Old/New Testament
41 “యోబూ, నీవు మొసలిని గాలముతో పట్టుకొనగలవా?
దాని నాలుకను తాడుతో కట్టివేయగలవా?
2 యోబూ, మొసలి ముక్కులోనుంచి తాడును నీవు వేయగలవా?
లేక దాని దవడకు గాలపు ముల్లు ఎక్కించగలవా?
3 యోబూ, తన్ను స్వేచ్చగా పోనిమ్మని మొసలి నిన్ను బ్రతిమలాడుతుందా?
అది మర్యాద మాటలతో నీతో మాట్లాడుతుందా?
4 యోబూ, మొసలి నీతో ఒడంబడిక చేసుకుంటుందా?
శాశ్వతంగా నిన్ను సేవిస్తానని వాగ్దానం చేస్తుందా?
5 యోబూ, నీవు ఒక పిట్టతో ఆడుకొనగలవా? మొసలితో ఆడుకొనగలవా?
నీ దాసీలు దానితో ఆడుకొనేందుకు దానికి ఒక తాడు కట్టగలవా?
6 యోబూ, జాలరులు నీవద్ద మొసలిని కొనుటకు ప్రయత్నిస్తారా?
వారు దానిని వ్యాపారులకు అమ్మేందుకు దానిని ముక్కలుగా కోయగలరా?
7 యోబూ, మొసలి చర్మం మీదికి, దాని తలమీదికి శూలాలు నీవు విసరగలవా?
లేక చేపలను వేటాడే అలుగులు అనేకం కొట్టగలవా?
8 “యోబూ, ఒక వేళ నీవు నీ చేతిని మొసలి మీద ఉంచితే దానితో నీ గట్టి పోరాటాన్ని నీవు ఎప్పటికీ మరచిపోలేవు.
మరియు నీవు దానితో మరల ఎన్నటికీ పోరాడవు.
9 ఒక వేళ నీవు మొసలిని ఓడించగలనని అనుకుంటే అది మరచిపో!
అలాంటి ఆశ ఏమీ లేదు!
దాన్ని చూస్తేనే నీకు భయం పుడుతుంది.
10 మొసలికి కోపం పుట్టించగలిగినంత
ధైర్యంగల మనిషి ఎవరూ లేరు.
“కనుక అలాంటప్పుడు యోబూ, నాకు విరోధంగా నిలువగలవాడు ఎవడు?
11 నేను (దేవుణ్ణి) ఎవరికీ ఏమీ బాకీ లేను.
ఆకాశమంతటి క్రింద ఉన్న సర్వము నాదే.
12 “యోబూ, మొసలి కాళ్లను గూర్చి, దాని బలం,
దాని అందమైన ఆకారం గూర్చి నేను నీతో చెబుతాను.
13 మొసలి చర్మాన్ని ఎవరూ ఊడదీయలేరు.
ఒక కళ్లెం పట్టుకొని ఎవ్వరూ దాని సమీపంగా రాజాలరు.
14 మొసలి దవడలు తెరిపించడానికి ఎవరూ దానిని బలవంతం చేయలేరు.
దాని దవడల్లోని పళ్లు మనుష్యులను భయపెడతాయి.
15 మొసలి వీపు మీది గట్టి పొలుసుల వరుసలు
దగ్గర దగ్గరగా కుదించబడ్డాయి.
16 గాలి జొరబడలేనంత దగ్గర దగ్గరగా
ఆ పొలుసులు ఉంటాయి.
17 ఆ పొలుసులు ఒక దానితో ఒకటి జత చేయబడ్డాయి.
వాటిని ఊడబెరుకుటకు వీలులేనంత గట్టిగా ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉంటాయి.
18 మొసలి తుమ్మినప్పుడు అది వెలుగు ప్రకాశించినట్టుగా ఉంటుంది.
దాని కళ్లు ఉదయపు వెలుగులా ఉంటాయి.
19 దాని నోటి నుండి మండుతున్న జ్వాలలు బయటకు వస్తాయి.
నిప్పు కణాలు బయటకు లేస్తాయి.
20 ఉడుకుతూ ఉన్న కుండ కింద కాలుతున్న
పిచ్చి మొక్కలనుండి పొగవచ్చినట్టుగా మొసలి ముక్కునుండి పొగ వస్తుంది.
21 మొసలి శ్వాస బొగ్గులను మండిస్తుంది.
దాని నోటినుండి అగ్ని జ్వాలలు వస్తాయి.
22 మొసలి మెడ చాలా బలంగా ఉంటుంది.
మనుష్యులు దానిని చూచి భయపడి దాని నుండి పారిపోతారు.
23 మొసలి శరీరంలో బలహీనత ఏమీ లేదు.
అది ఇనుములా గట్టిగా ఉంటుంది.
24 మొసలి గుండె బండలా ఉంటుంది.
దానికి భయం ఏమీ లేదు. అది తిరుగలి క్రింది రాయిలా గట్టిగా ఉంటుంది.
25 మొసలి మేల్కొన్నప్పుడు బలమైన మనుష్యులు భయపడతారు.
మొసలి తోక ఆడించినప్పుడు వారు పారిపోతారు.
26 ఖడ్గం, బల్లెం, బాణం మొసలిని కొడితే అవి తిరిగి వస్తాయి.
ఆ ఆయుధాలు దానికే మాత్రం హాని చేయవు.
27 మొసలికి ఇనుమును గడ్డి పరకలా విరుగ గొట్టడం తేలిక.
ఇత్తడిని పుచ్చిపోయిన చెక్కలా విరుగ గొట్టటం తేలిక.
28 బాణాలు మొసలిని పారిపోయేటట్టు చేయలేవు.
దానిమీద విసిరిన బండలు ఎండి గడ్డిపోచల్లా ఉంటాయి.
29 దుడ్డు కర్రతో మొసలిని కొట్టినప్పుడు అది దానికి ఒక గడ్డి పరకలా అనిపిస్తుంది.
మనుష్యులు దాని మీద ఈటెలు విసిరినప్పుడు అది నవ్వుతుంది.
30 మొసలి శరీరం క్రింద ఉన్న చర్మం పగిలి పోయిన చాలా వాడి చిల్లపెంకుల్లా ఉంటుంది.
అది నడిచినప్పుడు మట్టిలో నురిపిడి కొయ్యలా గుంటలు చేస్తుంది.
31 కాగుతున్న కుండలోని నీళ్లను అది బుడగలు పొంగిస్తుంది.
నూనె మసులుతున్న కుండలా అది నీటిని పొంగిస్తుంది.
32 మొసలి ఈదినప్పుడు దాని వెనుక ఒక దారి ఏర్పడుతుంది.
అది నీళ్లను పొంగింప జేసినప్పుడు దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది.
33 భూమి మీద ఏ జంతువూ మొసలిలాంటిది లేదు.
అది భయం లేని జంతువుగా చేయబడింది.
34 మహా గర్విష్ఠి జంతువులను మొసలి చిన్న చూపు చూస్తుంది.
క్రూర జంతువులన్నిటికీ అది రాజు.”
యెహోవాకు యోబు జవాబు
42 అప్పుడు యెహోవాకు యోబు ఇలా జవాబు చెప్పాడు.
2 “యెహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు.
నీవు పథకాలు వేస్తావు, నీ పథకాల్లో ఏదీ మార్చబడజాలదు, నిలిపివేయబడదు.
3 ‘నా సలహాను గూర్చి ఈ వెర్రి ప్రశ్నలు అడుగుతున్న ఇతడు ఎవరు?’ అని యెహోవా, నీవు ప్రశ్నించావు.
నేను (యోబును) నాకు అర్థం కాని విషయాలు యెహోవాని అడిగాను.
నేను తెలిసికోలేనంత మరీ విపరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను గూర్చి నేను మాట్లాడాను.
4 “యెహోవా, ‘నీవు నాతో యోబూ, నేను నీతో మాట్లాడుతాను.
నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి’ అన్నావు.
5 యెహోవా, ఇదివరకు నిన్ను గూర్చి నేను విన్నాను.
కానీ ఇప్పుడు నా స్వంత కళ్లతో నేను నిన్ను చూశాను.
6 కనుక ఇప్పుడు, నన్ను గూర్చి
నేను సిగ్గుపడుతున్నాను.
యెహోవా, నేను విచారిస్తున్నాను.
నేను ఈ ధూళిలో, బూడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం, నా హృదయం మార్చుకొంటానని వాగ్దానం చేస్తున్నాను.”
యోబుకు తన ఐశ్వర్యాలను యెహోవా తిరిగి యివ్వటం
7 యెహోవా యోబుతో మాట్లాడటం చాలించిన తర్వాత, ఆయన ఎలీఫజుతో మాట్లాడినాడు. ఎలీఫజు తేమాను పట్టణస్థుడు. ఎలీఫజుతో యెహోవా ఇలా చెప్పాడు: “నీ మీద, నీ యిద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను గూర్చి సరిగా చెప్పలేదు. కానీ యోబు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పాడు. యోబు నా సేవకుడు. 8 కనుక ఎలీఫజూ ఇప్పుడు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను నీవే తీసుకో. వాటిని నా సేవకుడు యోబు దగ్గరకు తీసుకొని వెళ్లి, మీ నిమిత్తం దహనబలిగా వాటిని అర్పించండి. నా సేవకుడు యోబు మీ కోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నేను అతని ప్రార్థనకు తప్పక జవాబు ఇస్తాను. అప్పుడు మీరు శిక్షించబడాల్సిన విధంగా నేను మిమ్మల్ని శిక్షించను. మీరు చాలా అవివేకంగా ఉన్నారు గనుక మీరు శిక్షించబడాలి. మీరు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పలేదు. కానీ నా సేవకుడు యోబు, నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పాడు.”
9 కనుక తేమానువాడగు ఎలీఫజు, షూహి దేశస్థుడైన బిల్దదు, నయమాతీ పట్టణస్థుడైన జోఫరు యెహోవాకు విధేయులయ్యారు. అప్పుడు యెహోవా చెప్పినట్లు వాళ్లు చేశారు. అప్పుడు యెహోవా యోబు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు.
10 కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించటం ముగించాడు. అప్పుడు యెహోవా యోబుకు మరల విజయం ఇచ్చాడు. యోబుకు అంతకు ముందు ఉన్నదానికి రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. 11 యోబు సోదరులు, ఆడపడుచులు అందరూ తిరిగి యోబు ఇంటికి వచ్చారు. అంతకు ముందు యోబును ఎరిగిన ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు. వాళ్లంతా యోబుతో కలిసి విందు భోజనం చేశారు. యోబుకు యెహోవా చాలా కష్టం కలిగించాడు గనుక వాళ్లంతా అతనిని ఓదార్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెండి నాణెం, ఒక బంగారు ఉంగరం యోబుకు ఇచ్చారు.
12 యోబు జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగాన్ని యెహోవా అధికంగా ఆశీర్వదించాడు. పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటెలు, రెండు వేల ఆవులు, వెయ్యి ఆడ గాడిదలు యోబుకు స్వంతంగా యిచ్చాడు. 13 యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు మరల కలిగారు. 14 యోబు మొదటి కుమార్తెరైకు యెమీమా అని పేరు పెట్టాడు. యోబు రెండో కుమార్తెకు కెజీయా అని పేరు పెట్టాడు. యోబు మూడో కుమార్తెకు కెరెంహప్పుకు అని పేరు పెట్టాడు. 15 దేశం అంతటిలో యోబు కుమార్తెలు మహాగొప్ప సౌందర్యవతులు. యోబు తన కుమార్తెలకు తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. వారి సోదరులు కూడ తమ తండ్రి ఆస్తిలో వాటా పొందారు.
16 కనుక యోబు మరో నూటనలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన పిల్లలను, మనుమలు, మనుమరాండ్రను, మునిమనుమలు, మనుమరాండ్రను, వారి పిల్లలను చూచేంతవరకు నాలుగు తరాలు జీవించాడు. 17 యోబు చనిపోయినప్పుడు అతడు కడు వృద్ధుడు. యోబు సుదీర్ఘమైన కాలం జీవించాడు.
22 ప్రజల గుంపు పౌలు, సీలల మీద పడింది. అధికారులు వాళ్ళ దుస్తుల్ని చింపి కొట్టమని ఆజ్ఞాపించారు. 23 చావకొట్టి, వాళ్ళను చెరసాలలో పడవేస్తూ, “వీళ్ళను జాగ్రత్తగా కాపలా కాయండి” అని ఆ చెరసాల అధికారితో చెప్పారు. 24 కనుక ఆ చెరసాల అధికారి వాళ్ళ కాళ్ళను బొండ కొయ్యకు గల రంధ్రాల్లో బిగించి లోపలి గదిలో పడవేసాడు.
25 అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బంధీలు వింటున్నారు. 26 అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళకు కట్టిన కట్లు తెగిపొయ్యాయి. 27 చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. 28 కాని పౌలు, “హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే ఉన్నాము” అని బిగ్గరగా అన్నాడు.
29 ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తికొంటూ వెళ్ళి వణకుతూ పౌలు, సీలల కాళ్ళ మీద పడ్డాడు. 30 ఆ తర్వాత వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు.
31 వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది” అని సమాధానం చెప్పారు. 32 ఆ తరువాత వాళ్ళు ప్రభువు సందేశాన్ని అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికీ చెప్పారు. 33 ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ్ళను పిలుచుకు వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని యింట్లోనివాళ్ళు బాప్తిస్మము పొందారు. 34 ఆ తరువాత అతడు వాళ్ళను తన యింటికి పిలుచుకు వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. అతడు, అతని యింట్లోనివాళ్ళు తాము దేవుణ్ణి విశ్వసించటం మొదలు పెట్టినందుకు చాలా ఆనందించారు.
35 తెల్లవారగానే న్యాయాధికారులు తమ భటుల్ని చెరసాల అధికారి దగ్గరకి పంపి వాళ్ళను విడుదల చేయమని ఆజ్ఞాపించారు.
36 “నిన్ను, సీలను విడుదల చేయమని న్యాయాధికారులు సెలవిచ్చారు. మీరిక వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళండి!” అని చెరసాల అధికారి అన్నాడు.
37 కాని పౌలు వాళ్ళతో, “మేము రోమా పౌరులమైనా విచారణ జరుపకుండా ప్రజల ముందు మమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టారు. కారాగారంలో పడవేసారు. కాని యిప్పుడు రహస్యంగా పంపివేయాలని చూస్తున్నారు. వీల్లేదు, స్వయంగా వచ్చి మమ్మల్ని విడుదల చేయమని అధికారులతో చెప్పండి” అని అన్నాడు.
38 భటులు ఈ వార్త అధికారులకు తెలియజేసారు. వాళ్ళు పౌలు, సీల రోమా పౌరులని విని భయపడిపోయారు. 39 అందువల్ల అధికారులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తమ తప్పు క్షమించమని వేడుకొన్నారు. వాళ్ళను ఊరి బయటకు పిలుచుకు వెళ్ళి, దయ ఉంచి తమ ఊరు విడిచి వెళ్ళమని వాళ్ళను కోరారు. 40 పౌలు, సీల కారాగారంనుండి లూదియ యింటికి వెళ్ళారు. అక్కడున్న సోదరులను కలుసుకొని వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు.
© 1997 Bible League International