Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 28-29

ఆలయం నిర్మాణానికి దావీదు యోచన

28 దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశపర్చాడు. వారందరనీ యెరూషలేముకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు ఎవరనగా: వంశాల పెద్దలు, రాజ సేవలో వున్న సైనికాధికారులు, వేయిమంది సైనికులకు అధిపతులు, వందమంది దళాలకు అధిపతులు, రాజు యొక్క, రాజకుమారుల యొక్క ఆస్తులను, పశువులను కాపాడే అధికారులు, రాజు యొక్క ముఖ్యాధికారులు, పరాక్రమశాలురు మరియు వీర సైనికులు.

రాజైన దావీదు నిలబడి వారినుద్దేశించి ఇలా చెప్పాడు: “సోదరులారా, నా ప్రజలారా, మీరంతా నేను చేప్పేది వినండి. యోహోవా ఒడంబడిక పెట్టెను ఉంచటానికి ఒక ఆలయాన్ని కట్టటానికి నేను నా హృదయంలో సంకల్పించాను దేవుని పాదం మోపటానికి ఒక స్థానం నిర్మించాలని నేను అనుకున్నాను. ఆలయ నిర్మాణానికి నేను ఒక పథకం కూడ తయారుచేశాను. కాని దేవుడు నాతో ఇలా అన్నాడు: ‘దావీదూ, వద్దు. నా పేరు మీద నీవు ఆలయం కట్టించకూడదు. నీవు సైనికుడవై, అనేకమందిని సంహరించావు. అందువల్ల నీవు ఆలయ నిర్మాణం చేయకూడదు.’

“ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారిని నడిపించటానికి యూదా వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్లీ ఆ వంశంలో నుండి నా తండ్రి కుటుంబాన్ని యోహోవా ఎంపిక చేశాడు. ఆ కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా ఏలటానికి యెహోవా నన్ను ఎంపికచేశాడు! దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలచాడు! యెహోవా నాకు చాలా మంది కుమారులను ఇచ్చాడు. వారందరిలో ఇశ్రాయేలుకు నూతన రాజుగా సొలొమోనును మాత్రం యెహోవా ఎంపిక చేసాడు. నిజానికి ఇశ్రాయేలు యెహోవా రాజ్యం. యెహోవా నాతో, ‘దావీదూ, నీ కుమారుడు సొలొమోను నా ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని నిర్మిస్తాడు. ఎందువల్లననగా సొలొమోనును నా కుమారునిగా భావించాను. నేను అతనికి తండ్రిగా వ్యవహరిస్తాను.[a] సొలొమోను ఇప్పుడు నా ధర్మాన్ని, ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అతడు నా ధర్మాన్ని, న్యాయాన్ని నిరంతరం పాటిస్తే నేను సొలొమోను రాజ్యాన్ని శాశ్వతంగా బలవంతమైనదిగా చేస్తాను!’” అని అన్నాడు.

“ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు, దేవుని సమక్షాన నేను మీకు ఈ విషయాలు చెబుతున్నాను. యెహోవా దేవుని శాసనాలన్నిటినీ మీరు పాటించేలా జాగ్రత్త పడండి! అప్పుడు ఈ మంచి దేశాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. పైగా దీనిని మీరు, మీ తర్వాత మీ సంతతి వారికి కూడ శాశ్వతంగా అందజేయగలరు.

“కుమారుడా, సొలొమోనూ! నీ తండ్రి యొక్క దేవుని నీవు తెలుసుకో. పవిత్ర హృదయంతో దేవుని ప్రార్థించు. దేవుని సేవించటానికి హృదయానందం కలిగివుండు. ఎందువల్లననగా, ప్రతివాని మనస్సులో ఏమున్నదో దేవునికి తెలుసు. నీవు ఆలోచించే ప్రతిదీ యెహోవా అర్థం చేసుకుంటాడు! సహాయం కోరి యెహోవాను అర్థిస్తే, నీకు సమాధానం దొరుకుతుంది. నీవు దేవునికి విముఖంగా వుంటే ఆయన నిన్ను శాశ్వతంగా వదిలివేస్తాడు. 10 సొలొమోనూ, తన పవిత్ర స్థలమైన ఆలయాన్ని నిర్మించటానికి యెహోవా నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్ధం చేసుకోవాలి. ధైర్యంగా వుండి కార్యం నెరవేర్చు.”

11 పిమ్మట దావీదు ఆలయ నిర్మాణానికి సిద్ధం చేసిన నమూనా పత్రాలను తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు. ఆ పత్రాలలో ఆలయం చుట్టూ నిర్మింప తలపెట్టిన ఆవరణ, మండపాలు, వస్తువులను భద్రపరచు గదులకు పైగదులు, లోపలి గదులు మరియు పాపపరిహారం ప్రాయశ్చిత్తం చేయు స్థానం మొదలగు వాటి నమూనాలు కూడ ఇమిడి వున్నాయి. 12 ఆలయపు అన్ని విభాగాలకూ దావీదు నమూనాలు గీయించాడు. దావీదు ఆ నమూనాలను సొలొమోనుకు ఇచ్చాడు. ఆలయం చుట్టూ ప్రాంగణానికి, ఇతర గదులకు, వస్తువులను భద్రపరచు గదులకు, పవిత్ర వస్తువులను వుంచే కొట్లకు గీచిన నమూనాలను కూడ దావీదు అతనికి ఇచ్చాడు. 13 దావీదు సొలొమోనుకు యాజకులలోను, లేవీయులలోను గల వర్గీకరణలను గూర్చి తెలియ జెప్పాడు. ఆలయపు సేవాకార్యక్రమ వివరాలు, ఆలయంలో వినియోగించే వస్తుసామగ్రి విషయాల గూర్చి దావీదు సొలొమోనుకు వివరించాడు. 14 ఆలయంలో ఉపయోగించే వస్తు సామగ్రి చేయటానికి ప్రతి దానికీ ఎంతెంత వెండి బంగారాలు వినియోగించాలో దావీదు సొలొమోనుకు చెప్పాడు. 15 బంగారు దీపాలకు, వెండి దీపాలకు, దీప స్తంభాలకు విడివిడిగా కొలతలు, నమూనాలు వున్నాయి. ఒక్కొక్క దీప స్తంభానికి, దాని దీపాలకు[b] ఉపయోగించే బంగారం లేక వెండి పరిమాణాన్ని దావీదు సొలొమోనుకు తెలియజేశాడు. అవసరమైన చోట వివిధ దీపస్తంభాలు నెలకొల్పవచ్చు. 16 నైవేద్యంగా పవిత్ర రొట్టెను దేవుని ముందు పెట్టటానికి పనికివచ్చే ప్రతి బల్లకు ఎంత బంగారం వాడాలో దావీదు చెప్పాడు. వెండి బల్లలకు కావలసిన వెండి పరిమాణం కూడా దావీదు చెప్పాడు. 17 శూలాలకు, నీరు చిలికే పాత్రలకు, మూతి వెడల్పు చెంబులకు ఎంతెంత శుద్ధ బంగారం కావాలో దావీదు వివరించాడు. ప్రతి బంగారు పాత్రకు, ప్రతి వెండి పాత్రకు ఎంతెంత బంగారం కావాలో దావీదు చెప్పాడు. 18 ధూప పీఠానికి కావలసిన శుద్ధ బంగారం విషయం దావీదు చెప్పాడు. దేవుని రథమైన రెక్కలుచాపి ఒడంబడిక పెట్టెను కప్పివుండే కెరూబుల నమూనాను కూడా దావీదు సొలొమోనుకు ఇచ్చాడు. ఇదే ధర్మ పీఠం. కెరూబు దూతల ప్రతిమలు బంగారంతో చేయబడ్డాయి.

19 “యెహోవా నాకు సూచించిన మేరకు ఈ నమూనాలన్నీ వ్రాయబడ్డాయి. నమూనాలలో ప్రతి విషయాన్నీ నేను అర్థం చేసుకొనేలా యెహోవా నాకు సహాయపడ్డాడు” అని దావీదు చెప్పాడు.

20 దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా ఇలా అన్నాడు: “నీవు ధైర్యంగా, నిలకడగా వుండు. పని మొదలు పెట్టు. నీవు భయపడవద్దు. ఎందువల్లననగా నీ దేవుడైన యెహోవా నీతో వున్నాడు. పనంతా పూర్తయ్యే వరకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీవు యెహోవా ఆలయం నిర్మిస్తావు. 21 ఆలయ నిర్మాణ కార్యక్రమంలో యాజకులు, లేవీయులు తమ తమ విధులు నిర్వహించటానికి సిద్ధంగా వున్నారు. నైపుణ్యంగల పనివారంతా నీకు సహాయం చేయటానికి సిద్ధంగా వున్నారు. నీవు ఇచ్చే ప్రతి ఆజ్ఞ అధికారులు, ప్రజలు అంతా శిరసావహిస్తారు.”

ఆలయం నిర్మాణానికి కానుకలు

29 అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి రాజైన దావీదు ఇలా అన్నాడు: “దేవుడు నా కుమారుడు సొలొమోనును ఎంపిక చేశాడు. సొలొమోను చిన్నవాడు. అందువల్ల తాను చేయవలసిన పనులన్నిటిలో తగిన అనుభవం లేదు. కాని పని మాత్రం అతి ముఖ్యమైనది! ఈ భవనం ప్రజల కొరకు కాదు. ఇది యెహోవా దేవుని ఆలయం. నా దేవుని ఆలయం కట్టించటానికి తగిన నమూనాలు, ఏర్పాట్లు నాశక్తి కొలదీ చేశాను. బంగారంతో చేయదగిన వస్తు సామగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయదగిన వస్తువులకు వెండి, కంచు సామగ్రికి కావలసిన కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప సామాన్లు చేయటానికి తగిన కలప ఏర్పాటు చేశాను. పొదగటానికి సులిమాను రాళ్లు అనబడే మణులను, నల్లరాతిని, విలువైన రంగురంగుల రత్నాలను, పాల రాతిని కూడ నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి ఈ రకమైన వస్తుసామగ్రిని లెక్కకు మించి ఇచ్చాను. నా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించ దలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను. ఆరువేల మణుగుల[c] ఓఫీరు దేశపు బంగారాన్ని, పద్నాలుగు వేల మణుగుల[d] శుద్ధమైన వెండిని ఇచ్చాను. ఆలయ భవనాల గోడలపై వెండిరేకుల తొడుగు వేస్తారు. వెండి బంగారాలతో చేయదగిన వస్తువులకు కావలసిన వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికివచ్చే అనేక రకాల వస్తు సామగ్రిని నిపుణతగల పనివారు చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన మీలో ఎంతమంది ఆరోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు?”

కుటుంబాల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు, సహస్ర సైనిక దళాధిపతులు, శత దళాధిపతులు రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువైన వస్తువులు స్వయంగా అర్పించారు. ఆలయానికి వారిచ్చిన వస్తువులు ఏవనగా: పదివేల మణుగుల బంగారం, ఇరవై వేల మణుగుల వెండి, ముప్పదియారు వేల మణుగుల కంచు, రెండు లక్షల మణుగుల ఇనుము. విలువైన రత్నాలు కలిగివున్న ప్రజలు వాటిని ఆలయానికి యిచ్చారు. యెహీయేలు విలువైన రత్నాలన్నిటి విషయంలో జాగ్రత్త తీసుకొన్నాడు. యెహీయేలు గెర్షోను వంశీయుడు. తమ నాయకులు అంత ఉదారంగా విరాళాలు ఇవ్వటంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు ఇచ్చి సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడ ఆనందంగా వున్నాడు.

దావీదు చక్కటి ప్రార్థన

10 సమావేశపర్చబడిన ప్రజానీకం ముందు దావీదు పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు:

“ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ,
    సదా నీకు స్తోత్రం చేస్తాము.
11 గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌరవము అన్నీ నీకు చెందినవే
    ఎందుకంటే పరలోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే,
ఓ దేవా, రాజ్యము నీదైయున్నది.
    నీవు సమస్త ప్రజలపై అధిపతివైయున్నావు.
12 భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి.
    సమస్తమును పాలించువాడవు నీవు.
నీవు బల పరాక్రమసంపన్నుడవు.
    నీవు ఎవరినైనా గొప్ప వాడినిగా గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు.
13 మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాము.
    మహిమగల నీ నామమును స్తుతిస్తాము!
14 ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు.
ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే.
    నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము.
15 మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాటసారుల్లా వున్నారు.
ఆశలేని మా బ్రతుకులు ఈ భూమి మీద నీడలాంటివి.
    ఎవ్వరూ స్థిరంగా వుండరు.
16 యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణానికై మేము ఈ వస్తువులన్నీ సమకూర్చాము.
    నీ నామము ఘనపర్చబడేలా మేము ఈ ఆలయం నిర్మిస్తాము.
కాని ఈ వస్తుసంపదంతా నీ నుండి వచ్చినదే.
    ప్రతిదీ నీకు చెందినదే.
17 నా దేవా, నీవు ప్రజల హృదయాలను పరీక్షిస్తావని కూడ నాకు తెలుసు.
    ప్రజలు మంచి పనులు చేస్తే నీవు సంతోషిస్తావు.
ఈ వస్తు సముదాయాన్నంతా హృదయ పూర్వకంగా (సదుద్దేశంతో)
    నేను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను.
నీ ప్రజలంతా అనేక కానుకలు సంతోషంగా
    నీకు ఇవ్వటానికి ఇక్కడ చేరియున్నట్లు నేను చూశాను.
18 ఓ దేవా, నీవు మా పితరులైన
    అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు[e] దేవుడివి.
నీ ప్రజలు సదా నిన్ను కొలిచేలా వారికి దయచేసి సహయపడుము.
    వారి హృదయాలెప్పుడూ నీ వైపు తిప్పుకోగలిగేలా వారికి నీవు సహాయపడుము.
19 నీ పట్ల సత్యవర్తనుడై మెలిగేలా నా కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయుము.
    నీ ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, నీ నియమ నిబంధనలను అతను ఎల్ల వేళలా పాటించేలా నీవతనికి తోడ్పడుము.
ఈ విషయాలలో నీవు సొలొమోనుకు సహాయంచేసి,
    అతను నేను తలపెట్టిన ఆలయ నిర్మాణకార్యక్రమం పూర్తిచేసేలా తోడ్పడుము.”

20 పిమ్మట దావీదు అక్కడ చేరిన ప్రజాసమూహాన్ని ఉద్ధేశించి, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి” అని అన్నాడు. తమ పూర్వీకులు కొలిచిన దేవుడగు యెహోవాను ప్రజలంతా స్తుతించారు. యెహోవాకు, రాజుకు గౌరవ సూచకంగా వారు సాష్టాంగ నమస్కారం చేశారు.

సొలొమోను రాజవటం

21 ఆ మరునాడు ప్రజలంతా యెహోవాకి బలులు అర్పించారు. యెహోవాకు వారు దహన బలులు అర్పించారు. వారు వేయి గిత్తలను, వేయి పొట్టేళ్లను, వేయి గొర్రె పిల్లలను బలి ఇచ్చారు. వారు పానార్పణలను కూడ సమర్పించారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపునా లెక్కలేనన్ని బలులు సమర్పించారు. 22 ఆ రోజు ప్రజలంతా బాగా తిని, త్రాగి ఆనందించారు. యెహోవా అక్కడ వారితో వున్నాడు.

వారు చాలా ఆనందంగా వున్నారు. తరువాత దావీదు కుమారుడైన సొలొమోనును వారు రెండవసారి[f] రాజుగా ప్రకటించారు. వారు సొలొమోనును రాజుగాను, సాదోకును యాజకునిగాను అభిషిక్తం చేశారు. యెహోవా నెలకొని వున్నచోటే వారు ఈ పనిచేశారు.

23 తరువాత సొలొమోను యెహోవా నియమించిన సింహాసనం మీద రాజు హోదాలో కూర్చున్నాడు. సొలొమోను తన తండ్రి స్థానాన్ని అలంకరించి వర్థిల్లాడు. ఇశ్రాయేలు ప్రజలంతా సొలొమోను ఆజ్ఞలను పాటించారు. 24 పెద్దలందరు, బలశాలురైన నాయకులు, రాజైన దావీదు కుమారులందరు సొలొమోనును రాజుగా గుర్తించి అతనికి విధేయులై వున్నారు. 25 యెహోవా సొలొమోనును చాలా గొప్ప వ్యక్తినిగా చేసాడు. యెహోవా సొలొమోనును చాలా ఉన్నతమైన వ్యక్తిగా చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలంతా గుర్తించారు. రాజుకు ఇవ్వవలసిన గౌరవాభిమానాలను యెహోవా సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోనుకు ముందు మరొక రాజెవ్వడూ అంతటి గౌరవాన్ని పొందియుండలేదు.

దావీదు మరణం

26-27 దావీదు ఇశ్రాయేలుకు నలభై సంవత్సరాలు రాజుగా వున్నాడు. దావీదు యెష్షయి కుమారుడు. దావీదు హెబ్రోను నగరంలో ఏడు సంవత్సరాలు పాలించాడు. తరువాత దావీదు యెరూషలేము నగరం నుండి ముప్పది మూడు సంవత్సరాలు పాలించాడు. 28 దావీదు బాగా వృద్ధుడయినాక మరణించాడు. దావీదు ఉత్తమ జీవితాన్ని దీర్ఘకాలం గడిపాడు. దావీదు అన్ని భోగభాగ్యాలు, గౌరవాభిమానాలు పొందాడు. తరువాత అతని కుమారుడు సొలొమోను నూతన రాజు అయ్యాడు.

29 రాజైన దావీదు ఆదినుండి అంతం వరకు చేసిన పనులన్నీ దీర్ఘదర్శియైన సమూయేలు వ్రాసిన వ్రాతలలోను, ప్రవక్తయగు నాతాను వ్రాతలలోను, దీర్ఘదర్శియైన గాదు వ్రాసిన వృత్తాంతాలలోను పొందుపర్చబడ్డాయి. 30 ఆ వ్రాతలన్నీ ఇశ్రాయేలుకు రాజుగా దావీదు చేసిన పనులన్నిటి గురించి తెల్పుతాయి. అవి దావీదు శౌర్యాన్ని గూర్చి, అతనికి సంభవించిన విషయాలను గూర్చి తెలియజేస్తాయి. ఆ వ్రాతలు ఇశ్రాయేలుకు, దాని పొరుగు రాజ్యాలన్నిటిలో జరిగిన కార్యాలు, వాటి పరిస్థితులను తెలియజేస్తాయి.

యోహాను 9:24-41

24 యూదులు గ్రుడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో, “దేవుణ్ణి స్తుతించు, అతణ్ణి కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు.

25 “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు. నేనిదివరలో గ్రుడ్డి వాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని అతడు సమాధానం చెప్పాడు.

26 “అతడు ఏమి చేసాడు? ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు?” అని వాళ్ళు అడిగారు.

27 అతుడు, “నేను యిది వరకే చెప్పాను. కాని మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారా?” అని అన్నాడు.

28 వాళ్ళు అతణ్ణి అవమానపరచారు. అతనితో, “నువ్వు అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులము. 29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఇక ఇతని గురించా? ఇతడెక్కడినుండి వచ్చాడో కూడా మాకు తెలియదు” అని అన్నారు.

30 అతడు, “ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు. 31 దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు. 32 పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించటం ఇది వరకు ఎవ్వరూ వినలేదు. 33 ఇతడు దేవుని నుండి రానట్లైతే ఏమి చెయ్యలేకపొయ్యేవాడు” అని అన్నాడు.

34 ఇది విని వాళ్ళు, “నీవు పాపంలో పుట్టావు. పాపంలో పెరిగావు. మాకు ఉపదేశించటానికి నీకెంత ధైర్యం?” అని అంటూ అతణ్ణి వెలివేశారు.

ఆత్మీయ అంధత్వము

35 అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు.

36 ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు.

37 యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే!” అని అన్నాడు.

38 అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు.

39 యేసు, “నేను తీర్పు చెప్పటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆ తీర్పేదనగా-గ్రుడ్దివాళ్ళు చూడగలగాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గ్రుడ్డివాళ్ళు కావాలని నేను వచ్చాను” అని అన్నాడు.

40 ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, “మేము కూడా గ్రుడ్డివాళ్ళ మంటున్నావా?” అని అన్నారు.

41 యేసు, “మీరు గ్రుడ్డి వాళ్ళైనట్లైతే మిమ్ములను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని దోషులనవలిసిందే!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International