Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఎస్తేరు 1-2

వష్తి రాణి రాజుకు అవిధేయురాలగుట

అహష్వేరోషు రాజ్యపాలన కాలంలో జరిగిన సంఘటన యిది. అహష్వేరోషు భారత దేశంనుంచి కూషు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలతో కూడిన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అహష్వేరోషు తన రాజధాని నగరమైన షూషనులో సింహాసనాధిష్ఠుతుడై, తన పాలన సాగించాడు.

అహష్వేరోషు తన రాజ్యపాలన మూడేళ్లు నిండిన సందర్భంగా అధికారులకూ, నాయకులకూ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకి పారసీక దేశమంతటినుంచి, మాదియా దేశం నుంచి సేనానులూ, ప్రముఖ నాయకులూ హాజరయ్యారు. ఆ విందు నూట ఎనభై రోజులు కొనసాగింది. ఆ విందుసాగిన అన్ని రోజులూ అహష్వేరోషు రాజు తన రాజ్యంలోని గొప్ప సంపదను ప్రదర్శించాడు. రాజభవనపు అందాలనూ, ఐశ్వర్యాన్నీ ప్రదర్శిస్తూ వచ్చాడు. ఆ నూట ఎనభై రోజుల విందు ముగిశాక అహహ్వేరోషు మరో విందు ఏర్పాటు చేశాడు. అది వారం రోజులపాటు కొనసాగింది. ఆ విందు రాజనగరులోని తోటలో జరిగింది. ఆ విందుకి రాజధాని నగరమైన షూషనులోని ప్రజలందరినీ, అత్యంత ముఖ్యులు మొదలుకొని అత్యల్పులను కూడా ఆహ్వానించాడు. ఆ లోపలి తోట చుట్టూ తెలుపు, నీలి తెరలు వేలాడదీయబడ్డాయి. అవి చలువరాతి స్తంభాలకు, తాపిన వెండి కమ్ములకు అవిసెనార, నూలు తాళ్లతో బిగించబడ్డాయి. అక్కడ ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు మొదలైన రంగుల విలువైన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి, బంగారాలతో చేసిన పడకలు వున్నాయి. అతిథులకు ద్రాక్షాసారా బంగారు పాత్రల్లో అందించబడింది. చిత్రమేమిటంటే, ఆ పాత్రల్లో ఒకదాన్ని పోలినది మరొకటి లేదు! రాజు బాగా ఔదార్యవంతుడేమో, ద్రాక్షాసారాకి కొదువ లేకపోయింది. రాజు ఆజ్ఞమేరకు ద్రాక్షాసారా వడ్డించేవాడు ప్రతి ఒక్క అతిథికీ అతను కోరినంత పోశాడు.

మహారాణి వష్తి కూడా స్త్రీలకు రాజభవనంలో విందుచేసింది.

10-11 ఆ విందు ఏడవ రోజున రాజు అహష్వేరోషు ద్రాక్షాసారా ఎక్కువగా సేవించాడు. మంచి మత్తులో వున్న మహారాజు తనను సేవించిన ఏడు మంది సేవకులైన మెహోమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే నపుంసకులకు మహారాణికి కిరీటం ధరింపజేసి, తన ఎదుటకు తీసుకు రావాలని ఆజ్ఞాపించాడు. మహారాణి వష్తి మహా సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని అధికారులకూ, ప్రముఖులకూ ప్రదర్శించి మెప్పు పొందాలన్నది అతని సంకల్పం.

12 ఆ సేవకులు మహారాణికి మహారాజు ఆజ్ఞను విన్నవించారు. కాని, ఆమె అందరి ముందుకు వెళ్లేందుకు నిరాకరించింది. మహారాజుకు అధికంగా కోపం వచ్చింది. 13-14 న్యాయ చట్టం గురించీ, శిక్షలను గురించి నిపుణుల సలహాలు అడగటం మహారాజుకి పరిపాటి. అందుకని, న్యాయనిపుణులైన తన సలహాదారులతో మహారాజు సంప్రదించాడు. మహా రాజుకి సన్నిహితులైన ఆ సలహాదారుల పేర్లు: కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను. ఈ యేడుగురూ పారశీక, మాదీయ దేశాల ప్రముఖులు. మహారాజును దర్శించేందుకు ప్రత్యేకమైన అనుమతులు కలిగినవాళ్లు. సామ్రాజ్యంలో అత్యున్నతమైన అధికారులు. 15 మహారాజు వాళ్లని ఇలా ప్రశ్నించాడు: “మహారాజు తన నపుంసకులద్వారా వష్తి మహారాణికి ఒక ఆజ్ఞ పంపాడు. కాని, ఆమె రాజాజ్ఞను మన్నించలేదు. న్యాయచట్టం ప్రకారం ఆమెపైన ఎలాంటి చర్య తీసుకోవాలి?”

16 అప్పుడు మెమూకాను యితర అధికారులు వింటూండగా మహారాజుకి ఇలా సమాధానమిచ్చాడు: “మహారాణి వష్తి చేసినది నేరం. ఆమె మహారాజు అహష్వేరోషు పట్లనే కాక రాజ్యములోని ఆయన సంస్థా నములన్నిటిలోనుండు అధికారుల పట్ల, ప్రముఖుల పట్ల కూడా నేరం చేసింది. 17 నేనీ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మహారాణి వష్తి చేసిన యీ ఆజ్ఞోల్లంఘనాన్ని గురించి మిగిలిన స్త్రీలందరూ వింటారు. అప్పుడింక యితర స్త్రీలు కూడా తమ భర్తల పట్ల విధేయత చూపడం మానేస్తారు. వాళ్లు తమ భర్తలతో ఇలా వాదిస్తారు: ‘అహష్వేరోషు మహారాజు వష్తి మహారాణిని రమ్మని ఆజ్ఞాపించాడు. కాని, ఆమె వచ్చేందుకు నిరాకరించింది కదా.’

18 “పారశీక, మాదీయ నాయకుల భార్యలు ఈనాడు మహారాణి చేసినదాన్ని గురించి విన్నారు. ఆమె చేసిన పనిచేత వాళ్లు ప్రభావితులవుతారు. ఆ స్త్రీలు కూడా మహారాజుగారి ప్రముఖుల పట్ల అలాగే వ్యవహరిస్తారు. దానితో అవిధేయతా, కోపతాపాలూ రెచ్చిపోతాయి.

19 “మహారాజు సమ్మతిస్తే, నాదొక సూచన, మహారాజా, మీరు ఒక శాసనం జారీచెయ్యాలి. దాన్ని పారశీక, మాదీయ రాజ్యాల న్యాయచట్టాల్లో నమోదు చేయించాలి. అప్పుడిక పారశీక, మాదియ న్యాయచట్టాలను మార్చడం సాధ్యంకాదు. వష్తి అహష్వేరోషు మహారాజు సమక్షంలోకి యిక ఎన్నడూ రాకూడదు. అంతేకాదు, మహారాజు ఆమె (రాణి) పట్టమహిషిత్వ స్థానాన్ని ఆమెకంటె మెరుగైన స్త్రీకి ఇవ్వాలి. 20 మహారాజు ఆజ్ఞ ఆయన సువిశాల సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లోనూ చాటింపబడినాక, స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు. అప్పుడిక అల్పుల దగ్గర్నుంచి అధికులదాకా స్త్రీలందరూ తమతమ భర్తల్ని గౌరవిస్తారు.”

21 మహారాజుకి, ఆయన ముఖ్యాధికారులకీ యీ సలహా నచ్చింది. దానితో అహష్వేరోషు మహారాజు మెమూకాను చేసిన యీ సూచనను శాసనం చేశాడు. 22 అహష్వేరోషు తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాలకీ, ఆయా ప్రాంతీయ భాషల్లో, యీ తాఖీదును పంపాడు. ఆ తాఖీదుల మేరకు, ప్రతి పురుషుడూ తన కుటుంబానికి యజమానిగా ప్రకటింపబడ్డాడు.

ఎస్తేరు రాణి అయింది

దరిమిలా కొంత కాలానికి, అహష్వేరోషు మహారాజు కోపం చల్లారింది. అప్పుడాయనకి వష్తీ, ఆమె చేసిన పని, తను జారీచేసిన ఆజ్ఞలు జ్ఞాప్తికి వచ్చాయి. అప్పుడు మహారాజు ఆంతరంగిక సేవకులు ఒక సూచన చేశారు, “మహారాజుగారి కోసం అందమైన కన్యల అన్వేషణ జరపాలి. మహారాజు తన సామ్రాజ్యం లోని ప్రతి సామంత రాజ్యంలోనూ ఒక్కొక్క నాయకుణ్ణి ఎంపిక చేసుకోవాలి. ఆ నాయకులు అందమైన ప్రతి ఒక్క కన్యనూ రాజధాని నగరమైన షూషనుకి తీసుకురావాలి. ఆ కన్యలను మహారాజుగారి అంతఃపుర స్త్రీల బృందంలో వుంచాలి. ఆ కన్యలు అంతఃపుర స్త్రీలను అదుపాజ్ఞల్లో వుంచే హేగే నపుంసకుని అధీనంలోవుంటారు. వాళ్లందరికీ సౌందర్య పోషక క్రియలు జరపాలి. అటు తర్వాత వీళ్లలో మహారాజుకి నచ్చిన కన్యను వష్తి స్థానంలో కొత్త మహారాణిని చేయాలి.” ఈ సలహా మహారాజుకి నచ్చింది. ఆయన దాన్ని ఆమోదించాడు.

రాజధాని నగరం షూషనులో బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై అనే ఒక యూదుడు వున్నాడు. మొర్దెకై తండ్రి యాయీరు. యాయీరు తండ్రి కీషు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను బందీగా పట్టుకొన్నాడు యెరూషలేము నుంచి చెరపట్టబడినవారిలో మొర్దెకై కూడా ఒకడు. హదస్సా అనే ఒక అమ్మాయి వుంది. ఆమె మొర్దెకైకి పినతండ్రి కూతురు. ఆమె తల్లితండ్రులు మరణించినప్పుడు, మొర్దకై ఆమెని చేరదీసి, తన స్వంత కూతురులా పెంచి పోషించాడు. హదస్సాకి ఎస్తేరు అనే పేరుకూడా వుంది. ఎస్తేరు అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను.

మహారాజుయొక్క ఆజ్ఞ ప్రకటింపబడిన మీదట చాలామంది కన్యలు రాజధాని అయిన షూషను నగరానికి తరలింపబడ్డారు. వాళ్లందరూ హేగే నపుంసకుని అధీనంలో ఉంచబడ్డారు. ఆ యువతుల్లో ఎస్తేరు ఒకతె. ఎస్తేరును రాజభవనానికి తీసుకుపోయి, మిగిలిన అంతఃపుర స్త్రీలతో బాటు హేగే అధీనంలో ఉంచారు. ఎస్తేరు హేగేకి నచ్చింది. ఆమె అతనికి అభిమాన ప్రాత్రురాలైంది. దానితో హేగే ఆమెకి సౌందర్యవర్థక పక్రియను త్వరలో పూర్తిచేసి, ఆమెకి ప్రత్యేకమైన భోజన పదార్థాలను సమకూర్చాడు. అప్పుడిక హేగే ఎస్తేరుకీ, ఆమె ఏడుగురు పరిచారికలకీ అంతఃపుర స్త్రీలు నివసించే అతి శ్రేష్ఠమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేశాడు. 10 తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు ఎవ్వరికీ చెప్పలేదు. మొర్దెకై వద్దన్నందున ఆమె తన కుటుంబ వివరాలేవీ ఎవ్వరికి తెలియ జెప్పలేదు. 11 ఎస్తేరు ఎలాగుందో, ఆమె విషయంలో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకోసం మొర్దెకై ప్రతి రోజూ అంతఃపుర ఆవరణ ముందు అటు ఇటు తిరుగులాడు తుండేవాడు.

12 ఎవరైనా ఒక యువతి అహష్వేరోషు మహారాజు సన్నిధానానికి తీసుకుపోబడేందుకు ముందు ఆమె చేయవలసిన పనులు యివి: ఆమె తన పన్నెండు మాసాల సౌందర్యవర్ధక పక్రియను వూర్తి చేయాలి. అంటే, ఆమె ఆరునెలలు పాటు గోపరస తైలాన్ని వాడి, తదుపరి ఆరునెలలు పరిమళ ద్రవ్యాలను, భిన్న భిన్న మైన అలంకరణ సామగ్రులను వాడాలి. 13 మహారాజు సముఖానికి తీసుకుపోబడేందుకు ఇదీ పద్దతి. ఆ అమ్మాయికి ఏది కావాలన్నా అంతఃపురం నుంచి ఇవ్వబడుతుంది. 14 ఆ యువతి రాజ భవనానికి సాయంత్రమందు చేరుకుంటుంది. ఆ మరుసటి ఉదయం ఆమె అంతఃవుర స్త్రీలు నివసించే మరో చోటికి తిరిగి వెళ్తుంది. అప్పుడామె అక్కడ షయష్గజు అనే నపుంసకుని అజమాయిషీలో ఉంచబడుతుంది. షయష్గజు నపుంసకుడు మహారాజు ఉంపుడుగత్తెల పర్యవేక్షకుడు. మహారాజుకు ఆమెపట్ల ప్రేమ కలిగినప్పుడేగాని ఆ యువతి ఆయన దగ్గరకు వెళ్లరాదు. అప్పుడాయన ఆమెను పేరుపెట్టి తిరిగి తనవద్దకు రమ్మని పిలుస్తాడు.

15 ఎస్తేరుకి మహారాజు వద్దకు వెళ్లే వంతు వచ్చి నప్పుడు, ఆమె ఏమీ కావాలని కోరలేదు. అంతఃపుర పర్యవేక్షకుడైన హేగే తనకేమి సూచించాడో అవే తీసుకుంది. (ఎస్తేరు మొర్దెకై పెంపుడు కూతురు, అతని పినతండ్రి అబీహాయిలు కూతురు). ఎస్తేరును చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చింది. 16 చివరికి ఎస్తేరు రాజ భవనంలో మహారాజు సముఖానికి తీసుకెళ్లబడింది. అది సరిగ్గా టెబేతు అనబడే పదోనెల, అహష్వేరోషు పాలనలో ఏడవ సంవత్సరం.

17 మహారాజు యువతులందరిలోకీ ఎస్తేరును బాగా ప్రేమించాడు. మిగిలిన కన్యలందరి కంటె ఆమె, ఆయన దయ, అభిమానాలను పొందింది. అందుకని మహారాజు స్వయంగా ఆమె శిరస్సుపై కిరీటం వుంచి, వష్తి స్థానంలో ఆమెను మహారాణిని చేశాడు. 18 మహారాజు ఎస్తేరు గౌరవార్థం తన సామంతులకూ, అధికారులకూ పెద్ద విందు చేశాడు. అన్ని సామంత రాజ్యాల్యోనూ ఆ రోజును ఆయన సెలవు దినంగా ప్రకటించాడు. ఉదారవంతుడైన ఆ మహారాజు జనానికి బహుమతులు పంపాడు.

మొర్దెకై ఒక కుట్రను కనిపెట్టుట

19 రెండవసారి యువతులందరూ ఒకచోట చేర్చబడినప్పుడు మొర్దెకై మహారాజు భవన ద్వారంవద్దనే కూర్చుని వున్నాడు. 20 తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు యింకా గుప్తంగానే వుంచింది. తన కుటుంబ గోత్రాలను గురించి ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. అది ఆమెకు మొర్దెకై ఇచ్చిన ఆజ్ఞ. తను మొర్దెకై పెంపకంలో ఉన్నప్పటి మాదిరిగానే, యింకా ఆమె అతని ఆజ్ఞలను పాటిస్తోంది.

21 మొర్దెకై మహారాజు భవన ద్వారం దగ్గర కూర్చున్న సమయంలో జరిగిన విషయం ఇది: బిగ్తాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వార పాలకులు మహారాజువట్ల కుపితులై అహష్వేరోషు మహారాజును హతమార్చాలని కుట్ర పన్నుతున్నారు. 22 అయితే, మొర్దెకై ఈ కుట్ర పథకాలను కనిపెట్టి ఎస్తేరు మహారాణికి ఈ విషయం చెప్పాడు. అప్పుడీ విషయాన్ని ఆమె మహారాజుకి చెప్పింది. ఈ కుట్రను గురించి తెలుసుకున్నది మొర్దెకై అని కూడా ఆమె మహారాజుకు చెప్పింది. 23 తర్వాత ఆ విషయమై విచారణ చేయబడింది. విచారణలో మొర్దెకై చెప్పిన సమాచారం సరైనదేనని తేలింది. మహారాజును హత్యచేయాలని దుష్ట వథకం వేసిన ద్వారపాలకులిద్దరూ ఉరితీయబడ్డారు. మహారాజు సమక్షంలోనే యీ విషయాలన్నీ మహారాజుల చరిత్ర విశేషాల గ్రంథంలో నమోదు చేయబడ్డాయి.

అపొస్తలుల కార్యములు 5:1-21

అననీయ మరియు సప్పీరా

“అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు.

అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”

ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనని విన్నవాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు.

మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు.

“ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.

పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసినవాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. 10 తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. 11 సంఘానికి, ఈ సంఘటనలు విన్నవాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.

అనేకులను నయం చేయటం

12 అపొస్తలులు, విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు. 13 ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతావాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు. 14 చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు. 15 ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్నవాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. 16 ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలనుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్నవాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్నవాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది.

అపొస్తలులు హింసించబడటం

17 సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు అసూయతో నిండిపోయారు. 18 వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు. 19 కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. 20 వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు. 21 దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలు పెట్టారు.

ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International