Old/New Testament
మొదటి భాగం
(కీర్తనలు 1–41)
1 ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
అతడు పాపులవలె జీవించనప్పుడు,
దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
2 ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
3 కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
4 అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
5 ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
2 యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
2 యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
3 “దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.
4 కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
“రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.
7 యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
మరియు నీవు నా కుమారుడివి.
8 నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
9 ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”
10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన
3 యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు
అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
2 చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.
3 అయితే, యెహోవా, నీవు నాకు కేడెము.
నీవే నా అతిశయం.
యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా[b] చేస్తావు.
4 యెహోవాకు నేను ప్రార్థిస్తాను.
ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!
5 నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును.
ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును.
కాని ఆ శత్రువులకు నేను భయపడను.
7 యెహోవా, లెమ్ము[c]
నా దేవా, వచ్చి నన్ను రక్షించుము!
నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి,
వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.
8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు.
యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.
థెస్సలొనీకలో
17 వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. 2 అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. 3 క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. 4 తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.
5 ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేనివాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు. 6 వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు. 7 వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.
8 ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు. 9 ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు.
బెరయలో
10 అర్థరాత్రి కాగానే సోదరులు పౌలును, సీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చినవాళ్ళు యూదుల సమాజమందిరానికి వెళ్ళారు. 11 థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయవాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవసందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథం చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. 12 చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.
13 పౌలు దైవసందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు. 14 వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు. 15 పౌలుతో వెళ్ళినవాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.
© 1997 Bible League International