Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 7-9

యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన సౌలును గూర్చినది ఈ పాట.

యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను.
    నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము.
నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను.
    నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.

యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు.
నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు.
    నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు.
కాని నేను అలా చేసియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము.
    నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద త్రొక్కనిమ్ము.
    మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.

యెహోవా, లెమ్ము. నీ కోపాన్ని చూపెట్టుము.
    నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము.
    లేచి న్యాయంకోసం వాదించుము.
జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి,
    వారి మీద పైనుండి పరిపాలించుము.
ప్రజలకు తీర్పు తీర్చుము. యెహోవా, నాకు తీర్పు తీర్చుము.
    నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము.
    నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
చెడ్డవాళ్లను శిక్షించి
    మంచివాళ్లకు సహాయం చేయుము.
దేవా, నీవు మంచివాడవు,
    మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.

10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు.
    కనుక దేవుడు నన్ను కాపాడుతాడు.
11 దేవుడు మంచి న్యాయమూర్తి,
    మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.
12 దేవుడు ఒక నిర్ణయం చేస్తే
    ఆయన తన మనస్సు మార్చుకోడు.
13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.

14 కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు.
    అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు.
15 వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు.
    అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు.
16 వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు.
    ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు.
    అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు.

17 యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను.
మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.

సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.

యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
    నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
    నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
    నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
    నీవు వానిని గమనించటం ఎందుకు?
అయితే మానవుడు నీకు ముఖ్యం.
    వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
    మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
    ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
    చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.

పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
    యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
    మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
    కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.

నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
    యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
    యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
    బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
శత్రువు పని అంతం అయిపోయింది.
    యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
    ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
    ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.

అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
    యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
    యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
    గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
    యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.

10 నీ నామం తెలిసిన ప్రజలు
    నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
    సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.

11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
    యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
    ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
    మరి యెహోవా వారిని మరచిపోలేదు.

13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
    నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
    ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
    నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”

15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
    కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
    ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
    కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
    యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]

17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
    ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
    కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
    వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
    వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.

అపొస్తలుల కార్యములు 18

కొరింథు

18 ఆ తరువాత పౌలు ఏథెన్సు వదిలి కొరింథుకు వెళ్ళాడు. అక్కడ అకుల అనే యూదుణ్ణి కలుసుకొన్నాడు. ఇతని స్వగ్రామం పొంతు. క్లౌదియ యూదులందర్ని రోమా నగరం వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించటంవలన అకుల ఇటలీనుండి తన భార్య ప్రిస్కిల్లతో కలసి ఈ మధ్య యిక్కడికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్ళాడు. తనలాగే వాళ్ళు కూడా గుడారాలు చేసి జీవించేవాళ్ళు కనుక వాళ్ళతో కలిసి ఉండి పని చేసాడు.

ప్రతి విశ్రాంతి రోజూ సమాజమందిరాల్లో తర్కించి యూదుల్ని, గ్రీకుల్ని ఒప్పించటానికి ప్రయత్నించేవాడు. మాసిదోనియనుండి సీల, తిమోతి వచ్చాక పౌలు తన కాలాన్నంతా బోధించటానికి వినియోగించాడు. యూదుల సమక్షంలో మాట్లాడి, యేసు ప్రభువే క్రీస్తు అని నిరూపించే వాడు. కాని యూదులు ఎదురు తిరిగి అతణ్ణి దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ తన దుస్తుల్ని దులిపి, “మీరు పొందనున్న శిక్షకు మీరే బాధ్యులు, నేను బాధ్యుణ్ణి కాదు. ఇక మీదట నేను యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్తాను” అని అన్నాడు.

పౌలు సమాజమందిరాన్ని వదిలి ప్రక్కనున్న తీతియు యూస్తు అనే విశ్వాసి యింటికి వెళ్ళాడు. యూదుల సమాజమందిరంపై అధికారిగా పని చేస్తున్న క్రిస్పు అనే వ్యక్తి అతని యింట్లోనివాళ్ళు ప్రభువును విశ్వసించారు. చాలా మంది కొరింథు ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి బాప్తిస్మము పొందారు.

9-10 ఒకనాటి రాత్రి ప్రభువు పౌలుకు కలలో కనిపించి, “ఈ పట్టణంలో నా ప్రజలు చాలా మంది ఉన్నారు. కనుక మౌనం వహించక ధైర్యంగా బోధించు. నేను నీ వెంటే ఉన్నాను. ఎవ్వరూ నీకు ఎదురు తిరగలేరు. ఏ హానీ చెయ్యలేరు” అని అన్నాడు. 11 పౌలు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడుండి దైవసందేశాన్ని వాళ్ళకు బోధించాడు.

పౌలు గల్లియో ఎదుటికి తీసుకురాబడ్డాడు

12 గల్లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయ ప్రాంతానికి సామంత రాజుగా ఉండేవాడు. అతని కాలంలో యూదులందరూ కలిసి పౌలుకు ఎదురు తిరిగారు. అతణ్ణి న్యాయస్థానం ముందుకు తెచ్చి, 13 “ఇతడు మన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిలో దేవుణ్ణి పూజించమని ప్రజల్ని ఒత్తిడి చేస్తున్నాడు” అని అతణ్ణి నిందించారు.

14 పౌలు సమాధానం చెప్పటానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో గల్లియో యూదులతో, “మీరు ఘోరమైన నేరాన్ని గురించి కాని, లేక చెడు నడతను గురించి కాని చెప్పదలిస్తే నేను మీ విన్నపం వినటం సమంజసంగా ఉంటుంది. 15 కాని మీ ఆరోపణ పదాలను గురించి, పేర్లను గురించి, మీ శాస్త్రాల్ని గురించి కాబట్టి మీలో మీరు తీర్మానం చేసుకోండి. 16 అలాంటి వాటిపై నేను తీర్పు చెప్పను” అని అంటూ వాళ్ళను న్యాయస్థానంనుండి తరిమివేసాడు.

17 వాళ్ళు యూదుల సమాజమందిరానికి పెద్ద అయినటువంటి సోస్తెనేసును పట్టుకొని అతణ్ణి న్యాయస్థానం ముందు కొట్టారు. అయినా గల్లియో తనకు సంబంధం లేనట్టు ఊరుకొన్నాడు.

అంతియొకయకు తిరిగి వెళ్ళటం

18 పౌలు కొరింథులో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత అక్కడున్న సోదరుల్ని వదిలి, ప్రిస్కిల్లను, అకులను తన వెంట పిలుచుకొని ఓడలో సిరియ దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణానికి ముందు తాను మ్రొక్కుబడి తీర్చుకోవటానికి కెంక్రేయలో తన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. 19 వాళ్ళు ఎఫెసుకు చేరుకున్నారు. అక్కడ పౌలు ప్రిస్కిల్లను, అకులను వదిలి తానొక్కడే సమాజమందిరానికి వెళ్ళి యూదులతో తర్కించాడు. 20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు. 21 కాని వెళ్ళే ముందు, “దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను” అని వాళ్ళతో చెప్పి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసాడు.

22 అతడు కైసరియ తీరాన్ని చేరుకొని అక్కడినుండి యెరూషలేము వెళ్ళాడు. అక్కడున్న సంఘానికి శుభాకాంక్షలు తెలిపి అక్కడినుండి అంతియొకయకు వెళ్ళాడు. 23 అంతియొకయలో కొద్ది రోజులు గడిపి అక్కడినుండి ప్రయాణమై గలతియ, ఫ్రుగియ ప్రాంతాల్లో పర్యటన చేసి, ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల్లో విశ్వాసం అభివృద్ధి చెందేటట్లు చేసాడు.

ఎఫెసులో అపొల్లో

24 ఇది యిలా ఉండగా అపొల్లో అనే యూదుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపొల్లో స్వగ్రామం అలెక్సంద్రియ. ఇతడు గొప్ప పండితుడు. యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు. 25 ప్రభువు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు. యేసును గురించి సక్రమంగా గొప్ప ఉత్సాహంతో బోధించాడు. కాని బాప్తిస్మము విషయంలో అతనికి యోహాను బోధించిన విషయాలు మాత్రమే తెలుసు. 26 అతడు యూదుల సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల యితని బోధ విని అతణ్ణి తమ యింటికి పిలిచి దైవ మార్గాన్ని గురించి అతనికి యింకా విశదంగా చెప్పారు.

27 అపొల్లో అకయ ప్రాంతానికి వెళ్ళాలనుకొన్నాడు. సోదరులు అతని ఉద్దేశాన్ని బలపరిచారు. అకయ ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు ఉత్తరం వ్రాసి యితనికి స్వాగతం చెప్పమని అడిగారు. అతడు వెళ్ళి, దైవానుగ్రహంవల్ల యేసును విశ్వసించినవాళ్ళకు చాలా సహాయం చేసాడు. 28 ప్రజలందరి ముందు యూదులతో తీవ్రమైన వాద వివాదాలు చేసి, వాళ్ళను ఓడించి శాస్త్రాల ద్వారా యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International