Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోబు 28-29

28 “మనుష్యులకు వెండి లభించే గనులు ఉన్నాయి.
    మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి.
మనుష్యులు భూమినుండి ఇనుమును తవ్వుతారు.
    బండల నుండి రాగి కరిగించబడుతుంది.
పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు.
    ఆ గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలి చీకటిలో బండల కోసం వారు వెదుకుతారు.
మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు గోతులు తవ్వుతారు.
    మరి ఏ మనిషీ కూడ గోతులను ఎన్నడూ తాకలేదు.
    పనివాడు లోతైన ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు యితరులకు చాలా దూరంలో ఉంటాడు.
భూమిపై నుండి ఆహారం వస్తుంది.
    కానీ భూమి క్రింద, వస్తువులను మంట మార్చివేసినట్టు,
    అది మార్చివేయబడుతుంది.
నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమవుతాయి.
    నేల కింద మట్టిలో బంగారం ఉంది.
ఆహారం కోసం జంతువులను తినే పక్షులకు భూమికింద మార్గాలు తెలియవు.
    డేగ కూడా ఈ మార్గం చూడదు.
క్రూర మృగాలు ఈ మార్గంలో నడవలేదు.
    సింహాలు ఈ మార్గంలో పయనించలేదు.
పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు.
    ఆ పనివాళ్లు పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు.
10 పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు.
    బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు.
11 నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన కట్టలు కడతారు.
    దాగి ఉన్న వాటిని వారు వెలుగు లోనికి తీసికొని వస్తారు.

12 “అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?
    గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
13 జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు.
    భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు.
14 ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది.
    ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.
15 అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము.
    జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు.
16 ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని,
    నీలంతో గాని, అది కొనబడేది కాదు.
17 బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది.
    బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు.
18 జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది.
    జ్ఞానం కెంపులకంటె ఖరీదైనది.
19 ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు.
    మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు.

20 “అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి?
    అవగాహన చేసికోవటం నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
21 భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది.
    ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు.
22 ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’
    అని మరణం, నాశనం చెబుతాయి.

23 “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు.
    జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.
24 భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు.
    ఆకాశాల క్రింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు.
25 గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు,
    మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు,
26 వర్షాన్ని ఎక్కడ కురిపించాలి,
    ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు
27 అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు
    దానిని పరీక్షించిన సమయం అవుతుంది.
    జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు.
28 ‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది.
    చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’”
అని దేవుడు ప్రజలతో చెప్పాడు.

యోబు తన మాటలు కొనసాగించటం

29 యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:

“దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసుకొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే
    నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
    (నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).
నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను.
    అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా
    నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.
అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట.
    నా మార్గం అంతా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.

“నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి
    ఆరుబయట కూర్చున్న రోజులు అవి.
అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు.
    పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.
ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి
    నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
10 చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు.
    అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.
11 నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు.
    నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.
12 ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను.
    తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకొనేవారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.
13 మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు.
    అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.
14 సక్రమంగా జీవించటం నాకు వస్త్రం.
    న్యాయం నాకు అంగీలా, తలపాగాలా ఉండేది.
15 గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను.
    కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.
16 పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను.
    కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.
17 దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను.
    దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.

18 “నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బ్రతుకుతాను.
    తర్వాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.
19 వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు
    మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.
20 నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది.
    నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.

21 “నేను మాట్లాడటం చాలించిన తరువాత నా మాటలు వింటున్న ప్రజలు చెప్పాల్సింది ఇంకేమీ ఉండేది కాదు.
    నా మాటలు వారి చెవులకు సౌమ్యంగా వినిపించేవి.
22 ప్రజలు వర్షంకోసం వేచి ఉన్నట్టు,
    నేను మాట్లాడాలని వారు వేచి ఉండేవారు.
23 నా మాట వసంతకాలపు వర్షంలా ఉండేది. నా మాటల్ని వారు పానం చేసేవారు.
    అధైర్యపడినవారిని చూచి నేను చిరునవ్వు నవ్వేవాడిని.
24 నా ప్రసన్న ముఖం క్రుంగిన ప్రజలకు మంచి అనుభూతిని కలిగించేది.
25 ప్రజల పట్ల బాధ్యత వహించి నేను నిర్ణయాలు చేసాను. నేను నాయకుణ్ణి అయ్యాను.
    తన సైన్య దళాలలో ఒక రాజులా నేను జీవించాను. చాలా విచారంలో ఉన్న ప్రజలకు ఆదరణ ఇచ్చే మనిషిలా నేను ఉన్నాను.

అపొస్తలుల కార్యములు 13:1-25

బర్నబాను, సౌలును ఎన్నుకొని పంపటం

13 అంతియొకయలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు, పండితులు ఎవరనగా: బర్నబా, “నీగెరు” అని పిలువబడే “సుమెయోను”, కురేనీ గ్రామానికి చెందిన లూకియ, మనయేను, (ఇతడు, సామంత రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు సౌలు. వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం వేరుచేయండి. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను” అని అన్నాడు.

అక్కడున్నవాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి పంపారు.

సైప్రసులో

పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు “సెలూకయ” అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడినుండి సలామి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవసందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా యోహాను వాళ్ళ వెంటే ఉన్నాడు.

వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాఫు” అనే పట్టణం చేరుకున్నారు. మాయాజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు “బర్‌ యేసు,” అతడు “సెర్గి పౌలు” అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గి పౌలు తెలివిగలవాడు. దైవసందేశాన్ని వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు. ఎలుమ రాష్ట్రపాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. “ఎలుమ” అనగా గ్రీకు భాషలో మాయాజాలకుడు. అప్పుడు సౌలు (ఇతణ్ణి పౌలు అని కూడా పిలిచే వారు) పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ, 10 “నీవు సాతానుకు పుట్టావు! మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల మోసాలు, కుట్రలు ఉన్నాయి! ప్రభువు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకొంటావు? 11 ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! గ్రుడ్డివాడివై పోతావు!” అని అన్నాడు.

తక్షణమే పొగమంచు, చీకట్లు అతణ్ణి చుట్టివేసాయి. తన చేయి పట్టుకొని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూసాడు. 12 ఆ రాష్ట్రపాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు.

పిసిదియ అంతియొకయలో

13 “పాఫు” నుండి పౌలు, అతని స్నేహితులు పంఫూలియాలోని “పెర్గే” అనే పట్టణానికి ఓడలో ప్రయాణం చేసి వెళ్ళారు. యోహాను వాళ్ళను అక్కడ వదిలి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. 14 వాళ్ళు పెర్గేనుండి పిసిదియ ప్రక్కన ఉన్న అంతియొకయ అనే పట్టణాన్ని చేరుకున్నారు.

ఒక విశ్రాంతి రోజు యూదుల సమాజ మందిరములోకి వెళ్ళి కూర్చున్నారు. 15 ధర్మశాస్త్రంలోని విషయాలు, ప్రవక్తల గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజమందిరం యొక్క అధికారులు, “సోదరులారా! ప్రజలను ఉత్సాహపరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మాట్లాడండి” అని అడగనంపారు.

16 పౌలు లేచి నిలుచొని చేతులెత్తి, ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజలారా! యూదులవలె దైవభీతిగల ప్రజలారా! నా మాటలు వినండి. 17 ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వులను ఎన్నుకొని వాళ్ళు ఈజిప్టులో పరదేశీయులుగా ఉన్నప్పుడు వాళ్ళను గొప్పవాళ్ళుగా చేసాడు. తన అద్భుతమైన శక్తితో ఆ దేశంనుండి వాళ్ళను పిలుచుకెళ్ళి, 18 ఎడారుల్లో వాళ్ళ ప్రవర్తనను నలభై సంవత్సరాలు సహిస్తూ వాళ్ళను కాపాడాడు. 19 కనాను దేశంలో ఏడు జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని ఆ ప్రాంతానికి వారసులుగా చేసాడు. 20 ఇవి చేయటానికి సుమారు నాలుగు వందల ఏబది సంవత్సరాలు పట్టింది.

“ఆ తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్త కాలందాకా, నాయకత్వం వహించగల న్యాయాధిపతుల్ని పంపాడు. 21 తమకు ‘రాజు’ కావాలని కోరగా కీషు కుమారుడైన ‘సౌలును’ వాళ్ళకు రాజుగా పంపాడు. ఇతడు బెన్యామీను వంశానికి చెందినవాడు. సౌలు నలభై సంవత్సరాలు పాలించాడు. 22 సౌలును తీసివేసాక దావీదును వాళ్ళ రాజుగా చేసాడు. దావీదు విషయంలో తన అంగీకారం చూపుతూ దేవుడు యిలా అన్నాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదు నా మనస్సుకు నచ్చాడు. అతడు నేను చెప్పినట్లు చేస్తాడు.’

23 “దేవుడు తన వాగ్దానానుసారం ఇశ్రాయేలు ప్రజల కోసం రక్షకుడైనటువంటి యేసును ఇతని వంశంలో జన్మింపచేసాడు. 24 యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. 25 తన కర్తవ్యం ముగిసే చివరి దశలో అతడు ఇలా అన్నాడు: ‘నేనెవర్ననుకొన్నారు? నేను మీరనుకొంటున్న వాణ్ణి కాదు! కాని నా తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్హత కూడా నాకు లేదు.’

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International