Old/New Testament
33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
4 దేవుని మాట సత్యం!
ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.
17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
ఫేలిక్సు సమక్షంలో విచారణ
24 అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ, కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియ చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారోపణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు. 2 తెర్తుల్లు తన వాదనను ప్రారంభిస్తూ, “మీ పాలనలో చాలాకాలం శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు చూపువల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి.
3 “మహా ఘనత పొందిన ఫేలిక్సు ప్రభూ! మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు, ఎంతో కృతజ్ఞతతో, సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. 4 మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకు ఇష్టం లేదు. కనుక క్లుప్తంగా చెపుతాము. మేము చెప్పేది మాపై దయ ఉంచి వినమని విజ్ఞప్తి చేస్తున్నాము. 5 ఇతడు సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్నే నజరేతు జాతికి నాయకుడు. 6 ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్యటానికి ప్రయత్నించాడు. 7 [a] 8 మీరితణ్ణి విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలుస్తాయి” అని అన్నాడు. 9 న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ, తెర్తుల్లు వాదనను బలపరిచారు.
పౌలు నిర్దోషినని ఫేలిక్సుముందు చెప్పుకొనటం
10 రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను. 11 నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్నదానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు. 12 నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు. 13 వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.
14 “వాళ్ళు, దేన్ని వేరొక మతంగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వికుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. 15 వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. 16 అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.
17 “పేదవాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేముకు వచ్చాను. 18 నేనీ కార్యాలు మందిరావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు. 19 కాని ఆసియనుండి అక్కడికి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది. 20 నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఇక్కడ నిలుచున్నవాళ్ళను చెప్పమనండి. 21 ఔను! నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచొని బిగ్గరగా ‘చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈ రోజు నేరస్థునిగా నిలుచున్నాను’ అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.”
22 యేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫేలిక్సు సభను ముగిస్తూ, “సహస్రాధిపతి లూసియ వచ్చాక నీ విషయం నిర్ణయిస్తాను” అని అన్నాడు. 23 శతాధిపతితో, “పౌలును కాపలాలో ఉంచు! కాని కొంత స్వేచ్ఛనివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా ఇవ్వటానికి వస్తే వాళ్ళనాపవద్దు” అని అన్నాడు.
పౌలు ఫేలిక్సుతో, అతని భార్యతో మాట్లాడటం
24 కొద్ది రోజుల తర్వాత ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో వచ్చాడు. ద్రుసిల్ల యూదురాలు. ఫేలిక్సు పౌలును పిలిపించాడు. “యేసు క్రీస్తులో విశ్వాసం” అనే విషయాన్ని గురించి, పౌలు మాట్లాడాడు. ఫేలిక్సు విన్నాడు. 25 పౌలు సన్మార్గాన్ని గురించి, మనో నిగ్రహాన్ని గురించి, రానున్న తీర్పును గురించి చెప్పటం విని ఫేలిక్సు భయపడి, “ఇప్పటికి చాలించి, వెళ్ళు! నాకు వీలున్నప్పుడు నిన్ను మళ్ళీ పిలిపిస్తాను” అని అన్నాడు. 26 కాని తనకు లంచమిస్తాడని ఆశించి అతణ్ణి మాటిమాటికి పిలిపించి అతనితో మాట్లాడేవాడు.
27 రెండు సంవత్సరాలు గడిచాక పోర్కియు ఫేస్తు ఫేలిక్సు స్థానంలో వచ్చాడు. ఫేలిక్సు యూదులకు ఒక ఉపకారం చెయ్యాలనే ఉద్దేశంతో పౌలును కారాగారంలోనే ఉంచాడు.
© 1997 Bible League International