Old/New Testament
యోబుకు బిల్దదు జవాబు
25 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “దేవుడే పాలకుడు.
ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి.
దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.
3 దేవుని దూతలను ఏ మనిషీ లెక్కించలేడు.
దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు.
4 కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు.
స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు.
5 దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు.
దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు.
6 మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు.
పనికి మాలిన పురుగులాంటివాడు!”
బిల్దదుకు యోబు జవాబు
26 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “బిల్దదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీనులైన మనుష్యులకు నిజంగా సహాయం చేయగలరు.
అవును, మీరు నన్ను ప్రోత్సహించారు. బలహీనమైన నా చేతులను మీరు తిరిగి బలం గలవిగా చేసారు.
3 అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు.
మీరు చాలా జ్ఞానం ప్రదర్శించారు.
4 ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం చేశారు.
ఎవరి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది?
5 “మరణించిన వారి ఆత్మలు
భూమి కింద నీళ్లలో విలవిల్లాడుతున్నాయి.
6 మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం.
దేవునికి మరణం మరుగు కాదు.
7 ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు.
దేవుడు భూమిని శూన్యంలో వేలాడతీశాడు.
8 మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు.
కానీ నీటి భారం మూలంగా మేఘాలు బద్దలు కాకుండా దేవుడు చూస్తాడు.
9 పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు.
దేవుడు తన మేఘాలను చంద్రుని మీద విస్తరింపచేసి, దానిని కప్పుతాడు
10 మహా సముద్రం మీది ఆకాశపు అంచులను
చీకటి వెలుగులకు మధ్య సరిహద్దుగా దేవుడు చేస్తాడు.
11 ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను
దేవుడు బెదిరించగా అవి భయంతో వణకుతాయి.
12 దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది.
దేవుని జ్ఞానము రాహాబు సహాయకులను నాశనం చేసింది.
13 దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది.
తప్పించుకోవాలని ప్రయత్నించిన సర్పాన్ని దేవుని హస్తం నాశనం చేస్తుంది.
14 దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే.
దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తిగలవాడో ఏ మనిషి నిజంగా అర్థం చేసుకోలేడు.”
27 అప్పుడు యోబు మాట్లాడటం కొనసాగించాడు:
2 “నిజంగా దేవుడు జీవిస్తున్నాడు.
మరియు దేవుడు జీవించటం ఎంత సత్యమో ఆయన నాకు అన్యాయం చేశాడు, అనటం కూడ అంతే సత్యం.
అవును, సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితాన్ని బాధించాడు.
3 కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవవాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు,
4 నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు.
మరియు నా నాలుక ఎన్నడూ ఒక్క అబద్దం చెప్పదు.
5 మీదే సరి అని నేను ఎన్నటికీ అంగీకరించను.
నేను నిర్దోషిని అని నేను చచ్చే రోజువరకు చెబుతూనే ఉంటాను.
6 నేను చేసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టుకొని ఉంటాను.
సరియైన వాటిని చేయటం నేను ఎన్నటికీ మాని వేయను. నేను బతికి ఉన్నంత కాలం నా మనస్సాక్షి నన్ను బాధించదు.
7 ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు.
నా శత్రువులు దుర్మార్గులు శిక్షించబడినట్లు శిక్షించబడుదురు గాక.
8 దేవుని లక్ష్యపెట్టని మనిషి చనిపోయినప్పుడు అతనికి ఆశ ఏమీ ఉండదు.
అతని జీవాన్ని దేవుడు తీసివేసినప్పుడు అతనికి ఆశ లేదు.
9 ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి,
దేవునికి మొరపెడితే దేవుడు వినడు.
10 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఆ వ్యక్తి కోరుకొని ఉండాల్సింది.
ఆ వ్యక్తి సదా దేవుని ప్రార్థించి ఉండాల్సింది.
11 “దేవుని శక్తిని గూర్చి నీకు నేను నేర్పిస్తాను.
సర్వశక్తిమంతుడైన దేవుని పథకాలను నేను దాచి పెట్టను.
12 దేవుని శక్తిని మీరు మీ కళ్లారా చూశారు.
కనుక మీరు అలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు చెబుతారు?
13 దుర్మార్గులకు దేవుడు తలపెట్టినది ఇదే.
సర్వశక్తిమంతుడైన దేవుని నుండి క్రూర మానవులకు లభించేది ఇదే.
14 ఒకవేళ దుర్మార్గునికి చాలామంది పిల్లలు ఉండవచ్చునేమో కాని వాని పిల్లలు యుద్ధంలో చంపి వేయబడతారు.
దుర్మార్గుని పిల్లలు తినేందుకు సరిపడినంత ఆహారం ఎన్నడూ ఉండదు.
15 దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు ఇంకా బ్రతికి ఉంటే భయంకర రోగం వారిని చంపేస్తుంది.
అతని కుమారుల విధవలు వారి కోసం విచారించరు.
16 ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమైన వెండిని రాశిగా పోయవచ్చు.
ఒకవేళ మట్టి పోగుల్లా అతనికి చాలా బట్టలు ఉండవచ్చును.
17 దుర్మార్గుడు సంపాదిస్తూ విడిచిపోయిన బట్టలను ఒక మంచి మనిషి ధరిస్తాడు.
దుర్మార్గుని వెండిని నిర్దోషులు పంచుకొంటారు.
18 దుర్మార్గుడు నిర్మించే యిల్లు ఎక్కువ కాలం నిలువదు.
అది సాలె గూడులా ఉంటుంది లేక కావలివాని గుడారంలా ఉంటుంది.
19 దుర్మార్గుడు ధనికునిగా నిద్రకు ఉపక్రమిస్తాడు.
కానీ ఆ తర్వాత అతను కళ్లు తెరిచినప్పుడు అతని సంపదంతా పోయినట్లు అతనికి తెలుస్తుంది.
20 ఆకస్మిక వరదలా భయాలు అతణ్ణి పట్టుకొంటాయి.
రాత్రి వేళ ఒక తుఫాను అతణ్ణి కొట్టుకొని పోతుంది.
21 తూర్పుగాలి అతణ్ణి కొట్టుకొని పొతుంది. అప్పుడు అతడు అంతమై పోతాడు.
తుఫాను అతణ్ణి అతని యింటినుండి తుడుచుకుని పోతుంది.
22 తుఫాను బలం నుండి దుర్మార్గుడు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు.
కానీ తుఫాను అతణ్ణి నిర్దాక్షిణ్యంగా కొడుతుంది.
23 దుర్మార్గుడు పారిపోతూ ఉండగా మనుష్యులు చప్పట్లు కొడతారు.
దుర్మార్గుడు తన యింటినుండి పారిపోతూంటే, వానికి విరోధంగా వాళ్లు ఈల వేస్తారు.”
హింసలు
12 ఆ రోజుల్లోనే హేరోదు రాజు సంఘానికి చెందిన కొందర్ని హింసించటం మొదలు పెట్టాడు. 2 అతడు యోహాను సోదరుడైన యాకోబును కత్తితో నరికి వేయించాడు. 3 ఈ సంఘటనకు యూదులు ఆనందించారు. ఇది గమనించి అతడు పేతురును కూడా బంధించాలని వెళ్ళాడు. ఈ సంఘటన యూదులు పులియని రొట్టెలు తినే పండుగ రోజుల్లో సంభవించింది. 4 అతణ్ణి బంధించి కారాగారంలో వేసాడు. పూటకు నలుగురి చొప్పున కాపలా కాయుమని చెప్పి పదహారుగురు భటులకు అతణ్ణి అప్పగించాడు. పస్కా పండుగ జరిగాక అతణ్ణి ప్రజల ముందుకు తెచ్చి విచారణ జరిపించాలని అతని ఉద్దేశ్యం. 5 పేతురును అంతవరకు కారాగారంలో ఉంచాడు. పేతురు కోసం సంఘానికి చెందినవాళ్ళు దీక్షతో దేవుణ్ణి ప్రార్థించారు.
ప్రభువు దూత పేతురును విడిపించటం
6 హేరోదు రేపు విచారణ చేస్తాడనగా ఆ నాటి రాత్రి పేతురు యిరువురి సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. సైనికులు అతణ్ణి రెండు యినుప గొలుసులతో కట్టివేసి ఉంచారు. మరి కొందరు సైనికులు కారాగారం ముందు కాపలా కాస్తూ ఉన్నారు. 7 అకస్మాత్తుగా ప్రభువు దూత ప్రత్యక్షం అయ్యాడు. ఆ గది అంతా వెలుగుతో నిండిపోయింది. ప్రభువు దూత పేతురు భుజం తట్టి, “త్వరగా లెమ్ము!” అని అంటూ అతణ్ణి నిద్రలేపాడు. మణికట్లకు కట్టిన సంకెళ్ళు ఊడిపోయాయి. 8 ఆ దూత, “లేచి, నీ దుస్తులు సరిచేసుకొని, చెప్పులు తొడుక్కో!” అని అన్నాడు. పేతురు అలాగే చేసాడు. “నీ దుప్పటి శరీరం మీద కప్పుకొని నా వెంట రా!” అని ఆ దూత అన్నాడు.
9 పేతురు అతణ్ణి అనుసరిస్తూ కారాగారంనుండి వెలుపలికి వచ్చాడు. కాని దేవదూత చేస్తున్నదంతా నిజంగా జరుగుతుందని అతడు అనుకోలేదు. తానొక కలకంటున్నాననుకొన్నాడు. 10 వాళ్ళు మొదటి కాపలావాణ్ణి, రెండవ కాపలావాణ్ణి దాటి పట్టణంలోకి వెళ్ళే యినుప ద్వారం దగ్గరకు వచ్చారు. అది వాళ్ళ కోసం దానంతట అదే తెరుచుకుంది. వాళ్ళు దాన్ని దాటి వెళ్ళారు. కొంత దూరం నడిచాక అకస్మాత్తుగా ఆ ప్రభువు దూత అతణ్ణి వదిలి వెళ్ళిపోయాడు.
11 అప్పటికి పేతురుకు తెలివి వచ్చింది. అతడు, “ప్రభువు తన దూతను పంపి హేరోదు బంధంనుండి మరియు కీడు కలగాలని ఎదురు చూస్తున్న యూదులనుండి, నన్ను రక్షించాడు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు” అని తనలో తాను అనుకొన్నాడు.
12 జరిగిన వాటిని గ్రహించాక యోహాను తల్లియైన మరియ యింటికి వెళ్ళాడు. యోహాన్ని మార్కు అని కూడా పిలిచేవాళ్ళు. అక్కడ చాలా మంది సమావేశమై ప్రార్థిస్తూ ఉన్నారు. 13 పేతురు తలుపు తట్టాడు. “రొదే” అనే పనిపిల్ల తలుపు తీయటానికి వచ్చింది. 14 ఆమె పేతురు స్వరం గుర్తించి చాలా ఆనందించింది. ఆ ఆనందంలో తలుపు కూడా తెరవకుండా లోపలికి పరుగెత్తి, “పేతురు తలుపు ముందున్నాడు” అని కేక వేసింది. 15 వాళ్ళంతా “నీకు మతిపోయింది” అని అన్నారు. కాని ఆమె తాను చెప్పింది నిజమని నొక్కి చెప్పింది. దానికి వాళ్ళు, “అది అతని దూత అయివుంటుంది” అని అన్నారు.
16 పేతురు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి తలుపు తెరిచి చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. 17 పేతురు వాళ్ళందర్ని నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేసాడు. ఆ తదుపరి దేవుడు తనను కారాగారంనుండి ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడో అందరికీ విశదంగా చెప్పాడు. “యాకోబుకు, మిగతా సోదరులకు దీన్ని గురించి చెప్పండి” అని చెప్పి, వాళ్ళను వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపొయ్యాడు.
18 ఉదయం సైనికుల్లో అలజడి చెలరేగింది. “పేతురు ఏమై ఉంటాడు?” అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. 19 హేరోదు పేతుర్ని వెతకటానికి అంతా గాలించమన్నాడు. కాని పేతురు కనిపించలేదు. హేరోదు కాపలావాళ్ళను అడ్డు ప్రశ్నలు వేసి విచారించాడు. ఆ తదుపరి ఆ కాపలావాళ్ళను చంపమని ఆజ్ఞాపించాడు. ఇది జరిగిన తదుపరి హేరోదు యూదయనుండి కైసరియకు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపాడు.
హేరోదు మరణం
20 హేరోదు తూరు, సీదోను ప్రజల పట్ల చాలా కోపంతో ఉన్నాడు. వాళ్ళంతా యిప్పుడు ఒకటై హేరోదుతో మాట్లాడటానికి వెళ్ళారు. రాజు ఆంతరంగిక స్నేహితుడైన బ్లాస్తు రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు అని దానియేలు బదులు చెప్పాడు. ను తమ వైపు త్రిప్పుకొని శాంతి కావాలని అడిగారు. వీళ్ళ రాజ్యం తమ ఆహారధాన్యాల కోసం హేరోదు రాజ్యంపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం.
21 ఒక నియమితమైన రోజు హేరోదు రాజ దుస్తులు ధరించాడు. సింహాసనంపై కూర్చొని ప్రజల్ని సంబోధిస్తూ ఒక ఉపన్యాసం యిచ్చాడు. 22 “ఇది దేవుని కంఠం. మనిషిది కాదు” అని ప్రజలు ఆపకుండా కేకలు వేసారు. 23 దేవునికి చెందవలసిన ఘనత అతడు అంగీకరించినందుకు ప్రభువు దూత అతణ్ణి తక్షణమే రోగంతో పడవేసాడు. పురుగులు పట్టి అతడు చనిపోయాడు.
24 దైవసందేశం విని విశ్వసిస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
25 బర్నబా, సౌలు తమ పని ముగించుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చారు. తమ వెంట మార్కు అని పిలువబడే యోహాన్ను కూడా పిలుచుకు వచ్చారు.
© 1997 Bible League International