Old/New Testament
దర్యావేషు ఆజ్ఞ
6 దర్వావేషు రాజు తన ముందరి రాజుల చారిత్రక పత్రాలను గాలించవలసిందిగా ఆదేశించాడు. ఆ పత్రాలు బబులోనులో డబ్బును పదిలపరచిన ఖజానాలోనే పదిలపరచబడ్డాయి. 2 మాదీయ రాష్ట్రంలోని ఎగ్బతానా కోటలో చుట్టబడిన పత్రం ఒకటి కనిపించింది. ఆ చుట్టబడిన పత్రం[a] లో యిలా వ్రాయబడి వుంది:
అధికార పత్రం: 3 కోరెషు రాజు పాలన మొదటి సంవత్సరంలో, కోరెషు యెరూషలేములోని దేవాలయం విషయంలో ఈ క్రింది ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞలో ఇలా పేర్కొనబడింది:
బలులు అర్పించేందుకు అనువైన యెరూషలేము దేవాలయం తిరిగి నిర్మించబడాలి. దానికి పునాదులు వెయ్యనియ్యండి, దేవాలయం (పొడవు 90 అడుగులు, వెడల్పు 90 అడుగులు వుండాలి.) 4 దాని చుట్టూ వుండే గోడ మూడు వరుసల పెద్ద రాళ్లతో, ఒక వరుస పెద్ద కొయ్య దూలాలతో నిర్మింపబడాలి. దేవాలయ నిర్మాణానికయ్యే ఖర్చులు రాజు ఖజానానుంచి చెల్లించాలి. 5 అంతేకాదు, దేవాలయం నుంచి తెచ్చిన వెండి, బంగారు వస్తువులు తిరిగి వాటి వాటి స్థానాల్లో వుంచబడాలి. వెనక, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయంలోంచి కొల్లగొట్టి, ఆ వస్తువులను బబులోనుకు తెచ్చాడు. వాటిని తిరిగి ఆ దేవాలయంలో వుంచాలి.
6 ఇప్పుడిక దర్యావేషునైన నేను,
యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంత అధికారియైన తత్తెనైయు, షెతర్బోజ్నయినీ, ఆ రాజ్యంలో నివసించే అధికారులందరినీ యెరూషలేముకు దూరంగా పుండవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. 7 అక్కడి పనివాళ్లని వేధించకండి. ఆ దేవాలయ నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నించకండి. యూదా పాలనాధికారీ, యూదా నాయకులూ ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించాలి. ఆ దేవాలయం పూర్వం ఎక్కడున్నదో సరిగ్గా అదే స్థలంలో దాన్ని తిరిగి నిర్మించాలి.
8 ఇప్పుడు నేనీక్రింది ఆజ్ఞను జారీ చేస్తున్నాను. దేవాలయం నిర్మిస్తున్న యూదా పెద్దలకు, మీరు ఈ క్రింది పనులు చెయ్యాలి. దేవాలయ నిర్మాణ ఖర్చులు పూర్తిగా ఖాజానానుంచి చెల్లింపబడాలి. ఆ సొమ్ము యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలోని రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేయబడాలి. ఆ నిర్మాణం ఆగిపోకుండా వుండేందుకుగాను మీరీ పనులు త్వర త్వరగా చెయ్యాలి. 9 వాళ్లకి ఏమి కావాలన్నా సరే ఇవ్వండి. పరలోక దేవునికి బలి ఇచ్చేందుకు వాళ్లు దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు కావాలంటే, వాటిని వాళ్లకి ఇవ్వండి. యెరూషలేము యాజకులు గోధుమలు, ఉప్పు, ద్రాక్షారసం, నూనె కావాలంటే, వాటిని మీరు ప్రతిరోజూ వాళ్లకి తప్పనిసరిగా ఇవ్వండి. 10 పరలోక దేవుని సంతృప్తి పరచేందుకోసం మీరు వీటిని యూదా యాజకులకు ఇవ్వండి. ఆ యాజకులు నా కోసం, నా కొడుకుల కోసం ప్రార్థన చేసేందుకుగాను మీరు వాటిని వాళ్లకి ఇవ్వండి.
11 దీనికీ తోడు నా మరో ఆజ్ఞ: ఎవరైనా ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే అతని ఇంటి దూలాన్ని ఊడపీకి, దానితో అతని పొట్టలో పొడవాలి. అతని ఇంటిని ధ్వంసంచేసి, దాన్నొక రాళ్ల కుప్పగా మార్చాలి.
12 దేవుడు యెరూషలేములో తన నామమును ఉంచాడు. ఈ నా ఆజ్ఞను ధిక్కరించ ప్రయత్నించే వ్యక్తి ఒక రాజైనా, మరొకడెవడైనా, అతన్ని ఆ దేవుడు ఓడిస్తాడని నేను ఆశిస్తున్నాను, యెరూషలేములోని ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ఏ వ్యక్తి అయినా ప్రయత్నిస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
జాగ్రత్త, ఇది నా (దర్యావేషు రాజు) తిరుగులేని ఆజ్ఞ. దీన్ని విధిగా వెంటనే, పూర్తిగా పాటించాలి!
దేవాలయ నిర్మాణ పనిపూర్తి, ప్రతిష్ఠ
13 సరే, యూఫ్రటీసు నది పశ్చమ ప్రాంత పాలనాధికారి తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు దర్యావేషు రాజు ఆజ్ఞను సంపూర్ణంగా పాటించారు. 14 దానితో, యూదుల పెద్దలు (నాయకులు) నిర్మాణ కృషిని కొనసాగించారు. ప్రవక్త హగ్గయి, ఇద్దో కొడుకు జెకర్యాల ప్రోత్సాహంతో వాళ్లు జయప్రదమయ్యారు. వాళ్ల దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞాపాలన క్రమంలో యీ పని పూర్తయింది. ఈ పని పూర్తయ్యేందుకు పారసీక రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆజ్ఞలు పాలింపబడటం కూడా కారణమే. 15 దేవాలయ నిర్మాణం అదారు నెల, మూడవ రోజున[b] దర్వావేషు రాజు పాలన ఆరవ ఏట[c] పూర్తయింది.
16 అప్పుడిక ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, నిర్భంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన ఇతరులు ఆ దేవాలయ ప్రతిష్ఠను పెద్ద పండుగలా, ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.
17 వాళ్లు దేవాలయ ప్రతిష్ఠ పండుగను యిలా జరుపుకున్నారు: వాళ్లు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపోతులను బలి ఇచ్చారు. వాళ్లు 12 మేకపోతులను ఇశ్రాయేలీయులందరి కొరకు పాపపరిహారార్థ బలిగాయిచ్డారు. అది ఒక్కొక్క వంశానికి ఒకటి చొప్పున 12 వంశాల ఇశ్రాయేలీయులకు. 18 అటు తర్వాత, యెరూషలేము దేవాలయంలో సేవల నిమిత్తం వాళ్లు తమ వంశాల్లోనూ, లేవీయులు తమ వంశాల్లోనూ, యాజకులను ఎంపిక చేశారు. వాళ్లీ కార్యక్రమాలను సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలోని నిబంధనల ప్రకారం చేశారు.
పస్కా పండుగ
19 [d] మొదటి నెల పద్నాల్గవ రోజున నిర్బంధంనుంచి వెనక్కి తిరిగి వచ్చిన యూదులు పస్కా పండుగ జరుపుకున్నారు. 20 యాజకులు, లేవీయులు ఆ రోజున తమను తాము శుద్ధిచేసుకున్నారు. వాళ్లందరూ తమని తాము శుభ్రం చేసుకుని పస్కా పండుగ నాడు చేసుకునేందుకు సంసిద్ధులయ్యారు. లేవీయులు నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూదులందరి కోసం పస్కా పండుగ గొర్రెపిల్లల్ని బలియిచ్చారు. వాళ్లీ బలిని తమ సోదరులైన యాజకుల కోసం, తమకోసం ఇచ్చారు. 21 అలాగు, నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ పస్కా పండుగ భోజనం చేశారు. ఇతరులు స్నానాదులతో తమని తాము శుభ్రం చేసుకుని, ఆ దేశంలో నివసించే ఇతర మనుష్యుల అపరిశుభ్ర అంశాలనుంచి తమని తాము వేరు చేసుకున్నారు. అలా పరిశుద్ధులైన వాళ్లు కూడా పస్కా పండుగ భోజనంలో పాల్గొన్నారు. వాళ్లు సహాయం కోసం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దగ్గరకు పోగలిగేందుకు, వారు తమ్మును తాము వేరు చేసుకొని పరిశుద్ధ పరచుకొన్నారు. 22 వాళ్లు ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. అష్షూరు రాజు[e] మనోవైఖరిని మార్చి, యెహోవా వాళ్లకెంతో సంతోషం కలిగించాడు. దానితో, అష్షూరు రాజు దేవాలయ పునర్నిర్మాణ కృషిని సాగిం చేందుకు వాళ్లకి తోడ్పడ్డాడు.
యెరూషలేముకు ఎజ్రా రాక
7 ఈ సంఘటనల తర్వత[f] పారసీక రాజు అర్తహషస్త పాలన కాలంలో ఎజ్రా బబులోను నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఎజ్రా శెరాయా కొడుకు. శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు, 2 హిల్కీయా షల్లూము కొడుకు. షల్లూము సాదోకు కొడుకు, సాదోకు అహిటూబు కొడుకు, 3 అహిటూబు అమర్యా కొడుకు. అమర్యా అజర్యా కొడుకు. అజర్యా మెరాయోతు కొడుకు. 4 మెరాయోతు జెరహ్యా కొడుకు. జెరహ్యా ఉజ్జీ కొడుకు. ఉజ్జీ బుక్కీ కొడుకు. 5 బుక్కీ అబీషూవ కొడుకు. అబీషూవ ఫీనెహాసు కొడుకు. ఫీనెహాసు ఎలియాజరు కొడుకు. ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కొడుకు.
6 బబులోను నుండి యెరూషలేముకు వచ్చిన ఎజ్రా గొప్ప ఉపదేశకుడు.[g] అతనికి మోషే ధర్మశాస్త్రం యెహోవా ద్వారా ఇవ్వబడింది. యెహోవా ఎజ్రాకి తోడుగా వున్నాడు. అందుకని, అర్తహషస్త మహారాజు ఎజ్రా కోరుకున్నదల్లా ఇచ్చాడు. 7 ఎజ్రాతోబాటు అనేక మంది ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చారు. వాళ్లతో యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వార పాలకులు, ఆలయ సేవకులు వున్నారు. ఆ ఇశ్రాయేలీయులు అర్తహషస్త రాజు పాలన ఏడవ సంవత్సరంలో యెరూషలేముకి తిరిగి వచ్చారు. 8 అర్తహషస్త రాజుగా అయిన ఏడవ సంవత్సరం, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేముకి చేరుకున్నాడు. 9 ఎజ్రా, అతనితో ఒక బృందం మొదటి నెల మొదటి రోజున బబులోను నుంచి బయల్దేరారు. ఎజ్రా యెరూషలేముకి అయిదవ నెల ఒకటవ రోజున చేరుకున్నాడు. యెహోవా దేవుడు అతనికి తోడుగా వున్నాడు. 10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్ర అధ్యయనానికి, దాన్ని అనుసరించేందుకూ తన కాలమంతటినీ ఎంతో శ్రద్ధగా వినియోగించాడు. ఎజ్రా ఇశ్రాయేలీయులకు యెహోవా ఆజ్ఞలనూ, ఆదేశ సూత్రాలనూ బోధించాలని కోరుకున్నాడు. అంతమాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆజ్ఞలను అనుసరించడంలో వారికి తోడ్పడాలని కూడా అతను కోరుకున్నాడు.
ఎజ్రాకి అర్తహషస్త రాజు లేఖ
11 ఎజ్రా యాజకుడు, ఉపదేశకుడు, యెహోవా ప్రభువు ఆదేశాలను గురించీ, ధర్మశాస్త్ర నిబంధనలను గురించీ అతనికి బాగా తెలుసు.
12 ఎజ్రా ఉపదేశకునికి అర్తహషస్త మహారాజు పంపిన లేఖనకలు: యాజకుడూ, పరలోక దేవుని ధర్మశ్రాస్త ఉపదేశకుడూ అయిన ఎజ్రాకి:
అభివందనాలు!
13 ఈ క్రింది ఆజ్ఞ జారీ చేస్తున్నాను, నా సామ్రాజ్యంలో నివసిస్తున్న ఏ వ్వక్తి, యాజకుడు, లేక లేవీయుడు అయినా ఎజ్రాతోబాటు యెరూషలేముకు పోవాలనుకుంటే, అతనలా పోవచ్చు.
14 ఎజ్రా! నా ఏడుగురు మంత్రులూ, నేనూ, నిన్ను పంపిస్తున్నాం. నీవు యూదాకి, యెరూషలేముకి వెళ్లాలి. మీ దేవుని ధర్మశాస్త్రాన్ని మీ ప్రజలు ఎలా ఆచరిస్తున్నారో పరిశీలించు, పర్యవేక్షించు. ఆ ధర్మశాస్త్రం నీ దగ్గర వుంది కదా.
15 నా మంత్రులూ, నేనూ ఇశ్రాయేలు దేవునికి వెండి బంగారాలు యిస్తున్నాం. దేవుడు యెరూషలేములో వుంటాడు. నీవు నీతో ఈ వెండి, బంగారాలు తీసుకువెళ్లాలి. 16 అంతేకాదు, నీవు బబులోను దేశంలోని రాష్ట్రాలన్నింట్లోనూ పర్యటించి, మీ ఇశ్రాయేలు ప్రజలనుంచీ, యాజకుల నుంచీ, లేవీయుల నుంచీ కానుకలు పోగుచెయ్యి. ఆ కానుకలు యెరూషలేములోని ఆలయ నిర్మాణం నిమిత్తం ఉద్దేశింపబడ్డాయి.
17 ఆ సొమ్మును ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను కొనేందుకు వినియోగించు. ఆ బలులతోబాటు సమర్పించవలసిన ధాన్యార్పణలనూ, పానార్పణలనూ కొను. తర్వాత యెరూషలేములోని మీ దేవుని దేవాలయంలో వాటిని బలి ఇవ్వు. 18 తర్వాత నీవూ, నీ సోదర యూదులూ ఇంకా మిగిలిపోయిన వెండి బంగారాలను మీ ఇష్టం వచ్చిన విధంగా వాడు కోవచ్చు. దాన్ని మీ దేవునికి ప్రీతికరమైన పద్ధతిలో ఉపయోగించు. 19 నీవు వస్తువులన్నీ యెరూషలేము దేవుని సన్నిధికి తీసుకుపో. ఆ వస్తువులు మీ దేవుని ఆరాధన కోసం. 20 మీ దేవుని ఆలయం కోసం అవసరమైన అనేక ఇతర వస్తువులను కూడ మీరు పొందవచ్చు. నీకు అవసరమైన ఏ వస్తువు కోసమైనా సొమ్మును రాజ ఖజానా నుంచి తీసుకో.
21 అర్తహషస్త రాజునైన నేను ఈ క్రింది ఆజ్ఞను జారీచేస్తున్నాను: యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో రాజధనాన్ని పర్యవేక్షిస్తున్న వ్యక్తులందరికీ ఎజ్రా ఏమి కోరుకుంటే, దాన్ని అతనికి ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఎజ్రా యాజకుడు, పరలోక దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే ఉపదేశకుడు. మీరీ పనిని సత్వరం సంపూర్ణంగా చెయ్యండి. 22 మీరు ఎజ్రా 3,400 కిలో గ్రాముల వెండిని, వెయ్యి తూముల గోధుమలను, 2,200 లీటర్ల ద్రాక్షారసమును, 2,200 కిలో గ్రాములు ఒలీవ నూనెను అడిగినంత ఉప్పును యివ్వండి. 23 పరలోక దేవుడు ఎజ్రా కోసం ఏమి ఆదేశిస్తే, దాన్ని మీరు ఎజ్రాకి సత్వరం, సంపూర్ణంగా ఇవ్వండి. మీరీ పనులు పరలోక దేవుని ఆలయంకోసం చెయ్యండి. దేవునికి నా సామ్రాజ్యం మీదా, నా కొడుకుల మీదా కోపం రావడం నాకు యిష్టం లేదు.
24 యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు, దేవాలయంలోని యితర పనివాళ్ల దగ్గర పన్నులు వసూలు చేయడం ధర్మశాస్త్ర విరుద్ధమన్న విషయం మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్లు పన్నులు, రాజుగారికి నజరానాలు, ఏ విధమైన సుంకపు పన్నులు చెల్లించ నక్కర్లేదు. 25 ఎజ్రా, మీ దేవుని యొద్ద నుంచి నీవు పొందిన వివేకాన్ని వినియోగించి పౌర, మతపర న్యాయాధిపతులను ఎంపికచేసే అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. వాళ్లు యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ న్యాయాధిపతులుగా వ్యవహరిస్తారు. నీ దేవుని ఆజ్ఞలను ఎరిగిన ప్రజలకందరికీ వారు తీర్పుతీరుస్తారు. దేవుని ఆజ్ఞలను గురించి వారు తెలియని వారికి నేర్పాలి. 26 మీ దేవుని ధర్మశాస్త్రాన్నిగాని, రాజ శాసనాన్నిగాని ఎవరైనా మన్నించకపోతే, అతను శిక్షించబడాలి. నేరాన్ని బట్టి అతనికి మరణ దండనో లేక దేశాంతరవాస శిక్షో విధించాలి, లేక అతని ఆస్తిని జప్తు చేయాలి, లేక అతన్ని చెరసాలలో పెట్టాలి.
దేవునికి ఎజ్రా స్తోత్రాలు
27 [h] యెరూషలేములో వున్న యెహోవా ఆలయానికి ఘనత చేకూర్చాలనే తలంపును రాజు మదిలో నాటిన ప్రభువుకు, మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు కీర్తి కలుగునుగాక! 28 రాజు, ఆయన మంత్రుల, ఇతరేతర ముఖ్యాధికారుల ఎదుట నాపై నిజమైన ప్రేమను ప్రభువు చూపించాడు. దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు, అందుకే నేను ధైర్యంగా ఉన్నాను. యెరూషలేముకు నాతో పోయేందుకు నేను ఇశ్రాయేలీయుల నాయకులను ప్రోగుచేశాను.
ఎజ్రాతో తిరిగివచ్చిన పెద్దల జాబితా
8 రాజు అర్తహషస్త పాలన కాలంలో బబులోను నుంచి యెరూషలేముకు నాతో (ఎజ్రా) పాటు తిరిగివచ్చిన ఆయా కుటుంబాల పెద్దల, తదితరుల పేర్ల జాబితా ఇది:
2 ఫీనెహాసు సంతతి నుంచి గెర్షోము; ఈతామారు సంతతినుంచి దానియేలు; దావీదు సంతతి నుంచి హట్టూషు:
3 షెకన్యా సంతతినుంచి పరోషు; పరోషు సంతతినుంచి జెకర్యా, మరో 150 మంది పురుషులు;
4 పహత్మోయాబు సంతతినుంచి జెరహ్యా కొడుకు ఎల్యోయేనై, మరో 200 మంది పురుషులు;
5 షెకన్యా సంతతి నుంచి యహజీయేలు కొడుకు షెకన్యా, మరో 300 మంది పురుషులు;
6 అదీను సంతతినుంచి యోనాతాను కొడుకు ఏబెదు, మరో 50 మంది పురుషులు;
7 ఏలాము సంతతి నుంచి అతల్యా కొడుకు యెషయా, మరో 70 మంది పురుషులు;
8 షెపట్య సంతతినుంచి మిఖాయేలు కొడుకు జెబద్యా, మరో 80 మంది పురుషులు;
9 యోవాబు సంతతినుంచి యెహీయేలు కొడుకు ఓబద్యా, మరో 218 మంది పురుషులు;
10 షెలోమీతు సంతతినుంచి యోసిప్యా కొడుకు షెలోమీతు, మరో 160 మంది పురుషులు;
11 బేబై సంతతినుంచి బేబై కొడుకు జెకర్యా, మరో 28 మంది పురుషులు;
12 అజ్గాదు సంతతినుంచి హక్కాటాను కొడుకు యోహానాను, మరో 110 మంది పురుషులు;
13 అదోనీకాము సంతతిలో చివరి వారినుంచి ఎలీఫెలెటు; యెహీయేలు, షెమాయా, మరో 60 మంది పురుషులు;
14 బిగ్వయి సంతతినుంచి ఊతైయు, జబ్బూదు, మరో 70 మంది పురుషులు.
యెరూషలేముకు తిరిగి రాక
15 నేను (ఎజ్రా) వాళ్లందరినీ అహవా వైపు పారే ఒక నది దగ్గర సమావేశపరిచాను. మేము మూడు రోడుల పాటు అక్కడనే యుంటిమి. ఆ బృందంలో యాజకులు వున్నారుగాని, లేవీయులెవ్వరూ లేరన్న విషయం నేను గమనించాను. 16 అందుకని, నేను ఎలియెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, (మరో) ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లూము అనే పెద్దలను పిలిచాను. వీరికి తోడు యోయారీబు, ఎల్నాతాను అనే మరో ఇద్దర్ని (వీళ్లిద్దరూ ఉపాధ్యాయులు) కూడా పిలిచాను. 17 వాళ్లని ఇద్దో వద్దకు పంపించాను. ఇద్దో కాసిఫ్యా పట్టణానికి నాయకుడు. ఇద్దోకీ, అతని బంధువులకు ఏమి చెప్పాలో వివరించి నేను నా మనుష్యులను అక్కడికి పంపాను. ఇద్దో బంధువులు కాసిఫ్యాలో దేవాలయ సేవకులు దేవాలయంలో పనిచేసే సేవకులను పంపవచ్చునన్న ఆశతో నేను నా మనుష్యులను ఇద్దో దగ్గరికి పంపాను. 18 దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి, ఇద్దో బంధువులు ఈ క్రిందివాళ్లను మాకు పంపారు: మావీ సంతతి నుంచి షేరేబ్యా అనే ఒక వివేకి (మాలీ లేవీ సంతతుల్లో ఒకడు. లేవీ ఇశ్రాయేలు కొడుకుల్లో ఒకడు. వాళ్లు అతని కొడుకునీ, అన్నదమ్ముల్నీ కూడా పంపారు. మొత్తంమీద ఆ కుటుంబానికి చెందిన వాళ్లు 18 మంది). 19 మెరారీ సంతతివారి నుంచి హషబ్యా, యెషయా (వాళ్లు తమ కొడుకులను, సోదరులను, బందువులను కూడా పంపారు, ఆ కుటుంబం నుంచి మొత్తం 20 మంది మగాళ్లు వచ్చారు) 20 వారితోపాటు 220 మంది దేవాలయ పరిచారకులు వచ్చారు. (వాళ్లు లేవీయులకు సాయం చేసేవాళ్లు. వాళ్ల పూర్వీకులు దావీదు చేత, ముఖ్యాధికారుల చేత ఎంపిక చేయబడినవాళ్లు. వాళ్లందరి పేర్లూ వ్రాసి వుంచబడ్డాయి).
21 అక్కడ, ఆ అహవా నది దగ్గర నేను (ఎజ్రా) మనమందరం ఉపవాసం చెయ్యాలని ప్రకటించాను. మన దేవుని ముందు విధేయత చూపేందుకుగాను మనం ఉపవాసం చెయ్యాలి. మేమూ, మా పిల్లలూ, మాకున్న సమస్త వస్తువులూ క్షేమంగా యెరూషలేము చేరేలా దీవించుమని దేవుణ్ణి వేడు కోవాలనుకున్నాము. 22 మా ప్రయాణ మార్గంలో మా రక్షణ కోసం సైనికుల్నీ, అశ్వికుల్నీ పంపమని అర్తహషస్త రాజుని అర్థించడం నాకు సిగ్గుగా తోచింది. మార్గంలో శత్రువులున్నారని నాకు తెలుసు. అయితే అర్తహషస్త రాజుకి మేమంతకు ముందు ఇలా చెప్పివున్నాము: “మా దేవుడు తనని నమ్మే ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాడు. అయితే, దేవుడు తనకు ఎడముఖంగా వున్న ప్రతి ఒక్కనిపట్లా చాలా కోపంగా వుంటాడు.” 23 అందుకని, మేము ఉపవాసం వుండి, మా ప్రయాణం గురించి మేము దేవుణ్ణి ప్రార్థించాము. ఆయన మా ప్రార్థనలకు జవాబిచ్చాడు.
24 తర్వాత నేను పన్నెండుగురు ముఖ్య యాజకులను, షెరేబ్యాను, హషబ్యాను, వాళ్ల సొదరులు పది మందిని ఎంపికచేశాను. 25 దేవాలయం కోసం ఇవ్వబడిన వెండిని, బంగారాన్ని తదితర వస్తువులను తూకం వేయించాను. నేను ఎంపికచేసిన పన్నెండుగురు యాజకులకు నేను వాటిని అప్పగించాను. అర్తహషస్త రాజు, ఆయన మంత్రులు, ఆయన ముఖ్యాధికారులు, బబులోనులోని ఇశ్రాయేలీయులు అందరూ దేవుని దేవాలయం కోసం యిచ్చిన వస్తువులవి. 26 నేను వాటన్నింటినీ తూకం వేశాను. వెండి 25 టన్నులు వుంది. వెండిగిన్నెలు, వస్తువులు మూడుమ్ముప్పాతిక టన్నులున్నాయి. మూడుమ్ముప్పాతిక టన్నుల బంగారం వుంది. 27 నేను వాళ్లకి 20 బంగారు గిన్నెలు యిచ్చాను. అవి 19 పౌనుల బరువున్నాయి. నేను వాళ్లకి మెరుగు పెట్టిన కంచుతో చేసిన అందమైన రెండు పాత్రలు ఇచ్చాను. అవి బంగారు వస్తువులంతటి విలువైనవి. 28 తర్వాత నేనా పన్నెండుగురు యాజకులతో యిలా చెప్పాను: “యెహోవా దేవుని దృష్టిలో మీరు పవిత్రులు, ఆ వస్తువులు పవిత్రమైనవి. ప్రజలు యీ వెండి బంగారాలను మీ పూర్వీకుల దేవునికి యిచ్చారు. 29 అందుకని, మీరీ వస్తువులను జాగ్రత్తగా కాపాడండి. యెరూషలేములోని దేవాలయ పెద్దలకు మీరు వీటిని అప్పగించేదాకా, యీ వస్తువులకు మీరే బాధ్యులు. మీరు వీటిని ముఖ్య లేవీయులకి, ఇశ్రాయేలు కుటుంబ పెద్దలకీ యిచ్చినప్పుడు వాళ్లు వీటిని తూకం వేసి, యెరూషలేములోని యెహోవా దేవాలయంలోని గదుల్లో పదిలపరుస్తారు.”
30 ఎజ్రా తూకం వేసి తమకిచ్చిన వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ యాజకులూ, లేవీయులు స్వీకరించి, ఎజ్రా చెప్పినట్లు, వాటిని యెరూషలేము లోని దేవాలయానికి చేర్చేందుకు సంసిద్ధులయ్యారు.
31 మొదటి నెల పన్నెండవ రోజున మేము అహవానది దగ్గరనుంచి యెరూషలేముకు బయల్దేరాము. దేవుడు మాకు తోడుగావుండి, మార్గంలో శత్రువులనుంచీ, దోపిడిగాండ్రనుంచీ మమ్మల్ని కాపాడాడు. 32 చివరకు మేము యెరూషలేము చేరుకున్నాము. మేమక్కడ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాము. 33 నాల్గవ రోజున దేవాలయానికి వెళ్లి వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ తూకం వేశాము. మేమా వస్తువులను ఊరియా యాజకుని కొడుకైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో ఫినేహాసు కుమారుడు ఎలీయాజరు వున్నాడు. వాళ్లతోబాటు లేవీయులైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా వున్నారు. 34 మేము అన్ని వస్తువులనూ లెక్క పెట్టి, వాటన్నింటినీ తూకం వేశాము. తర్వాత మేము అప్పటి మొత్తం బరువును వ్రాసి పెట్టాము.
35 అటు తర్వాత నిర్బంధంనుంచి తిరిగివచ్చిన యూదులు ఇశ్రాయేలు దేవునికి దహనబలులు అర్పించారు. వాళ్లు ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పోట్టేళ్లను, 77 మగ గొర్రెపిల్లలను, పాప పరిహారార్థబలి నిమిత్తం 12 మేక పోతులను బలి యిచ్చారు. ఇవన్నీ దహసబలిగా ఇవ్వబడ్డాయి.
36 అటుతర్వాత వాళ్లు అర్తహషస్త ఆజ్ఞలను రాజ ప్రతినిధులైన సామంత నాయకులకు, యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికారులకు అందజేశారు. కనుక వారందరూ వచ్చి దేవుని ఆలయపు పనిలో సహాయపడ్డారు.
యేసు మళ్ళీ కనిపించటం
21 ఆ తర్వాత తిబెరియ సముద్రం దగ్గర యేసు మళ్ళీ కనిపించాడు. అది ఈ విధంగా జరిగింది: 2 సీమోను పేతురు, దిదుమ అని పిలువబడే తోమా, గలిలయలోని కానా పట్టణానికి చెందిన “నతనయేలు”, జెబెదయి కుమారులు, మరొక యిద్దరు శిష్యులు, అంతా కలిసి ఒక చోట ఉన్నారు. 3 సీమోను పేతురు, “నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు.
మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము” అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కాని ఆ రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు.
4 తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిలుచొని ఉన్నాడు. కాని శిష్యులు ఆయనే “యేసు” అని గ్రహించలేదు. 5 యేసు, “మిత్రులారా! చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు.
“లేదు” అని వాళ్ళన్నారు.
6 ఆయన, “పడవ కుడి వైపు మీ వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని అన్నాడు. వాళ్ళు ఆయన చెప్పిన విధంగా వల వేసారు. చేపలు ఎక్కువగా వలలో పడటంవల్ల వాళ్లు ఆ వల లాగలేక పొయ్యారు.
7 యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “అదిగో చూడు ప్రభువు” అని అన్నాడు. సీమోను పేతురు, “అదిగో ప్రభువు!” అని అతడు అనటం విన్న వెంటనే, యిది వరకు తీసివేసిన తన పై వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు. 8 మిగతా శష్యులు ఒడ్డుకు వంద గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను నడుపుకుంటూ అతణ్ణి అనుసరిస్తూ ఒడ్డును చేరుకున్నారు. 9 వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గల మీద చేపలు ఉండటం చూసారు. కొన్ని రొట్టెలు కూడా అక్కడ ఉన్నాయి. 10 యేసు వాళ్ళతో “మీరు పట్టిన కొన్ని చేపలు తీసుకురండీ” అని అన్నాడు.
11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు! 12 యేసు వాళ్ళతో, “రండి! వచ్చి భోజనం చెయ్యండి” అని అన్నాడు. “మీరెవరు” అని అడగటానికి శిష్యుల కెవ్వరికీ ధైర్యం చాలలేదు. 13 యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, రొట్టెను తీసుకొని వాళ్ళకిచ్చాడు. అదే విధంగా చేపల్ని కూడా యచ్చాడు.
14 ఆయన బ్రతికింపబడ్డాక తన శిష్యులకు కనిపించడం యిది మూడవసారి.
యేసు మరియు పేతురు
15 వాళ్ళు భోజనం చెయ్యటం ముగించాక యేసు, సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ! వీళ్ళకన్నా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు.
“ఔను ప్రభూ! ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు.
యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు!” అని అన్నాడు.
16 యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ! నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?” అని మళ్ళీ అడిగాడు.
అతడు, “ఔను ప్రభూ! నేను ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు.
యేసు, “నా గొఱ్ఱెల్ని జాగ్రత్తగా చూసుకో!” అని అన్నాడు.
17 మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ! నన్ను ప్రేమిస్తున్నావా?” అని అన్నాడు.
మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా” అని అడిగినందుకు పేతురు మనస్సు చివుక్కుమన్నది. అతడు, “ప్రభూ! మీకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా తెలుసు” అని అన్నాడు.
యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు! 18 ఇది నిజం. వయస్సులో ఉన్నప్పుడు నీ దుస్తులు నీవు వేసుకొని నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళే వాడవు. కాని వయస్సు మళ్ళిన తర్వాత నీవు చేతులు చాపితే మరొకళ్ళు నీకు దుస్తులు తొడిగించి నీకు యిష్టం లేదన్న చోటికి తీసుకు వెళ్తారు” అని అన్నాడు. 19 పేతురు ఎలాంటి మరణం పొంది దేవునికి మహిమ తెస్తాడో సూచించటానికి యేసు ఇలా అన్నాడు. ఆ తర్వాత అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు.
20 పేతురు వెనక్కు తిరిగి చూసాడు. యేసు ప్రేమించిన శిష్యుడు వెంట రావటం గమనించాడు. రాత్రి భోజనాలప్పుడు యేసుకు ఆనుకొని, “ప్రభూ! మీకు ఎవరు ద్రోహం చేస్తారు!” అని ప్రశ్నించిన వాడు యితడే. 21 పేతురు అతణ్ణి చూసి యేసుతో, “ప్రభూ! అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు.
22 యేసు సమాధానంగా, “నేను తిరిగి వచ్చే వరకు అతడు బ్రతికి ఉండాలని నాకిష్టమైతే! ఆ సంగతి నీ కెందుకు. నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.
23 యేసు ఈ విధంగా అనటంవల్ల ఈ శిష్యుడు చనిపోడనే వదంతి సోదరుల్లో వ్యాపించింది. కాని యేసు అతడు చనిపోడని అనలేదు. అతడు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు బ్రతికి ఉండాలని నా ఉద్దేశ్యమైతే ఆ సంగతి నీకెందుకు?” అని అన్నాడు, అంతే.
24 వీటిని గురించి సాక్ష్యం చెప్పిన వాడు, వ్రాసిన వాడు ఈ శిష్యుడే. అతని సాక్ష్యం నిజమైనదని మనకు తెలుసు.
25 యేసు యింకా ఎన్నో కార్యాలు చేసాడు. వాటన్నిటిని గురించి వ్రాస్తే ఈ గ్రంథాలకు ఈ ప్రపంచంలో ఉన్న స్థలమంతా కూడా సరిపోదని నేననుకుంటాను.
© 1997 Bible League International