Old/New Testament
దావీదు తుది పలుకులు
23 ఇవి దావీదు చివరి మాటలు,
“యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన రాజు,
ఇశ్రాయేలు మధుర గాయకుడు,
యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన సందేశం.
దావీదు ఇలా అన్నాడు:
2 యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది.
ఆయన పలుకే నా నోటిలో వున్నది.
3 ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు,
ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు:
‘ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో,
ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో
4 ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు,
ఆ వ్యక్తి మబ్బులేని ప్రాతఃకాలంలా ప్రశాంతంగా వుంటాడు,
లేతగడ్డిని చిగురింపజేయు వర్షానంతర సూర్యకాంతిలా
ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.’
5 “గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చలేదు.
తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేశాడు.
అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు.
ఈ ఒడంబడికను దేవుడు బలపర్చాడు.
దానిని ఆయన ఉల్లంఘించడు!
ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగు చేస్తాడు!
6 “కాని దుష్టులు ముండ్లవంటి వారు.
జనులు ముండ్లనుచేతబట్టరు.
వాటిని తక్షణం విసర్జిస్తారు!
7 వాటిని ఎవరు తాకినా కర్ర,
ఇనుము బల్లెములతో గుచ్చివేసినట్లవుతుంది.
దుష్టులు కూడ ముండ్ల వంటి
వారు వారు అగ్నిలో తోయబడి
పూర్తిగా దహింపబడతారు.”
ముగ్గురు వీరులు
8 దావీదు సైన్యంలో ప్రముఖుల పేర్లు ఇలా వున్నాయి:
తక్మోనీయుడగు యోషేబెష్షెబెతు ముగ్గురు యోధుల అధిపతి. ఎస్నీయుడైన అదీనా అని కూడ ఇతడు పిలవబడేవాడు. యోషేబెష్షెబెతు ఒక్క యుద్ధంలోనే ఎనిమిది వందల మందిని చంపివేశాడు.
9 అహోహీయుడైన దోదో కుమారుడు ఎలియాజరు తరువాత ప్రముఖుడు. దావీదు ఫిలిష్తీయులను ఎదిరించిన కాలంలో అతనితో వున్న ముగ్గురు యోధులలో ఎలియాజరు ఒకడు. ఒక పర్యాయము ఫిలిష్తీయలు గుమిగూడి ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికి రాగా, ఇశ్రాయేలీయులు పారిపోయారు. 10 అప్పుడు ఎలియాజరు మాత్రము అలసిపోయేవరకు ఫిలిష్తీయులతో ఒంటరిగా పోరాడాడు. తన చెయ్యి కత్తి పిడికి అంటుకుపోయేలా గట్టిగా పట్టుకుని విడవకుండా శత్రుసంహారం చేశాడు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని సమకూర్చి పెట్టాడు. ఎలియాజరు యుద్ధంలో గెలిచిన తరువాత, జనం తిరిగి వచ్చారు. కాని నిజానికి వారు ఓడిపోయిన శత్రువులను దోచుకోడానికి మాత్రమే వచ్చారు.
11 హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా తరువాత ప్రముఖ సేనాని. ఒక పర్యాయం ఫిలిష్తీయులు వచ్చి నిండుగా పండిన అలసందల చేనువద్ద గుమిగూడారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను చూసి పారి పోయారు. 12 కాని షమ్మా మాత్రం చేను మధ్యలో నిలబడ్డాడు. అతడు చేనును కాపాడుతూ పోరాడాడు. అతడు ఫిలిష్తీయులను హత మార్చాడు. అప్పుడు కూడ యెహావా వారికి ఘన విజయం చేకూర్చాడు.
13 పంట కోతకాలంలో ముప్పై మంది సైనికులలో ఘటికులైన ముగ్గురు ఒక సారి దావీదు వద్దకు వచ్చారు. ఈ ముగ్గురూ అదుల్లాము గుహవద్దకు వచ్చారు. రెఫాయీము లోయలో ఫిలిష్తీయుల సైన్యం గూడారాలు వేసింది.
14 ఆ సమయంలో దావీదు కోటలో వున్నాడు. బేత్లెహేములో కొంత మంది ఫిలిష్తీయుల సైనికులున్నారు. 15 తన స్వగ్రామంలోని నీరు తాగాలనే ప్రగాఢవాంఛ దావీదుకు కలిగింది. “ఓహో, బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి నీరు ఎవరైనా తెచ్చియిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను,” అని దావీదు అన్నాడు. వాస్తవంగా దావీదు దీనిని కోరలేదు; కాని తానలా మట్లాడాడు. 16 కాని ముగ్గురు బలాఢ్యులు మాత్రం ఫిలిష్తీయుల సైనికులను ఛేధించుకుంటూ వెళ్లారు. బేత్లెహేము నగర ద్వారంవద్దగల బావి నుండి నీరు తీసుకున్నారు. దానిని వారు దావీదు వద్దకు తెచ్చారు. కాని దావీదు ఆ నీటిని త్రాగ నిరాకరించాడు. అతడా నీటిని యెహోవా ముందు పారబోశాడు. 17 దావీదు యెహోవాతో, “యెహోవా, నేను దీనిని త్రాగలేను! నా కొరకు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వెళ్లిన వారి రక్తం త్రాగినట్లుగా వుంటుంది,” అని అన్నాడు. అందువల్ల దావీదు ఆ నీటిని త్రాగ నిరాకరించాడు. ఈ ముగ్గురు సైనికులు అలా అనేక సాహసకృత్యాలు చేశారు.
ఇతర ధైర్యముగల సైనికులు
18 సెరూయా కుమారుడైన యోవాబు సోదరుడగు అబీషై ఈ ముగ్గురు సైనికులకు నాయకుడు. అబీషై తన ఈటెనుపయోగించి మూడు వందల శత్రుసైనికులను హతమార్చాడు. అతను కూడ ఆ ముగ్గరు సైనికులంత ప్రఖ్యాతి వహించాడు. 19 వారి ముగ్గురు కంటె అబీషై మిక్కిలి ప్రశంసలు పొందాడు. అతడు వారికి నాయకుడయ్యాడు. అంతేగాని వారితో పాటు ఆ కూటమిలో ఒక సభ్యుడు కాదు.
20 యెహోయాదా కుమారుడైన బెనాయా వున్నాడు. అతడు ఒక పరాక్రమశాలి కుమారుడు. అతడు కబ్సెయేలను ఊరివాడు. బెనాయా చాలా సాహసకృత్యాలు చేశాడు. అతడు మోయాబీయుడగు అరీయేలు ఇద్దరు కుమారులను చంపివేశాడు. అంతేకాదు మంచుపడే కాలంలో బెనాయా ఒక గోతిలోదిగి అక్కడ దాగిన ఒక సింహాన్ని చంపాడు. 21 ఈజిప్టుకు చెందిన ఒక బలమైన యోధుణ్ణి చంపాడు. ఆ ఈజిప్టీయుని చేతిలో ఒక ఈటెవుంది. కాని బెనాయా చేతిలో ఒక కర్ర మాత్రమేవుంది. కాని బెనాయా వెళ్లి ఆ ఈజిప్టీయుని చేతిలోని ఈటె లాక్కున్నాడు. తరువాత బెనాయా ఆ ఈటెతోనే ఈజిప్టీయుని పొడిచి చంపాడు. 22 యెహోయాదా కుమారుడైన బెనాయా అటువంటి కార్యాలు చాలా చేశాడు. బెనాయా కూడ ఆ ముగ్గురు యోధులవలె ప్రసిద్ధి గాంచాడు. 23 ముప్పై మంది సైనికులలోను బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది; కాని ఆ ముగ్గురు యోధుల కూటమిలో సభ్యుడు కాలేదు. బెనాయాను దావీదు తన అంగరక్షకులకు నాయకునిగా చేశాడు.
ముప్పై మంది వీరులు
24 యోవాబు సోదరుడగు అశాహేలు ఆ ముప్పై మందిలో ఒకడు. ఆ ముప్పై మందిలో మిగిలిన వారి పేర్లు:
బేత్లేహేమీయుడగు దోదో కుమారుడైన ఎల్హానాను,
25 హరోదీయుడైన షమ్మా,
హరోదీయుడైన ఎలీకా,
26 పల్తీయుడైన హేలెస్సు,
తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడగు ఈరా,
27 అనాతోతీయుడైన అబీయెజరు,
హుషాతీయుడైన మెబున్నయి,
28 అహోహీయుడైన సల్మోను,
నెటోపాతీయుడైన మహర్తె,
29 నెటోపాతీయుడగు బయానా కుమారుడైన హేలెబు,
బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,
30 పిరాతోనీయుడైన బెనాయా,
గాయషు సెలయేళ్ల ప్రాంతం వాడైన హిద్దయి,
31 అర్బాతీయుడైన అబీయల్బోను,
బర్హుమీయుడైన అజ్మావెతు,
32 షయల్బోనీయుడైన ఎల్యహ్బా,
యాషేను కుమారులలో
33 హరారీయుడైన షమ్మా కుమారుడు యోనాతాను,
హరారీయుడైన షారారు కుమారుడగు అహీయాము,
34 మాయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడగు ఎలీపేలెటు,
గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము,
35 కర్మెతీయుడైన హెస్రై,
అర్బీయుడైన పయరై,
36 సోబావాడగు నాతాను కుమారుడైన ఇగాలు,
గాదీయుడైన బానీ,
37 అమ్మోనీయుడైన జెలెకు,
బెయేరోతీయుడైన నహరై, (సెరూయా కుమారుడైన యోవాబునకు ఆయుధాలు మోసే సహాయకులు,)
38 ఇత్రీ యుడగు ఈరా,
ఇత్రీయుడగు గారేబు,
39 మరియు హిత్తీయుడైన ఊరియా.
వీరంతా మొత్తం ముప్పది ఏడుగురు.
దావీదు తన సైన్యాన్ని లెక్కింప నిర్ణయం
24 యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్ల కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు” అని అన్నాడు.
2 దావీదు రాజు సైన్యాధక్షుడైన యోవాబును పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇశ్రాయేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని అన్నాడు.
3 కాని యోవాబు రాజైన దావీదుతో ఇలా అన్నాడు, “ఇప్పటి జనాభా ఎంతైనా వుండనీ; నీ ప్రభువైన దేవుడు అంతకు వంద రెట్లు ప్రజలను నీకు యిచ్చుగాక! ఇది జరుగగా నీవు చూడాలని కాంక్షిస్తున్నాను. అయినా ఈ పని నీవెందుకు తల పెట్టావు?”
4 రాజు అది విని యోవాబును, సైన్యాధికారులను జనాభా లెక్కలు తీయమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. దానితో యోవాబు, సైన్యాధికారులు ఇశ్రాయేలులో జనాభా లెక్కలు తీయటానికి రాజును విడిచి వెళ్లారు. 5 వారు యోర్దాను నదిదాటారు. అరోయేరు వద్ద గుడారాలు వేశారు. వారి గుడారాలు లోయలోని నగరానికి కుడిప్రక్కగా వున్నవి. (నగరం గాదులోయ మధ్యలో వుంది. యాజేరుకు వెళ్లే మార్గంలోనే నగరంవుంది)
6 వారు గిలాదుకు, తహ్తింహోద్షీ దేశానికి వెళ్లారు. వారింకా దానాయానుకు, సీదోను ప్రాంతానికి వెళ్లారు. 7 వారు తూరు కోటను, మరియు హివ్వీయుల, కనానీయుల యొక్క నగరాలను దర్శించారు. వారు యూదా దేశపు దక్షిణ ప్రాంతాన గల బెయేర్షెబా చేరారు. 8 ఇలా దేశమంతా వారు తొమ్మిది నెలల, ఇరువది రోజుల పాటు తిరిగి చివరికి యెరూషలేముకు వచ్చారు.
9 జనాభా పట్టికను యోవాబు రాజుకు సమర్పించాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల జనం ఎనిమిది లక్షలవరకు వున్నారు. యూదాలో ఐదులక్షల మంది వున్నారు.
దావీదును యెహోవా శిక్షించటం
10 జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.”
11 దావీదు ఉదయం నిద్రలేచే సరికి యెహోవా వాక్యం గాదుకు చేరింది. గాదు ప్రవక్త దావీదుకు సన్నిహితుడు. 12 గాదుకు యెహోవా ఇలా చెప్పాడు: “దావీదు వద్దకు వెళ్లి నా మాటగా ఈ విషయం చెప్పు: యెహోవా మూడు విషయాలు నీ ముందు వుంచుతున్నాడు. ఆయన నీకు చేయవలసిన దాని నొకటి నీవు ఎన్నుకో.”
13 దావీదుతో గాదు ఇలా చెప్పాడు: “నేను చెప్పేవాటిలో ఒక దానిని కోరుకో: ఏడేండ్ల కరువు నీకూ, నీ రాజ్యానికీ రావాలా? లేక నీ శత్రువులు నిన్ను మూడు నెలల పాటు వెన్నంటి తరమాలా? లేక మూడు రోజుల పాటు నీ దేశంలో వ్యాధులు ప్రబలాలా? బాగా ఆలోచన చేసి ఈ మూడింటిలో నీవు దేనిని కోరుకుంటున్నావో చెప్పు. నేను నీ నిర్ణయాన్ని నన్ను పంపిన యెహోవాకి అందజేయాలి.”
14 గాదుతో దావీదు, “నిజంగా నేను చాలా క్లిష్ట పరిస్థితిలో పడ్డాను! యెహోవా దయామయుడు కావున ఆయనే మమ్మల్ని శిక్షించనీ, నాకు శిక్ష ప్రజలనుండి మాత్రం రానీయకు!” అని అన్నాడు.
15 అందువల్ల యెహోవా ఇశ్రాయేలులో వ్యాధులు ప్రబలేలా చేశాడు. ఉదయం మొదలైన వ్యాధులు నిర్ణయించిన గడువు వరకు ప్రబలినాయి. ఉత్తర దేశంలో దానునుండి దక్షిణ ఇశ్రాయేలులోని బెయేర్షెబా వరకు డెబ్బై వేల మంది చనిపోయారు. 16 దేవదూత యెరూషలేమును నాశనం చేసేందుకు చేయి పైకి లేపాడు. కాని జరిగిన విషాద సంఘటనలకు యెహోవా విచారించాడు. ప్రజలను నాశనం చేసిన దేవదూతతో యెహోవా, “ఇది చాలు! నీ చేయిదించు!” అని అన్నాడు. యోహోవాదూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం[a] వద్దవున్నాడు.
దావీదు అరౌనా కళ్లము కొనటం
17 ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించుకున్నాడు, “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! కాని నా ప్రజలంతా నన్ను గొర్రెలవలె అనుసరించారు! వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్రమే చూపించు!”
18 ఆరోజు మరల గాదు దావీదు వద్దకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం మీద యెహోవాకి ఒక బలిపీఠం నిర్మించమని చెప్పాడు”.
19 గాదు చెప్పిన రీతి దావీదు అంతా చేశాడు. యెహోవా ఆజ్ఞలను దావీదు శిరసావహించాడు. దావీదు అరౌనాను చూడటానికి వెళ్లాడు. 20 అరౌనా తలెత్తి చూడగా అక్కడ రాజు (దావీదు) వున్నాడు. ఆయన మనుష్యులు తన వైపు రావటం చూశాడు. అరౌనా ఎదురేగి తన శిరస్సు నేలను ఆనే వరకు వంగి రాజుకు నమస్కరించాడు. 21 “నా ప్రభువైన రాజు నావద్దకు ఎందుకు వచ్చినట్లు?” అని అడిగాడు అరౌనా.
అందుకు దావీదు, “నీనుండి నూర్పిడి కళ్లం కొనడానికి. అది కొని దానిపై యెహోవాకు ఒక బలిపీఠం నిర్మిస్తాను, అప్పడు ఈ వ్యాధులన్నీ అరికట్ట బడతాయి,” అని అన్నాడు.
22 “నా ప్రభువైన రాజు బలికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దహనబలికి కొన్ని ఎద్దులున్నాయి. అగ్నిని ప్రజ్వలింప చేయటానికి ధాన్యం రాలగొట్టే బల్లలు, మరియు ఎద్దులపై వేసే కాడికర్రలు వున్నాయి! 23 ఓ రాజా! ఇవన్నీ నీకు నేను ఇస్తాను.” అని అరౌనా దావీదుతో అన్నాడు. “నీ ప్రభువైన దేవుడు నీ పట్ల ప్రీతి చెందుగాక!” అని కూడ అన్నాడు.
24 అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెబుతున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి ఈ భూమిని కొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!”
కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏబైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు. 25 తరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని దావీదు నిర్మింపజేశాడు. దహనబలులు, సమాధాన బలులు దావీదు అర్పించాడు.
దేశంకొరకు దావీదు చేసిన ప్రార్థనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు.
జక్కయ్య
19 యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా వెళ్తూవున్నాడు. 2 ఆ గ్రామంలో జక్కయ్య అనేవాడు ఉండేవాడు. అతడు పన్నులు సేకరించేవాళ్ళలో పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. 3 జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకొన్నాడు. కాని ప్రజలు గుంపులు గుంపులుగా వుండిరి అతడు పొట్టివాడు అవటంవలన యేసును చూడలేకపోయాడు. 4 యేసు ఆ దారిలో వస్తున్నాడని తెలిసి ఆయన్ని చూడటానికి అందిరకన్నా ముందు పరుగెత్తి ఒక మెడి చెట్టెక్కి కూర్చున్నాడు.
5 యేసు ఆ చెట్టుదగ్గరకు వచ్చాక పైకి చూసి, “జక్కయ్యా! జక్కయ్యా! వెంటనే క్రిందికి దిగిరా! ఈ రోజు నేను నీ యింట్లో బసచెయ్యాలి!” అని అన్నాడు.
6 అతడు వెంటనే క్రిందికి దిగి ఆనందంతో యేసుకు స్వాగతం చెప్పాడు. 7 ప్రజలు జరిగినదంతా చూసి, “యేసు ఒక పాపి యింట్లో బస చెయ్యటానికి వెళ్తున్నాడే!” అని గొణిగారు.
8 కాని జక్కయ్య ప్రభువుతో, “ప్రభూ! నేనుయిక్కడే నా ఆస్తిలో సగం పేదవాళ్ళకు యిస్తాను. నేను ఎవరినుండైనా ఏదైనా మోసం చేసి తీసుకొని ఉంటే దానికి నాలుగు రెట్లు వాళ్ళకు చెల్లిస్తాను” అని అన్నాడు.
9 అప్పుడు యేసు, “ఇతడు కూడా అబ్రాహాము కుమారుడు. కనుక ఈ యింటికి ఈ రోజు రక్షణ వచ్చింది. 10 మనుష్యకుమారుడు తప్పిపోయిన వాళ్ళను వెతికి రక్షించటానికి వచ్చాడు” అని అన్నాడు.
పది మీనాల ఉపమానం
(మత్తయి 25:14-30)
11 ప్రజలు ఆయన చెబుతున్న విషయాలు వింటూ ఉన్నారు. ఆయన యెరూషలేము దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు దేవుని రాజ్యం రాబోతొందని అనుకున్నారు. కనుక ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 12 “గొప్ప కుంటుంబంలో పుట్టినవాడొకడు దూర దేశానికి వెళ్ళి తన దేశానికి రాజుగా నియమింపబడ్డాక తిరిగి రావాలనుకొన్నాడు. 13 వెళ్ళేముందు తన సేవకుల్ని పది మందిని పిలిచి ఒక్కొక్కనికి ఒక మీనాయిచ్చి, ‘నేను తిరిగి వచ్చేదాకా ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యండి’ అని అన్నాడు. 14 అతని ప్రజలకు అతడంటే యిష్టం ఉండేది కాదు. కనుక వాళ్ళు తమ ప్రతినిధుల్ని పంపి, ‘ఇతడు మా రాజుగా ఉండటం మాకిష్టం లేదు’ అని చెప్పనంపారు.
15 “అయినా అతడు రాజుగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత అతడు తన దేశానికి తిరిగి వచ్చాడు. తాను డబ్బిచ్చిన సేవకులు ఎంత సంపాదించారో కనుక్కోవటానికి వాళ్ళను పిలిపించాడు. 16 మొదటి వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో మరొక పది మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 17 ‘మంచిది! నీవు మంచి సేవకుడివి. నీవు చిన్న వాటిలో కూడా ఇంత నమ్మకంగా ఉన్నందుకు పది గ్రామాలపై నీకు అదికారం ఇస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.
18 “రెండవ వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో ఐదు మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 19 ‘నిన్ను ఐదు గ్రామాలపై అధికారిగా నియమిస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.
20 “మూడవవాడు వచ్చి, ‘ప్రభూ! ఇదిగో మీరిచ్చిన మీనా. దాన్ని నేను ఒక గుడ్డలో చుట్టి దాచి ఉంచాను. 21 మీరు చాలా కఠినాత్ములు కనుక మీరంటే నాకు భయం. మీరు మీవి కానివాటిని లాక్కుంటారు; విత్తకుండానే కోయాలంటారు’ అని అన్నాడు.
22 “ఆ రాజు, ‘ఓరి, దుర్మార్గుడా! నిన్ను శిక్షించటానికి నీ మాటలే ఉపయోగిస్తాను. నేను కఠినాత్ముడనని నీకు తెలుసునన్నమాట. నేను ఇవ్వని వాటిని లాక్కుంటానన్నమాట. విత్తనం వేయకుండా ఫలం పొందుతానన్నమాట. 23 అలాంటప్పుడు నా డబ్బు వడ్డీకి ఎందుకు యివ్వలేదు? అలా చేసివుంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది కదా!’ అని అన్నాడు. 24 ఆ తర్వాత అక్కడ నిలుచున్న వాళ్ళతో ‘వాని నుండి ఆ మీనా తీసుకొని పదిమీనాలున్న వానికి ఇవ్వండి!’ అని అన్నాడు.
25 “‘అయ్యా! అతని దగ్గర పదిమీనాలున్నాయి కదా!’ అని వాళ్ళు అన్నారు.
26 “అతడు, ‘వున్నవానికి యింకా ఎక్కువ ఇవ్వబడుతుంది. ఏమిలేని వాని నుండి అతని దగ్గర ఉన్నవి కూడా తేసివేయబడతాయి. 27 ఇక నేను తమ రాజుగా ఉండటానికి నిరాకరించిన శత్రువుల్ని పిలుచుకు వచ్చి నా ముందు చంపండి’” అని అన్నాడు.
© 1997 Bible League International