Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 14-16

ఇశ్రాయేలు తిరిగి వస్తుంది

14 భవిష్యత్తులో యెహోవా, తన ప్రేమను యాకోబుకు మరల చూపిస్తాడు. ఇశ్రాయేలీయులను యెహోవా మరల ఏర్పాటు చేసికొంటాడు. ఆ సమయంలో యెహోవా ఆ ప్రజలకు వారి దేశాన్ని ఇస్తాడు. అప్పుడు యూదులు కాని వారు, యూదా ప్రజల్లో చేరిపోతారు. ఈ ఇద్దరూ ఒకటిగా యాకోబు వంశం అవుతారు. ఆ రాజ్యాలు ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలు దేశంలో చేర్చుకుంటారు. ఇతర రాజ్యాలకు చెందిన ఆ స్త్రీ పురుషులు ఇశ్రాయేలుకు బానిసలు అవుతారు. గతంలో ఆ ప్రజలే ఇశ్రాయేలు ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కాని ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యాలను ఓడించి, వారి మీద ఏలుబడి చేస్తారు. యెహోవా మీ కష్టమైన పని తీసివేసి, మిమ్మల్ని ఆదరిస్తాడు. గతంలో మీరు బానిసలు. ప్రతి కష్టమైన పనినీ మనుష్యులు మీతో బలవంతంగా చేయించారు. అయితే యెహోవా మీకు ఈ కష్టతరమైన పనిని అంతం చేస్తాడు.

బబులోను రాజు గురించి ఒక గీతం

ఆ సమయంలో, బబులోను రాజును గూర్చి మీరు ఈ పాట పాడటం మొదలు పెడ్తారు.

ఆ రాజు మమ్మల్ని పాలించినప్పుడు నీచంగా ఉన్నాడు.
    కానీ ఇప్పుడు అతని పాలన అయిపోయింది.
చెడ్డ పాలకుల దండాన్ని యెహోవా విరుగగొడతాడు.
    వారి అధికారాన్ని యెహోవా తొలగించి వేస్తాడు.
బబులోను రాజు కోపంతో ప్రజలను కొట్టాడు
    దుష్టుడైన ఆ పాలకుడు ప్రజలను కొట్టడం మానలేదు
దుష్టుడైన ఆ పాలకుడు కోపంతో ప్రజలను పాలించాడు.
    ప్రజలకు కీడు చేయటం అతడు ఎన్నడూ ఆపు జేయలేదు.
అయితే ఇప్పుడు దేశం మొత్తం విశ్రాంతి తీసుకొంటూంది. దేశం నెమ్మదిగా ఉంది.
    ప్రజలు ఇప్పుడు ఉత్సవం చేసుకోవటం మొదలు పెడుతున్నారు.
నీవు ఒక దుష్ట రాజువు
    కానీ ఇప్పుడు నీ పని అయిపోయింది.
చివరికి తమాల వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి.
    లెబానోను దేవదారు వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి.
ఆ చెట్లు అంటున్నాయి, “రాజు మమ్మల్ని నరికి వేశాడు.
    కానీ ఇప్పుడు రాజే పడిపోయాడు.
    అతడు మళ్లీ ఎన్నటికీ నిలబడడు.”
నీవు వస్తున్నందుకు, మరణస్థానమైన పాతాళం హర్షిస్తుంది.
    భూలోక నాయకులందరి ఆత్మలనూ పాతాళం నీ కోసం మేల్కొలుపుతుంది.
    పాతాళం, రాజులను వారి సింహాసనాల మీదనుండి లేపి నిలబెడుతుంది. నీ రాకకు వారు సిద్ధంగా ఉంటారు.
10 ఈ నాయకులంతా నిన్ను హేళన చేస్తారు.
    “ఇప్పుడు నీవు కూడా మాలాగే చచ్చిన శవానివి.
    ఇప్పుడు నీవూ మాలాగే ఉన్నావు.” అని వారంటారు.
11 నీ గర్వం పాతాళానికి పంపబడింది.
    నీ సితారాల సంగీతం, నీ గర్విష్ఠి ఆత్మ రాకను ప్రకటిస్తున్నాయి.
కీటకాలు నీ శరీరాన్ని తినివేస్తాయి. వాటి మీద నీవు పరుపులా పడి ఉంటావు.
    పురుగులు దుప్పటిలా నీ శరీరాన్ని కప్పేస్తాయి.
12 ఓ ప్రకాశవంతమైన నక్షత్రమా! ఉదయ పుత్రా!
    నీవు ఆకాశంనుండి ఎలా పడిపోయావు.?
జనాంగాన్ని పతనం చేసే నీవు
    భూమి మీదికి ఎలా నరికి వేయబడ్డావు.
13 నీలో నీవు ఎల్లప్పుడూ ఇలా చెప్పుకొన్నావు:
    “సర్వోన్నతుడైన దేవునిలా నేనూ ఉంటాను.
    పైన ఆకాశాల్లోకి నేను వెళ్లిపోతాను.
    నేను, నా సింహాసనాన్ని దేవుని నక్షత్రాలకంటె పైకి హెచ్చిస్తాను.
    పరిశుద్ధ సభా పర్వతం మీద నేను కూర్చుంటాను.
    దాగియున్న ఆ కొండ మీద దేవుళ్లను నేను కలుసుకొంటాను.
14 మేఘాల మీద నేను బలిపీఠం దగ్గరకు వెళ్తాను.
    నేను, మహోన్నతుడైన దేవునిలా ఉంటాను.”
15 కానీ అది జరుగలేదు.
    నీవు దేవునితో ఆకాశంలోనికి వెళ్లలేదు. అగాధపు గోతిలోనికి పాతాళానికి నీవు క్రిందికి తీసుకొని రాబడ్డావు.
16 ప్రజలు నిన్ను చూచి, నీ విషయం ఆలోచిస్తారు. నీవు కేవలం చచ్చిన శవం మాత్రమేనని
    ప్రజలు గమనిస్తారు. ప్రజలు అంటారు,
“భూలోక రాజ్యాలన్నింటిలో భయం పుట్టించినవాడు వీడేనా?
17     పట్టణాలను నాశనం చేసినవాడు వీడేనా? దేశాన్ని ఎడారిగా మార్చినవాడు వీడేనా?
యుద్ధంలో మనుష్యుల్ని బంధించి, వారిని ఇంటికి వెళ్లనీయనివాడు వీడేనా?”
18 భూమిమీద ప్రతి రాజూ ఘనంగా మరణించాడు.
    ప్రతి రాజుకూ స్వంత సమాధి ఉంది.
19 అయితే నీవు, దుష్ట రాజువి నీ సమాధిలోనుండి త్రోసి వేయబడ్డావు.
    నరకబడిన చెట్టు కొమ్మలా నీవున్నావు. ఆ కొమ్మ నరకబడి, పారవేయబడింది.
నీవు యుద్ధంలో చచ్చిపడిన వానిలా ఉన్నావు.
    మిగతా సైనికులు వాని మీద నడిచారు.
ఇప్పుడు చచ్చిన ఇతరుల్లాగే ఉన్నావు.
    నీవు చావు గుడ్డల్లో చుట్టబడ్డావు.
20 ఇంకా ఎంతోమంది రాజులు చనిపోయారు. వారందరికీ వారి సమాధులు ఉన్నాయి.
    కానీ నీవు వాళ్లను చేరవు.
ఎందుకంటే, నీవు నీ స్వంత దేశాన్ని నాశనం చేశావు
    గనుక నీ స్వంత ప్రజల్నే నీవు చంపేశావు.
నీవు చేసినట్టు నీ పిల్లలు నాశనం చేయటం కొనసాగించరు. నీ పిల్లలు ఆపుజేయబడతారు.

21 అతని పిల్లలను చంపటానికి సిద్ధపడండి.
    వారి తండ్రి దోషి గనుక వాళ్లను చంపండి.
అతని పిల్లలు మళ్లీ ఎన్నటికీ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోరు.
    అతని పిల్లలు మళ్లీ ఎన్నటికీ ప్రపంచాన్ని తమ పట్టణాలతో నింపరు.

22 “నేను నిలబడి ఆ ప్రజలకు విరోధంగా యుద్ధం చేస్తాను. ప్రఖ్యాత బబులోను పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. బబులోను ప్రజలందరినీ నేను నాశనం చేస్తాను. వారి పిల్లలను, మనుమళ్లను, మునిమనుమళ్లను నేను నాశనం చేస్తాను” అని సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు. యెహోవా తానే ఆ విషయాలు చెప్పాడు.

23 “బబులోనును నేను మార్చేస్తాను. ఆ స్థలం మనుష్యుల కోసం కాదు, జంతువుల కోసమే. ఆ స్థలం నీ టి మడుగు అవుతుంది. బబులోనును తుడిచి వేయటానికి ‘నాశనం అనే చీపురును’ నేను ప్రయోగిస్తాను” అని యెహోవా చెప్పాడు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ సంగతులు చెప్పాడు.

దేవుడు అష్షూరును కూడా శిక్షిస్తాడు

24 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక ప్రమాణం చేశాడు. యెహోవా చెప్పాడు, “సరిగ్గా నేను తలచినట్టే ఈ సంగతులు జరుగుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ విషయాలు సరిగ్గా నా పథకం ప్రకారమే జరుగుతాయి. 25 అష్షూరు రాజును నేను నా దేశంలో నాశనం చేస్తాను. నా కొండలపై నేను ఆ రాజు మీద నడుస్తాను. ఆ రాజు నా ప్రజలను తనకు బానిసలుగా చేశాడు. వారి మెడల మీద అతడు ఒక కాడిపెట్టాడు. యూదా మెడమీద నుండి ఆ కాడి తొలగించి వేయబడుతుంది. ఆ భారం తొలగించబడుతుంది. 26 నేను నా ప్రజల కోసం చేయాలనీ ఉద్దేశించిన సంగతి అది. రాజ్యాలన్నింటినీ శిక్షించటానికి నేను నా చేతి బలంప్రయోగిస్తాను.”

27 యెహోవా ఒక పథకం వేసినప్పుడు ఆ పథకాన్ని ఎవ్వరూ అడ్డగించలేరు. ప్రజలను శిక్షించేందుకు యెహోవా తన చేయి పైకెత్తినప్పుడు, దానిని ఎవ్వరూ అడ్డగించలేరు.

ఫిలిష్తీయులకు దేవుని సందేశం

28 విచారకరమైన ఈ సందేశం ఆహాబు రాజు చని పోయిన సంవత్సరం ఇవ్వబడింది.

29 ఓ ఫిలిష్తీ దేశమా, నిన్ను కొట్టే రాజు చనిపోయాడని నీవు సంతోషిస్తున్నావు. కానీ నీవు నిజంగా సంతోషపడకు. అతని పరిపాలన అంతమయిపోయింది, నిజమే. కానీ రాజు కుమారుడు వస్తాడు. పరిపాలిస్తాడు. అది ఒక సర్పం తనకంటె మరింత ఎక్కువ ప్రమాదకరమైన సర్పానికి జన్మ ఇచ్చినట్టు ఉంటుంది. 30 కానీ నా దీన ప్రజలు మాత్రం క్షేమంగా భోజనం చేయగలుగుతారు. వారి పిల్లలు క్షేమంగా ఉంటారు. మీ దీనప్రజలు పండుకొని, క్షేమంగా ఉంటారు. కానీ నేను మీ కుటుంబాన్ని ఆకలితో చంపేస్తాను. మిగిలిన మీ ప్రజలంతా చనిపోతారు.

31 పట్టణ ద్వారం దగ్గర ఉండే ప్రజలారా కేక వేయండి.
    పట్టణ ప్రజలారా, గట్టిగా కేకలు వేయండి.
ఫిలిష్తియాలోని ప్రజలారా, మీరు భయపడతారు.
    మీ ధైర్యం వేడి మైనంలా కరిగిపోతుంది.

ఉత్తరంగా చూడండి.
    అక్కడ ధూళి మేఘం ఉంది.
అష్షూరు నుండి ఒక సైన్యం వస్తోంది.
    ఆ సైన్యంలో మనుష్యులంతా బలంగా ఉన్నారు.
32 ఆ సైన్యం, వారి దేశానికి సందేశం తీసుకువెళ్లే వారిని పంపుతుంది. ఆ సందేశకులు వారి ప్రజలకు ఏమని చెబుతారు?
    ఫిలిష్తియా ఓడిపోయింది. అని వారు ప్రకటిస్తారు. కానీ సీయోనును యెహోవా బలపర్చాడు.
    ఆయన దీన ప్రజలు భద్రత కోసం అక్కడికి వెళ్లారు.

మోయాబుకు దేవుని సందేశం

15 ఇది మోయాబును గూర్చి విచారకరమైన సందేశం:

ఒక రాత్రి ఆర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది.
    ఆ రాత్రి పట్టణం నాశనం చేయబడింది.
ఒక రాత్రి కిర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది.
    ఆ రాత్రే పట్టణం నాశనం చేయబడింది.
రాజ కుటుంబం, దీబోను ప్రజలు ఉన్నతమైన పూజాస్థలాల్లో మొరపెట్టేందుకు వెళ్తున్నారు.
    నెబో కోసం, మేదెబా కోసం మోయాబు ప్రజలు మొరపెడ్తున్నారు.
    ప్రజలంతా వారి విచారం వ్యక్తం చేయటానికి తలలు బోడిగుండ్లు చేసుకొన్నారు.
మోయాబు అంతటా ఇంటి కప్పుల మీద, వీధుల్లో
    ప్రజలు నల్ల బట్టలు ధరిస్తున్నారు.
    ప్రజలు ఏడుస్తున్నారు.
హెష్బోను, ఏలాలేయు పట్టణాల ప్రజలు చాలా గట్టిగా ఏడుస్తున్నారు.
    చాలా దూరంలో ఉన్న యహసు పట్టణంలో మీరు వారి ఏడ్పులు వినవచ్చును.
చివరికి సైనికులు కూడా భయపడుతున్నారు.
    సైనికులు భయంతో వణకుచున్నారు.

మోయాబు విషయంలో దుఃఖంతో నా హృదయం ఘోషిస్తుంది.
    ప్రజలు భద్రత కోసం పారిపోతున్నారు.
    దూరంలో ఉన్న సోయరుకు వారు పారిపోతున్నారు.
ఎగ్లాతు షెలిషియాకు వారు పారిపోతున్నారు.
    ప్రజలు కొండ మార్గంగా లూహీతుకు వెళ్తున్నారు.
ప్రజలు ఏడుస్తున్నారు.
    ప్రజలు హొరొనయీము మార్గంలో వెళ్తున్నారు. ప్రజలు చాలా గట్టిగా విలపిస్తున్నారు.
కానీ నిమ్రీము యేరు ఎడారిలా ఎండిపోయింది.
    మొక్కలన్నీ చచ్చాయి.
    ఏదీ పచ్చగా లేదు.
అందుచేత ప్రజలు వారి స్వంత సామగ్రి సర్దుకొని మోయాబు విడిచిపెడ్తున్నారు.
    వారు ఆ సామగ్రిమోస్తూ నిరవంజి చెట్ల నది దగ్గర సరిహద్దు దాటుతున్నారు.

ఏడ్వటం మోయాబు అంతటా వినబడుతుంది.
    చాలా దూరంలో ఉన్న ఎగ్లయీము పట్టణంలో ప్రజలు ఏడుస్తున్నారు. బెయేరేలీము పట్టణంలో ప్రజలు ఏడుస్తున్నారు.
దీమోను పట్టణపు నీళ్లు పూర్తిగా రక్తమయం అయిపోయాయి.
    మరియు నేను (యెహోవాను) దీమోనుకు ఇంకా ఎక్కువ కష్టాలు కలిగిస్తాను.
మోయాబులో నివసిస్తున్న కొద్దిమంది శత్రువునుండి తప్పించుకొన్నారు.
    కానీ ఆ ప్రజలను తిని వేయటానికి నేను సింహాలను పంపిస్తాను.

16 ఆ దేశపు రాజుకు మీరు ఒక కానుక పంపాలి. సెలానుండి అరణ్యంగుండా సీయోను కుమార్తె కొండకు (యెరూషలేము) మీరు ఒక గొర్రెపిల్లను పంపాలి.

మోయాబు స్త్రీలు అర్నోను నది దాటేందుకు ప్రయత్నిస్తారు.
    సహాయం కోసం వారు ఒకచోట నుండి మరోచోటుకు పరుగులెత్తుతారు.
    వారు, గూడు నేల కూలినప్పుడు తప్పిపోయిన చిన్న పిట్ట పిల్లలా ఉంటారు.
“మాకు సహాయం చేయండి,
    మేం ఏం చేయాలో మాకు చెప్పండి!
మధ్యాహ్నపు ఎండనుండి నీడ కాపాడినట్టు
    మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడండి.
మా శత్రువుల నుండి మేం పారిపోతున్నాం
    మమ్మల్ని దాచిపెట్టండి.
    మమ్మల్ని మా శత్రువులకు అప్పగించకండి అని వారంటారు.
ఆ మోయాబు ప్రజలు వారి ఇండ్లనుండి బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు.
    కనుక వాళ్లను మీ దేశంలో నివాసం ఉండనియ్యండి.
    వారి శత్రువులనుండి వారిని కాపాడండి.”

దోచుకోవటం ఆగిపోతుంది.
    శత్రువు ఓడించబడతాడు.
ఇతరులను బాధించే పురుషులు దేశం నుండి వెళ్లిపోతారు.
అప్పుడు క్రొత్త రాజు వస్తాడు.
    ఈ రాజు దావీదు వంశంవాడు.
    ఆయన నిజాయితీ పరుడు. ఆయన ప్రేమ, దయగలవాడు.
ఈ రాజు న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
    సరియైనవి, మంచివి ఆయన చేస్తాడు.

మోయాబు ప్రజలు చాలా గర్విష్ఠులని,
    మోసగాళ్లని మేము విన్నాం.
ఈ ప్రజలు తిరుగు బాటు దారులు, గర్విష్ఠులు.
    అయితే వారి గొప్పలన్నీ వట్టి మాటలే.
ఆ గర్వం చేత మొత్తం మోయాబు దేశం శ్రమ అనుభవిస్తుంది. మోయాబు ప్రజలంతా ఏడుస్తారు.
ప్రజలు విచారిస్తారు. గతంలో వారికి ఉన్నవన్నీ మళ్లీ కావాలనుకొంటారు.
    కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు కావాలని వారు కోరుకొంటారు.
హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్ష వల్లులు, ద్రాక్ష పండ్లు ఫలించటం లేదని ప్రజలు విచారంగా ఉంటారు.
    విదేశీ పాలకులు ద్రాక్ష వల్లులను నరికివేశారు.
    శత్రుసైన్యాలు యాజరు పట్టణం వరకు చాలా దూరం, అరణ్యంలోనికి విస్తరించారు. సముద్రం వరకు వారు విస్తరించారు.
“ద్రాక్ష పండ్లు నాశనం చేయబడ్డాయి.
    కనుక యాజరు, సిబ్మా ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను.
పంట ఉండదు గనుక హెష్బోను,
    ఏలాలే ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను.
వేసవి పండ్లు ఏమీ ఉండవు.
    సంతోషపు కేకలు అక్కడ ఉండవు.
10 కర్మెలులో పాటలు పాడటం మరియు సంతోషం ఉండదు.
    పంట కోత సమయంలో సంతోషం అంతా నేను నిలిపివేస్తాను.
ద్రాక్షపండ్లు ద్రాక్షరసం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
    కానీ అవన్నీ వ్యర్థం అవుతాయి.
11 అందుచేత మోయాబు గూర్చి నాకు చాలా విచారం కీర్హరెశు గూర్చి నాకు చాలా విచారం
    ఈ పట్టణాల గూర్చి నాకు ఎంతెంతో దుఃఖం.
12 మోయాబు ప్రజలు ఎత్తయిన వారి పూజాస్థలాలకు వెళ్తారు.
ప్రజలు ప్రార్థించాలని ప్రయత్నిస్తారు.
    కానీ సంభవించిన సంగతులన్నీ వారు చూస్తారు, ప్రార్థించలేనంత బలహీనులవుతారు.”

13 మోయాబును గూర్చి ఈ విషయాలు యెహోవా ఎన్నోసార్లు చెప్పాడు. 14 ఇప్పుడు “మూడు సంవత్సరాల్లో (కూలీ వాని కాలం లెక్క ప్రకారం) ఆ ప్రజలందరూ ఉండరు, వారికి అతిశయాస్పదమైనవన్నీ పోతాయి. కొంతమంది మనుష్యులు మిగిలి ఉంటారు. కానీ వారు ఎక్కువ మంది ఉండరు” అని యెహోవా చెబుతున్నాడు.

ఎఫెసీయులకు 5:1-16

మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.

కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు.

వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. 10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. 13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. 14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది:

“నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో!
    బ్రతికి లేచిరా!
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”

15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International