Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 16-17

దావీదుకు అభిమాన కావ్యము.

16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
“యెహోవా, నీవు నా యజమానివి
    నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
    అని నేను యెహోవాతో చెప్పాను.
మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
    “వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”

కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
    ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
    ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
    యెహోవా, నీవే నన్ను బలపరచావు.
    యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
నా వంతు చాలా అద్భుతమయింది.
    నా స్వాస్థ్యము చాలా అందమయింది.
యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
    రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.

నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
    ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
    నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
    నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
    నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
    యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
    నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.

దావీదు ప్రార్థన.

17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
    నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
    నీవు సత్యాన్ని చూడగలవు.
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
    దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
    నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
    నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
నేను నీ మార్గాలు అనుసరించాను.
    నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
    కనుక ఇప్పుడు నా మాట వినుము.
ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
    నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
    నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
    మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
    ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
    వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.

13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
    నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14     యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
    ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.

15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
    మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.

అపొస్తలుల కార్యములు 20:1-16

పౌలు మాసిదోనియా మరియు గ్రీసుకు వెళ్ళటం

20 అల్లర్లు తగ్గిపొయ్యాక, పౌలు యేసు శిష్యుల్ని పిలిచాడు. వాళ్ళను ఆత్మీయంగా ప్రోత్సాహపరిచి, వాళ్ళనుండి సెలవు తీసుకొన్నాడు. ఆ తర్వాత మాసిదోనియకు వెళ్ళాడు. ఆ ప్రాంతాన పర్యటన చేసి ఆత్మీయంగా ఉత్సాహపరిచే ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పి చివరకు గ్రీసు దేశం చేరుకున్నాడు. అక్కడ మూడు నెలలున్నాడు. అక్కడినుండి సిరియ దేశానికి ఓడలో ప్రయాణం చెయ్యాలనుకొని సిద్ధమయ్యాడు.

ఇంతలో యూదులు తనను చంపాలని అనుకొంటున్నారని అతనికి తెలిసింది. అందువలన అతడు తిరిగి మాసిదోనియకు వెళ్ళి అక్కడినుండి ప్రయాణం చేసాడు. అతని వెంట ఉన్నవాళ్ళు ఎవరనగా: బెరయ పట్టణంనుండి పుర్రు కుమారుడైన సోపత్రు, థెస్సలొనీక పట్టణంనుండి అరిస్తర్కు, సెకుందు, దెర్బే పట్టణంనుండి గాయి, తిమోతి, ఆసియనుండి తుకికు, త్రోఫిము. వీళ్ళు ముందే వెళ్ళి మా కోసం త్రోయలో కాచుకొని ఉన్నారు. కాని మేము ఫిలిప్పీనుండి ప్రత్యేకమైన పులియని రొట్టెల పండుగ తర్వాత ఓడలో ప్రయాణమయ్యాము. అయిదు రోజులు ప్రయాణం చేసాక త్రోయలో వాళ్ళను కలుసుకున్నాము. అక్కడ ఏడు రోజులు ఉన్నాము.

పౌలు చివరిసారి త్రోయకు వెళ్ళటం

ఆదివారం రోజున అంతా కలిసి రొట్టె విరుచుటకు సమావేశమయ్యాము. పౌలు మరుసటి రోజు ప్రయాణం చేయాలని అనుకోవటం వలన అర్థరాత్రి దాకా ప్రజలతో మాట్లాడాడు. మేము మేడపైనున్న గదిలో సమావేశమయ్యాము. మా గదిలో చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ గది కిటికీలో ఐతుకు అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు ఏకధాటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఐతుకుకు నిద్ర వచ్చి గాఢంగా నిద్రపొయ్యాడు. ఆ నిద్రలో మూడవ అంతస్తునుండి క్రింద పడ్డాడు. కొంత మంది వచ్చి చనిపోయిన అతణ్ణి చూసారు.

10 పౌలు క్రిందికి వెళ్ళి ఆ యువకుని ప్రక్కన ఒరిగి అతణ్ణి తన చేతుల్తో ఎత్తి, “దిగులు పడకండి, ప్రాణం ఉంది” అని అన్నాడు. 11 అతడు మళ్ళీ మేడ మీదికి వెళ్ళి రొట్టె విరిచి సోదరులకు పంచి తాను తిన్నాడు. తెల్లవారే దాకా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపొయ్యాడు. 12 ప్రజలు బ్రతికింపబడిన ఆ యువకుణ్ణి అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ మనస్సులు ఎంతో నెమ్మది పడ్డాయి.

త్రోయనుండి మిలేతుకు ప్రయాణం

13 మేము పౌలును వదిలి ఓడనెక్కి “అస్సు” కు వెళ్ళాము. తాను కాలి నడకన అస్సుకు చేరుకొని మమ్మల్ని అక్కడ కలుసుకొంటానని చెప్పాడు. అక్కడినుండి మాతో కలిసి ఓడలో ప్రయాణం చెయ్యాలని అతని ఉద్దేశ్యం. 14 మేము అతణ్ణి అస్సులో కలుసుకొన్నాక అతడు మా ఓడనెక్కాడు. అంతా కలిసి “మితులేనే” వెళ్ళాము. 15 మితులేనేనుండి మరుసటి రోజు ఓడలో మళ్ళీ ప్రయాణం సాగించి, “కీయొసు” ద్వీపం కొంత దూరం ఉందనగానే లంగరు వేసాము. ఆ మరుసటి రోజు ప్రయాణం చేసి “సమొసు” ద్వీపానికి దగ్గరగా వచ్చాము. మరొక రోజు ప్రయాణం చేసాక “మిలేతు” చేరుకున్నాము. 16 పౌలు యెరూషలేముకు త్వరగా వెళ్ళాలని అనుకొన్నాడు. ఆసియ ప్రాంతంలో కాలాన్ని వ్యర్థం చెయ్యటం యిష్టం లేక ఎఫెసులో ఆగకుండా వెళ్ళాడు. వీలైతే పెంతెకొస్తు పండుగనాటికి యెరూషలేంలో ఉండాలని అనుకొన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International