Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోబు 8-10

బిల్దదు యోబుతో మాట్లాడటం

అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు:

“ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు?
    నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి.
దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు.
    సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు.
నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు.
    వారు వారి పాపాలకు వెల చెల్లించారు.
అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు.
    ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు.
నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు.
    మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు.
నీకు మొదట ఉన్నదానికంటె
    ఎక్కువగా వస్తుంది.

“యోబూ, వృద్ధులను అడిగి వారు తమ పూర్వీకుల నుండి
    ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో.
ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక.
    మనకు ఏమీ తెలియదు.
    భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి.
10 చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు.
    వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.

11 “బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా?
    నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా?
12 లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి.
    వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి.
13 దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు.
    దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు.
14 ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది.
    ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది.
15 ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా
    ఆ గూడు తెగిపోతుంది.
అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు
    కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు.
16 సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు.
    ఆ మొక్క కొమ్మలు తోట అంతటా వ్యాపిస్తాయి.
17 అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి
    ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది.
18 కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడినప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు.
    ‘నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడలేదు’ అని ఆ తోట అంటుంది.
19 కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే.
    తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి.
20 నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు.
    చెడ్డ మనుష్యులకు ఆయన సహాయం చేయడు.
21 అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను,
    నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు.
22 కానీ నీ శత్రువులను దేవుడు సిగ్గుపరుస్తాడు.
    దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.”

బిల్దదుకు యోబు జవాబు

అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:

“అవును, నీవు చెప్పేది సత్యమే అని నాకు తెలుసు.
    అయితే మానవుడు దేవుని దృష్టిలో ఎలా నిర్దోషిగా ఉండగలడు?
ఒక మనిషి దేవునితో వాదించలేడు. దేవుడు వెయ్యి ప్రశ్నలు అడుగవచ్చు.
    కానీ ఒక్కదానికి కూడా ఏ మనిషీ జవాబు యివ్వలేడు.
దేవుని జ్ఞానం లోతైనది, ఆయన శక్తి గొప్పది.
    దేవునితో పోరాడిన ఏ మనిషీ బాధపడకుండా తప్పించుకోలేడు.
దేవుడు పర్వతాలను కదిలిస్తాడు. కాని వాటికి తెలియదు.
ఆయనకు కోపం వచ్చినప్పుడు పర్వతాలను తలక్రిందులు చేస్తాడు.
భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపాలను పంపిస్తాడు.
    భూమి పునాదులను దేవుడు కంపింపజేస్తాడు.
దేవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయించకుండా చేయగలడు.
    ప్రకాశించకుండా, నక్షత్రాలకు ఆయన తాళం వేసి పెట్టగలడు.
దేవుడే ఆకాశాలను చేశాడు.
    మహాసముద్ర తరంగాల మీద ఆయన నడుస్తాడు.

“స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనేవాటిని చేసినవాడు ఆయనే.
    దక్షిణ ఆకాశాన్ని దాటిపోయే గ్రహాలను ఆయన చేశాడు.
10 మనుష్యులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను దేవుడు చేస్తాడు.
    దేవుని మహా అద్భుతాలకు అంతం లేదు.
11 దేవుడు నన్ను దాటి వేళ్లేటప్పుడు నేను ఆయనను చూడలేను.
    దేవుడు పక్కగా వెళ్లేటప్పుడు ఆయన గొప్పతనాన్ని నేను గ్రహించలేను.
12 దేవుడు దేనినై నా తీసివేస్తే,
    ఏ ఒక్కరూ ఆయన్ని వారించలేరు.
‘ఏమిటి నీవు చేస్తున్నది?’
    అని ఎవ్వరూ ఆయనతో అనలేరు.
13 దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు.
    రాహాబు సహాయకులకు కూడా దేవుడంటే భయం.”
14 యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను.
    ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు.
15 యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను.
    నా న్యాయమూర్తిని (దేవుని) ప్రాధేయపడడం మాత్రమే నేను చేయగలిగింది అంతా.
16 ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన జవాబిచ్చినా,
    దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నమ్మను.
17 నన్ను అణచివేయటానికి దేవుడు తుఫానులు పంపిస్తాడు.
    ఏ కారణం లేకుండానే ఆయన నాకు ఇంకా ఎక్కువ గాయాలు కలిగిస్తాడు.
18 దేవుడు నన్ను మళ్లీ శ్వాస పీల్చనీయడు.
    ఆయన నన్ను ఇంకా ఎక్కువ కష్టపెడతాడు.
19 నేను దేవుణ్ణి ఓడించలేను.
    దేవుడు శక్తిమంతుడు.
దేవుని న్యాయస్థానానికి వెళ్లి నాకు న్యాయం చేకూర్చేటట్టు నేను చేయలేను.
    దేవుణ్ణి న్యాయస్థానానికి రమ్మని ఆయనను ఎవరు బలవంతం చేస్తారు?
20 యోబు అనే నేను నిర్దోషిని, కాని నేను చెప్పే మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి.
    కనుక, నేను నిర్దోషిని, కాని నా నోరు నేను దోషిని అని ప్రకటిస్తుంది.
21 నేను నిర్దోషిని, కాని నన్ను గూర్చి నేను లక్ష్య పెట్టను.
    నా స్వంత జీవితం నాకు అసహ్యం.
22 జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
    కనుక ‘దేవుడు నిర్దోషులను, దుర్మార్గులను కూడా నాశనం చేస్తాడు’ అని నేను తలస్తాను.
23 ఏదో ఒక దారుణం జరిగి ఒక నిర్దోషి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అతని శ్రమను చూసి దేవుడు నవ్వుతాడు.
24 భూమిని దుర్మార్గుడు చేజిక్కించుకున్నప్పుడు దేవుడు న్యాయమూర్తులను గుడ్డివాళ్లను చేస్తాడా?
    ఇది దేవుడు చేయకపోతే ఇంకెవరు చేశారు?

25 “పరుగెత్తేవాని కంటె వేగంగా నా రోజులు గడిచి పోయాయి.
    నా రోజులు ఎగిరిపోతున్నాయి, వాటిలో సంతోషం లేదు.
26 జమ్ము పడవలు పోయేలా నా రోజులు వేగంగా పోతున్నాయి.
    పక్షిరాజులు తాము పట్టుకొన్న జంతువుల మీదికి దూసుకు వచ్చినట్లుగా నా రోజులు వేగంగా గడిచి పోతున్నాయి.

27 “నేను ఆరోపణలు చేయను,
    ‘నేను నా బాధ మరచిపోతాను, నా ముఖం మార్చుకొని, నవ్వుతూ ఉంటాను’ అని ఒక వేళ నేను చెప్పినా,
28 నాకు నా శ్రమ అంతటిని గూర్చి ఇంకా భయమే.
    ఎందుకంటే నేను దోషిని అని దేవుడు ఇంకా చెబుతున్నాడని నాకు తెలుసు గనుక.
29 నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది.
    కనుక నేను ఇంకా ఎందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. పోనీ దానిని, ‘మర్చిపో’ అని అంటాను నేను.
30 మంచుతో నన్ను నేను కడుగుకొన్నా,
    సబ్బుతో నేను నా చేతులు కడుగుకొన్నా
31 దేవుడు నన్ను చావు గోతిలో[a] పడవేస్తాడు.
    అప్పుడు నా వస్త్రాలే నన్ను ద్వేషిస్తాయి.
32 దేవుడు నాలా మనిషి కాడు. అందుకే నేను ఆయనకు జవాబు ఇవ్వలేను.
    న్యాయస్థానంలో మేము ఒకరి నొకరం కలుసుకొలేం.
33 మాకు మధ్య నిలబడేందుకు ఎవరైనా ఉంటే బాగుండును.
    మా ఇద్దరికీ న్యాయంగా తీర్పు తీర్చేవారు ఎవరైనా ఉంటే బాగుండును.
34 దేవుని శిక్షా దండాన్ని తీసివేసుకొనే వారు ఎవరైనా ఉంటే బాగుండును.
    అప్పుడు దేవుడు నన్ను ఇంకెంత మాత్రము భయపెట్టడు.
35 అప్పుడు నేను దేవునికి భయపడకుండా నేను చెప్పదలచుకొన్నది చెప్పగలుగుతాను.
    కానీ ఇప్పుడు నేను అలా చేయలేను.

10 “నా స్వంత జీవితం నాకు అసహ్యం. అందుచేత నేను స్వేచ్ఛగా ఆరోపణలు చేస్తాను.
    నా ఆత్మ చాలా వేదనగా ఉంది కనుక ఇప్పుడు నేను మాట్లాడతాను.
నేను దేవునితో చెబుతాను, ‘నన్ను నిందించవద్దు.
    నేను ఏమి తప్పు చేశాను, నాకు చెప్పు. నా మీద నీకు ఎందుకు విరోధం?
దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడటం నీకు సంతోషమా?
    చూస్తుంటే, నీవు చేసిన దాని గూర్చి నీకు శ్రద్ధ లేనట్లుంది. దుర్మార్గులు వేసే పథకాలకు నీవు సంతోషిస్తున్నావా?
దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా?
    మనుష్యులు చూసినట్టుగా నీవు సంగతులు చూస్తున్నావా?
మా రోజుల్లాగ నీవి కొద్దిపాటి రోజులా?
    మా సంవత్సరాల్లా నీవి కొన్ని సంవత్సరాలేనా?
నీవు నా తప్పుకోసం చూస్తూ
    నాపాపం కోసం వెదకుతున్నావు.
కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు.
    అయితే నీ శక్తినుండి నన్ను ఎవ్వరూ రక్షించలేరు!
దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి.
    కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం చేస్తున్నావు.
దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం చేసుకో.
    కానీ, నీవు ఇప్పుడు నన్ను మరల మట్టిగా ఎందుకు మారుస్తున్నావు?
10 పాలు ఒలుకబోసినట్టుగా నీవు నన్ను సోస్తున్నావు.
    నన్ను వెన్న చిలకరించినట్లుగా చేస్తున్నావు.
11 ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు.
    తర్వాత చర్మంతో, మాంసంతో నీవు నన్ను కప్పివేశావు.
12 నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ చూపించావు.
    నా విషయమై నీవు శ్రద్ధ చూపించావు. నా ఆత్మను కాపాడావు.
13 కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది
    ఇదేనని నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది ఇదేనని నాకు తెలుసు.
14 ఒకవేళ నేను పాపం చేస్తే, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించవచ్చునని
    నీవు నన్ను గమనిస్తూ ఉంటావు.
15 నేను పాపం చేసినప్పుడు, నేను దోషిని.
    అది నాకు చాలా చెడు అవుతుంది.
కానీ నేను నిర్దోషిని అయినా సరే, నేను నా తల ఎత్తుకోలేను.
    ఎందుకంటే, నేను సిగ్గుతో, బాధతో నిండిపోయాను గనుక.
16 ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తోంటే
    ఒకడు సింహాన్ని వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతావు.
    నీవు మరోసారి నా మీద నీ శక్తి చూపిస్తావు.
17 నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు
    నీకు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు.
నామీద నీ కోపం ఎక్కువ అవుతుంది.
    నీవు నా మీదికి కొత్త సైన్యాలను పంపిస్తావు.
18 అందుచేత, దేవా అసలు నీవు నన్ను ఎందుకు పుట్టనిచ్చావు?
    నన్ను ఎవరూ చూడక ముందే నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది.
19 నేను ఎన్నడూ ఒక మనిషిని కాకుండా ఉంటే బాగుండును.
    నేను నా తల్లి గర్భం నుండి తిన్నగా సమాధికి మోసికొనిపోబడితే ఎంత బాగుండేది.?
20 నా జీవితం దాదాపు అయిపోయింది.
    కనుక నన్ను ఒంటరిగా వదిలెయ్యి.
    ఏదో కొద్దిపాటి వసతుల్ని అనుభవించనివ్వు.
21 ఏ చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగిరారో,
    అంధకారం, మరణం ఉండే ఆ చోటుకు నేను వెళ్లక ముందు, నాకు మిగిలి ఉన్న కొద్ది సమయం నన్ను అనుభవించనివ్వు.
22 ఎవ్వరూ చూడలేని, అంధకార ఛాయల, గందరగోళ స్థలానికి నేను వెళ్లకముందు నన్ను అనుభవించనివ్వు.
    అక్కడ వెలుగు కూడా చీకటిగా ఉండి ఉంటుంది.’”

అపొస్తలుల కార్యములు 8:26-40

ఫిలిప్పు ఇతియోపియా దేశస్థునికి బాప్తిస్మము ఇవ్వటం

26 ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేమునుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు.

27 అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇతియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇతియొపీయుల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి, 28 తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా,

29 దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అతన్ని కలుసుకో” అని అన్నాడు. 30 ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు.

31 “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు. 32 ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు:

“చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు
బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా
    ఆయన మాట్లాడ లేదు!
33 ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు.
ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు.
    ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?”(A)

34 ఆ కోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పు” అని అడిగాడు. 35 ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.

36 ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, నీవు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగి, రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. 37 ఫిలిప్పు, “నీవు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను ఇస్తాను” అన్నాడు. ఆ కోశాధికారి, “యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను” అన్నాడు. 38 ఫిలిప్పు, ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు. 39 వాళ్ళు నీళ్ళనుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు. 40 ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడినుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International