
యెహోవా నన్ను చీకటిలోకి
    నడపించాడేగాని వెలుగులోకి కాదు.
యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు.
    రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు.
ఆయన నా మాంసం, నా చర్మం కృశింపజేశాడు.
    ఆయన నా ఎముకలు విరుగగొట్టాడు.
యెహోవా నా పైకి కష్టాలను, వేదనను రప్పించాడు.
    ఆయన నాచుట్టూ విషాన్ని, సంకట పరిస్థితిని కలుగచేశాడు.
ఆయన నన్ను చీకటిలో కూర్చునేలా చేశాడు.
    ఏనాడో చనిపోయిన వ్యక్తిలా నన్ను ఆయన చేశాడు.
యెహోవా నన్ను బయటకు రాకుండా బంధించాడు.
    ఆయన నాకు బరువైన గొలుసులు తగిలించాడు.
సహాయం కొరకు నేను మొర్ర పెట్టుకుని అర్థించినా,
    యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు.
ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు.
    ఆయన నా మార్గాన్ని వక్రంగా, గతుకులమయం చేశాడు.
10 నా మీదకు పడనున్న ఎలుగుబంటిలా యెహోవా ఉన్నాడు.
    ఆయన పొంచి వున్న ఒక సింహంలా ఉన్నాడు.
11 యెహోవా నన్ను నా మార్గం నుండి తొలగించాడు.
    ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు. నన్ను నాశనం చేశాడు.
12 ఆయన విల్లంబులు చేపట్టాడు.
    ఆయన బాణాలకు నన్ను గురి చేశాడు.
13 ఆయన నా పొట్టలో బాణం వేశాడు.
    ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు.
14 నా ప్రజలందరిలో నేను నవ్వులపాలయ్యాను.
    రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి చేస్తారు.
15 యెహోవా నాచేత చేదు పానీయం (శిక్ష) తాగించాడు.
    ఆయన చేదు పానీయాలతో నన్ను నింపివేశాడు.
16 నా పండ్లు రాత్రి నేలలో గుచ్చుకుపోయేలా యెహోవా నన్ను తోశాడు.
    ఆయన నన్ను మట్టిలోకి త్రోసివేశాడు.
17 ఇక నాకు శాంతి ఉండదని అనుకున్నాను.
    మంచి విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను.
18 “యెహోవా తిరిగి నాకు సహాయం చేస్తాడనే
    ఆశ లేదనుకొన్నాను.”
19 ఓ యెహోవా, నా దుఃఖాన్ని,
    నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము.
    నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
20 నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి.
    నేను మిక్కిలి విచారిస్తున్నాను.
21 కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది.
    నేను ఇలా అనుకున్నాను.
22 యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి.
    యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
23 అవి నిత్య నూతనాలు.
    ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
24 “యెహోవా నా దేవుడు.
    అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.

25 ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు.
    ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
26 యెహోవా రక్షణకై నెమ్మదిగా
    వేచియుండటం క్షేమకరం
27 యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది.
    ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది.
28 యెహోవా తన కాడిని వానిమీద వేయునప్పుడు
    ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండాలి.
29 ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి.
    దానివల్ల తన ఆశ నెరవేరునేమో.
30 తనను కొట్టేవానివైపు తన దవడను ఆ వ్యక్తి తిప్పాలి.
    ఆ వ్యక్తి అవమానాలను భరించటానికి సంసిద్ధుడు కావాలి.
31 యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి.
32 యెహోవా శిక్షించేటప్పుడు, ఆయనకు కరుణకూడ ఉంటుంది.
    ఆయనకుగల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు.

33 యెహోవా తన ప్రజలను శిక్షింపకోరడు.
    తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు.
34 యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడడు:
    ఎవ్వరో ఒక్కరికోసం భూమిపైగల ఖైదీలందరినీ ఆయన పాదాలకింద తొక్కటానికి ఇష్టపడడు.
35 ఒకని మేలుకోసం మరియొకనికి అన్యాయం చేయటం ఆయనకు ఇష్టముండదు.
    కాని కొంత మంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు.
36 ఒకని మంచి పనిని మరియొకని కోసం పాడు చేయటానికి ఆయన ఇష్టపడడు.
    యెహోవా ఈ పనులేవీ చేయటానికి ఇష్టపడడు.
37 యెహోవా ఆజ్ఞలేకుండా ఎవ్వరూ దేనినీ చెప్పలేరు;
    చెప్పి జరిపించలేరు.
38 మహోన్నతుడైన దేవుని నోటినుండి వరాలు,
    శాపాలు రెండూ వెలువడతాయి.
39 ఒక వ్యక్తియొక్క పాపాలననుసరించి యెహోవా అతన్ని శిక్షిస్తాడు.
    కనుక, బతికున్న వాడెవడూ ఆయనపై ఫిర్యాదు చేయలేడు?
40 మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు
    పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము.

41 పరలోకాధిపతియైన దేవునివైపు మన హృదయాలను,
    చేతులను చాపుదాము.
42 ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము: “మేము పాపం చేశాము, మొండివైఖరి దాల్చాము.
    అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు.
43 నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినావు.
    కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు.
44 నిన్ను నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు.
    ఏ ఒక్క ప్రార్థనా నీలో ప్రవేశించకుండ నీవలా చేశావు.
45 అన్య దేశాలవారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా,
    కల్మశంలా చేశావు.
46 మా శత్రువులందరూ మాతో కోపంగా
    మాట్లాడుతున్నారు.
47 మేము భయానికి గురి అయ్యాము.
    మేము గోతిలో పడ్డాము.
మేము బాధపెట్టబడి,
    చితుక గొట్టబడ్డాము!”
48 నా కన్నీళ్లు ప్రవాహంలా కారుచున్నాయి!
    నా ప్రజానాశనం పట్ల నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
49 ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది!
    నా దుఃఖం ఆగదు.
50 ఓ యెహోవా, నీ దృష్టి మా పై ప్రసాదించి,
    మమ్మల్ని చూసే వరకు నా దుఃఖం ఆగదు.
పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసేవరకు
    నేను దుఃఖిస్తూనే ఉంటాను.
51 నా నగర కుమార్తెలకు ఏమి జరిగిందో నేను చూసినప్పుడు
    నా కండ్లు నాకు వేదన కలిగించాయి.
52 తగిన కారణం లేకుండానే నాకు శత్రువులైన
    వారంతా నన్నొక పక్షిలా తరిమారు.
53 నేను బ్రతికి వుండగానే నన్ను గోతిలోకి తోశారు.
    నాపై వాళ్లు రాళ్లు విసిరారు.
54 నీళ్లు నా తలపైకి వచ్చాయి.
    “ఇది నా అంతం” అని నేననుకున్నాను.
55 ఓ యెహోవా, నీ పేరు స్మరించాను.
    గోతిలో అట్టడుగునుండి నిన్ను పేరుపెట్టి పిలిచాను.
56 నీవు నా మొరాలకించావు.
    నీవు నీ చెవులు మూసి కొనలేదు.
    నన్ను కాచి రక్షించటానికి నీవు వెనుకాడలేదు.
57 నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు
    “భయపడవద్దు,” అని నాకు అభయమిచ్చావు.
58 ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు.
    నాకు మళ్లీ జీవం పోశావు.
59 ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు.
    నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు.
60 నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూశావు.
    వారు నాపై జరిపిన కుట్రలన్నీ నీవు చూశావు.
61 ఓ యెహోవా, వారెలా నన్నవమానించారో నీవు విన్నావు.
    వారు నాపై జరిపిన కుట్రలన్నిటిని గురించి నీవు విన్నావు.
62 నా శత్రువుల మాటలు, ఆలోచనలు ఎప్పుడూ
    నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి.
63     ఓ యెహోవా, వారు కూర్చున్నా,
    నిలబడినా వారు నన్నెలా ఎగతాళి చేస్తున్నారో చూడు!
64 ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు!
    వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు!
65 వారి గుండె బండ బారేలా చేయుము!
    పిమ్మట వారిని శపించుము!
66 కోపంతో వారిని వెంటాడుము! వారిని నాశనం చేయుము.
    యెహోవా, వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయుము!

యెరూషలేము పై దాడి భయాలు

బంగారం ఎలా నల్లబడిందో చూడు.
    మంచి బంగారం ఎలా మారిపోయిందో చూడు.
ఆభరణాలన్నీ నలుపక్కలా విసరివేయబడ్డాయి.
    ప్రతి వీధి మూలలో ఆ నగలు వెదజల్లబడ్డాయి.
సీయోను ప్రజలకు ఒకనాడు చాలా విలువ వుండేది.
    వారికి బంగారంతో సరితూగే విలువ వుండేది.
కాని ఈనాడు శత్రువు వారిని మట్టి కుండల్లా చుస్తున్నాడు.
    కుమ్మరి చేసిన మట్టి కుండల్లా ఈనాడు శత్రువు వారిని చూస్తున్నాడు.
నక్క సహితం తన పిల్లలకు పొదుగు అందిస్తుంది.
    నక్క సహితం తన పిల్లలను పాలు తాగనిస్తుంది.
కాని నా ప్రజల కుమార్తె (ఇశ్రాయేలు స్త్రీలు) మాత్రం కఠినాత్మురాలు.
    ఆమె ఎడారిలో నివసించే ఉష్ట్రపక్షిలా వుంది.
దాహంతో పసిబిడ్డ నాలుక
    అంగిట్లో అతుక్కు పోతుంది.
చిన్న పిల్లలు అన్నానికి అలమటిస్తారు.
    కాని వారికి ఎవ్వరూ ఆహారం ఇవ్వరు.
ఒకనాడు విలువైన భోజనం చేసినవారు,
    ఈనాడు వీధుల్లో చనిపోతున్నారు.
అందమైన ఎర్రని దుస్తుల్లో పెరిగిన ప్రజలు
    ఇప్పుడు చెత్త కుండీలలో ఏరుకుంటున్నారు.
నా ప్రజల కుమార్తె (యెరూషలేము స్త్రీలు) చేసిన పాపం మిక్కిలి ఘోరమైనది.
    వారి పాపం సొదొమ, గొమొర్రాల పాపాలకు మించివుంది.
సొదొమ, గొమొర్రా పట్టణాలు అకస్మాత్తుగా నాశనం చేయబడ్డాయి.
    ఏ మానవ హస్తమో చేసిన వినాశనం కాదది.
దేవుని సేవకు ప్రత్యేకంగా అంకితమైన యూదా మనుష్యులు మంచుకంటె తెల్లనివారు.
    వారు పాలకంటె తెల్లనివారు.
వారి శరీరాలు పగడంలా ఎర్రనివి.
    వారి దేహకాంతి నీలమువంటిది.
కాని వారి ముఖాలు ఇప్పుడు మసికంటె నల్లగా తయారైనాయి.
    వీధిలో వారిని ఎవ్వరూ గుర్తు పట్టలేరు.
వారి ఎముకలపై వారి చర్మం ముడుతలు పడింది.
    వారి చర్మం కట్టెలా అయిపోయింది.
కరువుతో మాడి చనిపోయిన వారి స్థితికంటె కత్తి వేటుకు గురియైన వారు అదృష్టవంతులు.
    ఆకలిచే మాడేవారు దుఃఖభాగ్యులు.
వారు గాయపర్చబడ్డారు.
    పొలాల నుండి పంటలురాక వారు ఆకలితో చనిపోయారు.
10 ఆ సమయంలో ఉత్తమ స్త్రీలు కూడా
    తమ స్వంత పిల్లలను వండుకొని తిన్నారు.
ఆ పిల్లలు తమ తల్లులకు ఆహార మయ్యారు.
    నా ప్రజలు నాశనం చేయబడినప్పుడు ఇది జరిగింది.
11 యెహోవా తన కోపాన్నంతా ప్రయోగించాడు.
    తన కోపాన్నంతా ఆయన కుమ్మరించాడు.
సీయోనులో ఆయన అగ్నిని ప్రజ్వరిల్ల జేశాడు.
    ఆ అగ్ని సీయోను పునాదులను తగులబెట్టింది.
12 జరిగిన దానిని ప్రపంచ రాజులెవ్వరూ నమ్మలేకపోయారు.
    ప్రపంచ ప్రజానీకం ఏది సంభవించిందో దానిని నమ్మలేకపోయింది.
శత్రువులు యెరూషలేము నగర ద్వారాల
    గుండా లోనికి ప్రవేశింపగలరని వారు అనుకోలేదు.
13 యెరూషలేము ప్రవక్తలు పాపం చేసిన
    నేరానికి ఇది జరిగింది.
యెరూషలేము యాజకులు దుష్ట కార్యాలు
    చేయటం వలన ఇది సంభవించింది.
యెరూషలేము నగరంలో ఆ మనుష్యులు రక్తం చిందించుతున్నారు.
    వారు మంచివారి రక్తాన్ని పారిస్తున్నారు.
14 ప్రవక్తలు, యాజకులు అంధుల్లా వీధుల్లో తిరిగాడారు.
    వారు రక్తసిక్తమై మలినపడ్డారు.
వారు మలినపడిన కారణంగా ఎవ్వరూ
    వారి బట్టలను కూడ ముట్టరు.
15 “పొండి! దూరంగా పొండి!
    మమ్మల్ని తాకవద్దు.”
ఆ ప్రజలు చుట్టుపక్కల తిరుగాడినారు.
    వారికి నివాసం లేదు.
“వారు మాతో కలిసి నివసించటం మాకు ఇష్టం లేదు.”
    అని అన్యదేశీయులు అన్నారు.
16 యెహోవాయే ఆ ప్రజలను నాశనం చేశాడు.
    ఆయన వారి బాగోగులు ఎంతమాత్రం తెలుసు కోలేదు.
ఆయన యాజకులను గౌరవించలేదు.
    ఆయన యూదా పెద్దలతో స్నేహ భావంతో లేడు.
17 మా కండ్లు పనిచేయటం మానివేశాయి.
    మేము సహాయం కొరకు నిరీక్షించాము.
కాని అది రాలేదు.
    ఆ నిరీక్షణలో కండ్లు అలసిపోయాయి.
ఏదో ఒక రాజ్యం వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని అదే పనిగా ఎదురుచూశాము.
    మా కావలి బురుజులపై నుండి మేము చూశాము.
    కాని ఏ దేశమూ మమ్మల్ని కాపాడటానికి రాలేదు.
18 అన్ని వేళలా మా శత్రువులు మమ్మల్ని వేటాడారు.
    మేము కనీసం వీధులలోకి కూడ పోలేకపోయాము.
మా అంతం సమీపించింది. మాకు సమయం దగ్గర పడింది.
    మాకు అంతిమకాలం వచ్చేసింది!
19 మమ్మల్ని వేటాడిన మనుష్యులు
    ఆకాశంలో గద్దల కంటె వేగవంతులు.
ఆ మనుష్యులు మమ్మల్ని పర్వతాలలోకి తరిమివేశారు.
    మమ్మల్ని పట్టుకోవటానికి వారు ఎడారిలో మాటువేశారు.
20 మా ముక్కు రంధ్రాలలో ఊపిరిలా మెలగిన మా రాజును
    వారు తమ గోతిలో పట్టుకున్నారు.
రాజు యెహోవాచే అభిషిక్తము చేయబడిన వ్యక్తి.
    “మేము ఆయన నీడలో నివసిస్తాము;
ప్రపంచ రాజ్యాల మధ్య మేము ఆయన నీడలో నివసిస్తాము,”
    అని మేము మా రాజును గురించి చెప్పుకున్నాము.

21 ఎదోము ప్రజలారా, సంతోషంగా ఉండండి, ఆనందించండి.
    ఊజు రాజ్యంలో నివసించే ప్రజలారా, సంతోషంగా వుండండి.
కాని ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. యెహోవా కోపపు గిన్నె మీవద్దకు కూడా వస్తుంది.
    మీరు దానిని తాగినప్పుడు, మీకు మత్తెక్కుతుంది.
    ఆ మత్తులో మిమ్మల్ని మీరు దిగంబరులుగా చేసుకుంటారు.
22 సీయోనూ, నీ శిక్ష పూర్తి అయ్యింది.
    మరెన్నడూ నీవు చెరపట్టబడవు.
కాని ఎదోము ప్రజలారా, యెహోవా మీ పాపాలకు తగిన శిక్ష విధిస్తాడు.
    ఆయన మీ పాపాలను బహిర్గతం చేస్తాడు.

యెహోవాకు ప్రార్థన

యెహోవా! మాకు జరిగిన దానిని జ్ఞాపకము చేసికొనుము.
    మాకు జరిగిన అవమానాన్ని తిలకించుము.
మా రాజ్యం పరాయివాళ్ల వశమయ్యింది.
    మా ఇండ్లు అన్యదేశీయులకు ఇవ్వబడ్డాయి.
మేము అనాధలమయ్యాము.
    మాకు తండ్రిలేడు.
    మా తల్లులు విధవరాండ్రవలె అయ్యారు.
మా తాగే నీరు మేము కొనవలసి వచ్చింది.
    మేము వాడే కట్టెలకు మేము డబ్బు చెల్లించవలసి వచ్చింది.
మా మెడమీద బలవంతంగా కాడి మోయవలసి వచ్చింది.
    మేము అలసిపోయాము. మాకు విశ్రాంతి లేదు.
మేము ఈజిప్టుతో ఒక ఒడంబడిక చేసికొన్నాము.
    తగిన ఆహార పదార్థాల సరఫరాకు మేము అష్షూరుతో కూడ ఒక ఒడంబడిక చేసికొన్నాము.
నీపట్ల మా పూర్వీకులు అపచారం చేశారు. వారిప్పుడు చచ్చిపోయారు.
    వారి పాపాలకు ఇప్పుడు మేము కష్టాలనుభవిస్తున్నాము.
బానిసలు మాకు పాలకులయ్యారు.
    వారినుండి మమ్మల్ని రక్షించటానికి ఎవ్వరూ లేరు.
మేము ఆహారం సంపాదించటానికి మా ప్రాణాలు తెగించవలసి వచ్చింది.
    ఎడారిలో కత్తులు ధరించివున్న మనుష్యుల మూలంగా మేము మా ప్రాణాలను తెగించవలసి వచ్చింది.
10 నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది.
    నకనకలాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది.
11 సీయోను స్త్రీలపై శత్రువులు అత్యాచారాలు జరిపారు.
    వారు యూదా నగరాలలో స్త్రీలను చెరిపారు.
12 మా రాజకుమారులను శత్రువు ఉరితీశాడు.
    వారు మా పెద్దలను గౌరవించలేదు.
13 శత్రువు మా యువకులచే తిరుగలి తిప్పించి పిండిపట్టించాడు.
    మా యువకులు కట్టెల మోపులు మోయలేక తొట్రిల్లారు.
14 నగర ద్వారాల వద్ద పెద్దలు ఏమాత్రం కూర్చోడంలేదు.
    యువకులు సంగీతం పాడటం మానివేశారు.
15 మా హృదయాల్లో సంతోషం ఏ మాత్రం లేదు.
    మా నాట్యం చనిపోయిన వారి కొరకు విలాపంగా మారింది.
16 మా తలనుండి కిరీటం కింద పడిపోయింది.
    మేము పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణామాలు వచ్చాయి.
17 ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి.
    ఫలితంగా మా కండ్లు మసకబారాయి.
18 సీయోను పర్వతం బీడు భూమి అయ్యింది.
    సీయోను పర్వతం మీద నక్కలు సంచరిస్తున్నాయి.
19 కాని యెహోవా, నీవు శాశ్వతంగా పరిపాలిస్తావు.
    నీ రాచరిక సింహాసనం కలకాలం అలా నిలిచివుంటుంది.
20 యెహోవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా మర్చి పోయినట్లున్నావు.
    నీవు మమ్మల్ని ఇంత దీర్ఘకాలం వదిలి వెళ్లావు.
21 యెహోవా, మమ్మల్ని నీవద్దకు చేర్చుకో. మేము సంతోషంగా నీదరి చేరుతాము.
    మా రోజులను మునుపటిలా మార్చివేయుము.
22 నీవు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు.
    నీవు మాపట్ల మిక్కిలి కోపం వహించావు.

హెబ్రీయులకు 10:19-39

విశ్వాసాన్ని వదులుకోకండి

19 సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. 20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. 21 అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. 22 తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం. 23 మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.

ఒకరికొకరు సహాయం చేసుకొంటూ బలవంతులై యుండండి

24 ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. 25 సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం[a] సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకొంటూ ఉందాం.

దైవకుమారున్నుండి వెళ్ళిపోకండి

26 సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా, మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే, యిక అర్పించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది? 27 తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలు రానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి. 28 మోషే నియమాల్ని ఉల్లంఘించినవానిపై యిద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయ చూపకుండా మరణ శిక్ష విధించేవాళ్ళు. 29 మరి దేవుని కుమారుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కినవాణ్ణి, తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమాన పరిచేవాణ్ణి, యింకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి. 30 “పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను” అని అన్నవాడు, “ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు”(A) అని అన్నవాడు ఎవరో మనకు తెలుసు. 31 సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్ములు చిక్కుకోవటమనేది భయానకమైన విషయము.

మీకు కలిగిన ధైర్యసహనాల్ని కాపాడుకోండి

32 మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు. 33 కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించేవాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. 34 అంతేకాక, చెరసాలల్లో ఉన్నవాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా “మీ ఆస్తుల్ని” దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు.

35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. 36 మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్ఛ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసినదాన్ని ప్రసాదిస్తాడు. 37 ఎందుకంటే,

“త్వరలోనే వస్తున్నాడు, వస్తాడు,
    ఆలస్యం చెయ్యడు!
38 నీతిమంతులైన నా ప్రజలు
    నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు.
కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే
    నా ఆత్మకు ఆనందం కలుగదు.”(B)

39 కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయేవాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడేవాళ్ళ లాంటివారం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International