Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 20-22

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
    యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
    సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
    నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
    నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
    దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.

ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
    దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
    ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
    కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
    కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!

దేవుడు రాజును రక్షించును గాక!
    మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

21 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.
    నీవు అతన్ని రక్షించినప్పుడు అతడు ఎంతగానో సంతోషించాడు.
రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.
    మరియు యెహోవా, రాజు అడిగినవాటిని నీవు అతనికిచ్చావు.

యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచివాటిని రాజుకిచ్చావు.
    బంగారు కిరీటం నీవు అతని తలకు ధరింపజేసావు.
దేవా, జీవంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.
    నీవు రాజుకు నిరంతరం సాగే దీర్ఘాయువు నిచ్చావు.
రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి వచ్చింది.
    నీవు అతనికి గౌరవం, ఘనత ఇచ్చావు.
దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.
    నీ సన్నిధానము రాజును ఎక్కువగా సంతోషపెడ్తుంది.
రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.
    సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు.
రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.
    నిన్ను ద్వేషించే ప్రజలను నీ శక్తి ఓడిస్తుంది.
నీవు కనబడినప్పుడు
    ఆ శత్రువులను వేడి పొయ్యిలోని నిప్పువలె చేస్తావు.
యెహోవా కోపము వేడి మంటవలె కాలుస్తుంది.
    మరియు ఆయన ఆ శత్రువులను నాశనం చేస్తాడు.
10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.
    వారు భూమి మీద నుండి తొలగిపోతారు.
11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.
    చెడుకార్యాలు చేయాలని వారు యోచించారు గాని వారు సాధించలేదు.
12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.
    ఎందుకంటే నీవు విల్లును వారి ముఖాలకు గురిపెడతావు.

13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి
    మేము కీర్తనలు పాడుతాము, వాద్యాలు వాయిస్తాము.

సంగీత నాయకునికి: అయ్యలెత్ షహరు రాగం. దావీదు కీర్తన.

22 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
    నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
    సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను.
    కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు.
మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.

దేవా, నీవు పవిత్రుడవు.
    నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం.
మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు.
    అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు.
    వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
కాని, నేను మనిషిని కానా, పురుగునా?
    మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు.
    నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి.
    ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో!
    నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”

దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే.
    నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు.
    నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.

11 కనుక దేవా, నన్ను విడువకు.
    కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు.
    వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు.
    (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్ధికెక్కిన ప్రాంతం.)
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు.
    వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి.

14 నేలమీద పోయబడ్డ నీళ్లలా
    నా బలం పోయినది.
నా ఎముకలు విడిపోయాయి.
    నా ధైర్యం పోయినది.
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది.
    నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది.
    “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.
16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి.
    ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది.
    సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు.
17 నేను నా ఎముకల్ని చూడగలను.
    ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు.
    వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు!
18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు.
    నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.

19 యెహోవా, నన్ను విడువకుము!
    నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
    ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
    ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము.

22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
    ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
    ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
    ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
    యెహోవా వారిని ద్వేషించడు.
    ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.

25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
    నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
    యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
    మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
    ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
    ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
    సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు.
మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు.
    చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
    యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు.
    దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.

అపొస్తలుల కార్యములు 21:1-17

యెరూషలేముకు ప్రయాణం

21 మేము సెలవు పుచ్చుకొని నేరుగా “కోసు” కు ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు “రొదు” చేరుకున్నాము. అక్కడినుండి బయలుదేరి “పతర” చేరుకున్నాము. ఒక ఓడ ఫొనీషియ వెళ్ళటం గమనించి అందులో ప్రయాణం చేసాము.

సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్ళి సిరియ దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపంలో ఆగాము. అక్కడ భక్తులుండటం గమనించి వాళ్ళతో ఏడు రోజులున్నాము. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యెరూషలేము వెళ్ళవద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్ళవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్ళాము. విశ్వాసులు, తమ భార్యాబిడ్డలతో కలిసి మా వెంట ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరుకున్నాక, అందరమూ మోకరిల్లి ప్రార్థించాము. పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. వాళ్ళు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయారు.

మేము తూరునుండి మా ప్రయాణం సాగించి తొలేమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోదరుల్ని కలుసుకొని వాళ్ళతో ఒక రోజు గడిపాము. మరుసటి రోజు ప్రయాణమై కైసరియ చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి యింట్లో బసచేసాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ ఏడుగురిలో ఒకడు. అతనికి నలుగురు పెళ్ళికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు.

10 అక్కడ మేము చాలా రోజులున్నాక, అగబు అనే ప్రవక్త యూదయనుండి వచ్చాడు. 11 అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకొని ఈ విధంగా అన్నాడు: “‘ఈ నడికట్టు ఎవరిదో, అతణ్ణి యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కానివాళ్ళకు అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెపుతున్నాడు.”

12 ఇది విని అక్కడి ప్రజలు, మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్ళవద్దని బ్రతిమలాడాము. 13 పౌలు, “మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడ్తున్నారు? యేసు ప్రభువు పేరిట బంధింపబడటానికే కాదు, మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను!” అని సమాధానం చెప్పాడు.

14 మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని మేమేమీ మాట్లాడలేదు.

15 ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము. 16 కైసరియనుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని “మ్నాసోను” అనే అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. అక్కడ మా బస. మ్నాసోను సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్ళలో ఇతడు ఒకడు.

పెద్దల్ని కలుసుకోవటం

17 మేము యెరూషలేముకు వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International