Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 16-18

16 తరువాత యెహోవా హనానీ కుమారుడైన యెహూతో మాట్లాడాడు. యెహోవా రాజైన బయెషాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. “నిన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నేను చేశాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలపై నిన్ను యువరాజుగా చేశాను. నీవు కూడా యరొబాము మార్గాన్నే అనుసరించావు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టేలా చేశావు. వారి పాపకార్యాలతో వారు నాకు కోపం కలుగజేశారు. కావున ఓ బయెషా, నిన్ను నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి చేసినదంతా నీ కుటుంబానికి కూడా చేస్తాను. నీ కుటుంబం వారు నగర వీధుల్లో పడి చనిపోతారు. వారి శవాలను కుక్కలుతింటాయి. నీ సంతతిలో కొందరు పొలాల్లో చనిపోతారు. వారి శవాలను పక్షులు తిని పోతాయి.”

బయెషా చేసిన ఇతర విషయాలన్నిటిని గురించి, అతని సైనిక బలం గురించి ఇశ్రాయేలు రాజుల చరిత గ్రంధంలో వ్రాయబడింది. బయెషా చనిపోయినప్పుడు అతనిని తిర్సాలో సమాధి చేశారు. అతని కుమారుడు ఏలా అతని స్థానంలో రాజు అయ్యాడు.

కావున ప్రవక్తయగు యెహూకు యెహోవా ఒక వర్తమానం అందించాడు. ఆ వర్తమానం బయెషాకు, అతని కుటుంబానికి వ్యతిరేకంగా వుంది. యెహోవా దృష్టిలో నీచమైన కార్యాలనేకం బయెషా చేశాడు. ఇది యెహోవాకు కోపకారణమయ్యింది. అతనికి ముందు యరొబాము సంతతి వారు చేసిన పనులే బయెషా కూడ చేశాడు. బయెషా యరొబాము కుటుంబం వారినందరినీ చంపివేసినందుకు కూడా యెహోవా కోపంగా వున్నాడు.

ఇశ్రాయేలు రాజుగా ఏలా

యూదా రాజుగా ఆసా పాలన ఇరువది ఆరవ సంవత్సరం గడుస్తూ వుండగా ఏలా ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఏలా అనువాడు బయెషా కుమారుడు. అతడు తిర్సాలో రెండేండ్లు పరిపాలించాడు.

రాజైన ఏలా కింది అధికారులలో జిమ్రీ ఒకడు. ఏలా యొక్క రథబలంలో సగానికి జిమ్రీ అధిపతి. కాని ఏలాకు వ్యతిరేకంగా జిమ్రీ కుట్ర పన్నాడు. రాజైన ఏలా తిర్సాలో ఉన్నాడు. అతడు అర్సాఇంటిలో బాగా మద్యపానం చేసి మత్తుగా ఉన్నాడు. తిర్సాలో వున్న రాజుభవన నిర్వాహకుడు అర్సా. 10 జీమ్రీ ఆ ఇంటిలో ప్రవేశించి రాజైన ఏలాను చంపేశాడు. ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా ఇది జరిగింది. తరువాత ఏలా స్థానంలో జిమ్రీ ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు.

ఇశ్రాయేలు రాజుగా జిమ్రీ

11 జిమ్రీ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించగానే, అతడు బయెషా కుటుంబం వారినందరినీ సంహరించాడు. బయెషా వంశంలోని మగవారినెవ్వరినీ అతడు ప్రాణాలతో వదలలేదు. బయెషా స్నేహితులను కూడ జిమ్రీ చంపేశాడు. 12 జిమ్రీ ఆ విధంగా బయెషాయొక్క వంశనాశనం గావించాడు. ప్రవక్తయైన యెహూ ద్వారా బయెషాకు వ్యతిరేకంగా ఏమి జరుగుతుందని యెహోవా పలికాడో ఆ రీతిగా ఇది జరిగింది.

13 బయెషా, అతని కుమారుడు ఏలా చేసిన పాపాల ఫలితంగా ఇది జరిగింది. వారు పాపం చేయటమే కాకుండా, ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి కూడా వారు కారకులయ్యారు. వారు విగ్రహాలను చేయటానికి పాల్పడినందుకు కూడా యెహోవా కోపగించాడు.

14 ఏలా చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

15 ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా, జిమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పాలించాడు. అసలు జరిగిన విషయమేమనగా: ఫిలిష్తీయుల నగరమైన గిబ్బెతోను వద్ద ఇశ్రాయేలు సైన్యం దిగియుండెను. 16 రాజుకు వ్యతిరేకంగా జిమ్రీకుట్ర పన్నుతున్నాడని సైనికులు విన్నారు. అతడు రాజును చంపివేశాడని కూడ విన్నారు. అదే రోజున ఇశ్రాయేలీయులు ఒమ్రీని రాజుగా అదే శిబిరంలోనే ప్రకటించారు. ఒమ్రీ సైన్యాధ్యక్షుడు. 17 తరువాత ఒమ్రీ, ఇశ్రాయేలు సైన్యం గిబ్బెతోనును వదిలి తిర్సాపైకి దండెత్తి వెళ్లారు. 18 నగరాన్ని ముట్టడించి పట్టుకున్నారని జిమ్రీ తెలుసుకున్నాడు. అతడు రాజభవనంలోకి వెళ్లి దానికి నిప్పుపెట్టాడు. అతడు భవనంతో పాటు కాలిపోయాడు. 19 జిమ్రీ పాపం చేయబట్టి అతడు నాశనమయ్యాడు. అతడు పాపం చేశాడు. యెహోవా దృష్టిలో అనేక చెడు కార్యాలు చేశాడు. యరొబాము మాదిరిగానే అతను కూడా పాపం చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.

20 జిమ్రీ పన్నిన కుట్ర విషయం, అతను చేసిన తదితర కార్యాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి. జిమ్రీ రాజైన ఏలాకి వ్యతిరేకంగా తిరిగి నప్పుడు జరిగిన సంఘటనలు కూడ ఆ గ్రంథంలో పొందు పర్చబడ్డాయి.

ఇశ్రాయేలు రాజుగా ఒమ్రీ

21 ఇశ్రాయేలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం గీనతు కుమారుడైన తిబ్నీని బలపర్చి, అతనిని రాజుగా చేయ సంకల్పించింది. రెండవ వర్గం ఒమ్రీని అనుసరించింది. 22 ఒమ్రీ అనుచరులు గీనతు కుమారుడైన తిబ్నీ వర్గం వారికంటె బలంగా వున్నారు. అందువల్ల తిబ్నీ చంపబడ్డాడు. ఒమ్రీ రాజయ్యాడు.

23 ఆసా పాలన యూదాలో ముప్పైయొకటో సంవత్సరం జరుగుతూ వుండగా, ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఒమ్రీ ఇశ్రాయేలును పన్నెండు సంవత్సరాలు పాలించాడు. అందులో ఆరు సంవత్సరాలు తిర్సాలో వుండి ఏలాడు. 24 కాని ఒమ్రీ షోమ్రోను కొండను కొన్నాడు. దానిని షెమెరు అను వానియొద్ద నాలుగు మణుగుల[a] వెండి నిచ్చి కొన్నాడు. ఆ కొండ మీద ఒమ్రీ ఒక నగరాన్ని కట్టాడు. ఆ కొండ యజమానియైన షెమెరు జ్ఞాపకార్థం ఆ నగరానికి షోమ్రోను[b] అని పేరు పెట్టాడు.

25 కాని ఒమ్రీ యెహోవా దృష్టిలో అనేక దుష్ట కార్యాలు చేశాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అతడు ఎక్కువ పాపం చేశాడు. 26 అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన తప్పులన్నీ చేశాడు. ఇశ్రాయేలీయులు పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. కావున వారంతా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కలుగజేశారు. యెహోవాకు కోపం రావటానికి కారణ మేమనగా వారు పనికిమాలిన విగ్రహారాధన చేశారు.

27 ఒమ్రీ చేసిన ఇతర కార్యాలు, తన సైనికబలం మొదలగు విషయాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి. 28 ఒమ్రీ చనిపోయాడు. అతనిని షోమ్రోనులో సమాధి చేశారు. అతని కుమారుడు అహాబు అతని స్థానంలో రాజు అయ్యాడు.

ఇశ్రాయేలు రాజుగా అహాబు

29 యూదాలో ఆసా పాలన ముప్పై ఎనిమిదవ సంవత్సరం జరుగుతూండగా ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజైనాడు. షోమ్రోను నుండి ఇరువది రెండు సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పాలించాడు. 30 అహాబు యెహోవా చేయవద్దన్న కార్యాలను చేశాడు. తనకు ముందు పాలించిన వారందరికంటె అహాబు ఎక్కువ చెడుకార్యాలు చేశాడు. 31 నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపక్రియలు అహాబుకు చాలా సామాన్యమైనవిగా కన్పించాయి. ఆ తప్పులు చాలవన్నట్లు అతడు ఎత్బయలు కుమార్తెయగు యెజెబెలును వివాహం చేసుకున్నాడు. ఎత్బయలు సీదోనుకు రాజు. దానితో అహాబు బయలు దేవతను కొలవటం మొదలు పెట్టాడు. అహాబు అతనిని ఆరాధించాడు. 32 షోమ్రోనులో బయలు ఆరాధనకు ఒక ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయంలో ఒక బలిపీఠం ఏర్పాటు చేశాడు. 33 అషేరా దేవతను ఆరాధించటానికి అహాబు ఒక ప్రత్యేక స్తంభాన్ని నిర్మించాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అహాబు ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపాన్ని కలుగజేశాడు.

34 అహాబు రాజ్యం చేసే కాలంలో బేతేలు వాడైన హీయేలు యెరికో పట్టణాన్ని మరల‌ నిర్మించాడు. హీయేలు నగర నిర్మాణపు పనిని మొదలు పెట్టగానే, అతని పెద్ద కుమారుడగు అబీరాము చనిపోయాడు. హీయేలు నగర ద్వారాలు నిర్మించేటప్పుడు అతని చిన్న కుమారుడగు సెగూబు చనిపోయాడు. నూను కుమారుడైన యెహోషువ ద్వారా ఏది ఎలా జరుగుతుందని యెహోవా చెప్పాడో ఇదంతా ఆ విధంగా జరిగింది.[c]

ఏలీయా మరియు వర్షాభావ పరిస్థితి

17 ప్రవక్తయైన ఏలీయా గిలాదులోని తిష్బీ నగరానికి చెందినవాడు. ఏలీయా వచ్చి రాజైన అహాబుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను సేవిస్తాను. ఆయన శక్తితో నేను నిశ్చయంగా చెప్పేదేమనగా రాబోవు కొద్ది సంవత్సరాలలో మంచుగాని, వర్షంగాని కురియదు. నేను ఆజ్ఞ ఇస్తేగాని వర్షం పడదు.”

తరువాత యెహోవా ఏలీయాతో, “నీవు ఈ ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెళ్లి, కెరీతు వాగువద్ద దాగి వుండు. ఆ వాగు యోర్దాను నదికి తూర్పున ఉన్నది. నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహారాన్ని అక్కడికి చేరవేయమని నేను కాకోలములకు[d] ఆజ్ఞ ఇచ్చాను” అని అన్నాడు. కావున యెహోవా చెప్పిన విధంగా ఏలీయా చేశాడు. యోర్దాను నదికి తూర్పున వున్న కెరీతువాగు దగ్గర నివసించటానికి అతడు వెళ్లాడు. బొంత కాకులు ప్రతి ఉదయం రొట్టెను, ప్రతి సాయంత్రం మాంసాన్ని తెచ్చి ఇచ్చేవి. ఏలీయా వాగు నీటిని తాగేవాడు.

వర్షాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు ఎండిపోయింది. అప్పుడు యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: “సీదోనులోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను.”

10 కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లే సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు. 11 అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకురా” అని ఏలీయా అన్నాడు.

12 “నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెబుతున్నాను. నా వద్ద రొట్టె లేదు. ఒక జాడీలో కొద్దిపిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనెవుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరుకోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” అని ఆ స్త్రీ అన్నది.

13 ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధపడకు. నేను చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒకచిన్న రొట్టె ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట చేసుకో. 14 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది.’”

15 అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు. 16 పిండిజాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరిగింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా చెప్పాడు.

17 కొంత కాలం తరువాత ఆ విధవ స్త్రీ కుమారునికి జబ్బు చేసింది. జబ్బు రోజురోజుకు తీవ్రమయ్యింది. చివరిగా అతని శ్వాస ఆగిపోయింది. 18 ఆమె ఏలీయా వద్దకు వచ్చి, “నీవు దైవజనుడవు కదా! నీవు నా బిడ్డకు సహాయం చేయగలవా? లేక కేవలం నేను చేసిన తప్పులన్నిటినీ నాకు జ్ఞాపకం చేయటానికే నీవు ఇక్కడికి వచ్చావా? నా కుమారుడు చనిపోయేలా చేయటానికే నీవు వచ్చావా?” అని అడిగింది.

19 “నీవు నీ కుమారుని నాకు ఇవ్వు” అని ఏలీయా ఆమెతో అన్నాడు. ఏలీయా ఆమె వద్ద నుండి బిడ్డను తీసుకుని పై అంతస్తుకు వెళ్లాడు. తను ఉంటున్న గదిలో పక్కమీద బాలుని పడుకోబెట్టాడు. 20 తరువాత ఏలీయా ఇలా ప్రార్థన చేశాడు: “ఓ నా ప్రభువైన దేవా! ఈ విధవరాలు తన ఇంటిలో నాకు ఆశ్రయమిచ్చింది. అటువంటి స్త్రీకి ఇటువంటి ఆపద నీవు కలుగజేస్తావా? ఆమె కుమారుడు చనిపోయేలా చేస్తావా?” 21 పిమ్మట ఏలీయా ఆ బాలుని మీద మూడు సార్లు పడి, “ఓ నా ప్రభువైన దేవా! ఈ బాలుడు మరల జీవించేలా చేయు” మని ప్రార్థించాడు.

22 యెహోవా ఏలీయా ప్రార్థన ఆలకించాడు. బాలుడు శ్వాసపీల్చటం ప్రారంభించాడు. వాడు బతికాడు. 23 ఏలీయా బాలుని కిందికి తీసుకుని వచ్చాడు. బాలుని అతని తల్లికి ఇస్తూ, “చూడు! నీ కుమారుడు బతికాడు” అని ఏలీయా అన్నాడు.

24 “నీవు నిజంగా దైవజనుడవేనని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను. నిజంగా యెహోవా నీద్వారా మాట్లాడుతున్నాడని నేను తెలుసుకున్నాను” అని ఆ స్త్రీ అన్నది.

ఏలీయా మరియు బయలు ప్రవక్తలు

18 వర్షాలు లేకుండా పోయి మూడు సంవత్సరాలయ్యింది. అప్పుడు యెహోవా ఏలీయాతో, “నీవు వెళ్లి రాజైన అహాబును కలుసుకో. నేను త్వరలో వర్షం కురిసేలా చేస్తాను” అని చెప్పాడు. కావున ఏలీయా అహాబును కలిసేటందుకు వెళ్లాడు.

అప్పుడు షోమ్రోనులో క్షామం నెలకొన్నది. రాజైన అహాబు ఓబద్యాను పిలిపించాడు. ఓబద్యా రాజభవన నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు. (ఓబద్యా యెహోవాకు నిజమైన అనుచరుడు.) ఒకసారి యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపటం మొదలు పెట్టింది. అప్పుడు ఓబద్యా నూరుమంది ప్రవక్తలను చేరదీసి, వారిని రెండు గుహలలో దాచాడు. ఓబద్యా ఏబది మందిని ఒక గుహలోను, మరో ఏబది మందిని ఒక గుహలోను దాచాడు. ఓబద్యా వారికి ఆహార పానీయాలు ఇచ్చి కాపాడాడు. రాజైన అహాబు ఓబద్యాతో ఇలా అన్నాడు: “నాతో కలిసిరా. మనిద్దరం దేశంలో వున్న నీటి వనరులన్నీ పరిశీలిద్దాము. మన గుర్రాలు, కంచర గాడిదలు బతకటానికి తగిన పచ్చగడ్డి దొరుకుతుందేమో చూద్దాం. అప్పుడు మన పశువులను చంపే అవసరము వుండదు.” నీటి వనరులు వెదకటానికి ఎవరేదిశకు వెళ్లాలో వారు నిర్ణయించుకున్నారు. వారిద్దరూ దేశమంతా తిరగనారంభించారు. అహాబు ఒక దిశలో వెళ్లాడు. ఓబద్యా మరోదిశలో వెళ్లాడు. ఓబద్యా ప్రయాణం చేస్తూండగా అతడు ఏలీయాను కలిశాడు. ఏలీయాను చూడగానే, అతనెవరో ఓబద్యా తెలుసుకున్నాడు. ఓబద్యా ఏలీయాకు సాష్టాంగ నమస్కారం చేసి, “నీవు నా యజమానివైన ఏలీయావే గదా?” అని అడిగాడు.

“అవును నేనే. నీవు వెళ్లి నేనిక్కడ వున్నానని నీ యజమానియగు రాజుకు తెలియజేయి” అని ఏలీయా సమాధానం చెప్పాడు.

అందుకు ఓబద్యా ఇలా అన్నాడు: “నేను అహాబుతో నీవెక్కడ వున్నదీ నాకు తెలుసునని చెప్పితే అతడు నన్ను చంపుతాడు! నీ పట్ల నేనేమీ అపచారం చేయలేదు! నేను చనిపోవాలని నీవెందుకు కోరు కుంటున్నావు? 10 నీ దేవుడైన యెహోవా సాక్షిగా చెబుతున్నాను. రాజు నీ కొరకై ప్రతి చోటా చూస్తూన్నాడు! నిన్ను వెదకమని తన మనుష్యులను అన్ని దేశాలకు పంపాడు. ఏ పాలకుడైనా తన దేశంలో నీవు లేవని చెపితే అహాబు అంతటితో ఆగక నీవతని రాజ్యంలో లేవని ప్రమాణం చేయమని బలవంతపెట్టు తున్నాడు. 11 ఈ పరిస్థితుల్లో నేను వెళ్లి నీవిక్కడ వున్నావని చెప్పమంటున్నావా? 12 ఒకవేళ నేను పోయి రాజైన అహాబుతో నీవిక్కడ వున్నావని చెపితే, ఈ లోపు యెహోవా నిన్ను ఇక్కడ నుంచి మరో చోటికి తీసుకుని పోవచ్చు. రాజైన అహాబు వచ్చి నీవిక్కడ లేకపోవటం చూచి, నన్ను చంపేస్తాడు! నేను నా బాల్యం నుండి యెహోవాను ఆశ్రయించియున్నాను. 13 నేను ఏమి చేశానో నీవు వినే వుంటావు! యెజెబెలు యెహోవా యొక్క ప్రవక్తలందరినీ చంపుతూండగా, నేను వంద మంది ప్రవక్తలను గుహలలో దాచాను. ఏభై మంది ప్రవక్తలను ఒక గుహలోను, మరో ఏభై మందిని వేరొక గుహలోను దాచాను. వారికి అన్న పానాదులిచ్చి ఆదుకున్నాను. 14 ఇప్పుడు నన్ను వెళ్లి నీవిక్కడ వున్నట్లు రాజుతో చెప్పమంటున్నావు. రాజు నన్ను చంపేస్తాడు!”

15 అది విన్న ఏలీయా, “సర్వశక్తిమంతుడైన యెహోవా సాక్షిగా ఈ రోజు నేను రాజు ముందు నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను” అని అన్నాడు.

16 అందువల్ల ఓబద్యా రాజైన అహాబు వద్దుకు వెళ్లాడు. ఏలీయా ఎక్కడ వున్నదీ అతనికి చెప్పాడు. రాజైన అహాబు ఏలీయాను చూడటానికి వెళ్లాడు.

17 ఏలీయాను అహాబు చూచి, “నీవేనా? ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించే వాడివి నీవే కదా!” అని అన్నాడు.

18 ఏలీయా ఇలా అన్నాడు, “నేను ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించటం లేదు. కష్టాలన్నీ నీ మూలంగా, నీ తండ్రి కుటుంబం వారివల్ల వచ్చినవే. యెహోవా ఆజ్ఞలను తిరస్కరిస్తూ, బూటకపు దేవుళ్లను పూజిస్తూ, నీవే ఈ కష్టాలన్నిటికీ కారకుడవయ్యావు. 19 ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు కర్మెలు పర్వతం వద్ద నన్ను కలవమని సమాచారం పంపు. పైగా నాలుగు వందల ఏభై మంది బయలు దేవత ప్రవక్తలను, నాలుగు వందల మంది బూటకపు దేవత అషేరా ప్రవక్తలను అక్కడికి తీసుకొనిరా. రాణీ యెజెబెలు ఈ ప్రవక్తలందరినీ పోషిస్తూ[e] వున్నది.”

20 పిమ్మట అహాబు ఇశ్రాయేలు వారందరినీ, ఆ ప్రవక్తలను కర్మెలు పర్వతం వద్దకు పిలువనంపాడు. 21 ఆ ప్రజలందరి వద్దకు ఏలీయా వచ్చాడు. అతడు వారినుద్దేశించి, “మీరంతా ఎవరిని అనుసరించాలనేది ఎప్పుడు నిర్ణయిస్తారు? యెహోవా నిజమైన దేవుడైతే మీరాయనను అనుసరించండి. బయలు నిజమైన దేవత అయితే మీరా దేవతను అనుసరించండి” అని అన్నాడు.

ప్రజలు ఏమీ మాట్లాడలేదు. 22 అందువల్ల ఏలీయా ఇలా అన్నాడు: “ఇక్కడ నేనొక్కడినే యెహోవాయొక్క వ్రవక్తను. నేను ఒంటరిగా వున్నాను. కాని నాలుగు వందల ఏభై మంది బయలు ప్రవక్తలున్నారు. 23 కావున మీరు రెండు ఆబోతులను తీసుకునిరండి. వాటిలో ఒక దానిని బయలు ప్రవక్తలను తీసుకోనివ్యండి. వారు దానిని చంపి ముక్కలు చేయనీయండి. ఆ మాంసాన్ని ఒక చితిపై వుంచండి. కాని ఆ చితికి నిప్పు పెట్టవద్దు. నేను కూడ ఆ రెండవ ఆబోతును అలాగే చేస్తాను. నేనూ ఆ చితికి నిప్పు అంటించను. 24 బయలు దేవత ప్రపక్తలారా! మీరు మీ దేవునికి ప్రార్థించండి. నేను నా యెహోవాను ప్రార్థిస్తాను. ఏ దేవుడైతే ప్రార్థనలను ఆలకించి, చితిని రగిలింప చేస్తాడో అతడే నిజమైన దేవుడు.”

ప్రజలంతా ఇది మంచి ఆలోచన అని ఒప్పుకున్నారు.

25 బయలు ప్రవక్తలతో మళ్లీ ఏలీయా ఇలా అన్నాడు: “మీరు చాలా మంది వున్నారు. కనుక పని మీరు ముందు మొదలు పెట్టండి. ఒక ఆబోతును ఎన్నుకుని తయారు చెయ్యండి. కాని నిప్పు మాత్రం రగల్చకండి.”

26 కావున ఆ ప్రవక్తలు తమకివ్వబడిన ఆబోతును తీసుకున్నారు. దానిని తయారు చేశారు. వారు బయలు దేవతకు మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. “ఓ బయలు దేవతా! మా ప్రార్థనలు ఆలకించు!” అని వేడుకున్నారు. కాని ఎటువంటి చప్పుడూ లేదు. ఎవ్వరూ సమాధాన మియ్యలేదు. వారు నిర్మించిన బలిపీఠం చుట్టూ ప్రవక్తలు నాట్యం చేశారు. కానీ నిప్పు రాజలేదు.

27 మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా వారిని హేళన చేయనారంభించాడు: “బయలు నిజంగా దైవమైతే మీరు బిగ్గరగా ప్రార్థన చేయాల్సివుంటుందేమో! బహుశః అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు! లేక అతడు చాలా పని ఒత్తిడిలో ఉండవచ్చు. లేక అతను ప్రయాణం చేస్తూ ఉండవచ్చు! అతడు నిద్రపోతూ ఉండవచ్చు! బహుశః మీరతనిని లేపవలసి ఉంటుంది!” అంటూ అపహాస్యం చేశాడు ఏలీయా. 28 అందువల్ల ఆ ప్రవక్తలు బిగ్గరగా ప్రార్థనలు చేయనారంభించారు. వారు కత్తులతోను, ఈటెలతోను శరీరమంతా చీరుకున్నారు. (అది వారి ఆరాధనా తీరు) వారు రక్తం కారేలాగు ఒళ్లు చీరుకున్నారు. 29 మధ్యాహ్న సమయం దాటి పోయింది. అయినా నిప్పు అంటుకోలేదు. సాయంత్రపు బలుల సమయం అయ్యేవరకు ఆ ప్రవక్తలు తమ భయానక చేష్టలు[f] సాగించారు. బయలు వద్దనుండి సమాధానం లేదు. చితికి ఏమీ జరగలేదు.[g]

30 అప్పుడు ఏలీయా ప్రజలతో, “నా వద్దకు రండి” అని అన్నాడు. వారంతా ఏలీయా చుట్టూ చేరారు. బేతేలులో ఉన్న యెహోవా యొక్క బలిపీఠం నాశనం చేయబడింది. ఏలీయా దానిని మళ్లీ నిర్మించాడు. 31 ఏలీయా పన్నెండు రాళ్లను తీసుకున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కోక్క రాయి చొప్పున ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్లను తీశాడు. యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్లతో ఈ గోత్రాలు పిలవబడుతూ వున్నాయి. యాకోబునే యెహోవా ఇశ్రాయేలని పిలిచాడు. 32 ఏలీయా ఈ రాళ్లను యెహోవా గౌరవార్థం బలిపీఠాన్ని నిర్మించటానికి ఉపయోగించాడు. పీఠం చుట్టూ ఏలీయా చిన్న కందకం తవ్వించాడు. అది రెండు షియాల[h] విత్తనాలు నీటితో సహా పట్టేటంత వెడల్పు, లోతుకలిగివుంది. 33 అప్పుడు ఏలీయా కట్టెనంతా బలిపీఠంపై వుంచాడు. అతడు ఆబోతును ముక్కలుగా నరికి, వాటిని పేర్చిన కట్టెలపై వుంచాడు. 34 తరువాత ఏలీయా ప్రజలను నాలుగు జాడీలతో నీరు తీసుకుని మాంసం మీద, కట్టెల మీద చల్లమన్నాడు. వారిని అదే విధంగా మళ్లీ చేయమన్నాడు. ఆయన వారితో మూడవ సారి కూడా అలానే చేయమన్నాడు. 35 ఆ నీరు బలిపీఠం నుండి జారి చుట్టూవున్న కందకాన్ని నింపేసింది.

36 సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా ప్రార్థించాడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా! ఇశ్రాయేలీయుల దైవం నీవేనని నిరూపించమని నేనిప్పుడు నిన్నడుగుతున్నాను. నేను నీ సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు తెలియజేయి. 37 ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు చేర్చుకుంటున్నావని వీరు తెలుసుకుంటారు.”

38 అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలిమాంసాన్ని, కట్టెలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది. 39 ప్రజలంతా ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి. “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని స్తుతించసాగారు.”

40 అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్తలందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” అని అన్నాడు. ప్రవక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చెంపేశాడు.

తిరిగి వర్షాలు పడటం

41 ఏలీయా రాజైన అహాబుతో, “నీవు ఇప్పుడు వెళ్లి అన్నపానాదులు స్వీకరించు. ఒక భారీ వర్షం పడబోతూ వుంది” అని అన్నాడు. 42 రాజైన అహాబు భోజనానికి వెళ్లాడు. అదే సమయంలో ఏలీయా కర్మెలు పర్వతం మీద అతడు వంగి తన మోకాళ్లమధ్య తలను పెట్టాడు. 43 అప్పుడు ఏలీయా తన సేవకునితో సముద్రం చూడమన్నాడు. సముద్రం కనపడే చోటుకు సేవకుడు వెళ్లాడు.

“నేనేమీ చూడలేడు” అని సేవకుడు తిరిగి వచ్చి చెప్పాడు. మళ్లీ వెళ్లి చూడమని ఏలీయా అన్నాడు. ఈ విధంగా ఏడుసార్లు జరిగింది. 44 ఏడవసారి నౌకరు తిరిగి వచ్చి ఒక పిడికెడంత మబ్బును చూసినట్లు చెప్పాడు. అది సముద్రం మీది నుంచి వస్తున్నదని అన్నాడు.

ఏలీయా తన సేవకునితో, “రాజైన అహాబు వద్దకు వెళ్లి తన రథం సిద్ధం చేసుకొని వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పు. అతనిప్పుడు వెళ్లకపోతే వర్షం అతనిని ఆపేస్తుంది” అని అన్నాడు.

45 ఆ తరువాత కొద్ది సేవటికే ఆకాశంలో కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. భయంకరంగా గాలి, వాన ప్రారంభమైనాయి. అహాబు తన రథమెక్కి యెజ్రెయేలుకు తిరుగు ప్రయాణం సాగించాడు. 46 యెహోవా శక్తి ఏలీయా మీదికి వచ్చింది. ఏలీయా తన బట్టలను నడుముకు బిగించి కట్టి రాజైన అహాబుకంటె ముందుగా యెజ్రెయేలుకు పరుగెత్తికొని వెళ్లాడు.

లూకా 22:47-71

యేసును బంధించటం

(మత్తయి 26:47-56; మార్కు 14:43-50; యోహాను 18:3-11)

47 ఆయనింకా మాట్లాడుతుండగా ప్రజల గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. పన్నెండుమందిలో ఒకడైన యూదా అన్నవాడు అందరి కన్నా ముందు ఉన్నాడు. వాడు యేసును ముద్దు పెట్టుకోవటానికి ఆయన దగ్గరకు వెళ్ళాడు.

48 కాని యేసు వానితో, “యూదా! ముద్దు పెట్టుకొని దేవుని కుమారునికి ద్రోహం చెయ్యాలని నీ ఉద్దేశ్యమా?” అని అడిగాడు. 49 యేసు శిష్యులు జరుగబోయే సంఘటనను గ్రహించారు. వాళ్ళు, “ప్రభూ! మా కత్తులతో వాళ్ళను నరకమంటారా?” అని అడిగారు. 50 ఇంతలో ఆయన శిష్యుల్లో ఒకడు తన కత్తి దూసి ప్రధానయాజకుని సేవకుని యొక్క కుడిచెవి నరికి వేశాడు.

51 యేసు, “ఆపండి” అని అంటూ ఆ సేవకుని చెవి తాకి అతనికి నయం చేశాడు.

52 ఆ తర్వాత యేసు తనను బంధించటానికి వచ్చిన ప్రధానయాజకులతో, మందిరం యొక్క ముఖ్య ద్వారపాలకులతో, పెద్దలతో ఈ విధంగా అన్నాడు: “నేనొక దొంగనైనట్లు మీరు కత్తులతో, కర్రలతో రావలసిన అవసరమేమొచ్చింది? 53 నేను మీతోపాటు ప్రతిరోజు ఆలయంలో ఉన్నాను. కాని మీరు అప్పుడు నన్ను బంధించలేదు. ఇది మీ ఘడియ. సైతాను శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ.”

పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం

(మత్తయి 26:57-58, 69-75; మార్కు 14:53-54, 66-72; యోహాను 18:12-18, 25-27)

54 యేసును బంధించి ప్రధాన యాజకుని యింటికి తీసుకొని వెళ్ళారు. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరించాడు. 55 వాళ్ళు పెరటి మధ్య చలిమంటలు వేసి చుట్టూరా కూర్చొన్నారు. పేతురు వచ్చి వాళ్ళతో సహా కూర్చున్నాడు. 56 ఒక పనిపిల్ల ఆ మంటల వెలుతురులో పేతురు అక్కడ కూర్చుని ఉండటం గమనించింది. దగ్గరకు వచ్చి అతణ్ణి చూస్తూ, “ఇతడు కూడా యేసుతో ఉన్నాడు” అని అనింది.

57 కాని పేతురు అది నిజంకాదంటూ, “ఆయనెవరో నాకు తెలియదు అమ్మాయి!” అని అన్నాడు. 58 కొంత సేపయ్యాక మరొకడు అతణ్ణి చూసి, “నీవు కూడా వాళ్ళలో ఒకడివి” అని అన్నాడు.

“నేను వాళ్ళలో ఒకణ్ణి కాదు” అని సమాధానం చెప్పాడు.

59 ఒక గంట తర్వాత యింకొకడు, “ఇతడు గలిలయ దేశస్థుడు. కనుక తప్పక అతనితో ఉన్నవాడే!” అని అన్నాడు.

60 “అయ్యా! మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు” అని పేతురు సమాధానం చెప్పాడు.

అతడీ మాటలంటుండగానే కోడి కూసింది. 61 ప్రభువు అటువైపు మళ్ళీ సూటిగా పేతురు వైపు చూశాడు. అప్పుడు ప్రభువు, “ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో తెలియదని మూడుసార్లంటావు” అని అన్న మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. 62 పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.

భటులు యేసును హేళన చెయ్యటం

(మత్తయి 26:67-68; మార్కు 14:65)

63-64 యేసును కాపలా కాస్తున్న వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ కొట్టటం మొదలు పెట్టారు. ఆయన కళ్ళకు బట్టకట్టి, “నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో చూసి చెప్పు!” అని ఆయన్ని కవ్వించి అడిగారు. 65 అవమానిస్తూ ఎన్నెన్నో మాటలు అన్నారు.

మహాసభ సమక్షంలో యేసు

(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; యోహాను 18:19-24)

66 సూర్యోదయం కాగానే యూదుల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు సమావేశమయ్యారు. వాళ్ళు యేసును మహాసభ ముందుకు పిలుచుకు వచ్చారు. 67 మహాసభ సభ్యులు, “నీవు క్రీస్తువైనట్లైతే మాతో చెప్పు” అని అన్నారు.

యేసు, “నేను చెబితే మీరు నమ్మరు. 68 నేను అడిగితే మీరు చెప్పరు. 69 కాని యిప్పటినుండి మనుష్య కుమారుడు సర్వశక్తిసంపన్నుడైన దేవుని యొక్క కుడివైపున కూర్చుంటాడు” అని సమాధానం చెప్పాడు.

70 వాళ్ళు, “నీవు దేవుని కుమారునివా?” అని అడిగారు. ఆయన, “మీరన్నది నిజం” అని అన్నాడు.

71 ఆ తదుపరి వాళ్ళు, “మనకిక ఇతర సాక్ష్యాలు ఎందుకు? స్వయంగా అతని నోటినుండే విన్నాము” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International