Old/New Testament
హిజ్కియా పస్కా పండుగ ఆచరించుట
30 రాజైన హజ్కియా ఇశ్రాయేలు, యూదా ప్రజలందరికీ వర్తమానం పంపించాడు. అతడు ఎఫ్రాయిము, మనష్షే[a] ప్రజలకు కూడా లేఖలు వ్రాశాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పస్కా[b] పండుగ జరిపేందుకు వారిందరినీ యెరూషలేములోని ఆలయానికి రమ్మని హిజ్కియా ఆహ్వానించాడు. 2 పస్కా పండుగ రెండవ నెలలో జరపటానికి అధికారులతోను, యెరూషలేము సమావేశంలోను చర్చించి రాజైన హిజ్కియా నిర్ణయించాడు. 3 పస్కా పండుగను మామూలుగా (నీసాను 14వ తేదీ) జరిగే సమయానికి వారు జరుపుకోలేక పోయారు. ఎందువల్లనంటే పవిత్ర సేవా కార్యాక్రమానికి తగినంత మంది యాజకులు సిద్ధం కాలేదు. పైగా ప్రజలందరూ యెరూషలేములో సమావేశం కాలేదు. 4 ఇప్పుడు పండుగ జరిపే తేదీ పట్ల రాజైన హిజ్కియా, సమావేశమైనవారూ సంతృప్తిని వెలిబుచ్చారు. 5 పిమ్మట బెయేర్షెబా పట్టణం మొదలు దాను పట్టణం వరకు ఇశ్రాయేలంతటా వారీవిషయమై ప్రకటన చేశారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపటానికి ప్రజలంతా యెరూషలేముకు రావాలని వారు చాటించారు. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన విధంగా చాలాకాలంగా ఇశ్రాయేలు ప్రజలలో అధిక సంఖ్యాకులు పస్కా పండుగ జరుపలేదు. 6 కావున దూతలు రాజు యొక్క లేఖలను ఇశ్రాయేలు, యూదా ప్రాంతాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. ఆ లేఖలలో యిలా వ్రాయబడి వుంది:
ఇశ్రాయేలు బిడ్డలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు (యాకోబు) విధేయులై వున్న దేవుడైన యెహోవా వైపు తిరగండి. అప్పుడు మీలో ఇంకా బ్రతికివున్న వారి వద్దకు, అష్షూరు రాజు బారినుండి తప్పించుకున్న వారి వద్దకు యెహోవా వస్తాడు. 7 మీ తండ్రులవలెను, మీ సొదరులవలెను మీరు ప్రవర్తించకండి. యెహోవా వారి దేవుడు; కాని వారు ఆయనకు వ్యతిరేకులయ్యారు. అందువల్ల ప్రజలు వారిని అసహ్యించుకునేలా, వారు నిందలపాలయ్యేలా యెహోవా చేశాడు. ఇది నిజమని మీ కళ్లతో మీరే స్వయంగా చూడవచ్చు. 8 మీ వెనుక తరంవారివలె మీరు మొండిగా ప్రవర్తించకండి. ఇష్ట పూర్వకమైన మీ హృదయాలతో యెహోవాకు విధేయులు కండి. అతి పరిశుద్ధ స్ధలానికి తరలిరండి. అతి పరిశుద్ద స్థలాన్ని యెహోవా శాశ్వతంగా పవిత్ర పర్చాడు. మీ దేవుడైన యెహోవాను కొలవండి. అప్పుడు యెహోవా యొక్క భయంకరమైన కోపం మీనుండి తొలగిపోతుంది. 9 మీరు తిరిగివచ్చి యెహోవాకు విధేయులైతే, బందీలైన మీ బంధువులు, పిల్లలు వారిని చెరబట్టిన శత్రువుల నుండి కనికరం పొందుతారు. మీ బంధువులు, మీ పిల్లలు మళ్లీ ఈ రాజ్యానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా దయగలవాడు; కరుణా మూర్తి. మీరాయనను ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టడు.
10 వార్తాహరులు ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో ప్రతి పట్టణానికీ వెళ్లారు. వారు సుదూర ప్రాంతమైన జెబూలూనుకు కూడా వెళ్లారు. కాని అక్కడి ప్రజలు వార్త తెచ్చిన వారిని చూసి నవ్వి, హేళనచేశారు. 11 కాని అషేరు, మనష్షే మరియు జెబూలూను ప్రాంతాలలో కొంతమంది మాత్రం తమను తాము తగ్గించుకొని, అణకువతో యెరూషలేముకు వెళ్లారు. 12 యెహోవా తన వాక్కు ద్వారా రాజైన హిజ్కియా మరియు అతని అధికారులు ఇచ్చిన ఆజ్ఞలకు యూదా ప్రజంతా విధేయులై వుండేలా వారి మనస్సులు మార్చాడు.
13 చాలామంది ప్రజలు జట్లు జట్లుగా పులియని రొట్టెల పండుగ[c] జరుపుకోటానికి రెండవ నెలలో యెరూషలేముకు వచ్చారు. ప్రజాసమూహం పెద్దగా వుంది. 14 యెరూషలేములో బూటకపు దేవుళ్ల ఆరాధనకు నిర్మింపబడ్డ బలిపీఠాలన్నిటినీ అక్కడ చేరిన ప్రజలు తొలగించారు. బూటకపు దేవుళ్లకు నిర్మించిన ధూప పీఠాలను కూడా వారు తీసివేశారు. ఆ బలిపీఠాలన్నిటినీ వారు కిద్రోను లోయలో పారవేశారు. 15 పిమ్మట వారు రెండవ నెల పదునాల్గవ తేదీన పస్కా గొర్రెపిల్లను చంపారు. యాజకులు, లేవీయులు సిగ్గుపడి పవిత్ర సేవా కార్యక్రమానికి పరిశుద్ధులై సిద్ధమయ్యారు. యాజకులు, లేవీయులు దహనబలులు ఆలయానికి తీసుకొనివచ్చారు. 16 యెహోవా సేవకుడైన మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారంతా ఆలయంలో తమ తమ స్థానాలను ఆక్రమించారు. లేవీయులు బలుల రక్తాన్ని యాజకులకిచ్చారు. ఆ రక్తాన్ని యాజకులు బలిపీఠం మీద చిలికించారు. 17 సమావేశమైన వారిలో శుచియై సేవా కార్యాక్రమానికి సిద్ధం కానివారు అనేకమంది వున్నారు. కావున వారు పస్కా గొర్రెపిల్లలను చంపటానికి అనుమతింపబడలేదు. ఆ కారణంగా లేవీయులు పరిశుద్ధులు కాని వారందరి తరుపునా పస్కా బలులు అర్పించవలసి వచ్చింది. లేవీయులు ప్రతి గొర్రెపిల్లను పవిత్రపర్చి బలికి సిద్ధం చేశారు.
18-19 ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు మరియు జెబూలూను ప్రజలలో చాలామంది పస్కా పండుగుకు ధర్మశాస్త్రీయంగా తమను తాము పవిత్రపర్చుకోలేదు. మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిలో వారు పస్కా పండుగను సక్రమంగా జరుపుకోలేదు. కాని హిజ్కియా వారికొరకు ప్రార్థన చేశాడు. హిజ్కియా యిలా ప్రార్థన చేశాడు: “ప్రభువైన యెహోవా, నీవు మంచివాడవు. ఈ ప్రజలు నిజానికి నిన్ను ధర్మశాస్త్రానుసారంగా ఆరాధించాలనుకున్నారు. కాని ధర్మశాస్త్రం చెప్పిన రీతిగా వారు తమను తాము పవిత్ర పర్చుకోలేదు. దయచేసి వారిని క్షమించు. నీవు మా పూర్వీకులు విధేయులైయున్న దేవుడివి. అతిపవిత్ర స్థానానికి అర్హమైన రీతిలో ప్రజలెవరైనా తమను తాము పవిత్ర పర్చుకొనకపోయినా నీవు వారిని క్షమించ కోరుతున్నాను.” 20 రాజైన హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన ప్రజలను క్షమించాడు. 21 ఇశ్రాయేలు సంతతివారు యెరూషలేములో ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను జరుపుకున్నారు. వారంతా చాలా ఆనందోత్సాహాలతో వున్నారు. లేవీయులు, యాజకులు ప్రతిరోజు తమ శక్తి కొలది యెహోవాకు స్తోత్రం చేశారు. 22 యెహోవా సేవా కార్యక్రమంలో పరిపూర్ణ జ్ఞానంగల లేవీయులందరినీ రాజైన హిజ్కియా ప్రోత్సహించాడు. ప్రజలు పండుగను ఏడు రోజులపాటు జరిపి సమాధాన బలులు అర్పించారు. వారు తమ పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.
23 ప్రజలంతా అక్కడ మరి ఏడు రోజులు వుండటానికి ఇష్టపడ్డారు. పస్కా పండుగను మరి ఏడు రోజులు జరుపుకున్నందుకు వారు సంతోషించారు. 24 యూదా రాజైన హిజ్కియా ఒక వెయ్యి గిత్తలను, ఏడువేల గొర్రెలను సమావేశమైన ప్రజల ఆహారం నిమిత్తం ఇచ్చాడు. పెద్దలు కూడా వెయ్యిగిత్తలను, పదివేల గొర్రెలను ప్రజలకు ఆహారంగా ఇచ్చారు. చాలామంది యాజకులు పవిత్ర కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. 25 యూదా నుండి వచ్చిన ప్రజా సమూహం, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నుండి వచ్చిన జనం, మరియు ఇశ్రాయేలు నుండి యూదాకు వచ్చిన ఇతర యాత్రీకులు-అందరూ చాలా సంతోషపడ్డారు. 26 అందువల్ల యెరూషలేములో ఆనందం వెల్లివిరిసింది. దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను కాలం తరువాత ఇప్పటివరకు ఇంత వైభవంగా ఏ ఉత్సవం నిర్వహింపబడలేదు. 27 యాజకులు, లేవీయులు లేచి నిలబడి ప్రజలను దీవించుమని యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారి ప్రార్థన యెహోవా పరిశుద్ధ నివాసం చేరింది.
రాజైన హిజ్కియా అభివృద్ధి కార్యక్రమం చేయటం
31 పస్కా పండుగ పూర్తి అయ్యింది. యెరూషలేముకు పండుగ నిమిత్తం వచ్చిన ఇశ్రాయేలీయులు యూదాలో వున్న పట్టణాలకు వెళ్లి, అక్కడ వున్న రాతి విగ్రహాలన్నిటినీ ముక్కలు చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వారు ఈ రాతి విగ్రహాలను ఉపయోగించేవారు. ప్రజలు అషేరా స్తంభాలను కూడా నరికివేశారు. యూదా, బెన్యామీను రాజ్యాలలో వున్న ఉన్నత స్థలాలను, బలిపీఠాలను కూలదోశారు. ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో కూడా ఈ ప్రజలు అదే పని చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వినియోగించే వస్తువులన్నీ నాశనమయ్యే వరకు ప్రజలీపని చేస్తూనే వున్నారు. తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాలకు వెళ్లిపోయారు. ప్రతి వ్యక్తీ తన ఇంటికి వెళ్లిపోయాడు.
2 రాజైన హిజ్కియా మళ్లీ యాజకుల, లేవీయుల వంశాలను వారివారి విధులు నిర్వర్తించటానికి ఎంపిక చేశాడు. ప్రతి గుంపుకీ ప్రత్యేకమైన పని నిర్దేశించబడింది. దహనబలులు, సమాధానబలులు యివ్వటానికి కూడ హిజ్కియా మళ్లీ యాజకులను, లేవీయులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు ఆలయంలో సేవ చేసి, దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చేశారు. 3 దహన బలులుగా అర్పించటానికి హిజ్కియా తన స్వంత జంతువులను కొన్నిటిని ఇచ్చాడు. ఈ దహనబలులు ఉదయ, సాయంకాల సమయాలలోను, వారం చివర సబ్బాతు దినాలలోను (శనివారం), అమావాస్యలందు, మరి ఇతర పండుగ దినాలలోను అర్పించేవారు. ఈ కార్యక్రమమంతా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జరిగింది.
4 యాజకులకు, లేవీయులకు చెందిన భాగాన్ని వారికి ఇవ్వమని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు హిజ్కియా ఆజ్ఞాపించాడు. తద్వారా యాజకులు, లేవీయులు తమ పూర్తి కాలాన్ని యెహోవా సేవలో, ధర్మశాస్త్రం బోధించేందుకు వినియోగించగలరు. 5 రాజాజ్ఞ దేశమంతా ప్రచారం చేయబడిన వెంటనే, ఇశ్రాయేలు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. తమ పంటలైన ధాన్యం, ద్రాక్ష, నూనె, తేనె, ఇంకను వారి పొలాల్లో పండిన తదితర పంటల నుండి మొదటి భాగాన్ని ధారాళంగా ఇచ్చారు. వారి పంటలో పదవ భాగాన్ని స్వచ్ఛందంగా తీసుకొని వచ్చారు. ఈ సేకరణే చాలా పెద్ద మొత్తమయ్యింది. 6 యూదా పట్టణాలలో నివసిస్తున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలు కూడా తమ పశుసంపదలో పదవవంతు తెచ్చారు. వారింకా యెహోవా కొరకు విడిగా ఒక చోట నిల్వచేసిన వస్తువులలో పదవవంతు తెచ్చారు. వారీ వస్తువులన్నీ తాము ఆరాధించే దేవుడైన యెహోవా నిమిత్తం తెచ్చారు. వారు తెచ్చిన పదార్థాలు, వస్తువులు అన్నీ రాశులుగా పోశారు.
7 మూడవ నెలలో (మే/జూన్) ప్రజలు నిల్వచేసిన వస్తువులన్నీ తేవటం మొదలుపెట్టి ఏడవ నెలలో (సెప్టెంబర్/అక్టోబర్) పూర్తి చేశారు. 8 హిజ్కియా, మరియు ఇతర పెద్దలు వచ్చి ప్రజలు తెచ్చిన వస్తుసంపద రాశులుగా పడివుండటం చూశారు. వారు దేవునికి స్తోత్రం చేసి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను శ్లాఘించారు.
9 అప్పుడు హిజ్కియా రాసులుగా పడివున్న వస్తుసంపద గురించి యాజకులను, లేవీయులను అడిగి తెలుసుకున్నాడు. 10 సాదోకు కుటుంబానికి చెందిన ప్రముఖ యాజకుడు అజర్యా రాజైన హిజ్కియాతో యిలా చెప్పాడు: “ప్రజలు ఆలయానికి కానుకలు తేవటం మొదలు పెట్టినప్పటి నుండి తినటానికి మాకు సమృద్ధిగా ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. అంతేగాదు, మా వద్ద ఇంకా అనేక పదార్థాలు మిగిలివున్నాయి. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించాడు. అందుచే మావద్ద ఇదంతా మిగిలివుంది.”
11 పిమ్మట ఆలయంలో సరుకు నిల్వచేసే గదులు కట్టించమని హిజ్కియా యాజకులకు ఆజ్ఞాపించగా, వారు వాటిని కట్టించారు. 12 తరువాత యాజకులు కానుకలను, దశమ భాగాలను, తదితర వస్తువుల్లో యెహోవాకై ప్రత్యేకించబడిన కానుకను తెచ్చారు. అలా సేకరించిన ఆ వస్తుసంపదను ఆలయ గిడ్డంగులలో భద్రపర్చారు. లేవీయుడైన కొనన్యా వీటిపై పర్యవేక్షకుడుగా నియపింపబడ్డాడు. అతని తరువాత అధికారిగా షిమీ నియమితుడయ్యాడు. కొనన్యా సోదరుడే షిమీ. 13 కొనన్యా, అతని సోదరుడు షిమీలిద్దరూ యెహీయేలు, అజజ్యాహు, నహతు, అశాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యాహు, మహతు మరియు బెనాయాలపై పర్యవేక్షణ అధికారులుగా నియమింపబడ్డారు. రాజైన హిజ్కియా, ఆలయపు నిర్వహణాధికారి అజర్యాలిద్దరూ ఈ మనుష్యులను ఎంపికచేశారు.
14 ప్రజలు దేవునికి ఇచ్చే ఉచిత కానుకల విషయమై శ్రద్ధ తీసుకోనే అధికారి పేరు కోరే. దేవునికి ఇవ్వబడిన కానుకల పంపిణీ విషయంలో ఇతడు శ్రద్ధ తీసుకొంటాడు. దేవునికి ఇవ్వగా పవిత్ర పర్చబడిన ధానాల పంపిణీ విషయంలో కూడా బాధ్యత ఇతనిదే. కోరే తూర్పు ద్వారపాలకుడు. ఇతని తండ్రి లేవీయుడైన ఇమ్నా. 15 ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా మరియు షెకన్యా అనేవారు కోరేకు సహాయ కులుగా పనిచేశారు. వారంతా యాజకులు నివసించే పట్టణాలలో విశ్వాసపాత్రంగా పనిచేశారు. యాజకులలో ప్రతి వర్గం వారి బంధువులకు సేకరించిన వస్తువులను వారు ఇచ్చేవారు. అవే వస్తువులను మిక్కిలి గొప్పవారికి, అతి పేదవారికి కూడ వారివారి భాగాలను వారు ఇచ్చేవారు.
16 లేవీయుల వంశ చరిత్రల్లో చేర్చబడిన మూడేండ్లు అంతకు పైబడిన వయస్సుగల మగ పిల్లలకు కూడ సేకరించిన రాశులనుండి వారు భాగాలను పంచిపెట్టేవారు. ఈ మగవారంతా నిత్యం ఆలయానికి వెళ్లి అనుదిన సేవా కార్యక్రమాలలో తమ తమ విధులు నిర్వర్తించవలిసినవారు. లేవీయులో ప్రతి వంశంవారికి ఒక బాధ్యత అప్పగించబడింది. 17 సేకరించిన వస్తుసంపద నుంచి యాజకులకు తమ భాగం యివ్వబడింది. ఇది వారి కుటుంబాల వారీగా వంశ చరిత్రలలో వ్రాయబడిన క్రమంలో ఈ పని జరుపబడింది. సేకరించిన సంపదలో ఇరవైయేండ్లు, అంతకు పైబడిన వయస్సుగల లేవీయులకు వారి వంతు భాగాలు ఇవ్వబడ్డాయి. ఇది వారి వారి బాధ్యతలను బట్టి, వారి వారి కుటుంబాలను బట్టి జరిగింది. 18 లేవీయుల పసిపిల్లలు, భార్యలు, కుమారులు, కుమార్తెలు సేకరించిన సంపదలో భాగస్వాములయ్యారు. వంశచరిత్రలో వ్రాయబడిన లేవీయులందరికీ యిలా భాగాలు ఇవ్వ బడ్డాయి. లేవీయులు విశ్వాస పాత్రంగా సదా పవిత్రులైవుండి, ప్రభుసేవా పరాయణులైనందువల్ల ఆ విధంగా ఏర్పాటు చేయబడింది.
19 అహరోను వంశస్థులైన కొంతమంది యాజకులు లేవీయులు నివసిస్తున్న పట్టణాలకు దగ్గరలో కొన్ని పంట భూములు కలిగియున్నారు. ఆ పట్టణాలలో అహరోను సంతతి వారు కూడ కొందరు నివసిస్తున్నారు. అట్టి అహరోను సంతతి వారికి భాగాలు యివ్వటానికి ప్రతి పట్టణంలోను నివసిస్తున్న పురుషులు పేర్ల వారీగా ఎంపిక చేయబడ్డారు. పురుషులు, లేవీయుల వంశ చరిత్రలో వ్రాయబడినవారు సేకరించిన పదార్థాలలో భాగం పొందారు.
20 రాజైన హిజ్కియా అలాంటి మంచి పనులు యూదా రాజ్యమంతటా చేశాడు. యెహోవా దృష్టికి మంచిదైన న్యాయమైన విశ్వసనీయమైన ప్రతి పనినీ అతడు చేశాడు. 21 తలపెట్టిన ప్రతి పనిలోను, ఆలయంలో సేవాకార్యక్రమం పునః ప్రారంభించటంలోను, దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను పాటించటంలోను మరియు అతడు దేవుని అనుసరించటంలోను అతను విజయం సాధించాడు. హిజ్కియా ఈ పనులన్నీ తన హృదయపూర్వకంగా చేశాడు.
యేసును బంధించటం
(మత్తయి 26:47-56; మార్కు 14:43-50; లూకా 22:47-53)
18 యేసు ప్రార్థించటం ముగించాక తన శిష్యులతో కలిసి ప్రయాణమయ్యాడు. అంతా కలిసి కెద్రోను లోయ దాటి వెళ్ళారు. అక్కడ ఒక ఒలీవల తోట ఉంది. వాళ్ళు ఆ తోటలోకి వెళ్ళారు.
2 యేసు తన శిష్యులతో తరుచు యిక్కడ కలుసుకొంటూ ఉండేవాడు కనుక ఆయనకు ద్రోహం చేసిన యూదాకు ఈ స్థలం తెలుసు. 3 అందువల్ల యూదా ఒక సైనిక దళాన్ని, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన కొంతమంది రక్షక భటుల్ని వెంట బెట్టుకొని వచ్చాడు. వాని వెంట ఉన్న వాళ్ళు ఆయుధాలను, దివిటీలను, దీపాలను, పట్టుకొని వాణ్ణి అనుసరించారు.
4 యేసుకు జరుగనున్నదంతా తెలుసు. ఆయన ముందుకు వచ్చి, “వాళ్ళతో మీకెవరు కావాలి?” అని అడిగాడు.
5 “నజరేతుకు చెందిన యేసు!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
“ఆయన్ని నేనే!” అని యేసు అన్నాడు. ద్రోహం చేసిన యూదా వాళ్ళతో నిలుచుని ఉన్నాడు. 6 యేసు, “నేనే ఆయన్ని” అని అనటం విని వాళ్ళు ఒక అడుగు వెనక్కు వేసి క్రింద పడిపోయారు.
7 యేసు, “మీకెవరు కావాలి?” అని మళ్ళీ అడిగాడు.
వాళ్ళు, “నజరేతుకు చెందిన యేసు” అని సమాధానం చెప్పారు.
8 యేసు, “ఆయన్ని నేనే అని చెప్పానుగా? మీరు నా కోసం చూస్తుంటే వీళ్ళను మాత్రం వెళ్ళ నివ్వండి” అని అన్నాడు. 9 “నీవు నాకప్పగించిన వాళ్ళలో ఒక్కణ్ణి కూడా నేను పోగొట్టుకోలేదు” అని ఆయన అన్న మాటలు నిజం కావటానికి యిలా జరిగింది.
10 సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉండింది. అతడు ఆ కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి నరకటానికి పోయి, అతని కుడి చెవి నరికి వేసాడు. ఆ సేవకుని పేరు “మల్కు.” 11 యేసు పేతురుతో, “నీ కత్తి ఒరలో పెట్టు! నా తండ్రి యిచ్చిన పాత్ర నేను త్రాగకుండా ఉంటానా?” అని అన్నాడు.
యేసును అన్న దగ్గరకు పిలుచుకు వెళ్ళటం
(మత్తయి 26:57-58; మార్కు 14:53-54; లూకా 22:54)
12 ఆ తర్వాత సైనిక దళము, దళాధిపతి, రక్షక భటులు యేసును బంధించి, మొదట అన్న దగ్గరకు తీసుకు వెళ్ళారు. “అన్న” “కయపకు” కూమార్తె నిచ్చిన మామ. 13 “కయప” ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. 14 ప్రజల కొరకు ఒకే ఒక వ్యక్తి చనిపోవటం మంచిదని యూదులకు సలహా ఇచ్చిన వాడు ఇతడే!
పేతురు తెలియదనటం
(మత్తయి 26:69-70; మార్కు 14:66-68; లూకా 22:55-57)
15 సీమోను పేతురు, అతనితో పాటు యింకొక శిష్యుడు యేసు వెంట వెళ్ళారు. ఈ యింకొక శిష్యుడు ప్రధాన యాజకునికి తెలిసినవాడు. అందువల్ల అతడు యేసు వెంట ప్రధాన యాజకుని యింటి ఆవరణంలోకి వెళ్ళాడు. 16 కాని పేతురు బయట ద్వారం దగ్గర ఉండవలసి వచ్చింది. ప్రధాన యాజకునికి పరిచయమున్న ఆ యింకొక శిష్యుడు, బయటికి వచ్చి అక్కడవున్న కాపలా ఆమెతో మాట్లాడి పేతుర్ని లోపలికి పిలుచుకు వెళ్ళాడు. 17 “నీవు అతని శిష్యుల గుంపుకు చెందిన వాడవు కావా?” అని ద్వారం దగ్గరున్న కాపలాది పేతుర్ని అడిగింది.
“లేదు!” అని అతడు జవాబు చెప్పాడు.
18 చలిగా ఉంది కనుక రక్షక భటులు, సేవకులు, చలిమంట వేసి దాని చుట్టూ నిల్చున్నారు. పేతురు వెళ్ళి వారితో సహా చలికాచుకొనుచున్నాడు.
© 1997 Bible League International