Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 21-22

21 యెహోషాపాతు చనిపోగా, అతనిని అతని పూర్వీకుల సరసన సమాధిఛేశారు. అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. యెహోషాపాతు స్థానంలో అతని కుమారుడు యెహోరాము కొత్త రాజయ్యాడు. యెహోరాము సోదరులు అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, మరియు షెపట్య అనువారు. వీరంతా యెహోషాపాతు కుమారులు. యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజు. యెహోషాపాతు తన కుమారులకు వెండి బంగారు వస్తువులు, తదితర విలువైన కానుకలు యిచ్చాడు అతడు యూదాలో బలమైన కోటలు నిర్మించి యిచ్చాడు. కాని యెహోషాపాతు రాజ్యాన్ని యెహోరాముకు యిచ్చాడు. ఎందువల్లనంటే అతడు పెద్ద కుమారుడు.

యూదా రాజుగా యెహోరాము

యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని చేపట్టి తనను తాను పటిష్ట పర్చుకొని స్థిరపడ్డాడు. తరువాత కత్తిని వినియోగించి తన సోదరులనందరినీ చంపి వేశాడు. అతడు మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను కూడా నరికివేశాడు. యెహోరాము ఏల నారంభించే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. అతడు ఇశ్రాయేలు రాజులు నివసించిన రీతిలో జీవితం కొనసాగించాడు. అహాబు కుటుంబం మాదిరిగానే అతడు కూడ నివసించాడు. ఎందువల్ల నంటే అహాబు కుమార్తెనే యెహోరాము వివాహమాడాడు. యెహోరాము యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ చేశాడు. కాని యెహోవా దావీదుతో చేసుకొన్న ఒడంబడిక ప్రకారం ఆయన దావీదు కుటుంబాన్ని నాశనం చేయలేదు. దావీదు కొరకు, ఆయన సంతతివారి కొరకు యెహోవా శాశ్వతంగా ఒక జ్యోతిని వెలిగించుతానని మాట యిచ్చివున్నాడు.[a]

యెహోరాము కాలంలోనే యూదా ఆధిపత్యం నుండి ఎదోము విడిపోయి, స్వతంత్ర రాజ్యమయ్యింది. ఎదోమీయులు వారి స్వంత రాజును ప్రకటించుకున్నారు. అందువల్ల యెహోవారాము తన సైన్యాధిపతులతోను, రథాలతోను ఎదోము మీదికి వెళ్లాడు. ఎదోమీయుల సైన్యం యెహోరామును, అతని రథాధిపతులను చుట్టుముట్టింది. కాని యెహోరాము తీవ్రంగా యుద్ధం చేసి చీకటి పడ్డాక బయట పడ్డాడు. 10 అప్పటి నుండి ఈ నాటి వరకు ఎదోము రాజ్యం యూదాపై తిరుగబడుతూనే వుంది. లిబ్నా పట్టణవాసులు కూడా యెహోరాముకు వ్యతిరేకులైనారు. యెహోరాము యెహోవాను విడనాడినందుకు ఫలితంగా ఇదంతా జరిగింది. యెహోవా యెహోరాము పూర్వీకులు ఆరాధించిన దేవుడు. 11 యెహోరాము యూదా కొండలమీద, గుట్టలమీద క్షుద్ర దేవతల పూజలకై స్థలాలను నిర్మించాడు. దేవుడు ఆశించిన దానిని చేయకుండా యెరూషలేము ప్రజలకు యెహోరాము అడ్డుపడ్డాడు. అతడు యూదా ప్రజలను యెహోవాకు దూరం చేశాడు.

12 ప్రవక్తయైన ఏలీయా ద్వారా యెహోరాముకు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం యిలా వుంది:

“దేవుడైన యెహోవా తెలియజేయునదేమనగా: ఆయన మీ పూర్వీకుడైన దావీదు ఆరాధించిన దైవం. యెహోవా చెప్పుచున్నాడు: ‘యెహోరామూ, నీ తండ్రి యెహోషాపాతు నడిచిన మార్గాన్ని నీవు విడనాడినావు. యూదా రాజైన ఆసా నడిచిన మార్గాన్ని కూడ నీవు విడనాడినావు. 13 అంతేకాదు నీవు ఇశ్రాయేలు రాజులు నడచిన పెడమార్గాన్ని అనుసరించావు. దేవుడు ఆశించిన రీతిగా నడవకుండా నీవు యూదా, యెరూషలేము ప్రజలను ఆపావు. అదే నేరాన్ని అహాబు, అతని కుటుంబంవారు చేశారు. వారు దేవుని పట్ల విశ్వాస ఘాతకులైనారు. నీవు నీ సోదరులను హత్యచేశావు. నీకంటె నీ సోదరులు మంచివారు. 14 కావున త్వరలో యెహోవా నీ ప్రజలను కఠినంగా శిక్షిస్తాడు. యెహోవా నీ పిల్లలను భార్యలను శిక్షించి, నీ ఆస్తిని పాడుచేస్తాడు. 15 నీకు పేగుల్లో భయంకరమైన జబ్బు చేస్తుంది. రోజు రోజుకూ నీ జబ్బు ముదురుతుంది. ఆ భయంకరమైన వ్యాధివల్ల నీ ప్రేగులు బయటికి వచ్చేస్తాయి.’”

16 యెహోవా ఫిలిష్తీయులను, ఇథియోపియులకు (కూషీయులు) దగ్గరలో నివసిస్తున్న అరబీయులను యెహోరాము మీదికి పోయేలా ప్రేరేపించాడు. 17 ఆ ప్రజలు యూదా రాజ్యం మీదికి దండెత్తారు. వారు రాజగృహంలోని ధనాన్నంతా కొల్లగొట్టారు. వారు యెహోరాము కుమారులను, భార్యలను తీసుకొనిపోయారు. యెహోరాము చిన్న కుమారుడు మాత్రం వదిలిపెట్టబడ్డాడు. యెహోరాము చిన్న కుమారుని పేరు యెహోయాహాజు.[b]

18 ఈ సంఘటనలు జరిగిన తరువాత యెహోవా యెహోరాముకు పేగుల్లో నయంకాని వ్యాధిని కలుగజేశాడు. 19 జబ్బు ముదిరి రెండు సంవత్సరాల తరువాత యెహోరాము పేగులు బయటికి వచ్చాయి. భరించలేని బాధతో అతడు చనిపోయాడు. తన తండ్రికి చేసినట్లు ప్రజలు యెహోరాముకు గౌరవసూచకంగా పెద్దమంట వేయలేదు. 20 యెహోరాము రాజయ్యే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. యెహోరాము చనిపోయినప్పుడు ఒక్కడు కూడ విచారించలేదు. యెహోరామును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారుగాని, రాజులను వుంచే చోట అతనిని సమాధి చేయలేదు.

అహజ్యా యూదా రాజవటం

22 యెహోరాము స్థానంలో యెరూషలేము ప్రజలు అహజ్యాను[c] కొత్త రాజుగా చేసారు. అహజ్యా యెహోరాము యొక్క చిన్న కుమారుడు. అరబీయులతో యెహోరాము మీదికి వచ్చిన ప్రజలు యెహోరాము కుమారులందరినీ చంపివేశారుగాని, చిన్నవానిని మాత్రం వదిలారు. అందువల్ల అహజ్యా యూదాలో పరిపాలించగలిగాడు. అహజ్యా పరిపాలన ఆరంభించే నాటికి ఇరువది రెండేండ్లవాడు.[d] యెరూషలేములో అహజ్యా ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. అతల్యా తండ్రి పేరు ఒమ్రీ. అహాబు కుటుంబం నివసించిన తీరునే అహజ్యా నివసించాడు. అతడలా నివసించటానికి కారణం అతని తల్లి అతనిని దుష్టకార్యాలకు ప్రేరేపించటమే. యెహోవా దృష్టిలో అహజ్యా పాపకార్యాలు చేశాడు. అహాబు కుటుంబం కూడా అదే చేసింది. అహజ్యా తండ్రి చనిపోయినపిమ్మట అతనికి అహాబు కుటుంబం వారు సలహాదారులయ్యారు. వారు అహజ్యాకు తప్పుడు సలహాలిచ్చారు. ఆ తప్పుడు సలహాలే అతని చావుకు దారితీశాయి. అహాబు కుటుంబం అతని కిచ్చిన సలహనే అహజ్యా పాటించాడు. ఇశ్రాయేలు రాజైన యెహోరాముతో కలిసి అహజ్యా అరాము (సిరియా) రాజైన హజాయేలుపై యుద్ధానికి రామోత్గిలాదు పట్టణానికి వెళ్లాడు. యెహోరాము తండ్రి ఇశ్రాయేలు రాజైన అహాబు. కాని అరామీయులు (సిరియనులు) యుద్ధంలో యెహోరామును గాయపర్చారు. యెహోరాము తన గాయాలను నయం చేసికోటానికి యెజ్రెయేలుకు తిరిగి వెళ్లాడు. అరాము రాజైన హజాయేలుతో రామోతు వద్ద పోరాడుతుండగా అతడు గాయపడ్డాడు. పిమ్మట యెహోరామును చూడటానికి అహజ్యా (యెహోయహాజు) యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు. అహజ్యా తండ్రి పేరు యూదా రాజైన యెహోరాము. యెహోరాము తండ్రి పేరు అహాబు. యెహోరాము గాయపడటంతో అతడు యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు.

యెహోరామును చూడటానికి అహజ్యా వెళ్లినప్పుడు దేవుడు అతనికి మరణం కలుగజేశాడు. అహజ్యా వెళ్లి యెహోరాముతో కలిసి యెహూను చూడటానికి వెళ్లాడు. యెహూ తండ్రి పేరు నింషీ. అహాబు వంశాన్ని నాశనం చేయటానికి దేవుడు యెహూను నియమించాడు. అహాబు వంశాన్ని యెహూ నాశనం చేస్తూవున్నాడు. అప్పుడతడు యూదా పెద్దలను, అహజ్యా సేవలో వున్న అతని బంధువులను చూశాడు. యూదా పెద్దలను, అహజ్యా బంధువులను యెహూ చంపివేశాడు. పిమ్మట అహజ్యా కొరకు యెహూ వెదికాడు. అతడు సమరయ (షోమ్రోను) పట్టణంలో దాగుకొనే ప్రయత్నం చేస్తూండగా యెహూ మనుష్యులు అతనిని పట్టుకున్నారు. వారు అహజ్యాను యెహూ వద్దకు తీసుకొని వచ్చారు. వారు అహజ్యాను చంపి, సమాధి చేశారు. “అహజ్యా యెహోషాపాతు వారసుడు. యెహోషాపాతు యెహోవాను నిండు హృదయంతో అనుసరించాడు” అని వారు అన్నారు. యూదా రాజ్యాన్ని సమైక్యంగా వుంచే శక్తి అహజ్యా కుటుంబానికి లేదు.

రాణి అతల్యా

10 అహజ్యా తల్లి పేరు అతల్యా. తన కుమారుడు చంపబడ్డాడని తెలుసుకోగానే ఆమె యూదాలో రాజ వంశస్తుల నందరినీ చంపివేసింది. 11 కాని యెహోషెబతు[e] అనే స్త్రీ అహజ్యా కుమారుడైన యోవాషును దాచివేసింది. యోవాషును, అతని దాదిని యెహోషెబతు లోపలి పడకగదిలో దాచింది. యెహోషెబతు రాజైన యెహోరాము కుమార్తె. ఆమె యెహోయాదా భర్యా. యెహోయాదా ఒక యాజకుడు. పైగా యెహోషెబతు అహజ్యాకు సోదరి. యెహోషెబతు దాచిన కారణంగా, యోవాషును అతల్యా చంపలేకపోయింది. 12 ఆలయంలో ఆరు సంవత్సరాల పాటు యోవాషు యాజకుల వద్ద దాచబడ్డాడు. ఆ సమయంలో అతల్యా పరిపాలన కొనసాగింది.

యోహాను 14

యేసు తన శిష్యులను ఆదరించటం

14 “మీరు ఆందోళన చెందకండి. దేవుణ్ణి నమ్మండి. నన్ను కూడా నమ్మండి. నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం. నేను వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరకే తెలుసు” అని యేసు అన్నాడు.

తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు.

యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు. నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు.

ఫిలిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. అది చాలు” అని అన్నాడు.

యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అలాగైతే తండ్రిని చూపుమని ఎందుకు అడుగుతున్నావు? 10 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా? నేను చెప్పే మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు. 11 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు చూసైనా నమ్మండి.

12 “ఇది నిజం. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కడూ నేను చేసిన కార్యాలు చేస్తాడు. వీటికన్నా యింకా గొప్ప కార్యాలే చేస్తాడు. 13 కుమారుని ద్వారా తండ్రి మహిమ పొందటానికి మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను. 14 నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేస్తాను.

పవిత్రాత్మ వాగ్దానం

15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించినట్లు చేస్తారు. 16-17 మీతో చిరకాలం ఉండి, మీకు సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని[a] పంపుమని నేను తండ్రిని అడుగుతాను. ఆయన ఆత్మను పంపుతాడు. ఆ పవిత్రాత్మ సత్యాన్ని ప్రకటించటం తన కర్తవ్యం. ప్రపంచం ఆయన్ని చూడలేదు. ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కనుక ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మీతో ఉన్నాడు కనుక మీకు ఆయన గురించి తెలుసు. ఆయన భవిష్యత్తులో మీతో ఉంటాడు. లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎందుకంటే అది ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు.

18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను. 19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు. 20 ఆ రోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు. 21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”

22 అప్పుడు యూదా (యూదా ఇస్కరియోతు కాదు), “కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై, ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటున్నారు?” అని అన్నాడు.

23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. 24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.

25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.

27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి. 28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.

30 “ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు. 31 కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను.

“రండి, యిక్కడి నుండి వెళ్దాం!”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International