Old/New Testament
యూదేతరులతో మిశ్రమ వివాహాలు
9 మేమీ పనులన్నీ ముగించాక ఇశ్రాయేలు నాయకులు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు: “ఎజ్రా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూ వున్నవారితో తమని తాము వేరుగా నిలుపుకోలేదు. యాజకులు, లేవీయులు సైతం తమ ప్రత్యేకతను కాపాడుకోలేదు. కనాను, హిత్తీ, పెరిజ్జీ, యెబూషీ, అమ్మోను, మెయాబు, ఈజిప్టు అమోరీ జాతులవారు చేసే పాపపు పనులతో ఇశ్రాయేలీయులు చెడుగా ప్రభావితులవుతున్నారు. 2 ఇశ్రాయేలీయులు మన చుట్టూ వున్న ఆయా జాతులవారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు తమ ప్రత్యేకతను నిలుపుకొని వుండవలసింది. కాని. వాళ్లు తమ చుట్టూవున్న ఇతర జాతీయులను పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు నాయకులు, ముఖ్య అధికారులు ఈ విషయంలో చెడ్డ విధానాన్ని అనుసరించారు.” 3 ఈ విషయాలు విన్న నేను నా మనో దుఃఖాన్ని తెలిపేందుకు అంగీని, పైవస్తాన్ని చింపుకున్నాను. నా జుట్టు, గడ్డం పీక్కున్నాను. కలత చెంది దిగ్భ్రాంతుడనై నేను కూర్చుండి పోయాను. 4 అప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రతి ఒక్కడూ భయకంపితుడయ్యాడు. చెరనుంచి తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని పట్ల నమ్మక ద్రోహులుగా వ్యవహారించినందుకు వాళ్లందరూ భయపడ్డారు. సాయంత్రపు బలివరకు కలతచెందిన నేను మాటలాడక అక్కడే కూర్చుండిపోయాను. అందరూ నా చుట్టూ మూగారు.
5 సాయంత్రపు బలివేళ అవడంతో, నేను లేచి నిలబడ్డాను. నా అంగీ, పై వస్త్రమూ చీలికలు పేలికలైవున్నాయి. యెహోవా దేవునివైపు చేతులు చాపి ప్రార్థిస్తూ, మోకరిల్లాను. 6 అప్పుడు నేనిలా ప్రార్థించాను:
“ఓ దేవా, ఎక్కువ సిగ్గుచేత, కలవరపాటుచేత నేను నీవైపు ముఖము ఎత్తలేకపోతున్నాను. మా పాపాలు, దోషాలు మా తలల ఎత్తును మీరిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయి. 7 మా పూర్వీకుల నాటినుంచి నేటి మా తరందాకా మేము అనేకానేక పాపాలు చేశాము. అందుకే మా రాజులూ, యాజకులూ శిక్షింపబడ్డారు. విదేశాల రాజులు మా పైన దాడి చేసి మా ప్రజలను బందీలుగా తీసుకుపోయారు. ఆ రాజులు మా సంపదను కొల్లగొట్టి, మమ్మల్ని అవమానానికి గురిచేశారు. ఈ నాటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.
8 “చివరికి ఇప్పుడు, దేవా, నీవు మాపట్ల దయ చూపావు. మాలో కొద్దిమంది చెరనుంచి తప్పించుకొని ఈ పవిత్ర ప్రాంతంలో నివసించడాన్ని సాధ్యంచేశావు. ప్రభువా, నీవు మాకు కొత్త జీవితం, దాస్యములో నుంచి విముక్తి ప్రసాదించావు. 9 మేము బానిసలుగా వున్నమాట నిజమే, కాని, నీవు మమ్మల్మి శాశ్వతంగా బానిసలుగా ఉండనియ్యవు. నీవు మాపట్ల దయ చూపావు. పారసీక ప్రభువులు మాపట్ల దయ చూపేలా నీవు చేశావు. నీ దేవాలయం ధ్వంసం చేయబడింది. కాని, నీవు మాకు నూతన జీవితం ప్రసాదించి, మేము నీ ఆలయాన్ని తిరిగి నిర్మించి, దాన్ని సరికొత్తదానిలా మలచగలిగే అవకాశం మాకు కల్పించావు. దేవా! యూదా, యెరూషలేములకు రక్షణగా ప్రాకారం కట్టేందుకు నీవు మాకు తోడ్పడ్డావు.
10 “ఇప్పుడు దేవా, నీకు మేము చెప్పగలిగింది ఏముంది? మేము మళ్లీ నీ మాట పాటించడం మానేశాం! 11 దేవా, నీవు నీ సేవకులైన నీ ప్రవక్తల ద్వారా ఆ ఆదేశాలను మాకు ఇచ్చావు. నీవు ఇలా అన్నావు, ‘మీరు స్వంతం చేసుకొని, నివసించబోయే ప్రాంతం అపవిత్రమైన భూమి. అక్కడ నివసిస్తూ వచ్చిన మనుష్యులు చేసిన చెడ్డపనుల మూలంగా అది అపవిత్రమైనది. వాళ్లు ఈ దేశంలో అన్నిచోట్లా ఇలాంటి చెడ్డపనులు చాలా చేశారు. వాళ్లు తమ పాపాలతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు. 12 అందుకని, ఇశ్రాయేలీయులారా, మీ బిడ్డలు వారి బిడ్డలను పెళ్లి చేసుకోకుండా చూడండి. మీరు వాళ్లతో కలవకండి! నా ఆదేశాలను పాటించండి, వారితో శాంతి ఒప్పందం చేయకండి. అప్పుడు మీరు శక్తి కలిగి, దేశంలోని మంచి వాటిని ఆనందంగా అనుభవించగలుగుతారు. అప్పుడు మీరు ఈ దేశాన్ని నిలుపుకొని, దాన్ని మీ బిడ్డలకు సంక్రమింప జేయగలుగుతారు.’
13 “మనకి వాటిల్లిన కష్టాలకు మన చెడ్డక్రియలే కారణం. మనం పాపాలు చేశాం, మన దోషాలు అనేకమైనవి. అయితే, ఓ దేవా, నీవు మమ్ముల్ని శిక్షించ వలసినంతగా శిక్షించలేదు. మేము ఘోరమైన పాపాలు ఎన్నో చేశాము. మమ్మల్ని నీవు ఇంకెంతో కఠినంగా శిక్షించియుండవలసింది. మాలో కొందర్ని దాస్యంలో సహితం తప్పించుకోనిచ్చావు. 14 నీ ఆదేశాలను భంగ పరచకూడదని మేము తెలుసుకున్నాము. మేము వాళ్లను పెళ్లి చేసుకోకూడదు. వాళ్లు చేసేవి చాలా చెడ్డ పనులు. దేవా, మేమా చెడ్డవాళ్లతో పెళ్లి కొనసాగించినట్లయితే, నీవు మమ్మల్ని నాశనం చేస్తావని మాకు తెలుసు! అప్పుడిక ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కడూ ప్రాణాలతో మిగిలివుండడు.
15 “యెహోవా, ఇశ్రాయేలు ప్రజల దేవా, నీవు నీతి మంతుడవై యున్నావు. మాలో కొందర్ని ప్రాణాలతో మిగిల్చావు. మా దోషం కారణంగా, మాలో ఒక్కడుకూడా నీ ముందు నిలిచేందుకు అర్హుడుకాడు.”
తమ పాపాలను ఒప్పుకున్న ప్రజలు
10 ఎజ్రా ఎడతెగకుండా శోకిస్తూ, ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుని ఆలయం ముందు విలపిస్తూ సాష్టాంగపడ్డాడు. ఎజ్రా అలా ప్రార్థిస్తూ వుండగా, ఇశ్రాయేలీయుల పెద్దల బృందం ఒకటి పురుషులు, స్త్రీలు, బాలబాలికలు అతని చుట్టూ గుమికూడింది. వాళ్లు కూడా భోరున విలపించసాగారు. 2 అప్పుడు ఏలాము సంతతివాడైన యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు: “మేము దేవునికి విశ్వాస పాత్రంగా వ్యవహరించలేదు. మేము మా చుట్టూ వున్న పరాయి జాతుల స్త్రీలను పెండ్లాడాము. అయితే, మేమీ పని చేసినా కూడా, ఇశ్రాయేలీయులకు ఇంకా ఆశవుంది. 3 ఇప్పుడిక్కడ మనం మన దేవుని ముందు ఆ స్త్రీలను, వాళ్ల పిల్లలను అందర్నీ బయటికి పంపేస్తామని ఒడంబడిక చేద్దాము. ఎజ్రా సలహానూ, మన దేవుని ఆదేశాలను గౌరవించేవారి సలహాలను పాటించేందుకుగాను మనం యీ పని చేద్దాము. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము. 4 ఎజ్రా, నీవు లే, ఇది నీ బాధ్యత, అయితే, మేమూ నీకు తోడ్పాటు ఇస్తాము. అందుకని నీవు ధైర్యంగా వుండి ఈ పని నిర్వహించు.”
5 అప్పుడు ఎజ్రా లేచి నిలబడ్డాడు. ముఖ్య యాజకుల చేత, లేవీయుల చేత, ఇశ్రాయేలీయులందరి చేత తాను చెప్పినది చేస్తామని వాగ్దానం చేయించుకున్నాడు. 6 తర్వాత, ఎజ్రా దేవుని ఆలయం ముందునుంచి ఎల్యాషీబు కొడుకు యోహానాను గదికి వెళ్లాడు. ఎజ్రా అక్కడ వున్నప్పుడు తిండి తినలేదు, నీరు తాగలేదు. యెరూషలేముకి చెరనుండి తిరిగి వచ్చిన ప్రజలు చేసిన దేవుని చట్ట ఉల్లంఘన విషయంలో ఇంకా చాలా దుఃఖితుడై పున్న కారణంగానే, అతనలా తిండి ముట్టకుండా ఉండిపోయాడు. 7 అటు తర్వాత, అతను యూదా, యెరూషలేములలో అన్నిచోట్లా చాటింపు వేయించాడు. ఆ చాటింపు సందేశంలో నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూద వ్యక్తులందరూ యెరూషలేములో సమావేశమవ్వాలని పేర్కొనబడింది. 8 మూడు రోజుల్లో అలా యెరుషలేముకి రాని వ్యక్తి తన ఆస్తినంతటినీ వదులుకోవలసివుంటుంది. అతను నివసిస్తున్న ప్రజాబృందం నుంచి వెలివేయ బడతాడు. ముఖ్య అధికారులూ, యూదా పెద్దలూ (నాయకులూ) యెరూషలేము వెళ్లాలని నిర్ణయం చేశారు.
9 దానితో, మూడు రోజుల్లో యూదా, బెన్యామీను వంశాలకు చెందిన పురుషులందరూ యెరూషలేములో సమావేశమయ్యారు. తొమ్మిదోనెల[a] ఇరవయ్యవ రోజున ప్రజలందరూ దేవాలయ ఆవరణలో సమావేశమయ్యారు. సమావేశ లక్ష్యం దృష్ట్యానూ, భారీ వర్షం మూలంగానూ వాళ్లందరూ ఎంతో కలవరపడ్డారు. 10 అప్పుడు ఎజ్రా యాజకుడు ఆ జనాన్ని ఉద్దేశించి యిలా ప్రసంగించాడు: “మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించలేదు. మీరు విదేశీయులను పెళ్లాడారు. మీరు అలా చేయడం ద్వారా ఇశ్రాయేలును మరింతగా నేరస్థం చేశారు. 11 మీరిప్పుడు నేరం చేసినట్లు యెహోవా ముందు ఒప్పుకోవాలి. యెహోవా మీ పూర్వీకుల దేవుడు. మీరు యెహోవా ఆజ్ఞను పాటించాలి. మీరు మీ చుట్టూ నివసించే అన్య ప్రజలనుంచీ, విదేశీ భార్యలనుంచీ వేరుపడాలి.”
12 అప్పుడు అక్కడ కూడిన అందరూ ఎజ్రాకి బిగ్గరగా ఇలా బదులిచ్చారు, “ఎజ్రా, నీవు చెప్పింది సరైన మాట! మేము నీవు చెప్పిన పనులు చెయ్యాలి. 13 అయితే, ఇక్కడ చాలామంది వున్నారు. ఇది వర్షాకాలం. మేమిక్కడ బయట నిలబడి వుండటం కష్టం. మేము చాలా తీవ్రమైన పాపం చేశాము. అందుకని, ఈ సమన్యను ఒకటి రెండు రోజుల్లో పరిష్కరించడం సాధ్యంకాదు. 14 ఇక్కడ సమావేశమైన వాళ్లందరి తరపున మా నాయకుల్ని నిర్ణయం తీసుకోమనండి. అటు తర్వాత, మా పట్టణాల్లో విదేశీ స్త్రీని పెళ్లి చేసుకున్న ప్రతివ్యక్తి ఒక నిర్ణీత సమయంలో యెరూషలేముకు రావాలి. వాళ్లు ఇక్కడికి తమ పెద్దలతో (నాయకులు) న్యాయాధిపతులతో కలిసి రావాలి. అప్పుడు మనపట్ల దేవుని కోపం ఆగుతుంది.”
15 కొద్దిమంది మాత్రమే ఈ ఏర్పాటును వ్యతిరేకించారు. అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యాయు. మెషుల్లాము, షబ్బెతైయు కూడా యీ తీర్మానాన్ని వ్యతిరేకించారు.
16 చెరనుంచి యెరూషలేముకు తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. యాజకుడు ఎజ్రా ఆయా వంశాల నాయకులను ఎంపికచేశాడు. అతను ఒక్కొక్క వంశం నుంచి ఒక్కొక్కరిని పేరు వరుసన ఎన్నుకున్నాడు. పదవ నెల[b] మొదటి రోజున ఎంపిక చేయబడిన వ్యక్తులు కూర్చుని ఒక్కొక్కరి విషయాన్ని విచారణ చేయనారంభించారు. 17 మొదటి నెల[c] మొదటిరోజు నాటికి విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్లందర్ని గురించీ చర్చలు ముగించారు.
విదేశీ స్త్రీలను వివాహం చేసుకున్నవాళ్ల జాబితా
18 విదేశీ స్త్రీలను వివాహం చేసుకున్న యాజకుల సంతతివారి పేర్లు యివి:
యోజాదాకు కొడుకు యేషూవ వంశీకుల నుంచి యేషూవ సోదరులు, మయశేయ, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా. 19 వీళ్లందరూ తమ భార్యలకు విడాకులు ఇస్తామని ప్రమాణం చేశారు. తర్వాత వాళ్లలో ప్రతి ఒక్కడూ తన నేర పరిహారం నిమిత్తం అపరాధ పరిహారార్థ బలిగా తన మంద నుంచి ఒక్కొక్క పొట్టేలును సమర్పించారు.
20 ఇమ్మేరు సంతతివారు: హనానీ, జెబద్యా
21 హారీము సంతతివారు: మయశేయా, ఏలియా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
22 పషూరు సంతతివారు: ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
23 లేవీయుల్లో పరాయి స్త్రీలను పెళ్లి చేసుకున్నవారు:
యోజాబాదు, షిమీ, కెలిథా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.
24 గాయకులలో: ఎల్యాషీబు. ద్వారపాలకులలో: షల్లూము, తెలెము, ఊరి.
25 ఇశ్రాయేలీయుల్లో ఈ క్రిందివారు పరజాతి స్త్రీలను పెళ్లిచేసుకున్నారు.
పరోషు సంతతివారు: రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా.
26 ఏలాము సంతతివారు: మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలియా.
27 జత్తూ సంతతివారు: ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.
28 బేబై వంశీకులు: యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.
29 బానీ సంతతివారు: మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, రామోతు.
30 పహత్మోయాబు సంతతివారు: అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్య, బెసలేలు, బన్నూయి, మనష్షే.
31 హారీము సంతతివారు: ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షీమ్యోను, 32 బెన్యామీను, మల్లూకు, షెమర్యా.
33 హాషుము సంతతివారు: మతైనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమీ,
34 బానీ సంతతివారు: మయదై, అమ్రాము, ఊయేలు, 35 బెనాయా, బేద్యా, కెలూహు, 36 వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు, 37 మత్తన్యా, మతైనై, యహశావు.
38 బిన్నూయి సంతతివారు: షిమీ, 39 షెమర్యా, నాతాను, అదాయా, 40 మక్నద్బయి, షామై, షారాయి, 41 అజరేలు, షెలెమ్యా, షెమర్యా, 42 షల్లూము, అమర్యా, యోసేవు.
43 నెబో సంతతివారు: యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా.
44 పై పురుషులందరూ పరాయి జాతుల స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వాళ్లలో కొందరు ఆ స్త్రీల ద్వారా సంతానం పొందారు కూడా.
యెరూషలేములో సమావేశం
1 ప్రియమైన థెయొఫిలాకు,
నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడిన రోజు వరకు జరిగినదంతా వ్రాసాను. 2 ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకొన్న అపొస్తలులకు[a] వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. 3 ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. 4 ఆయన వారిని ఒకసారి కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: “యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకిదివరకే చెప్పాను. 5 యోహాను నీళ్ళతో బాప్తిస్మమునిచ్చాడు. కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తిస్మము పొందుతారు.”
యేసు పరలోకానికి వెళ్ళటం
6 వాళ్ళంతా కలుసుకొన్నప్పుడు, “ప్రభూ! మీరు ఈ సమయాన ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా?” అని యేసును అడిగారు.
7 ఆయన వాళ్ళతో, “తండ్రి తన అధికారంతో గడియలను, రోజులను నియమించాడు. కాని వాటిని తెలుసుకొనే అవసరం మీకు లేదు. 8 కాని పవిత్రాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలోనూ, ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు” అని అన్నాడు.
9 ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది. 10 ఆయన వెళ్తూ ఉంటే వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకొన్న యిద్దరు వ్యక్తులు వాళ్ళ ప్రక్కన నిలుచొని వాళ్ళతో, 11 “గలిలయ ప్రజలారా! ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీనుండి పరలోకానికి తీసుకు వెళ్ళబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మళ్ళీ తిరిగి వస్తాడు” అని అన్నారు.
మత్తీయని ఎన్నుకోవటం
12 ఆ తర్వాత వాళ్ళు ఒలీవల కొండనుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది.[b] 13 వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, “జెలోతే”[c] అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా.
14 వీళ్ళంతా సమావేశమై ఒకే మనస్సుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండేవాళ్ళు.
15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. 16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు. 17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”
18 యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తర్వాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి ప్రేగులు బయటపడ్డాయి. 19 యెరూషలేములోని వాళ్ళంతా దీన్ని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమ అని పిలిచేవాళ్ళు. దీని అర్థం “రక్తపు భూమి.”
20 పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:
‘అతని భూమిని పాడు పడనిమ్ము
అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’(A)
‘అతని స్థానాన్ని యింకొకడు ఆక్రమించనిమ్ము!’(B)
21 “ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు వాళ్ళలో, అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్నవాళ్ళలో ఒకడై ఉండాలి. 22 అతడు యేసు ప్రభువు చావునుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటినుండి యేసును మననుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన దినం దాకా మనతో కలిసి జీవించినవాడై ఉండాలి.”
23 వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు, ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు. 24-25 అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అపొస్తలత్వాన్ని, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకొన్నవాణ్ణి మాకు చూపించు.” 26 ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.
© 1997 Bible League International