Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 12-13

నాతాను దావీదుతో మాట్లాడటం

12 యెహోవా నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదు వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు ధనవంతుడు. రెండవవాడు దరిద్రుడు. ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి. కాని పేదవానివద్ధ తాను కొనుక్కున్న ఒక ఆడ గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు. ఆ గొర్రెపిల్లను పేదవాడు సాకాడు. ఆ పేదవానితో పాటు, అతని పిల్లలతో పాటు ఆ గొర్రెపిల్ల కూడ పెరిగింది. ఆ గొర్రెపిల్ల పేదవాని కంచంలో తిని, వాని గిన్నెలో నీళ్లు తాగింది. ఆ పేదవాని రొమ్ము మీద గొర్రెపిల్ల పడుకొని నిద్రపోయేది. పేదవానికి ఆ గొర్రెపిల్ల ఒక కూతురిలా వుండేది.

“ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని ఆ యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రికునికి ఆహారంగా వండించాడు.”

ఇది వింటున్న దావీదుకు ధనికునిపై విపరీతంగా కోపం వచ్చింది. “యెహోవా జీవము తోడుగా ఈ పని చేసిన ఆ వ్యక్తి నిశ్ఛయంగా చావవలసిందే! ఆ గొర్రె పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్లించాలి. ఎందుకంటే వాడు ఈ భయంకరమైన పని చేశాడు. పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో అన్నాడు.

నాతాను దావీదుతో అతని పాపాన్ని తెలియజెప్పటం

“ఆ వ్యక్తివి నీవే అన్నాడు నాతాను దావీదుతో. ఇశ్రాయేలు దేవుడైన యోహోవా నీ విషయంలో ఇలా అంటున్నాడని నాతాను దావీదుతో చెప్పాడు: నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషిక్తం చేశాను. సౌలునుండి నిన్ను కాపాడాను. అతని కుటుంబాన్ని, భార్యలను నీవు తీసుకొనేలా చేశాను. పైగా ఇశ్రాయేలు పైన, యూదా పైన రాజుగా నియమించాను. ఇవన్నీ చాలవన్నట్లు, నీకు ఇంకా చాలా ఇచ్చాను కావున ఎందువల్ల యెహోవా ఆజ్ఞను తిరస్కరించావు? దేవుడు చెడ్డదని చెప్పిన దానిని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను నీవు కత్తితో చంపించావు. అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు. అవును; నీవు ఊరియాను అమ్మోనీయుల కత్తితో చంపావు! 10 కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించుకున్నావు.”

11 “నేను నీకు ఆపద తీసుకువస్తున్నాను. నీ కుటుంబంలో నుండే ఈ ఆపద వస్తుంది. నీ భార్యలందరినీ నీ నుండి నేను తీసివేసి, నీకు అతి సన్నిహితుడైన వానికొకనికి ఇస్తాను. ఆ వ్యక్తి నీ భార్యలందరితో కలియగా, అది అందరికీ తెలుస్తుంది.[a] 12 నీవు బత్షెబతో రహస్యంగా కూడినావు. కాని నేను చేసే పని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుస్తుంది.”[b]

13 నాతానుతో, “యెహోవా పట్ల నేను పాపం చేశాను” అని దావీదు చెప్పాడు.

అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంపబడవు. 14 కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు నీ యెహోవాని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.”

దావీదు బత్షెబల శిశువు మరణించటం

15 పిమ్మట నాతాను ఇంటికి వెళ్లిపోయాడు. ఊరియాభార్య ద్వారా దావీదుకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బు పడేలా యెహోవా చేశాడు. 16 దావీదు బిడ్డ కొరకు దేవుని ప్రార్థించాడు. దావీదు తినటానికి, తాగటానికి నిరాకరించాడు. అతను తన ఇంట్లోకివెళ్లి లోపలే వుండి పోయాడు. రాత్రంతా నేలమీదే పడుకొని వుండిపోయాడు.

17 దావీదు కుటుంబంలో ముఖ్యులైన వారు వచ్చి దావీదును నేలమీద నుండి లేపటానికి ప్రయత్నించారు. కాని దావీదు లేవ నిరాకరించాడు. వారితో కలిసి భోజనం చేయటానికి కూడ దావీదు నిరాకరించాడు. 18 ఏడవ రోజున శిశువు మరణించింది. శిశువు మరణించిందని దావీదుతో చెప్పటానికి సేవకులు భయపడ్డారు. ఒకరితో ఒకరు వారిలా అనుకోసాగారు, “చూడండి, బిడ్డ బ్రతికివుండగా మనం అతనితో మాట్లాడాలని ప్రయత్నం చేశాము. కాని అతను మన మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ మరణం గురించి మనం తెలియ జేస్తే, అతడు తన ప్రాణానికి ముప్పు వాటిల్లే ఏ పనికైనా పాల్పడవచ్చు!”

19 కాని దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవటం గమనించి, బిడ్డ మరణించి వుండవచ్చని ఊహించాడు. “బిడ్డ చనిపోయాడా?” అని దావీదు సేవకులను అడిగాడు.

“అవును, చనిపోయాడు” అని సేవకులు అన్నారు.

20 దావీదు నేలమీద నుంచి లేచాడు. కాళ్లు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకొని, యెహోవాని ప్రార్థించటానికి ఆలయానికి వెళ్లాడు. తరువాత ఇంటికి వెళ్లి, తినటానికి ఆహారాన్ని అడిగాడు. సేవకులు కొంత ఆహారాన్ని ఇవ్వగా, అతడు తిన్నాడు.

21 దావీదు సేవకులు అతనితో ఇలా చెప్పారు, “నీవిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? బిడ్డ బ్రతికి వుండగా నీవు తినటానికి నిరాకరించావు. నీవు ఏడ్చావు. కాని బిడ్డ చనిపోగానే, లేచి భోజనం చేశావు.”

22 అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బ్రతికివుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే యెహోవా నన్ను కనికరించి బిడ్డను బ్రతికించవచ్చు! ఎవరికి తెలుసు! అనుకున్నాను. 23 కాని ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. కావున ఇప్పుడు నేనెందుకు తినటానికి నిరాకరించాలి? నేను బిడ్డను తిరిగి బతికించుకొనగలనా? లేదు! ఏదో ఒక రోజున నేనే వాని దగ్గరకు వెళతాను. అంతేగాని వాడు నా వద్దకు తిరిగి రాలేడు.”

సొలొమోను జన్మించటం

24 దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడామెతో కలిసి వుండి సంగమించగా, ఆమె గర్భవతి అయింది. ఆమెకు మరొక కుమారుడు జన్మించాడు. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా సొలొమోనును ప్రేమించాడు. 25 ప్రవక్త నాతాను ద్వారా యెహోవా తన సందేశం పంపాడు. నాతాను వచ్చి సొలొమోనుకు యదీద్యా[c] అని నామకరణం చేశాడు. దేవుని ఆజ్ఞానుసారం నాతాను అలా చేశాడు.

దావీదు రబ్బాను పట్టుకొనటం

26 యోవాబు అమ్మోనీయుల నగరంపై యుద్ధం చేశాడు. అతడు రాజధాని నగరాన్ని పట్టుకున్నాడు. 27 యోవాబు దావీదు వద్దకు దూతలను పంపి ఇలా చెప్పమన్నాడు: “నేను రబ్బాపై యుద్ధం నిర్వహించాను. నేను జలనగరాన్ని పట్టుకున్నాను. 28 ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని కూడగట్టుకొని వచ్చి రబ్బానగరాన్ని ముట్టడించు. దానిని నాకై నేను వశపర్చుకునేలోగా నీవు వచ్చి పట్టుకో. నేను గనుక వశపర్చుకుంటే, ఆ నగరం నా పేరు మీదుగా పిలువబడుతుంది!”

29 దావీదు తన సైన్యాన్ని కూడదీసికొని రబ్బా నగరానికి వెళ్లాడు. యుద్ధం చేసి ఆ నగరాన్ని వశపర్చుకున్నాడు. 30 దావీదు ఆ రాజు తలనుండి[d] కిరీటాన్ని తీసుకున్నాడు. అది బంగారు కిరీటం. దాని బరువు సుమారు డెబ్బది అయిదు కాసులు. ఈ కిరీటంలో విలువైన వజ్రాలు పొదగబడ్డాయి. ఆ కిరీటాన్ని సైనికులు దావీదు తలపై వుంచారు. ఆ నగరం నుండి దావీదు అనేక విలువైవ వస్తువులను కొల్లగొట్టుకుపోయాడు.

31 అంతేగాదు, దావీదు రబ్బా నగర వాసులను బయటకు తీసుకొని వచ్చాడు. వారందరినీ రంపములతోను, పలుగులతోను, గొడ్డళ్లతోను పని చేయించాడు. వారందరినీ ఇటుకలతో కట్టడాలను నిర్మించేలా చేశాడు. అమ్మోనీయుల నగరాలన్నిటిలో దావీదు ఇలాగే చేయించాడు. తరువాత దావీదు తన సైన్యంతో యెరూషలేముకు వెళ్లిపోయాడు.

అమ్నోను తామారును మోహించుట

13 దావీదుకు అబ్షాలోము అను కుమారుడొకడున్నాడు. అబ్షాలోముకు ఒక సోదరివుంది. ఆమె పేరు తామారు. ఆమె బహుసౌందర్యవతి. దావీదు యొక్క మరో కుమారుడైన అమ్నోను[e] తామారును మోహించాడు. తామారు కన్యక. అందువల్ల ఆమెను తన కామవంఛ తీర్చుకోవటానికి అమ్నోను ఆమెను ఏమీ చేయలేకపోయాడు. కాని అమ్నోను ఆమెను మిక్కిలిగా మోహించాడు. ఆమెను పొందలేక ఆమె ధ్యాసతో అమ్నోను విరక్తితో నీరసించిపోయాడు.

అమ్నోనుకు యెహోనాదాబు అనే స్నేహితుడొకడున్నాడు. అతడు షిమ్యా కుమారుడు. షిమ్యా దావీదు సోదరుడు. యెహోనాదాబు యుక్తిగల వాడు. యెహోనాదాబు అమ్నోనుతో, “రోజు రోజుకీ నీవు చిక్కిపోతున్నావు! నీవు రాజ కుమారుడవు! తినటానికి కావలసినంత ఉంది. కాని ఎందుకిలా చిక్కి శల్యమై పోతున్నావు? నాతో చెప్పు” అన్నాడు.

“నేను తామారును ప్రేమిస్తున్నాను. కాని ఆమె నా తమ్ముడైన అబ్షాలోము సహోదరి” అన్నాడు అమ్నోను.

యెహోనాదాబు అమ్నోనుకు ఇలా సలహాయిచ్చాడు: “నీవు పోయి పడుకో, జబ్బు పడిన వానిలా నటించు. అప్పుడు నీ తండ్రి నిన్ను చూసేందుకు వస్తాడు. నీవాయనతో నీ చెల్లెలైన తామారును నీకు ఆహారాన్నిచ్చి సేవ చేయటానికి పంపమను. ఆమె నీ ఎదుట ఆహారం నీవు చూస్తూవుండగా తయారు చేసి ఆమె నీకు పెడుతుందని కూడా చెప్పు.”

ఆ సలహా మేరకు అమ్నోను పక్క మీద పడుకుని జబ్బు పడిన వానిలా నటించాడు. అమ్నోనును చూడటానికి దావీదు రాజు వచ్చాడు. “దయచేసి చెల్లెలు తామారును పంపించు. నేను చూస్తూవుండగా ఆమె రెండు ప్రత్యెకమైన రొట్టెలు చేసి పెడుతుంది. ఆమె చేతిమీదుగా తింటాను” అని దావీదుతో అమ్నోను చెప్పాడు.

దావీదు తామారు ఇంటికి దూతలను పంపాడు. వారు తామారుతో ఆమె సోదరుడు, “అమ్నోను ఇంటికి వెళ్లి అతనికి కొంత ఆహారం చేసిపెట్టమని చెప్పారు.”

తన సోదరుడైన అమ్నోను ఇంటికి తామారు వెళ్లింది. అమ్నోను మంచంపై ఉన్నాడు తామారు కొంత పిండి తీసుకొని, దానిని ఆమె స్వయంగా కలిపింది. అమ్నోను చూస్తూవుండగా ఆమె కొన్ని రొట్టెలు చేసింది. తరువాత ఆమె రొట్టెలను కాల్చింది. తామారు రొట్టెలను కాల్చిన పిమ్మట పెనంలో వాటిని తీసుకొని వెళ్లి అమ్నోను ముందు పళ్లెంలో వేసింది. కాని అమ్నోను తినటానికి అంగీకరించలేదు. అమ్నోను తన సేవకులందరినీ, “అతనిని ఒంటరిగా వదిలి వెళ్లి పొమ్మన్నాడు” అమ్నోను గదినుండి సేవకులంతా బయటికి పోయారు.

అమ్నోను తామారును చెరచుట

10 అమ్నోను తామారుతో, “రొట్టెలను లోపలి గది లోనికి తీసుకొనిరా. అప్పుడు నీ చేతిమీదుగా వాటిని తింటాను” అని అన్నాడు.

తామారు లోపలి గదిలో వున్న తన సోదరుడైన అమ్నోను వద్దకు వెళ్లింది. ఆమె చేసిన రొట్టెలను తీసుకొని వెళ్లింది. 11 తన చేతుల మీదుగా తింటాడని ఆమె అమ్మోను వద్దకు వెళ్లింది. కాని అమ్నోను తామారును పట్టుకున్నాడు. “చెల్లీ, రా! నాతో కలిసి పడుకో!” అని అన్నాడు.

12 అందుకు తామారు అమ్నెనుతో ఇలా ప్రాధేయపడింది: “వద్దు, సోదరా! నన్ను బలవంతం చేయకు! ఇశ్రాయేలులో ఇలా ఎన్నటికీ జరుగకూడదు! ఈ అవమానకరమైన పని చేయకు! 13 నా కళంకాన్ని నేనెన్నడూ మాపుకోలేను. ఇశ్రాయేలీయులలో నీచకార్యాలు చేసే మూర్ఖులలో నీవొకడివై పోతావు. దయచేసి రాజుతో మాట్లాడు. నన్ను వివాహం చేసికోటానికి ఆయన నీకు అనుమతిస్తాడు.”

14 కాని అమ్నోను తామారు చెప్పే దానిని వినటానికి నిరాకరించాడు. అతడు తామారుకంటె బలవంతుడు. అతడామెను బలాత్కరించి సంగమించాడు. 15 దాని తరువాత అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. ముందు అతనామెనెంతగా ప్రేమించాడో, అంతకు మించి ఇప్పుడు అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. అమ్నోను తామారుతో, “మంచం మీది నుంచి లేచి బయటికి పొమ్మన్నాడు.”

16 అందుకు తామారు అమ్నోనుతో, “కాదు! నీవిప్పుడు మునుపటికంటె ఇంకా ఘోరమైన తప్పు చేస్తున్నావు. నీవు నన్ను పంపివేయటానికి ప్రయత్నిస్తున్నావు!” అనిఅన్నది.

కాని అమ్నోను తామారు చెప్పేది వినలేదు. 17 అమ్నోను తన సేవకుణ్ణి లోనికి పిలిచి, “ఇప్పుడే ఈ పిల్లను గదినుండి బయటికి పంపించు! బయటకు నెట్టి తలుపుకు తాళం వేయి” అని చెప్పాడు.

18 అమ్నోను సేవకుడు తామారును బయటికి గెంటి గదికి తాళం పెట్టాడు.

తామారు ఒక రంగురంగుల పొడవైన చేతులు, చాలా వదులుగా వుండే అంగీని వేసుకున్నది. ఆ రకమైన అంగీలను పెండ్లికాని రాజ కుమార్తెలు మాత్రమే వేసుకునేవారు. 19 తామారు కొద్దిగా బూడిద తీసుకొని తన నెత్తి మీద పోసుకున్నది. తన రంగురంగుల అంగీని చింపుకొన్నది. తన చేయి నెత్తిమీద పెట్టుకుని బిగ్గరగా ఏడ్చుకుంటూ పోయింది.[f]

20 తామారు సోదరుడు అబ్షాలోము తామారుతో, “నీ సోదరుడు అమ్నోను నిన్ను చెరిచినాడుగా?”[g] అన్నాడు. “అమ్నోను నీ సోదరుడు. కావున చెల్లీ, ప్రస్తుతానికి నీవు మాట్లాడక వుండు. ఇది నిన్ను విపరీతంగా సంక్షోభపెట్టకుండా[h] చూసుకో!” అది విన్న తామారు ఇక ఏమీ మట్లాడ లేదు. నాశనమైన స్త్రీలా, అమె అబ్షాలోము ఇంటి వద్దనే ఉండసాగింది.

21 ఈ వార్త దావీదు రాజు విన్నాడు. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. 22 అబ్షాలోము అమ్నోనును అసహ్యించుకున్నాడు. అబ్షాలోము అమ్నోను నుద్దేశించి మంచిగా గాని, చెడ్డగా గాని ఏమీ అనలేదు. తన సోదరి తామారును చెరచినందుకు అమ్నోనును అసహ్యించుకున్నాడు.

అబ్షాలోము పగ తీర్చుకొనటం

23 రెండు సంవత్సరాల తరువాత అబ్షాలోము కొందరు మనుష్యులను తన గొర్రెల నుండి ఉన్ని తీయటానికి బయల్దాసోరుకు రావించాడు. ఈ కార్యక్రమం చూడటానికి రాజకుమారులందరినీ అబ్షాలోము ఆహ్వానించాడు. 24 అబ్షాలోము రాజు వద్దకు వెళ్లి, “నా గొర్రెల నుండి ఉన్ని తీయటానికి మనుష్యులను పిలిచాను. దయచేసి నీ సేవకులతో వచ్చి ఆ కార్యక్రమం తిలకించ” మని అడిగాడు.

25 “వద్దు, కుమారుడా! మేము రాము. మేమంతా వస్తే అది నీకు చాల శ్రమ అవుతుంది” అని దావీదు రాజు అబ్షాలోముతో అన్నాడు.

దావీదును రమ్మని అబ్షాలోము ప్రాధేయపడ్డాడు. దావీదు వెళ్లలేదు గాని, అతని పనిని ఆశీర్వదించాడు.

26 “నీవు రాకుంటే, దయచేసి నా సోదరుడు అమ్నోనును నాతో పంపించు” మని అబ్షాలోము అడిగాడు.

“అతడు నీతో ఎందుకు రావాలి?” అని దావీదు రాజు అడిగాడు.

27 అయినా అబ్షాలోము వినిపించుకోకుండా అదే పనిగా ప్రాధేయపడి అడిగాడు. చివరికి అమ్నోను, మిగిలిన రాజకుమారులు అబ్షాలోముతో వెళ్లటానికి ఒప్పుకున్నారు.

అమ్నోను హత్య చేయబడటం

28 అబ్షాలోము తన సేవకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “అమ్నోనును ఒక కంట కనిపెట్టి వుండండి. వాడు బాగా తాగిన పిమ్మట ‘అమ్నోనును చంపండి’ అంటాను. ఆ సమయంలో వానిని చంపండి! భయపడకండి నేను మీకు అజ్ఞ ఇస్తున్నాను! నిబ్బరంగా, ధైర్యంగా వుండండి” అని అబ్షాలోము సేవకులతో అన్నాడు.

29 అబ్షాలోము ఆజ్ఞ మేరకు అతని యువసేవకులు అమ్నోనును చంపివేశారు. కాని దావీదు మిగిలిన కుమారులంతా తప్పించుకున్నారు. వారిలో ప్రతి ఒక్కడూ తన కంచర గాడిదపై ఎక్కి తప్పించుకు పోయాడు.

అమ్నోను మరణవార్తను దావీదు వినటం

30 రాజకుమారులంతా మార్గంమధ్యలో వుండగానే, ఈ వార్త దావీదుకు చేరింది. “అబ్షాలోము రాజ కుమారులందరినీ చంపివేశాడనీ, ఒక్కడు కూడా మిగల లేదనీ” ఆయనకు వర్తమానం వచ్చింది.

31 దావీదు రాజు తన బట్టలు చింపుకొని నేలమీద పడ్డాడు. దావీదు చెంతనున్న తన సేవకులు కూడా విషాదసూచకంగా తమ బట్టలు కూడా చింపుకున్నారు.

32 దావీదు సోదరుడగు షిమ్యా కుమారుడు యెహోనాదాబు దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “రాజకుమారులంతా చనిపోయారని అనుకోవద్దు. చనిపోయినది అమ్నోను ఒక్కడు మాత్రమే! అబ్షాలోము ఇదంతా జరిపించాడు. 33 కారణమేమనగా అమ్నోను అబ్షాలోము చెల్లెలు తామారును చెరిచాడు. కాబట్టి అమ్నోను మాత్రము చంపబడ్డాడు.”

34 అబ్షాలోము పరారైనాడు.

నగర ప్రహరీ గోడమీద ఒక కావలివాడు నిలబడి వున్నాడు. కొండకు అవతలి ప్రక్కనుండి చాలా మంది రావటం చూశాడు. 35 అది చూసి యెహోనాదాబు దావీదు రాజుతో, “చూడండి, నేను చెప్పింది నిజమైనది. రాజ కుమారులంతా వస్తున్నారు!” అన్నాడు.

36 యెహోనాదాబు ఈ మాటలు అంటూ వుండగానే రాజకుమారులు వచ్చారు. వారు గగ్గోలు పడి ఏడుస్తూవున్నారు. దావీదు, అతని సేవకులందరూ కూడ విలపించసాగారు. వారంతా విపరీతంగా దుఃఖించారు. 37 దావీదు తన కుమారుడైన అమ్నోను కొరకు ప్రతి రోజూ దుఃఖించాడు.

అబ్షాలోము గెషూరుకు తప్పించుకు పోవటం

అబ్షాలోము తల్మయి రాజు[i] వద్దకు పారిపోయాడు. తల్మయి గెషూరుకు రాజు. అతని తండ్రి పేరు అమీహూదు. 38 అబ్షాలోము గెషూరుకు పారిపోయి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. 39 అమ్నోను మరణం గూర్చి దావీదురాజు క్రమేపీ ఓడార్చబడ్డాడు. కాని అతడు అబ్షాలోమును గూర్చి మిక్కిలి ఆరాట పడసాగాడు.

లూకా 16

అవినీతి గుమాస్తా యొక్క ఉపమానం

16 యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఒక ధనవంతుని దగ్గర ఒక గుమాస్తా పని చేస్తూ ఉండేవాడు. కొందరు, గుమాస్తా ఆ ధనవంతుని ధనం వ్యర్థం చేస్తున్నాడని అతనిపై ఆ ధనవంతునితో ఫిర్యాదు చేశారు. ఆ కారణంగా ఆ ధనవంతుడు తన గుమాస్తాను పిలిచి, ‘నేను నిన్ను గురించి వింటున్నదేమిటి? జమాఖర్చుల లెక్కలు నాకు చూపు. నీవిక నా గుమాస్తాగా ఉండటానికి వీల్లేదు’ అని అన్నాడు.

“ఆ గుమాస్తా, ‘నేనేం చెయ్యాలి? నా యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసివేస్తున్నాడు. పొలం దున్ని జీవించాలంటే శక్తి లేదు. భిక్ష మెత్తుకోవాలంటే సిగ్గేస్తుంది. ఆ! నా ఉద్యోగం పోయినప్పుడు ప్రజలు నన్ను తమ ఇండ్లలోనికి ఆహ్వానించేటట్లు ఏమి చెయ్యాలో తెలిసింది’ అని అనుకున్నాడు.

“వెంటనే అతడు తన యజమానికి అప్పున్న వాళ్ళను ఒక్కొక్కరిని పిలిచాడు. మొదటివానితో, ‘నా యజమానికి ఎంత అప్పున్నావు?’ అని అడిగాడు. ‘వందలీటరులు ఒలీవ నూనె’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని అక్కడ కూర్చొని దాన్ని వెంటనే యాభై లీటర్లు చెయ్యి’ అని అతనితో అన్నాడు.

“ఆ తర్వాత రెండవ వానితో, ‘నీవెంత అప్పున్నావు?’ అని అడిగాడు. ‘వంద గోధుమ సంచులు’ అని అతడు సమాధానం చెప్పాడు. ఆ గుమాస్తా, ‘ఈ రసీదు తీసుకొని దాన్ని ఎనభై సంచులు చెయ్యి’ అని అతనితో అన్నాడు.

“ఆ యజమాని, ఆ అవినీతి గుమాస్తాను తెలివిగా ప్రవర్తించినందుకు అభినందించాడు. దైవ చింతన కలవాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చూపుతున్న తెలివి కన్నా, ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు తమ పరిస్థితుల్ని ఎక్కువ తెలివిగా ఎదుర్కొంటారు.

“నేను చెప్పేదేమిటంటే, మీ ఐహిక సంపదను ఉపయోగించి ఈ లోకపు స్నేహితులను సంపాదించండి. మీ ధనం తరిగిపోయిన తర్వాత వారు మీకు సహాయం అవుతారు. 10 చిన్న విషయాల్లో నమ్మగలిగిన వాణ్ణి పెద్ద విషయాల్లో కూడా నమ్మవచ్చు. చిన్న విషయాల్లో అవినీతిగా ఉన్నవాడు పెద్ద విషయాల్లో కూడా అవినీతిగా ఉంటాడు. 11 ఐహిక సంపద విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు నిజమైన సంపద విషయంలో మిమ్మల్నెవరు నమ్ముతారు? 12 ఇతరుల ఆస్థి విషయంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు మీకు మీ స్వంత ఆస్థిని ఎవరిస్తారు?

13 “ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలాచేస్తే అతడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఒకని పట్ల విశ్వాసం చూపి యింకొకని పట్ల నీచంగా ప్రవర్తిస్తాడు. దేవుణ్ణి, ధనాన్ని సమంగా కొలువలేము.”

ధర్మశాస్త్రము, దేవుని రాజ్యము

(మత్తయి 11:12-13)

14 పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేవాళ్ళు కనుక వాళ్ళు ఇది విని యేసును హేళన చేశారు. 15 యేసు వాళ్ళతో, “మీరు ప్రజల ముందు నీతిమంతులుగా ప్రవర్తిస్తారు. కాని మీ హృదయాల్లో ఏముందో దేవునికి తెలుసు. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో వాటిని దేవుడు తిరస్కరిస్తాడు.

16 “యోహాను కాలాందాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు వ్రాసిన విషయాలు ఆచరణలో ఉన్నాయి. యోహాను కాలం నుండి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటింపబడుతోంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలోకి వెళ్ళాలని తమ శక్త్యానుసారం కష్టపడుతున్నారు. 17 భూమి, ఆకాశము నశించిపోవచ్చు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు.

విడాకులు మరియు పునర్వివాహము

18 “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్న ప్రతివాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడాకులివ్వబడిన స్త్రీని వివాహం చేసుకొన్నవాడు కూడా వ్యభిచారిగా పరిగణింపబడతాడు” అని అన్నాడు.

ధనవంతుడు, లాజరు

19 “ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు మంచి విలువైన దుస్తులు వేసుకొని ప్రతిరోజు భోగాలనుభవిస్తూ జీవించేవాడు. 20 అతని గడప ముందు లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కులు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. 21 అతడాధనికుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు.

22 “ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ ధనికుడు కూడా చనిపొయ్యాడు. అతడు సమాధి చెయ్యబడ్డాడు. 23 నరకంలో ఆ ధనికుడు హింసలు అనుభవిస్తూవుండేవాడు. తలెత్తి చూడగా లాజరును తన ప్రక్కన కూర్చోబెట్టుకున్న అబ్రాహాము కనిపించాడు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. 24 అందువల్ల అబ్రాహామును పిలిచి, ‘తండ్రి అబ్రాహామా! నామీద దయ చూపు. నేను ఈ మంటల్లో తీవ్రంగా బాధపడ్తున్నాను. లాజరుతో ఇక్కడకు వచ్చి తన వేలుముంచి నా నాలుక తడపమని చెప్పండి’ అని అన్నాడు.

25 “కాని అబ్రాహాము, ‘కుమారుడా! జ్ఞాపకం తెచ్చుకో! నీవు బ్రతికిన రోజుల్లో సుఖాలనుభవించావు. లాజరు కష్టాలనుభవించాడు. కాని అతడిక్కడ ఆనందంగా ఉన్నాడు. నీవు బాధలను అనుభవిస్తున్నావు. 26 ఇక్కడి వాళ్ళు అక్కడకు రాకూడదని, అక్కడివాళ్ళు యిక్కడికి రాకూడదని మన మధ్య పెద్ద అఘాతం ఉంది’ అని అన్నాడు.

27 “ఆ ధనికుడు అలాగైతే ‘తండ్రి! లాజరును మా తండ్రి ఇంటికి పంపు. 28 అక్కడ నా ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళు యిక్కడకు వచ్చి హింసలు అనుభవించకుండా ఉండేటట్లు వాళ్ళకు బోధించుమని చెప్పు’ అని అన్నాడు.

29 “అబ్రాహాము ఈ విధంగా సమాధానం చెప్పాడు: ‘మోషే, ప్రవక్తలు ఉన్నారు కదా! వాళ్ళు చెప్పినట్లు చెయ్యనీ!’

30 “‘తండ్రీ అబ్రాహామా! చనిపోయిన వాళ్ళనుండి ఎవరైనా వెళ్తే వాళ్ళు విని మారుమనస్సు పొందుతారు’ అని ఆ ధనికుడు అన్నాడు.

31 “అబ్రాహాము, ‘వాళ్ళు మోషే, ప్రవక్తలు చెప్పినట్లు విననట్లైతే చనిపోయినవాడు బ్రతికి వచ్చినా వాళ్ళు వినరు’ అని అన్నాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International