Old/New Testament
ఎలీఫజు జవాబు
22 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు యిచ్చాడు:
2 “దేవునికి నరుడు ఉపకారికాగలడా?
జ్ఞానం గల వ్యక్తి తప్పక తనకు తానే ఉపయోగికారిగా వుంటాడు.
3 ఒకవేళ నీవు సక్రమమయినదే చేసినప్పటికీ,
సర్వ శక్తిమంతుడైన దేవునికి అది సంతోషం కలిగించదు. నీవు ఎల్లప్పుడూ మంచివాడివిగానే వున్నా దేవునికి ఏమీ లాభంలేదు.
4 యోబూ, దేవుడు నిన్ను శిక్షించినది
ఆయనను నీవు ఆరాధించినందుకా?
5 కాదు, అది నీవు విస్తారంగా పాపం చేసినందువల్లనే.
యోబూ, నీ పాపాలు ఎప్పటికీ నిలిచిపోవు.
6 యోబూ, నీ సోదరులు నీకు ఋణపడి ఉన్న ధనాన్ని నీకు తిరిగి చెల్లించేందుకు నీవు వారిని బలవంతం చేశావు.
అది కారణం లేకుండా నీవు చేశావు. ప్రజల దగ్గర్నుండి వస్త్రాలు నీవు లాగేసు కొని, వారు ధరించటానికి ఏమీ లేకుండా చేశావు.
7 అలసిపోయిన మనుష్యులకు నీవు నీళ్లు ఇవ్వలేదు.
ఆకలిగొన్న మనుష్యులకు నీవు అన్నం పెట్టలేదు.
8 యోబూ! నీవు అధికారం, ఐశ్వర్యం గలవాడవైనప్పటికీ నీవు ఆ ప్రజలకు సహాయం చేయలేదు.
నీకు చాలా భూమి ఉంది, నీవు చాలా గౌరవం పొందినవాడవు.
9 కాని విధవలకు నీవు ఏమీ ఇవ్వకుండానే వారిని పంపించివేశావు.
యోబూ! అనాధ పిల్లలను నీవు దోచుకొని నీవు వారి యెడల చెడుగా ప్రవర్తించావు.
10 అందుకే నీ చుట్టూరా బోనులు ఉన్నాయి.
మరియు ఆకస్మిక కష్టం నిన్ను భయపెడుతుంది.
11 అందుకే నీవు చూడలేనంత కటిక చీకటిగా ఉంది.
మరియు అందుకే నీళ్ల ప్రవాహం నిన్ను కప్పేస్తుంది.
12 “ఆకాశంలో అతి ఉన్నత స్థానంలో దేవుడు నివసిస్తాడు.
మహా ఎత్తయిన నక్షత్రాలను దేవుడు వంగి కిందికి చూస్తాడు. నక్షత్రాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో నీవు చూడగలవు.
13 కాని యోబూ, నీవు, ‘దేవునికి ఏమీ తెలియదు!
అంధకార మేఘాల్లోంచి దేవుడు మాకు ఎలా తీర్పు తీరుస్తాడు?
14 ఆయన ఆకాశపు అత్యున్నత స్థానంలో నడిచేటప్పుడు
మనం చూడకుండా మేఘాలు ఆయనను కప్పివేస్తాయి.’ అని అంటావు.
15 “యోబూ! దుర్మార్గులు తిరిగే పాత మార్గంలోనే
నీవు నడుస్తున్నావు.
16 దుర్మార్గులు మరణించాల్సిన సమయం రాకముందే వారు తీసుకోబడ్డారు.
ఒక వరదలో వారు కొట్టుకొని పోయారు.
17 ‘మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టండి.
సర్వశక్తిమంతుడైన దేవుడు మాకు ఏమీ చేయలేదు’
అని దేవునితో చెప్పేవాళ్లు ఆ మనుష్యులే.
18 కానీ ఆ మనుష్యులనే దేవుడు విజయం పొందిన ధనికులుగా చేశాడు.
దుర్మార్గులు తలచే పద్ధతి నేను అంగీకరించలేను.
19 దుర్మార్గులు నాశనం అయినప్పుడు మంచివాళ్లు చూచి సంతోషిస్తారు.
నిర్దోషులు దుర్మార్గులను చూచి నవ్వుతూ.
20 ‘మన శత్రువులు నిజంగా నాశనం చేయబడ్డారు.
వారి ఐశ్వర్యాలను అగ్ని కాల్చేస్తుంది’ అని అంటారు.
21 “యోబూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయనతో శాంతి ఉంటుంది.
ఇలా నీవు చేస్తే, నీవు ధన్యుడవవుతూ, విజయం పొందుతావు.
22 ఈ ఉపదేశము స్వీకరించి
ఆయన మాటలు నీ హృదయంలో భద్రం చేసుకో.
23 యోబూ! సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నీవు తిరిగి వస్తే, నీకు మరల మామూలు స్థితి ఇవ్వబడుతుంది.
నీవు మాత్రం దుర్మార్గాన్ని నీ ఇంటినుండి దూరంగా తొలగించి వేయాలి.
24 నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి,
ఓఫీరునుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి విసిరికొట్టు.
25 సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు బంగారంగాను,
వెండిగాను ఉండనియ్యి.
26 అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. సర్వశక్తిమంతుడైన దేవునిలో ఆనందం కనుగొంటావు.
నీవు నీ ముఖాన్ని దేవుని వైపు ఎత్తగలవు.
27 నీవు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు.
నీవు ఏం చేస్తానని ఆయనకు ప్రమాణం చేస్తావో దానిని నీవు చేస్తావు.
28 నీవు చేసే ప్రతి దానిలో విజయం పొందుతావు.
నీ త్రోవలో వెలుగు ప్రకాశిస్తుంది
29 గర్విష్ఠులను దేవుడు సిగ్గు పరుస్తాడు
కానీ దీనులను దేవుడు రక్షిస్తాడు.
30 నిర్దోషి కాని మనిషిని కూడా దేవుడు రక్షిస్తాడు.
నీ చేతుల పవిత్రత మూలంగా అతడు రక్షించబడతాడు.”
యోబు జవాబు
23 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “ఈవేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను.
దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, కనుక నేను ఆరోపిస్తూనే ఉంటాను.
3 దేవునిని ఎక్కడ వెదకాలో
ఆయన యొద్దకు ఎలా వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ.
4 నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను.
నేను నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదాలతో నిండిపోతుంది.
5 నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను తెలిసికోవాలని కోరుతున్నాను.
అప్పుడు నేను దేవుని జవాబులు గ్రహిస్తాను.
6 దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా?
లేదు, ఆయన నా మాట వింటాడు!
7 అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన గాధను దేవునికి వివరించవచ్చును.
అప్పుడు నా న్యాయమూర్తి నన్ను విముక్తుణ్ణి చేయవచ్చును.
8 “కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు.
ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు.
9 దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన కనబడడు.
దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా ఆయన నాకు కనబడడు.
10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు.
ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్తాడు.
11 నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను.
దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు.
12 దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ చేస్తాను.
నా భోజనం కంటే దేవుని నోటినుండి వచ్చే మాటలు నాకు ఇష్టం.
13 “కానీ దేవుడు ఎన్నటికీ మారడు.
ఏ మనిషి ఆయనకు విరోధంగా నిలబడలేడు.
దేవుడు అనుకొన్నది ఆయన చేస్తాడు.
14 దేవుడు నాకు వ్యతిరేకంగా ఏమి పథకం వేశాడో దాన్ని ఆయన చేస్తాడు.
నా కోసం ఆయనకు ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి.
15 అందుకే నేను దేవుని ఎదుట జీవిస్తూ ఉండగా నేను భయపడతాను.
వీటన్నింటిని గూర్చీ నేను తలచినప్పుడు దేవునికి నేను భయపడతాను.
16 దేవుడు నా హృదయాన్ని బలహీనం చేస్తాడు.
నేనేమో నా ధైర్యం కోల్పోతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను భయపెడతాడు.
17 కానీ చీకటి నన్ను మౌనంగా ఉండేటట్టు చేయదు.
గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేస్తుంది.
24 “సర్వశక్తిమంతుడైన దేవుడు న్యాయవిచారణ కోసం ఒక సమయాన్ని ఎందుకు నిర్ణయించడు?
దేవునికి విధేయులయ్యే మనుష్యులు ఆ న్యాయవిచారణ సమయం కోసం అనవసరంగా ఎందుకు వేచి ఉండాలి?”
2 “మనుష్యులు తమ పొరుగు వారి భూమిని ఆక్రమించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు.
మనుష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయళ్లకు వాటిని తోలుకొని పోతారు.
3 అనాధల గాడిదను వారు దొంగిలిస్తారు.
ఒక విధవ వారి బాకీ తీర్చేంత వరకు ఆమె యొక్క ఆవును వారు తోలుకొని పొతారు.
4 ఇల్లు లేకుండా ఒక చోటు నుండి మరో చోటికి సంచారం చేసేటట్టు ప్రజలను వారు బలవంతం చేస్తారు.
పేద ప్రజలంతా ఈ దుర్మార్గుల బారినుండి దాగుకొనేలా బలవంతం చేయబడతారు.
5 “అరణ్యంలో ఆహారం కోసం వెదకులాడే అడవి గాడిదలా ఉన్నారు ఈ పేద ప్రజలు.
పేద ప్రజలకూ వారి పిల్లలకూ ఎడారి ఆహారమును ఇస్తుంది.
6 పేద ప్రజలు ఇంకెంత వరకు వారి స్వంతం కాని పొలాలలో గడ్డి, గడ్డిపరకలు కూర్చుకోవాలి?
దుర్మార్గుల ద్రాక్షాతోటల నుండి వారు పండ్లు ఏరుకొంటారు.
7 పేద ప్రజలు బట్టలు లేకుండానే రాత్రిపూట వెళ్లబుచ్చాలి.
చలిలో వారు కప్పుకొనేందుకు వారికి ఏమీ లేదు.
8 కొండల్లోని వర్షానికి వారు తడిసిపోయారు.
వాతా వరణంనుండి వారిని వారు కాపాడుకొనేందుకు వారికి ఏమీ లేదు కనుక వారు పెద్ద బండలకు దగ్గరలో ఉండాలి.
9 దుర్మార్గులు తండ్రిలేని బిడ్డను తల్లి దగ్గర నుండి లాగివేసుకొంటారు.
పేద మనిషియొక్క బిడ్డను వారు తీసివేసుకొంటారు. పేద మనిషి బాకీపడి ఉన్న దానిని చెల్లించటం కోసం దుర్మార్గులు ఆ చిన్న బిడ్డను బానిసగా చేస్తారు.
10 పేద ప్రజలకు బట్టలు లేవు, కనుక వారు దిగంబరులుగా పని చేస్తారు.
దుర్మార్గుల కోసం వారు పనలు మోస్తారు. కానీ పేద ప్రజలు ఇంకా ఆకలితోనే ఉంటారు.
11 పేద ప్రజలు ఒలీవ నూనె పిండుతారు.
వారు ద్రాక్షాగానుగను తిప్పుతారు. కానీ వారు ఇంకా దాహంతోనే ఉంటారు.
12 మరణిస్తున్న మనుష్యులు చేస్తున్న విచారకరమైన శబ్దాలు పట్టణంలో వినిపిస్తున్నాయి.
బాధించబడిన మనుష్యులు సహాయం కోసం అరుస్తున్నారు. కానీ దేవుడు వినటం లేదు.
13 “వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు ఉన్నారు.
వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు.
వారు దేవుని మార్గంలో నడవరు.
14 నరహంతకుడు ఉదయాన్నే లేచి పేద ప్రజలను, అక్కరలో ఉన్న ప్రజలను చంపుతాడు.
రాత్రివేళ అతడు దొంగగా మారిపోతాడు.
15 వ్యభిచారం చేసేవాడు రాత్రి కోసం వేచి ఉంటాడు.
‘నన్ను ఎవ్వరూ చూడడం లేదు’ అని అతడు అనుకొంటాడు. కనుక అతడు తన ముఖం కప్పు కొంటాడు.
16 రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో చొరబడతారు.
కానీ పగటివేళ వారు వారి స్వంత ఇళ్లలో దాగుకొంటారు. వెలుగును వారు తప్పించుకొంటారు.
17 ఆ దుర్మార్గులకు చీకటి ఉదయంలా ఉంటుంది.
చీకటి దారుణాలకు వారు స్నేహితులు.
18 “కాని వరద నీటిపైనున్న నురగవలె దుర్మార్గులు తీసుకొనిపోబడతారు.
వారి స్వంత భూమి శపించబడింది. కనుక ద్రాక్షా తోటలలో ద్రాక్షాపండ్లు కోసే పనికి వారు వెళ్లరు.
19 వేడిగా, పొడిగా ఉండే గాలి శీతాకాలపు మంచు నీళ్లను తొలగించి వేస్తుంది.
అదే విధంగా దుర్మార్గులు కూడా తీసుకొనిపోబడతారు.
20 దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి సహితం వానిని మరిచిపోతుంది.
దుర్మార్గుని శరీరాన్ని పురుగులు తినివేస్తాయి.
అతడు ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోబడడు.
దుర్మార్గులు పడిపోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు.
21 దుర్మార్గులు గొడ్రాలికి అక్రమాలు చేస్తారు. పిల్లలు లేని స్త్రీని వారు బాధిస్తారు.
వారు విధవరాలికి దయ చూపెట్టరు.
22 కానీ బలంగల మనుష్యులను నాశనం చేసేందుకు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు.
బలంగల మనుష్యులు శక్తిమంతులవుతారు. కాని వారి స్వంత జీవితాలను గూర్చిన నమ్మకం వారికి లేదు.
23 ఒకవేళ దేవుడు శక్తిగల మనుష్యులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో
కాని దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు.
24 కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధిస్తారు. ఆ తరువాత వారు అంతమై పోతారు.
మనుష్యులందరిలాగే వారూ ఒక చోట చేర్చబడతారు. తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్లా మరణిస్తారు.
25 “ఈ విషయాలు సత్యం కాకపోతే,
నేను అబద్ధం చెప్పానని ఎవరు రుజువు చేయగలరు?
నా మాటలు వట్టివి అని ఎవరు చెప్పగలరు?”
పేతురు తన అనుభవాల్ని చెప్పటం
11 అపొస్తలులు, యూదయ దేశంలో ఉన్న సోదరులు, యూదులు కానివాళ్ళకు కూడా దైవసందేశం లభించిందని విన్నారు. 2 పేతురు యెరూషలేము వచ్చాడు. సున్నతి చేసుకోవాలి అని వాదించే వాళ్ళ గుంపు అతణ్ణి విమర్శిస్తూ, 3 “నీవు సున్నతి చేసుకోనివాళ్ళ యిళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి తిన్నావు!” అని అన్నారు.
4 పేతురు వాళ్ళకు జరిగింది జరిగినట్లు ఈ విధంగా విడమర్చి చెప్పటం మొదలు పెట్టాడు: 5 “నేను యొప్పే పట్టణంలో ప్రార్థిస్తుండగా నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక దివ్యమైన సంగతి చూసాను. ఆ దివ్య దర్శనంలో ఒక పెద్ద దుప్పటి లాంటిది ఆకాశంనుండి ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు చూసాను. అది నేనున్న స్థలంలో దిగింది. 6 నేను అందులో ఏముందోనని జాగ్రత్తగా చూసాను. భూమ్మీద నివసించే నాలుగు కాళ్ళ జంతువులు, క్రూర మృగాలు, ప్రాకే ప్రాణులు, గాల్లో ఎగిరే పక్షులు కనిపించాయి. 7 అంతలో నాకొక స్వరం వినిపించి నాతో, ‘పేతురూ! లే! వీటిలో ఏ జంతువునైనా చంపి దానిని తిను!’ అని అంది.
8 “‘నేనాపని చేయలేను ప్రభూ! తినకూడదన్నదాన్ని నా నాలుక ఎన్నడూ రుచి చూడలేదు’ అని నేను సమాధానం చెప్పాను.
9 “ఆకాశంనుండి ఆ స్వరం రెండవసారి యిలా అంది: ‘దేవుడు తినవచ్చని అన్నవాటిని తినకూడదని అనకు.’
10 “ఇలా మూడుసార్లు జరిగాక అది ఆకాశానికి తీసుకు వెళ్ళబడింది. 11 అదే క్షణంలో నన్ను పిలుచుకు వెళ్ళడానికి కైసరియనుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులు నేనున్న యింటి ముందు ఆగారు. 12 వాళ్ళతో వెళ్ళటానికి నేను ఏ మాత్రం వెనకాడరాదని దేవుని ఆత్మ నాతో చెప్పాడు. అక్కడున్న ఆరుగురు సోదరులు కూడా నాతో వచ్చారు. మేమంతా కలిసి కొర్నేలీ యింటికి వెళ్ళాం. 13 అతడు తన యింట్లో ఒక దేవదూత ప్రత్యక్షమైన విషయము, అతణ్ణి తాను చూసిన విషయము, దేవదూత, ‘పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు, 14 అతడు మాట్లాడే విషయాలు నిన్ను, నీ యింట్లోని వాళ్ళనందరిని రక్షిస్తాయి’ అని తనతో చెప్పిన విషయము మాకు చెప్పాడు.
15 “నేను మాట్లాడటం మొదలెడుతుండగా, మొట్టమొదట మన మీదికి వచ్చినట్లే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు కూడా వచ్చాడు. 16 ‘యోహాను నీళ్ళతో బాప్తిస్మము యిచ్చాడు కాని నీవు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతావు!’ అని అన్న యేసు ప్రభువు మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. 17 మనం యేసు క్రీస్తు ప్రభువును నమ్మినందుకు మనకిచ్చిన వరమునే దేవుడు వాళ్ళకు కూడా యిచ్చాడు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎదిరించటానికి నేనెవర్ని?”
18 వాళ్ళీ మాటలు విన్నాక వేరే ఆక్షేపణలు చేయలేదు. దేవుడు యూదులు కానివాళ్ళకు కూడా మారుమనస్సు కలిగి రక్షణ పొందే అవకాశ మిచ్చాడంటూ వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
అంతియొకయ ప్రజలకు శుభవార్త తెలియటం
19 స్తెఫను చనిపోయిన తర్వాత జరిగిన హింసలకు భక్తులు చెదిరిపోయారు. వీళ్ళలో కొందరు ఫొనీషియ, సైప్రసు, అంతియొకయ పట్టణాలకు వెళ్ళి దైవసందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు. 20 సైప్రసు, కురేనీ పట్టణాలకు చెందిన వీళ్ళలో కొందరు అంతియొకయకు వెళ్ళి, గ్రీకువారితో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. 21 ప్రభువు అభయ హస్తం వాళ్ళ వెంట ఉంది. కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసులయ్యారు.
22 యెరూషలేములో వున్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది. 23 అతడు అంతియొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండమని అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు. 24 బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులయ్యారు.
25 ఆ తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూసాడు. అతణ్ణి కలుసుకొని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు. 26 సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు బోధించేవాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా “క్రైస్తవులు” అని పిలువబడ్డారు.
27 ఆ రోజుల్లో కొంత మంది ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చారు. 28 వాళ్ళలో ఒకతని పేరు అగబు. అతడు లేచి నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో, “తీవ్రమైన కరువు త్వరలో ప్రపంచమంతా రాబోతోంది” అని సూచించాడు. ఈ కరువు క్లౌదియ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో సంభవించింది. 29 ఇది విని అంతియొకయలో ఉన్న శిష్యులు యూదయలో నివసిస్తున్న తమ సోదరుల కోసం తమకు చేతనయిన సహాయం వాళ్ళు చెయ్యాలని నిర్ణయించుకొన్నారు. 30 అనుకొన్న విధంగా బర్నబా, సౌలు ద్వారా తాము పంపదలచిన వాటిని యూదయలోని పెద్దలకు పంపారు.
© 1997 Bible League International