Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 24-25

నెబుకద్నెజరు రాజు యూదాకు వచ్చుట

24 యెహోయాకీము కాలంలో బబులోను రాజయిన నెబుకద్నెజరు యూదా దేశానికి వచ్చాడు. యెహోయాకీము నెబుకద్నెజరుని మూడేండ్లు సేవించాడు. తర్వాత యెహోయాకీము నెబుకద్నెజరుకు ప్రతికూలుడై అతని పరిపాలన నుండి విముక్తుడయ్యాడు. యెహోవా బబులోనువారి బృందాలు, సిరియనులు, మోయాబీయులు, అమ్మోనీయులు మొదలైన వారిని యెహోయాకీముకి విరుద్ధంగా యుద్ధము చేయునట్లు చేశాడు. యెహోవా ఆ బృందాలను యూదాని ధ్వంసం చేయమని పంపించాడు. ఇది యెహోవా చెప్పినట్లుగానే జరిగింది. యెహోవా తన సేవకులైన ప్రవక్తలను అవి చెప్పడానికి ఉపయోగించాడు.

యూదాలో అవి జరుగేటట్లు యెహోవా ఆజ్ఞాపించాడు. ఈ విధంగా యెహోవా వారిని తన దృష్టినుండి మరల్చాడు. మనష్షే చేసిన పాపాలన్నిటి కారణాన యెహోవా ఇలా చేశాడు. మనష్షే పలువురు అమాయకులను చంపినందువల్ల, యెహోవా ఇదంతా చేశాడు. మనష్షే యెరూషలేమును వారి రక్తముతో నింపివేశాడు. మరియు యెహోవా ఆ పాపాలను మన్నించడు.

యెహోయాకీము చేసిన ఇతర కార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. యెహోయాకీము మరణించగా, అతని పూర్వికులతో పాటుగా అతనిని సమాధి చేశారు. యెహోయాకీము కుమారుడు యెహోయాకీను, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.

బబులోను రాజు ఈజిప్టు వాగుకి యూఫ్రటీసు నదికి మధ్యగల ప్రదేశమంతటిని స్వాధీనము చేసుకున్నాడు. ఈ ప్రదేశము అంతకు ముందు ఈజిప్టువారు తమ అదుపులో ఉంచుకున్నారు. అందువల్ల ఈజిప్టు రాజు ఈజిప్టుని ఏ మాత్రమూ విడువదలచుకోలేదు.

నెబుకద్నెజరు యెరూషలేమును వశం చేసుకొనుట

యెహోయాకీను, పరిపాలన ప్రారంభించిన నాడు, అతను 18 యేండ్లవాడు. అతను యెరూషలేములో 3 మాసాలు పరపాలించాడు. అతని తల్లి పేరు నెహుష్తా ఆమె యెరూషలేముకు చెందిన ఎల్నాతాను కుమార్తె. యెహోవా తప్పని చెప్పిన పనులు యెహోయాకీను చేశాడు. అతను తన తండ్రి చేసిన అవే పనులు చేసాడు.

10 ఆ సమయమున బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క అధికారులు యెరూషలేముకు వచ్చి ముట్టిడించారు. 11 తర్వాత బబులోను రాజైన నెబుకద్నెజరు నగరానికి వచ్చాడు. అతని సైన్యము అప్పటికే నగరాన్ని చుట్టుముట్టుతూ ఉంది. 12 యూదా రాజు యెహోయాకీను బబులోను రాజుని కలుసుకోడానికి వెలుపలికి వచ్చాడు. యెహోయాకీను తల్లి, అతని అధికారులు, నాయకులు, ఉద్యోగులు కూడా అతనితో పాటు వెళ్లారు. అప్పుడు బబులోను రాజు యెహోయాకీనుని బంధించాడు. ఇది నెబుకద్నెజరు పరిపాలనాకాలపు 8వ సంవత్సరమున జరిగింది.

13 నెబుకద్నెజరు యెరూషలేమునుండి, యెహోవా యొక్క ఆలయములోని నిధులన్నిటినీ, రాజభవనములోని నిధులన్నిటినీ తీసుకొనెను. నెబుకద్నెజరు ఇశ్రాయేలు రాజయిన సొలొమోను యెహోవా యొక్క ఆలయములో ఉంచిన అన్ని బంగారు పాత్రలను ముక్కలు చేశాడు. యెహోవా చెప్పినట్లుగానే ఇది సంభవించింది.

14 నెబుకద్నెజరు యెరూషలేములోని ప్రజలందరిని బంధించాడు. అతను నాయకులందరినీ, ధనవంతులను బంధించాడు. అతను 10,000 మంది ప్రజలను బందీలుగా తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పనిలో చెయ్యి తిరిగినవారిని, నిపుణులను తీసుకు వెళ్లాడు. సామాన్యులలోని నిరుపేదలను తప్ప మరెవ్వరిని విడిచి పెట్టలేదు. 15 నెబుకద్నెజరు యెహోయాకీనుని బందీగా చేసి బబులోనుకు తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పైగా రాజమాతను, అతని భార్యలను, అధికారులను, ప్రముఖ వ్యక్తులను తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు వారిని యెరూషలేము నుండి బబులోనుకి బందీలుగా చేసి తీసుకువెళ్లాడు. 16 7,000 మంది సైనికులుండిరి. నెబుకద్నెజరు సైనికులందరినీ, 1,000 మంది పనిలో చెయ్యి తిరిగినవారినీ, నిపుణులను తీసుకు వెళ్లాడు. ఈ వ్యక్తులందరు యుద్ధానికి సిద్ధంగా వుండే సుశిక్షుతులైన సైనికులు. బబులోను రాజు వారినందరినీ బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్లాడు.

సిద్కియా రాజు

17 బబులోను రాజు మత్తన్యాను కొత్త రాజుగా చేశాడు. మత్తన్యా యెహోయాకీము యొక్క పిన తండ్రి. అతను అతని పేరుని సిద్కియా అని మార్చి వేశాడు. 18 సిద్కియా పరిపాలన ప్రారంభించే నాటికి ఇరవై ఒక్క సంవత్సరములవాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నాకి చెందిన యిర్మీయా కుమార్తె. 19 యెహోవా తప్పు అని చెప్పిన పనులు సిద్కియా చేశాడు. సిద్కియా యెహోయాకీను చేసిన పనులే చేశాడు. 20 యెహోవా యెరూషలేము యూదాల పట్ల ఆగ్రహం చెందాడు. యెహోవా వారిని దూరపరచెను.

నెబుకద్నెజరు సిద్కియా పరిపాలనను అంతము చేయుట

25 సిద్కియా తిరుగుబాటు చేసి, బబులోను రాజుకు విధేయుడై వుండటానికి సమ్మతించలేదు.

అందువల్ల, బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని మొత్తము సైన్యము యెరూషలేముకు ప్రతికూలముగా యుద్ధము చేయడానికి వచ్చింది. సిద్కియా రాజు యొక్క తొమ్మిదో సంవత్సరాన, 10వ నెలలో 10వ రోజున ఇది సంభవించింది. నెబుకద్నెజరు తన సైన్యాన్ని యెరూషలేము చుట్టు ఉంచి, ప్రజలను నగరం నుండి వెలుపలికిగాని లోపలికిగాని రానీయకుండ చేశాడు. ఆ తర్వాత నగరం చుట్టు అతను ఒక మురికి గోడ నిర్మించాడు. నెబుకద్నెజరు సైన్యము సిద్కియా యూదా రాజుగా వున్న 11వ సంవత్సరము దాకా యెరూషలేము చుట్టూ ఉండెను. నగరంలో కరువు ఘోరంగా తయారయింది. నాలుగవ నెలలో 9వ రోజున నగరంలోని సామాన్యులకు ఆహారము లేకపోయింది.

నెబుకద్నెజరు సైన్యము చివరికి నగర ప్రాకారమును బద్దలు చేసింది. ఆ రాత్రి సిద్కియా రాజు అతని సైనికులు పారిపోయారు. వారు రాజుగారి ఉద్యనవనము ద్వారా రహస్య ద్వారాన్ని ఉపయోగించి జంట గోడలద్వారా వెళ్లారు. విరోధి సైనికులు నగరం చుట్టూ వుండిరి. కాని సిద్కియా అతని మనుష్యులు మార్గము మీదికి తప్పించుకుని ఎడారికి పారిపోయారు. బబులోను సైన్యము సిద్కియా రాజుని వెన్నంటిపోయి అతనిని యెరికో అనే చోట పట్టుకున్నారు. సిద్కియా సైనికులందరు అతనిని విడిచిపెట్టి పారి పోయారు.

బబులోనువారు సిద్కియా రాజుని బబులోను రాజు వద్దకు రిబ్లా అనే చోటికి తీసుకు వెళ్లారు. బబులోనువారు సిద్కియాని శిక్షింప నిశ్చయించారు. వారు సిద్కియా కుమారులను అతని ఎదుటనే చంపివేశారు. ఆ తర్వాత సిద్కియా యొక్క కండ్లు పెరికివేశారు. అతనికి గొలుసులు బిగించి అతనిని బబులోనుకు తీసుకువెళ్లారు.

యెరూషలేమును ధ్వంసం చేయుట

నెబుకద్నెజరు బబులోను రాజుగా వున్న 19 వ సంవత్సరమున, 5 వ నెలలో 7వ తేదీన యెరూషలేముకు వచ్చాడు. నెబూజరదాను నెబుకద్నెజరు అత్యుత్తమ సైనికులకు అధిపతి. నెబూజరదాను యెహోవాయొక్క ఆలయమును దగ్ధం చేశాడు. రాజు భవనాన్ని, యెరూషలేములోని అన్ని ఇళ్లను కూడా దగ్ధం చేశాడు. అతను పెద్ద ఇళ్లను కూడా దగ్ధం చేశాడు.

10 అప్పుడు నెబూజరదానుతో పాటువున్న బబులోను సైన్యము యెరూషలేము పరిసరాలలోవున్న ప్రాకారములను కూలదోసింది. 11 నెబూజరదాను నగరంలో ఇంకా మిగిలివున్న ప్రజలను బంధించాడు. నెబూజరదానుకు లోబడిన వారిని సయితము బందీలుగా తీసుకువెళ్లాడు. 12 సామాన్యులలో అతి పేదవారిని మాత్రం నెబూజరదాను విడిచిపెట్టాడు. ద్రాక్షాలు ఇతర పంటలను చూసే నిమిత్తం వారిని అక్కడే నివసింప జేశాడు.

13 బబులోను సైనికులు యెహోవా యొక్క ఆలయములోని అన్ని ఇత్తడి వస్తువులను ముక్కలు చేశారు. వారు కంచు స్తంభాలను, కంచు మట్లను, పెద్ద ఇత్తడి చెరువుని ధ్వంసం చేశారు. తర్వాత ఆ కంచునంతా బబులోనుకు తీసుకువెళ్లారు. 14 బబులోనువారు యెహోవా యొక్క ఆలయంలో ఉపయోగింపబడే కుండలు, నిప్పు తీసే గరిటలు, దీపాలు చక్కబరిచే ఉపకరణాలు, చెంచాలు, కంచు పాత్రలు మొదలైనవాటిని తీసుకువెళ్లారు. 15 నెబూజరదాను బానలు, పాత్రలు కూడా తీసుకు వెళ్లాడు. బంగారము కోసము బంగారముతో చేయబడిన వస్తువులను వెండి కోసము వెండితో చేయబడిన వస్తువులను కూడా తీసుకువెళ్లాడు. 16-17 2 కంచు స్తంభాలు (ప్రతి స్తంభం 27 అడుగుల యెత్తు కలవి. స్తంభాల మీది పై పీటలు నాలుగున్నర అడుగుల ఎత్తు కలవి. దానిమ్మ పండు మరియు అల్లిక విన్యాసాలు కంచుతో చేయబడినవి. రెండు స్తంభాల విన్యాసం ఒకే మోస్తరుగా వుంటుంది) విశాలమైన కంచు చెరువు. యెహోవాయొక్క ఆలయానికి సొలొమోను సిద్ధపరిచిన రెండు స్తంభములు. ఆ వస్తువుల నుండి గ్రహించిన కంచు తూకం వేయడానికి అలవి కానిది.

యూదా ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్లుట

18 ఆలయము నుండి నెబూజరదాను ప్రధాన యాజకుడైన శెరాయాను పట్టుకున్నాడు. జెఫన్యా అనే రెండవ యాజకుడు, ప్రవేశమును కాచే ఆ ముగ్గురు మనుష్యులను తీసుకెళ్లాడు.

19 నగరంనుండి నెబూజరదాను సైన్యానికి అధికారిగా ఉన్న ఉద్యోగిని, నగరంలో మిగిలివున్న ఐదుగురు రాజుగారి సలహాదారులను తీసుకొన్నాడు. సైన్యాధిపతి యొక్క ఒక కార్యదర్శి. అతను సామాన్య ప్రజలను లెక్కించేవాడు. మరియు అతను వారిలోనుండి కొందరు సైనికులను ఎంచుకునేవాడు. నగరంలో అప్పుడున్న 60 మంది ప్రజలను నెబుకద్నెజరు తీసుకొన్నాడు.

20-21 తరువాత నెబూజరదాను హమాతు ప్రదేశంలోని రిబ్లా దగ్గర ఉన్న బబులోను రాజువద్దకు ప్రజలందరినీ తీసుకువెళ్లాడు. బబులోను రాజు రిబ్లా అనే చోట వారిని చంపివేశాడు. మరియు యూదా ప్రజలను వారి దేశమునుండి బందీలుగా తీసుకొని పోయెను.

యూదా రాజ్య పాలకుడు అయిన గెదల్యా

22 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంలో కొందరు ప్రజలను విడచి పెట్టాడు. షాఫాను కుమారుడైన అహీకాం, అతని కుమారుడైన గెదల్యా అనే అతడు ఒకడుండెను. నెబుకద్నెజరు యూదా ప్రజల మీద గెదల్యాను అధిపతిగా నియమించాడు.

23 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు కారేహకు కుమారుడైన నెటోఫాతుకు చెందిన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మాయాకాతు కుమారుడైన యజన్నా మొదలయిన వారు సైన్యాధిపతులు. ఈ సైన్యాధిపతులు, వారి మనుష్యులు, బబులోను రాజు గెదల్యాను అధిపతిగా చేసినట్లు విన్నారు. అందువల్ల గెదల్యాను కలుసుకోవడానికి వారు మిస్పాకి వెళ్లారు. 24 ఈ అధికారులకు, వారి మనుష్యులకు గెదల్యా వాగ్దానాలు చేశాడు. గెదల్యా వారితో ఇట్లన్నాడు: “బబులోను అధికారులను చూసి మీరు భయపడకండి. ఇక్కడే ఉండి బబులోను రాజుని కొలవండి. ఆ తరువాత, అంతయు మీకు సక్రమముగా ఉంటుంది.”

25 ఎలీషా కుమారుడైన నెతన్యా కుమారుడు ఇష్మాయేలు రాజు కుటుంబము నుండి వచ్చినవాడు. ఏడవ నెలలో ఇష్మాయేలు మరియు పదిమంది అతని మనుష్యులు గెదల్యా మీద దాడిచేసి, మిస్పా వద్ద గెదల్యాతో పాటు ఉన్న కల్దీయులను, యూదులను చంపివేశాడు. 26 అప్పుడు సైన్యాధికారులు అందరు మనుష్యులు ఈజిప్టుకు పారిపోయారు. అతి సామాన్యుడు మొదలుకొని అతి ప్రాముఖ్యము కలవాడి వరకు అందరూ పారి పోయారు. ఎందుకనగా, కల్దీయులనగా వారు భయపడ్డారు.

27 ఆ తర్వాత ఎవీల్మెరోదకు బబులోనుకు రాజయ్యాడు. అతను యూదా రాజైన యెహోయాకీనును చెరసాలనుండి విముక్తి చేసెను. ఇది యెహోయాకీను బంధింపబడిన 37వ సంవత్సరమున సంభవించింది. ఇది ఎవీల్మెరోదకు పరిపాలన ప్రారంభం చేసిన 12వ నెలనుండి 27వ తేదీ వరకు జరిగింది. 28 ఎవీల్మెరోదకు యెహోయాకీను పట్ల దయకలిగి ఉండెను. అతను యెహోయాకీనుకి బబులోనులో తనతో బాటు ఆసీనులయ్యే ఇతర రాజుల కంటె ఎక్కువ ప్రాముఖ్యముగల చోటు ఇచ్చాడు. 29 ఎవీల్మెరోదకు యెహోయాకీను చెరసాల దుస్తులు ధరించడం ఆపివేశాడు. మరియు యెహోయాకీను ఒకే మేజాబల్ల మీద కూర్చుని ఎవీల్మెరోదకుతో కలిసి భుజించాడు. ఇట్లు అతని శేష జీవితము వరకు జరిగింది. 30 అందువల్ల ఎవీల్మెరోదకు రాజు యెహోయాకీనుకు అతని శేష జీవితము వరకూ ప్రతిరోజూ భోజనము పెట్టాడు.

యోహాను 5:1-24

చిన్న కొలను దగ్గర నయం చేయటం

కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేములో గొఱ్ఱెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్థ అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. చాలామంది వికలాంగులు, గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. [a] అక్కడున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు. యేసు అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు నయం కావాలని ఉందా?” అని అడిగాడు.

ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు: అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు” అని అన్నాడు.

అప్పుడు యేసు అతనితో, “లే! నీ చాప తీసుకొని నడువు!” అని అన్నాడు. అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళిపోయాడు.

ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది. 10 తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో, “ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్రం ప్రకారం నీవు చాపమోసుక వెళ్ళటానికి వీల్లేదు” అని అన్నారు.

11 కాని అతడు, “నాకు నయం చేసిన వ్యక్తి, ‘నీ చాప పట్టుకొని వెళ్ళు’ అని అన్నాడు” అని సమాధానం చెప్పాడు.

12 వాళ్ళు, “నీ చాప తీసుకొని నడవమన్న వాడెవడు?” అని అడిగారు.

13 ప్రజల గుంపు ఉండటంవల్ల యేసు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవరో అతడు చూపలేక పోయాడు.

14 ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసుకొని, “చూడు! నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అయ్యావు. పాపాలు చెయ్యటం మానేయి. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు!” అని అన్నాడు.

15 ఆ తర్వాత వాడు వెళ్ళి, తనకు నయం చేసిన వ్యక్తి యేసు అని చెప్పాడు.

16 యేసు విశ్రాంతి రోజున యివన్నీ చెశాడని తెలియటం వల్ల యూదులు ఆయన్ని పీడించటం మొదలు పెట్టారు. 17 యేసు వాళ్ళతో, “నా తండ్రి అన్ని వేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు.

18 ఈ కారణంగా యూదులాయన్ని చంపటానికి యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు, “అతడు విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా చేసి తనను దేవునితో సమానం చేసుకొంటున్నాడు” అని అన్నారు.

యేసు దేవుని అధికారం కలిగియున్నాడు

19 యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు. 20 తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు. 21 తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు.

22 “అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు. 23 తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు.

24 యేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International