Old/New Testament
7 ఈ విధంగా, మేము ప్రాకార నిర్మాణం పూర్తి చేశాము. తర్వాత మేము ద్వార పాలకులను ఎంపిక చేశాము. ఆలయ గాయకులుగా వుంటూ, యాజకులకు తోడ్పడేవాళ్లను ఎంపిక చేశాము. 2 అటు తర్వాత, నా సోదరుడు హనానీని యెరూషలేముకు అధికారిగా నియమించాను. హనన్యా అనే మరో వ్యక్తిని కోటకి సేనాధిపతిగా నియమించాను. నేను హనానీని ఎందుకు ఎంపిక చేశానంటే, అతను చాలా నిజాయితీ పరుడు. అత్యధిక సంఖ్యాకులు కంటె, అతను అధిక దేవుని భయం కలిగినవాడు. 3 అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకుగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.”
తిరిగి వచ్చిన బందీల జాబితా
4 అప్పుడు ఆ నగరం విశాలంగా పుంది, కావలసినంతకన్న ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడింది. అయితే, నగరంలో కొద్దిమందే వున్నారు. ఇళ్లు తిరిగి ఇంకా నిర్మింపబడలేదు. 5 జనం అందర్నీ సమావేశ పరచాలన్న సంకల్పాన్ని దేవుడు నాకు కలిగించాడు. నేను ముఖ్యుల్ని, ఉద్యోగుల్ని, సామాన్యుల్ని అందర్నీ సమావెశానికి పిలిచాను. నేనీ పని కుటుంబాలన్నింటి జాబితా తయారు చేయగలుగుతానన్న భావంతో చేశాను. మొదట దేశమునుండి వెళ్లగొట్టబడిన వారిలో తిరిగి వచ్చిన వాళ్ల కుటుంబాల జాబితాలు నాకు దొరికాయి. అక్కడ వ్రాసివున్న సమాచారం ఇది.
6 చెరనుంచి తిరిగి వచ్చిన వాళ్ల వివరం వుంది. వెనక బబులోను రాజు నెబుకద్నెజరు వీళ్లని బబులోనుకి బందీలుగా పట్టుకుపోయాడు. వాళ్లు ఇప్పుడు యెరూషలేముకీ, యూదాకీ తిరిగి వచ్చారు. వాళ్లలో ప్రతి ఒక్కడూ తన స్వంత పట్టణానికి పోయాడు. 7 ఈ క్రిందివాళ్లు జెరుబ్బాబెలు[a] తో కలిసి వచ్చారు: యేషూవా, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, సహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా. ఇశ్రాయేలుకి చెందిన ఈ క్రింది మనుష్యులు ఈ క్రింది సంఖ్యలో తిరిగి వచ్చారు:
8 పరోషు వంశీయులు | 2,172 |
9 షెపట్యా వంశీయులు | 372 |
10 ఆరహు వంశీయులు | 652 |
11 పహత్మోయాబు వంశీయులు (వీళ్లు యేషూవ, జోయాబు వంశపు వాళ్లు) | 2,818 |
12 ఏలాము వంశీయులు | 1,254 |
13 జత్తూ వంశీయులు | 845 |
14 జక్కయి వంశీయులు | 760 |
15 బిన్నూయి వంశీయులు | 648 |
16 బేబై వంశీయులు | 628 |
17 అజ్గాదు వంశీయులు | 2,322 |
18 అదోనీకాము వంశీయులు | 667 |
19 బిగ్వయి వంశీయులు | 2,067 |
20 ఆదీను వంశీయులు | 655 |
21 హిజ్కియా కుటుంబానికి చెందిన ఆటేరు వంశీయులు | 98 |
22 హాషూము వంశీయులు | 328 |
23 బేజయి వంశీయులు | 324 |
24 హారీపు వంశీయులు | 112 |
25 గిబియోను వంశీయులు | 95 |
26 బేత్లేహేము, నెటోపా పట్టణాల వాళ్లు | 188 |
27 అనాతోతు పట్టణం వాళ్లు | 128 |
28 బేతజ్మావెతు పట్టణం వాళ్లు | 42 |
29 కిర్యతారీము, కెఫీరా, బేయెరోతు పట్టణాల వాళ్లు | 743 |
30 రమా, గెబ పట్టణాల వాళ్లు | 621 |
31 మిక్మషు పట్టణం వాళ్లు | 122 |
32 బేతేలు, ఆయి పట్టణాల వాళ్లు | 123 |
33 రెండవ నెబో పట్టణం వాళ్లు | 52 |
34 రెండవ ఏలాము పట్టణం వాళ్లు | 1,254 |
35 హారిము పట్టణం వాళ్లు | 320 |
36 యెరికో పట్టణం వాళ్లు | 345 |
37 లోదు హదీదు, ఓనో పట్టణాల వాళ్లు | 721 |
38 సెనాయా పట్టణం వాళ్లు | 3,930 |
39 వీళ్లు యాజకులు:
యేషూవా కుటుంబం ద్వారా యెదాయా వంశీయులు | 973 |
40 ఇమ్మేరు వంశీయులు | 1,052 |
41 పషూరు వంశీయులు | 1,247 |
42 హారిము వంశీయులు | 1,017 |
43 లేవీ వంశానికి చెందిన వాళ్లు:
యేషువా, హోదేయా,[b] కద్మీయులు | 74 |
44 వీళ్లు గాయకులు:
ఆసావు వంశీయులు | 148 |
45 వీళ్లు ద్వారపాలకులు:
షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబ, హటీటాం, షోబయి వంశీయులు | 138 |
46 వీళ్లు ఈ కింది వంశాల ఆలయ ప్రత్యేక సేవకులు:
జీహా, హశూఫా, టబ్బాయేలు
47 కేరోసు, సీయహా, పాదోను,
48 లెబానా, హగాబా, షల్మయి,
49 హానాను, గిద్దేలు, గహరు
50 రెవాయ, రెజీను, నెకోదా,
51 గజ్జాము, ఉజ్జా, పాసెయ.
52 బేసాయి, మెహూనీము, నెపూషేసీము.
53 బక్బూకు, హకూఫా, హర్హూరు,
54 బజ్లీతు, మెహీదా, హర్షా,
55 బర్కోసు, సీసెరా, తెమాహా,
56 నెజీయహు, హటేపా.
57 సొలొమోను దాసుల వంశాలకు చెందిన వారు:
సొటయి, సోపెరెతు, పెరూదా,
58 యహలా, దర్కొను, గిద్దేలు,
59 షెఫట్యా, హట్టీలు, పొకెరెతు, హజ్జెబాయిము, అమోను.
60 ఆలయ సేవకులు, సొలొమోను దాసుల వంశీయులు కలిసి మొత్తం | 392 |
61 కొందరు ఈ క్రింది పట్టణాలనుంచి యెరూషలేముకు వచ్చారు. తేల్మెలెహు, తెల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు, అయితే, వీళ్లు తమ కుటుంబాలు ఇశ్రాయేలుకి చెందినవో కావో నిరూపించుకోలేక పోయారు.
62 దెలాయ్యా, టోబీయా, నెకొనిదా వంశీయులు | 642 |
63 యాజక కుటుంబాల్లో చేరినవాళ్లు
హబాయా, హక్కోజు, బర్జిల్లయి (గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలను పెళ్లి చేసుకున్నవాళ్లు బర్జిల్లయి వంశీయులుగా పరిగణింపబడ్డారు.)
64 వీళ్లు తమ కుటుంబ చరిత్రల కోసం గాలించారు, కాని అవి వాళ్లకి దొరకలేదు. తాము యాజకులుగా పని చేయగలిగేందుకు గాను, తమ పూర్వీకులు యాజకులన్న విషయాన్ని వాళ్లు నిరూపించలేక పోయారు. దానితో, వాళ్ల పేర్లు యాజకుల జాబితాలో చేర్చబడలేదు. 65 అత్యంత పవిత్రమైన వస్తువులను వాళ్లకి ఇవ్వరాదని పాలనాధికారి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీము[c] ఉపయోగించి, దేవుని సంకల్పం తెలుసుకునేందుకోసం అర్థించి, ప్రార్థించేదాకా వాళ్లు ఈ అతి పరిశుద్ధ వస్తువుల్లో వేటికీ అర్హులు కాకుండా పోయారు.
66-67 మొత్తం మీద, ఆ బృందంలో తిరిగి వచ్చిన వాళ్లు 42,360 మంది వున్నారు. వాళ్ల 7,337 దాసదాసీలు ఈ మొత్తం సంఖ్యలో చేర్చబడలేదు. వాళ్లతోబాటు 245 మంది గాయనీ గాయకులు కూడా వున్నారు. 68-69 వాళ్లకి 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు వున్నాయి.
70 కుటుంబ పెద్దలు కొందరు పనినిర్వహణకు సహాయంగా కొంత డబ్బు ఇచ్చారు. పాలనాధికారి ఖజానాకు 19 పౌనుల బంగారు ఇచ్చాడు. అతను 50 పళ్లాలు, యాజకులు ధరించేందుకు 530 జతల దుస్తులు కూడా ఇచ్చాడు. 71 కుటుంబ పెద్దలు పని నిర్వహణ కోసం 375 పౌనుల బంగారాన్ని ఖజానాకి ఇచ్చారు. వాళ్లు 1 1/3 టన్నులు వెండిని కూడ ఇచ్చారు. 72 మొత్తంమీద ఇతరులు 375 పౌనుల బంగారము, 1 1/3 టన్నుల వెండిని, యాజకుల కోసం 67 రకాల దుస్తులు ఇచ్చారు.
73 ఈ విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమ తమ స్వంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ స్వంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల[d] నాటికి ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.
ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదవటం
8 ఆ విధంగా, ఇశ్రాయేలీయులందరూ ఆ ఏడాది ఏడవ నెలలో సమావేశమయ్యారు. వాళ్లందరూ నీటి గుమ్మం ముందరి మైదానంలో ఏక మనస్కులై ఒకే మనిషి అన్నట్లు గుమికూడారు. వాళ్లు ఎజ్రా ఉపదేశకుణ్ణి మోషే ధర్మశాస్త్రాన్ని పైకి తీసి పఠించ వలసిందిగా కోరారు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమది. 2 యాజకుడైన ఎజ్రా సమావేశమైన జనం ముందుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అది నెల మొదటి రోజు. అది ఏడాదిలో ఏడవ నెల. ఆ సమావేశంలో స్త్రీలు, పురుషులు విని, అర్థం చేసుకోగల వయస్కులు వున్నారు. 3 ఎజ్రా ఉదయాన్నుంచి మిట్ట మధ్యాహ్నంవరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి గుమ్మం ఎదుటవున్న మైదానానికి ఎదురుగా నిలబడి, ఎజ్రా స్త్రీలనీ, పురుషుల్నీ విని అర్థం చేసుకోగల వాళ్లందర్నీ ఉద్దేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర గ్రంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు.
4 ఎజ్రా ఈ ప్రత్యేక సందర్భంకోసం నిర్మింపబడిన ఎత్తైన కొయ్య వేదిక మీద నిలబడ్డాడు. ఎజ్రా కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కియా, మయశేయాలు ఉన్నారు. ఎజ్రా ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాములు వున్నారు.
5 అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎతైన వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతన్ని చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరవగానే, జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. 6 ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా, “ఆమేన్! ఆమేన్!” అన్నారు. తర్వాత జనులందరూ నేలమీదవంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు.
7 జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా. 8 ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు.
9 తర్వాత పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడునైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి ప్రత్యేక దినం[e] మీరు విచారంగా వుండకండి, ఏడ్వకండి!” అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదించనారంభించిన మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు.
10 నెహెమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకికొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు యెహోవాకి ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది.”
11 జనం శాంతచిత్తులయ్యేందుకు లేవీయులు తోడ్పడ్డారు. “శాంతించండి, మౌనంగా వుండండి. ఇదొక ప్రత్యేక దినం, దుఃఖించకండి.”
12 అప్పుడిక అందరూ విందు భోజనం చేసేందుకు వెళ్లారు. వాళ్లు తమ ఆహార పదార్థాలనీ, పానీయాలనీ పరస్పరం పంచుకున్నారు. ఆ ప్రత్యేక దినాన్ని వాళ్లెంతో సంతోషంగా జరుపుకున్నారు. వాళ్లు చివరికి బోధకులు తమకి బోధించ ప్రయత్నిస్తున్న ధర్మశాస్త్ర గుణపాఠాలను అర్థం చేసుకున్నారు.
13 అటు తర్వాత, నెల రెండవ రోజున[f] అన్ని కుటుంబాల పెద్దలూ ఎజ్రానూ, యాజకులనూ, లేవీయులనూ కలుసుకునేందుకు వెళ్లారు. వాళ్లందరూ ధర్మశాస్త్రంలోని ప్రవచనాలను అధ్యయనం చేసేందుకు ఉపదేశకుడైన ఎజ్రాచుట్టూ చేరారు.
14-15 వాళ్లు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయగా దానిలో ఈ దిగువ ఆజ్ఞలు వాళ్లకి కనిపించాయి యెహోవా మోషే ద్వారా ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఏడాది ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ప్రత్యేకమైన పండుగ జరుపుకునేందుకు విధిగా పోవాలి. వాళ్లు తాత్కాలిక పర్ణశాలల్లో ఉండాలి. తమ పట్టణాలన్నింటికీ, యెరూషలేముకీ పోయి, ఈ క్రింది మాటలు ప్రకటించాలి. “పర్వత ప్రాంతానికి పోయి రకరకాల ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకురావాలి. కదంబ, తాటి, ఈత ఆకులను, అలాగే నీడనిచ్చే ఇతర మొక్కలను తీసుకురావాలి. ఆ కొమ్మలతో తాత్కాలికమైన పర్ణశాలలు వెయ్యాలి. ధర్మశాస్త్ర గ్రంథం చెప్పినట్లు చెయ్యండి.”
16 సరే, జనం పోయి, ఆ చెట్ల కొమ్మలు తెచ్చారు. తర్వాత వాటితో వాళ్లు తమకి తాత్కాలిక పర్ణశాలలు నిర్మించుకున్నారు. వాళ్లు పర్ణశాలలను తమ ఇళ్ల కప్పులపైనా, తమ ఆవరణల్లోనూ వేసుకున్నారు. వాళ్లు ఆలయ ప్రాంగణంలో, నీటి గుమ్మం దగ్గరి ఖాళీ స్థలంలో, ఎఫ్రాయిము ద్వారం దగ్గర పర్ణశాలలు నిర్మించారు. 17 చెరనుంచి బంధవిముక్తులై తిరిగివచ్చిన ఇశ్రాయేలీయుల బృందమంతా పర్ణశాలలు కట్టు కున్నారు. వాళ్లు తాము కట్టుకున్న పర్ణశాలల్లో నివసించారు. నూను కుమారుడైన యెహోషువా కాలంనుంచి ఆనాటిదాకా ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగను ఇంత చక్కగా జరుపుకోలేదు. అందరూ ఎంతో సంతోషించారు!
18 ఆ పండుగ ప్రతి రోజూ, మొదటి రోజునుంచి చివరి రోజు వరకు ఎజ్రా వాళ్లకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పండగను వారం రోజులపాటు జరుపుకున్నారు. అటు తర్వాత ఎనిమిదో రోజున, ధర్మ శాస్త్రం నిర్దేశించినట్టు ఒక ప్రత్యేక సమావేశం కోసం ఒక చోట కూడారు.
ఇశ్రాయేలీయులు తమ పాపాలను ఒప్పుకొనటం
9 తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు ఒక చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. వాళ్లు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ విచారాన్ని చూపేందుకు గాను) నెత్తిన బూడిద పోసుకున్నారు. 2 నిజంగా ఇశ్రాయేలీయులైన వాళ్లు అన్య జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పుకొన్నారు. 3 వాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల పడ్డారు.
4 అటు తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్లపైన నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్లో యెహోవాను పిలిచారు. 5 తర్వాత ఈ లేవీయులు మళ్వీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, హషబ్నెయా, షెరేబ్యా, హోదీయా, షబన్యా, పెతహాయా, వాళ్లు, “లేచి నిలబడి, ప్రభువైన దేవుణ్ణి స్తుతించండి” అని చెప్పారు.
“దేవుడు ఎల్లప్పుడు ఉండును. ఆయన ఎల్లప్పుడూ జీవించును!
నీ ఘననామం స్తుతించబడాలి.
నీ ఘనమైన నామం సకలాశీర్వచన స్తోత్రాలనూ అధిగమించి పోవాలి!
6 యెహోవా నీవే దేవుడివి!,
యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు,
వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు!
భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ
నీవే సృజించావు!
సముద్రాలను సృజించింది నీవే.
వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే!
ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే,
దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
7 యెహోవా, నీవే దేవుడివి.
అబ్రామును ఎంచుకున్నది నీవే.
అతన్ని బబులోనులోని ఊరునుంచి నడిపించింది నీవే.
అబ్రాహాముగా అతని పేరు మార్చింది నీవే.
8 అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు.
అతనితో నీవొక ఒడంబడిక చేసుకున్నావు.
అతని సంతతి వారికి వాగ్దానం చేశావు
నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్జీ, యెబూసీ, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న.
నీ మాటను నీవు నిలుపుకున్నావు!
నీవు నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు!
9 మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం చూశావు!
సహాయార్థం ఎర్ర సముద్ర తీరాన వారి మొరలు ఆలకించావు.
10 నీవు ఫరోకి అద్భుతాలు ప్రదర్శించావు
అతని ఉద్యోగులకీ, ప్రజలకీ దిగ్ర్భాంతికరమైన పనులు చేసి చూపావు.
మా పూర్వీకుల కంటె తాము గొప్ప అని
ఈజిప్టీయులు అనుకోవడం నీకు తెలుసు.
అయితే నీవు, నీ వెంత గొప్పవాడివో నిరూపించుకొన్నావు!
ఈనాటికీ అది వాళ్లు జ్ఞాపకం ఉంచుకొంటారు.
11 నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని విభాగించావు.
వాళ్లు పొడినేల మీద నడిచి పోయారు!
ఈజిప్టు సైనికులు వాళ్లని తరుముతున్నారు కాని, నీవు ఆ శత్రువుని సముద్రంలో ముంచేశావు.
మరి వాళ్లు ఒక రాయిలా నీటిలో మునిగారు.
12 పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని నడిపించావు,
రాత్రివేళ దీపస్ధంభంలో వుండి వాళ్లని నడిపించావు,
ఆ విధంగా నీవు వారి మార్గాన్ని వెలిగించితివి.
వాళ్లు చేరవలసిన గమ్యాన్ని చూపావు.
13 అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి
ఆకాశంనుంచి వాళ్లతో మాట్లాడాపు.
వాళ్లకి చక్కటి. ధర్మనియమాలిచ్చావు.
వాళ్లకి సదుపదేశాలిచ్చావు.
మంచి ఆజ్ఞలిచ్చావు, చక్కటి ఆదేశాలిచ్చావు!
14 నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి వాళ్లకి చెప్పావు.
వాళ్లకి ఆజ్ఞలు, చట్టాలు, ఉపదేశాలు ఇచ్చేందుకు నీ సేవకుడు మోషేని వినియోగించావు.
15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు
వాళ్లకి నీవు ఆకాశంనుంచి తిండినిచ్చావు.
వాళ్లు దప్పి గొన్నప్పుడు
వాళ్లకి నీవు బండ నుంచి మంచి నీళ్లిచ్చావు.
వాళ్లకి చెప్పావు,
‘రండి, ఈ భూమి తీసుకోండని’
నీవు నీ శక్తిని వినియోగించి
వారికోసం ఆ భూమిని తీసుకున్నావు!
16 కాని వాళ్లు, మా పూర్వీకులు గర్వపడి కన్ను గానక ప్రవర్తించారు.
వాళ్లు మొండి వారై నీ ఆజ్ఞలు పాటించక నిరాకరించారు.
17 వాళ్లు నీ మాటలు తిరస్కరించారు.
వాళ్లకు నీవు చేసిన ఆశ్చర్యకారాలను అద్భుతాలను మరిచారు.
వాళ్లు మొండివారై ఎదురు తిరిగినప్పుడు,
వాళ్లు మళ్లీ వెనుకకు తిరిగి బానిసలయ్యారు.
“నీవు క్షమాశీలివి!
నీవు దయామయుడివి. కరుణామయుడివి.
నీవు ఓర్పుగలవాడివి. ప్రేమామయుడవు.
అందుకే నీవు వాళ్లను విడువలేదు.
18 వాళ్లు లేగ దూడల బంగారు బొమ్మలు చేసి, ‘మమ్మల్ని ఈజిప్టు నుంచి వెలికి తెచ్చిన దేవుళ్ళు వీరే’
అన్నా నీవు వాళ్లని వదిలేయలేదు!
19 నీవెంతో దయామయుడివి!
అందుకే వాళ్లని ఎడారిలో వదిలేయలేదు.
పగటివేళ మేఘస్థంభాన్ని
వాళ్లనుంచి తప్పించలేదు.
వాళ్లని నడిపిస్తూనే వచ్చావు.
రాత్రివేళ దీపస్తంభాన్ని
వాళ్ల దృష్టినుంచి తొలగించ లేదు.
వాళ్ల బాటకి వెలుగు చూపుతూనే వచ్చి
వాళ్లకి మార్గదర్శనం చేస్తూనే వచ్చావు.
20 వాళ్లని వివేకవంతుల్ని చేసేందుకు నీవు వారికి నీ మంచి ఆత్మను ఇచ్చావు.
వాళ్లకి ఆహారంగా మన్నానిచ్చావు.
వాళ్ల దప్పిక తీర్చేందుకు మంచి నీరిచ్చావు.
21 నీవు వాళ్లని నలుబదియేండ్లు పోషించావు!
ఎడారిలో అవసరమైనవన్నీ వాళ్లు పొందారు.
వాళ్ల దుస్తులు చిరిగి పోలేదు.
వాళ్ల పాదాలు వాయలేదు, గాయపడలేదు.
22 యెహోవా, నీవు వాళ్లకి రాజ్యాలిచ్చావు, దేశాలిచ్చావు,
జనాభా పలచగావున్న సుదూర ప్రాంతాలనిచ్చావు.
హెష్బోను రాజైన సీహోను దేశాన్నీ,
బాషాను రాజైన ఓగు దేశాన్నీ పొందారు వాళ్లు.
23 యెహోవా నీవు వాళ్ల సంతతివారిని విస్తరింప చేసావు.
వాళ్లు ఆకాశంలోని నక్షత్రాలంత మంది ఉండిరి.
వాళ్ల పూర్వీకులకి నీవివ్వ జూపిన దేశానికి
నీవు వాళ్లని తీసుకొచ్చావు.
వాళ్లు ఆ భూమిలో ప్రవేశించి, దాన్ని స్వాధీన పరుచుకున్నారు.
24 ఆ బిడ్డలు ఆ భూమిని వశపరచుకున్నారు.
అక్కడ నివసిస్తున్న కనానీయుల్ని వాళ్లు ఓడించారు.
ఆ ప్రజలను వాళ్లోడించేటట్టు నీవు చేశావు!
ఆ దేశ ప్రజలను, రాజులను
నీ ప్రజలేమి చేయదలచుకుంటే, అది చేయనిచ్చావు!
25 వాళ్లు బలీయమైన నగరాలను ఓడించారు.
సారవంతమైన భూమిని కైవసం చేసుకున్నారు.
మంచి వస్తువులతో నిండిన ఇళ్లూ,
అంతకు ముందే తవ్విన బావులూ వాళ్లకి చిక్కాయి.
వాళ్లకి ద్రాక్షాతోటలు, ఒలీవ చెట్లు, ఎన్నెన్నో రకాల ఫలవృక్షాలు చిక్కాయి.
వాళ్లు కడువునిండ తిని, కొవ్వెక్కారు.
వాళ్లకి నీవిచ్చిన ఎన్నెన్నో వింత వస్తుపులు వాళ్లు తనివితీరా అనుభవించారు.
26 మరి తర్వాత వాళ్లు నీకు ఎదురు తిరిగారు!
వాళ్లు నీ బోధనలను త్రోసిపుచ్చారు!
వాళ్లు నీ ప్రవక్తల్ని హతమార్చారు.
ఆ ప్రవక్తలు చేసిన తప్పిదం జనాన్ని హెచ్చరించడం,
వాళ్లని తిరిగి నీ వైపుకి తిప్ప ప్రయత్నించడం కొరకే కాని మా పూర్వీకులు నీకు ప్రతికూలంగా దారుణాలెన్నో చేశారు!
27 వాళ్ల శత్రువులు వాళ్లని చెరపట్టడానికి అందుకనే నీవు అనుమతించావు.
శత్రువులు వాళ్లని నానా ఇబ్బంది పెట్టారు.
కష్టాలు ఎదురైనప్పుడు మా పూర్వీకులు సహాయంకోసం నీకు మొర పెట్టుకున్నారు.
పరలోకంలో వున్న నీవు వాళ్ల మొర విన్నావు.
నీవు చాలా దయాశీలివి.
అందుకని నీవు వాళ్లని కాపాడేందుకు మనుషుల్ని పంపావు.
ఆ మనుష్యులు వాళ్లని వాళ్ల శత్రువుల నుంచి విడిపించారు.
28 సరే, పరిస్థితులు మెరుగవగానే మా పూర్వీకులు తిరిగి
ఎన్నెన్నో దారుణాలు చేయనారంభించారు!
నీవు మరలా శత్రువులు వారిని ఓడించి, శిక్షించేటట్టు చేశావు.
వాళ్లు మళ్లీ నీకు మొర పెట్టుకున్నారు.
పరలోకంలో ఉన్న నీవు ఆ మొర విని వాళ్లకి తోడ్డడావు.
నీవెంతో దయామయుడివి!
ఇలా జరిగింది ఎన్నెన్నోసార్లు!
29 నీవు వాళ్లని హెచ్చరించావు.
మంచి మార్గానికి తిరిగి రమ్మన్నావు.
అయితే, వాళ్లు మరీ గర్వపడి,
నీ ఆదేశాలను, ఆజ్ఞలను మీరారు.
జనం నీ ఆజ్ఞలను పాటిస్తే
వాళ్లు నిజంగా బ్రతుకుతారు.
కాని మా పూర్వీకులు నీ ఆజ్ఞలు ఉల్లంఘించారు
వాళ్లు మొండివారై,
నీకు పెడ ముఖమయ్యారు,
నీ ఆజ్ఞలు పెడచెవిన పెట్టారు.
30 “నీవు మా పూర్వీకుల పట్ల చాలా ఓర్పు వహించావు.
వాళ్లు నీతో సరిగా వ్యవహరించక పోయినా చాలా సంవత్సరాలు వాళ్లని సహించావు.
నీ ఆత్మతో వాళ్లని హెచ్చరించావు.
వాళ్లని హెచ్చరించేందుకు ప్రవక్తల్ని పంపావు.
కాని మా పూర్వీకులు వాళ్ల మాటలు వినలేదు.
అందుకే నీవు వాళ్లని విదేశాల్లోని మనుష్యులకు అప్పగించావు.
31 “అయితే, నీవెంతో దయామయుడివి!
వాళ్లని నీవు సర్వనాశనం చేయలేదు.
నీవు వాళ్లని విడువలేదు.
నీవెంతో దయామయుడివి, దేవా, నీవెంతో కరుణామయుడివి!
32 మా దేవా, నీవు మహా దేవుడివి,
భయంకరుడివి, శక్తిశాలియైన యోధుడివి!
నీవు దయామయుడివి, విశ్వాసనీయుడివి!
ఒడంబడికను తప్పని వాడివి!
మాకెన్నో కష్టాలు, కడగళ్లు వచ్చాయి.
మా కష్టాలు నీవు పట్టించుకుంటావు!
మా ప్రజలందరికీ,
మా రాజులకీ, మా పెద్దలకీ,
మా యాజకులకీ, మా ప్రవక్తలకీ ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి.
అష్షూరు రాజు పాలన కాలం నుంచి నేటిదాకా అవి వున్నాయి!
కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే వున్నాయి!
33 అందుకని దేవా మాకు సంభవించే ప్రతి దాన్నిగురించీ నీదే ఒప్పు,
మాదే తప్పు.
34 మా రాజులు, నాయకులు, యాజకులు, మరి మా పూర్వీకులు నీ ధర్మనిబంధనలు పాటించలేదు.
వాళ్లు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు,
నీ హెచ్చరికను ఖాతరు చేయలేదు.
35 తమ స్వదేశంలో నివసించినప్పుడు సైతం మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు.
వాళ్లు దుష్టకార్యాలు చేయడం మానలేదు.
నీవు వాళ్లకిచ్చిన అద్భుతమైన వాటన్నిటినీ హాయిగా అనుభవించారు.
వాళ్లు సారవంతమైన భూమిని అనుభవించారు సువిశాల దేశాన్ని ఏలుకున్నారు,
అయినా, తమ దుర్మార్గాలు వీడలేదు.
36 మరి ఇప్పుడు, మేము బానిసలము.
మేమీ భూమిలో ఏ భూమినీ,
దేని ఫలసాయాలనూ, ఇక్కడ పెరిగే మంచివాటన్నిటినీ
అనుభవించమని మా పూర్వీకులకు నీవిచ్చావో,
ఆ భూమిలో మేము ఈనాడు దాసులము.
37 ఈ భూమిలో పంట పుష్కలమైనదే
కాని మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు పోతుంది.
ఆ రాజులు మామీదా, మా పశువుల పైనా పెత్తనం చలాయిస్తారు.
తమకిష్టము వచ్చినట్లు వ్యవహరిస్తారు.
దేవా, మేము చాలా కష్టాల్లోవున్నాము.
38 వీటన్నింటి మూలంగా,
మార్చరాని స్థిరమైన ఒడంబడిక ఒకటి మేము చేసుకుంటున్నాము.
మేమీ ఒడంబడికను రాత పూర్వకంగా చేసుకొంటున్నాము.
మా నాయకులూ, లేవీయులూ, యాజకులూ ఈ ఒడంబడిక మీద సంతకాలు చేసి,
ఒక ముద్రతో దానికి ముద్ర[g] వేస్తున్నారు.”
పేతురు కుంటివానిని నయం చెయ్యటం
3 ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం. 2 కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించేవాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు. 3 ఈ కుంటివాడు పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు.
4 పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు. 5 ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు. 6 అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్నదాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ,
7 అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది. 8 అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు. 9 మందిరంలో ఉన్నవాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. 10 భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు.
పేతురు ఉపన్యసించటం
11 ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళారు.
12 పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు? 13 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పర్చాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు. 14 పవిత్రుడు, నీతిమంతుడు అయిన ఆయన్ని నిరాకరించి, ఆయనకు మారుగా ఒక హంతకుణ్ణి విడుదల చెయ్యాలని మీరు కోరారు. 15 మీరు మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.
16 “మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.
17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. 18 కాని, ‘క్రీస్తు తప్పక చనిపోవాలి’ అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేసాడు. 19 మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి. 20 మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు.
21 “చాలా కాలం క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసుకొన్న ప్రవక్తల నోటి ద్వారా యిలా అభయమిచ్చాడు. సర్వం పునఃస్థాపితం చేసేకాలం వచ్చేవరకు యేసు పరలోకంలోనే ఉండాలి. 22 మోషే ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులనుండి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి. 23 దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ళనుండి దూరం చేసి నాశనం చేస్తాడు.’(A)
24 “సమూయేలు కాలంనుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రానున్నాయని చెప్పారు. 25 మీ పూర్వికులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు మీరు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ వంశీయుని ద్వారా భూమ్మీద ఉన్న ప్రజలందర్ని దీవిస్తాను’(B) అని అన్నాడు. 26 దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.”
© 1997 Bible League International