Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 123-125

యాత్ర కీర్తన.

123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
    నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
    బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
    దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
యెహోవా, మా మీద దయ చూపించుము.
    మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
    మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.

దావీదు యాత్ర కీర్తన.

124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
    ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
    ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
    వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
    మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
    మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.

యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
    మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.

మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
    వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
    భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.

యాత్ర కీర్తన.

125 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
    వారు ఎన్నటికీ కదలరు.
    వారు శాశ్వతంగా కొనసాగుతారు.
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
    అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
    దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలుపెడతారేమో.

యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
    పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
    వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.

ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.

1 కొరింథీయులకు 10:1-18

ఇశ్రాయేలు చరిత్ర నుండి హెచ్చరికలు

10 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వికులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు. అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే. అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతావాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.

వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు. కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”(A) మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవై మూడు వేలమంది మరణించారు. వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి. 10 వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.

11 మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. 12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్నవాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి. 13 మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్థుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.

14 కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి. 15 మీరు తెలివిగలవాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి 16 మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా? 17 రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము.

18 ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చినదాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా?

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International