Old/New Testament
దావీదు పలుచోట్లకు వెళ్లుట
22 దావీదు గాతును వదిలి అదుల్లాము గుహలలోకి పారిపోయాడు. అదుల్లాము గుహలో దావీదు ఉన్నట్లు అతని సోదరులు, బంధువులు విన్నారు. దావీదును చూడటానికి వారక్కడికి వెళ్లారు. 2 చాలా మంది ప్రజలు దావీదుతో కలిసారు. కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందిన వారు దావీదు చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. అతనితో కలిపి వారు మొత్తం నాలుగు వందలమంది.
3 దావీదు అదుల్లాము గుహ వదిలి మోయాబులో ఉన్న మిస్పాకు వెళ్లాడు. “దేవుడు నాకు ఏమి చేయనున్నాడో నేను తెలుసుకునే వరకు దయచేసి నా తల్లి దండ్రులను వచ్చి నీతో ఉండనియ్యి” అని దావీదు మోయాబు రాజును అడిగాడు. 4 దావీదు తన తల్లి దండ్రులను మోయాబు రాజువద్ద వదిలి పెట్టాడు. దావీదు కొండలలో[a] దాగి ఉన్నంత కాలం అతని తల్లిదండ్రులు మోయాబు రాజుతోనే ఉన్నారు.
5 గాదు ప్రవక్త దావీదును, “కోటలో వుండవద్దనీ, యూదాకు వెళ్లమని చెప్పాడు.” కనుక దావీదు బయల్దేరి హారేతు అరణ్యానికి వెళ్లాడు.
అహీమెలెకు కుటుంబాన్ని సౌలు నాశనము చేయుట
6 దావీదు, అతని మనుష్యులను గూర్చి తన మనుష్యులకు తెలిసినట్లు సౌలు విన్నాడు. గిబియా వద్ద కొండ మీద ఉన్న ఒక వృక్షం క్రింద సౌలు కూర్చున్నాడు. సౌలు క్రింది అధికారులంతా అతని చుట్టూ నిలబడ్డారు. సౌలు చేతిలో ఒక ఈటె వుంది. 7 సౌలు తన చుట్టూవున్న అధికారులనుద్దేశంచి, “బెన్యామీను మనుష్యులారా వినండి! యెష్షయి కుమారుడు దావీదు మీ అందరికీ భూములు, ద్రాక్షతోటలు ఇస్తాడని మీరనుకుంటున్నారా? మీ అందరినీ దావీదు సహస్ర సైన్యాధిపతులుగా, శత దళాధిపతులుగా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అని అడిగాడు. 8 మీరంతా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు! మీరు రహస్య పథకాలు వేసారు. నా కుమారుడు యోనాతాను యెష్షయి కుమారునితో ఒడంబడిక చేసుకున్నట్లు మీలో ఎవ్వడూ నాకు చెప్పలేదు! నా గురించి మీలో ఒక్కనికీ శ్రద్ధలేదు! దావీదును నా కుమారుడు యోనాతాను ప్రోత్సహించినట్టు మీలో ఒక్కడూ నాకు చెప్పలేదు. నా సేవకుడు దావీదును దాగుకొనుమని, నన్ను ఎదురుదెబ్బ తీయుమని యోనాతాను చెప్పాడు. దావీదు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు” అని అన్నాడు.
9 ఎదోమీయుడగు దోయేగు అక్కడ సౌలు అధికారులతో పాటు నిలబడివున్నాడు. “యెష్షయి కుమారుడైన దావీదు అహీటూబు కుమారుడైన అహీమెలెకును నోబులో చూడటానికి వచ్చినపుడు, అతనిని నేను చూసాను. 10 దావీదు కొరకు అహీమెలెకు ప్రార్థన చేయటం, అహీమెలెకు అతనికి ఆహారం ఇవ్వటం, పైగా ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గాన్ని అహీమెలెకు దావీదుకు ఇవ్వటం నేను చూసాను” అని దోయేగు వివరంగా చెప్పాడు.
11 అది విన్న సౌలు అహీటూబు కుమారుడు, యాజకుడైన అహీమెలెకును, అతని బంధువుల నందరినీ తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. అహీమెలెకు బంధువులంతా నోబులో యాజకులు. వారంతా రాజువద్దకు వచ్చారు. 12 “అహీటూబు కుమారుడా, విను” అని సౌలు అహీమెలెకుతో అన్నాడు.
“చెప్పండి ప్రభూ,” అన్నాడు అహీమెలెకు.
13 “నీవూ, యెష్షయి కుమారుడైన దావీదూ కలిసి నామీద ఎందుకు రహస్య పథకాలు వేసారు? నీవు దావీదుకు రొట్టె, ఖడ్గం ఇచ్చావు. వాని కోసం నీవు దేవునికి ప్రార్థన చేసావు. ఇప్పుడు దావీదు నన్ను ఎదుర్కోటానికి వేచియున్నాడు.” అన్నాడు అహీమెలెకుతో సౌలు.
14 అహీమెలెకు, “దావీదు నీ పట్ల చాలా విశ్వసంగా ఉన్నాడు. దావీదు అంతటి నమ్మకస్థుడు నీ అధికారులలో మరెవ్వరూ లేరు. దావీదు నీ సొంత అల్లుడు. పైగా నీ అంగరక్షకులందరికీ అతడు అధిపతి. నీ సొంత కుటుంబమంతా దావీదును గౌరవిస్తూ ఉంది. 15 నేను దావీదు కొరకు ప్రార్థన చేయటం అది మొదటి సారికాదు. ఎన్నటికీ కాదు. నన్నుగాని, నా బంధువులనుగాని నిందించవద్దు. మేము నీ సేవకులము. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందనేది నాకేమీ తెలియదు” అని జవాబిచ్చాడు.
16 కానీ రాజు, “అహీమెలెకూ! నీవూ, నీ బంధువులు అంతా చావాల్సిందే!” అన్నాడు. 17 అప్పుడు రాజు తన పక్కనవున్న భటులతో, “వెళ్లి, యెహోవా యాజకులందరినీ చంపండి. వారు దావీదు పక్షంగా ఉన్నారు. దావీదు పారిపోతున్నాడని వారికి తెలుసు. అయినా వారు నాకు ఆ విషయం చెప్పలేదు” అని చెప్పాడు.
రాజభటులు యెహోవా యాజకులకు హాని చేసేందుకు నిరాకరించారు. 18 అప్పుడు రాజు దోయేగును పిలిచి, “నీవు వెళ్లి ఆ యాజకులను చంపు” అని ఆజ్ఞాపించాడు. దానితో ఎదోనీయుడైన దోయేగు వెళ్లి యాజకులందరినీ చంపేసాడు. ఆ రోజు ఎనభై అయిదు మంది యాజకులను దోయేగు చంపేసాడు. 19 నోబు యాజకుల యొక్క పట్టణం. నోబు పట్టణంలోని వారందరినీ దోయేగు చంపేసాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసివాళ్లు అందరినీ దోయేగు చంపేసాడు. వారి పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నిటినీ దోయేగు చంపేసాడు.
20 అయితే అబ్యాతారు తప్పించుకున్నాడు. ఇతడు అహీటూబు మనుమడు. అంటే అహీమెలెకు కుమారుడు. అబ్యాతారు పారిపోయి దావీదును కలుసుకొన్నాడు. 21 సౌలు, యెహోవా యాజకులనందకినీ చంపిన విధమంతా అబ్యాతారు దావీదుకు చెప్పాడు. 22 “ఎదోమీయుడగు దోయేగును ఆ రోజు నోబులో నేను చూసాను, వాడు సౌలుకు తప్పనిసరిగా చెబుతాడని నాకు తెలుసును, కాని నీ తండ్రి కుటుంబం అంతా చనిపోవటానికి నేనే కారకుడను. 23 నిన్ను చంపాలనుకొనే సౌలు నన్నూ చంపాలనుకుంటున్నాడు. నీవు నాతోనే ఉండు. భయపడవద్దు. నాతో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు” అని దావీదు అబ్యాతారుతో అన్నాడు.
దావీదు కెయీలాకు వెళ్లటం
23 అక్కడి ప్రజలు దావీదుతో, “ఫిలిష్తీయులు కెయీలా రాజ్యంపై యుద్ధం చేస్తున్నారనీ, నూర్చెడి కళ్లాలనుండి ధాన్యాన్ని కొల్ల గొడుతున్నారనీ” చెప్పారు.
2 “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా?” అని దావీదు యెహోవాను అడిగాడు.
“వెళ్లు. ఫిలిష్తీయులను ఎదుర్కొని కెయీలాను కాపాడు.” అని యెహోవా దావీదుకు సమాధానమిచ్చాడు.
3 కాని దావీదు మనుష్యులు, “మనము యూదాలోనే ఉండి భయపడి పోతున్నాము. ఇక ఫిలిష్తీయుల సైన్యంవున్న చోటికి వెళితే మా భయానికి అంతువుండదు” అన్నారు.
4 దావీదు మళ్లీ యెహోవాను అడిగాడు. యెహోవా, “కెయీలాకు వెళ్లు, ఫిలిష్తీయులను జయించటానికి నేను నీకు సహాయం చేస్తాను” అని దావీదుకు జవాబిచ్చాడు. 5 అప్పుడు దావీదు తన మనుష్యులతో కెయీలాకు వెళ్లాడు. దావీదు మనుష్యులు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి, వారిని ఓడించి, వారి పశువులను పట్టుకున్నారు. దావీదు ఫిలిష్తీయులను చిత్తుగా ఓడించి వారి బారినుండి కెయీలా ప్రజలను రక్షించాడు. 6 (అహీమెలెకు కుమారుడు అబ్యాతారు దావీదు వద్దకు పారిపోయినప్పుడు తనతో ఏఫోదు అనబడే యాజకుల అంగీని ఒక దానిని తీసుకొని వెళ్లాడు).
7 దావీదు కెయీలాలో ఉన్నట్లు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని, “దేవుడు దావీదును నాకిచ్చినట్టే! దావీదు తనకు తాను బోనులో పడ్డాడు. ఎందువల్ల నంటే అతను చుట్టూ ద్వారాలు కటకటాలు ఉన్న పట్టణంలో ప్రవేశించాడు” అన్నాడు సౌలు. 8 సౌలు తన సైన్యాన్ని సమీకరించుకొని, యుద్ధానికి సిద్ధమయ్యాడు. దావీదును, అతని అనుచరులను ఎదిరించటానికి సౌలు సైన్యం కెయీలాకు వెళ్లేందుకు తయారయింది.
9 తన మీద సౌలు పన్నాగం పన్నుతున్నాడని దావీదు తెలుసుకున్నాడు. “ఏఫోదు తీసుకురా” అని దావీదు అబ్యాతారుకు చెప్పాడు.
10 దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలీయుల యెహోవా దేవా! నా మూలంగా సౌలు కెయీలా పట్టణానికి వచ్చి దానిని నాశనం చేయ సంకల్పించాడని విన్నాను. 11 సౌలు కెయీలాకు వస్తాడా? కెయీలా ప్రజలు నన్ను సౌలుకు అప్పగిస్తారా? ఇశ్రాయేలీయుల యెహోవా దేవా, నేను నీ సేవకుడను! దయచేసి నాకు చెప్పు.”
“అవును!” అని యెహోవా జవాబిచ్చాడు.
12 దావీదు, “కెయీలా ప్రజలు నన్ను, నా మనుష్యులను సౌలుకు అప్పగిస్తారా?” అని మళ్లీ అడిగాడు.
“అవును!” అని యెహోవా జవాబిచ్చాడు.
13 అది విన్న దావీదు తన మనుష్యులతో కెయీలా వదిలి వెళ్లిపోయాడు. దావీదుతో ఆరువందల మంది వెళ్లారు. ఒక చోటనుండి మరొక చోటికి వారు తరలిపోయారు. దావీదు కెయీలానుండి తప్పించుకున్నాడని విన్న సౌలు కెయీలా నగరానికి వెళ్లలేదు.
సౌలు దావీదును వెంటాడుట
14 దావీదు అరణ్యములో ఉన్న దుర్గాలలోను, జీపు అరణ్యంలోని కొండలలోను తలదాచుకున్నాడు. ప్రతి రోజూ సౌలు దావీదు కోసం వెదుకుతూ ఉండేవాడు. కానీ యెహోవా దావీదును సౌలు పట్టుకొనేలా చేయలేదు.
15 జీపు అరణ్యంలో హోరేషు వద్ద ఉన్నాడు దావీదు. సౌలు తనను చంపటానికి వస్తున్నాడని భయపడ్డాడు. 16 కానీ సౌలు కుమారుడు యోనాతాను హోరేషులో ఉన్న దావీదును చూడటానికి వెళ్లాడు. యోనాతాను దావీదుకు యెహోవా మీద దృఢవిశ్వాసం కలిగేందుకు సహాయం చేసాడు. 17 యోనాతాను, “భయపడకు, నా తండ్రి సౌలు నిన్ను తాకలేడు. నీవు ఇశ్రాయేలుకు రాజువవుతావు. నేను నీ తరువాత స్థానంలో ఉంటాను. ఇది నా తండ్రికి కూడా తెలుసు” అన్నాడు దావీదుతో.
18 యోనాతాను, దావీదు ఇద్దరూ యెహోవా ఎదుట ఒక ఒడంబడిక చేసుకున్నారు. తరువాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు. దావీదు హోరేషులో ఉండిపోయాడు.
జీపు ప్రజలు దావీదు గురించి సౌలుకు చెప్పుట
19 గిబియాలో ఉన్న సౌలు వద్దకు జీపు ప్రజలువచ్చి, “తమ రాజ్యంలో దావీదు దాగియున్నట్లు చెప్పారు. యెషిమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండ మీద వున్న హోరోషు కోటలో దావీదు ఉన్నట్లు చెప్పారు. 20 ఓ రాజా! ఇప్పుడు మీరు ఏ సమయంలో వచ్చినా దావీదును మీకు పట్టి ఇచ్చే బాధ్యత మాది” అని అన్నారు.
21 అందుకు సౌలు, “నాకు సహాయం చేస్తున్నందుకు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! 22 వెళ్లండి. అతని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకొనండి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో కనుగొనండి. అతనిని అక్కడ ఎవరు చూశారో కూడా తెలుసుకోండి. సౌలు కంటె దావీదు తెలివైనవాడు, కనుక తనను మోసగిస్తాడు అని అనుకున్నాడు. 23 దావీదు దాక్కొనే స్థలాలన్నీ కూడ తెలుసుకోండి. మళ్లీ నా వద్దకు వచ్చి నాకు పూర్తి సమాచారం తెలియజేయండి. అప్పుడు నేను మీతో వస్తాను. దావీదు ఆ ప్రాంతంలోనే ఉంటే నేను వానిని కనుగొంటాను. అవసరమైతే యూదాలో ప్రతి ఇంటిని శోధించైనా సరే వానిని కనుక్కుంటాను” అన్నాడు.
24 అప్పుడు జీపువాళ్లు జీపుకు తిరిగి వెళ్లిపోయారు. సౌలు తరువాత అక్కడికి వెళ్లాడు.
దావీదు, అతని అనుచరులు మాయోను అరణ్యంలో ఉన్నారు. అది యెషీమోనుకు దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతం. 25 సౌలు, అతని సైనికులు దావీదును వెతుక్కుంటూ వెళ్లారు. కాని సౌలు అతనికొరకు వస్తున్నాడని ప్రజలు దావీదును హెచ్చరించారు. దావీదు మాయోను అరణ్యంలోని “కొండ” కు వెళ్లాడు. ఇది సౌలు తెలుసుకున్నాడు. సౌలు దావీదును వెతుక్కుంటూ మాయోను అరణ్యానికి వెళ్లాడు.
26 పర్వతానికి ఒక ప్రక్కన సౌలు ఉన్నాడు. దావీదు, అతని మనుష్యులు అదే పర్వతానికి మరో వైపున ఉన్నారు. సౌలునుండి దూరంగా పోవటానికి దావీదు తొందర పడుతూ ఉన్నాడు. కానీ దావీదును సపరివారంగా పట్టుకోవాలని సౌలు, అతని సైనికులు ఆ పర్వతం చుట్టూ తిరుగుట ప్రారంభించారు.
27 ఒక సందేశకుడు సౌలు వద్దకు వచ్చి, “ఫిలిష్తీయులు తమ రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారనీ” త్వరగా రమ్మనీ చెప్పాడు.
28 అంతటితో సౌలు దావీదును వెంటాడటం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోటానికి వెళ్లాడు. అందువల్ల ప్రజలు ఈ ప్రదేశానికి, “జారుడు బండ”[b] అని పేరు పెట్టారు. 29 దావీదు మోయోను ఎడారి వదలి ఏన్గెదీ దగ్గర ఉన్న కొండస్థలాలకు వెళ్లాడు.
దావీదు సౌలును అవమానపరచుట
24 సౌలు ఫిలిష్తీయులను తరిమివేసిన పిమ్మట, “దావీదు ఏన్గెదీ ఎడారిలో ఉంటున్నట్లు” ప్రజలు అతనికి చెప్పారు.
2 కనుక సౌలు ఇశ్రాయేలు అంతటినుండీ మూడువేలమందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారిని తీసుకొని వెళ్లి దావీదు కొరకు, అతని అనుచరుల కొరకు వెతకటం మొదలు పెట్టాడు. అడవి మేక బండలు అనే చోట వారు వెదికారు. 3 సౌలు బాట ప క్కగావున్న గొర్రెల మంద వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలోకి కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లాడు. ఆ గుహలోనే చాలా లోపల దావీదు, అతని మనుష్యులు దాగివున్నారు. 4 సౌలును చూసి దావీదు అనుచరులు అతనితో “యెహోవా చెప్పిన రోజు ఇదే. ‘నీ శత్రువును నీకు అప్పగిస్తాను కనుక ఇప్పుడు నీ శత్రువును నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు అని యెహోవా నీతో చెప్పాడు గదా!’” అన్నారు.
అప్పుడు దావీదు మెల్లగా సౌలు వద్దకు పాకుతూ వెళ్లి, సౌలు అంగీని ఒక కొన కోసివేశాడు. సౌలు దావీదును గమనించలేదు. 5 కానీ తర్వాత సౌలు అంగీని కోసివేసినందుకు దావీదు బాధపడ్డాడు. 6 “నా యజమానికి నేను ఇలాంటి పని చేయకుండా యెహోవా నన్ను నివారించునుగాక! సౌలు యెహోవా నియమించిన రాజు. సౌలు యెహోవాచే అభిషేకింపబడిన రాజు గనుక సౌలుకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయకూడదు” అని దావీదు తన మనుష్యులతో అన్నాడు. 7 కోపోద్రేకులైన తన మనుష్యులను అదుపు చేయటానికి దావీదు ఈ మాటలు చెప్పాడు. దావీదు వారిని సౌలు మీదికి పోనియ్యలేదు.
సౌలు గుహ వదిలి తన దారిన వెళ్లిపోయాడు. 8 అతని వెనుకనే దావీదు బయటికి వచ్చి, “రాజా నా ప్రభూ” అని కేక వేసాడు. సౌలు వెనుదిరిగి చూశాడు. దావీదు వంగి నమస్కరించాడు. 9 “దావీదు నీకు హాని చేయ చూస్తున్నాడని ప్రజలు చెబితే నీవెందుకు ఆ మాటలు వింటున్నావు? 10 యెహోవా ఈ రోజున గుహలో నిన్ను నాకు ఎలా అప్పగించాడో నీ కళ్లతో నీవే చూశావు. కానీ నిన్ను చంపటానికి నేను నిరాకరించాను. నేను నీపట్ల కనికరము చూపాను. ‘సౌలు యెహోవా చేత అభిషేకించబడిన రాజు. నా యజమానికి నేను కీడు చేయను’ అని నేననుకున్నాను. 11 ఇదిగో నీ రాజవస్త్రం ముక్క నా చేతిలో ఉంది చూడు! దీనిని నీ అంగీ నుండి ఒక మూల కోశాను. నిన్ను నేను చంపగలిగి ఉండేవాడిని కానీ చంపలేదు. ఇప్పుడైనా నీవు అర్థం చేసుకో. నేను నీకు ఏ కీడూ తలపెట్టలేదు. నేను నీ ఎడల ఏ తప్పూ చేయలేదు. కాని నీవు మాత్రం నన్ను చంపే ప్రయత్నంలో వెంటాడుతున్నావు. 12 యెహోవాయే న్యాయం తీర్చును గాక! నీవు నాపట్ల తలపెట్టిన కీడుకు యెహోవా నిన్ను శిక్షించవచ్చును. కాని నాకై నేను నీతో పోరాడను. 13 దుష్టులనుండి దుష్టకార్యాలే వస్తాయనే ఒక పాత సామెత ఉంది.
‘కానీ నేను దుర్మార్గం ఏమీ చేయలేదు.’
“నేను దుర్మార్గుడిని కాదు. నేను నీకు హాని చేయను. 14 ఇంతకూ నీవు తరుముచున్నది ఎవరిని? ఇశ్రాయేలు రాజు పోరాడేందుకు వస్తున్నది ఎవరిమీదికి? నిన్ను గాయపర్చే వారినెవరినో నీవు వెంటాడటం లేదు! ఏదో ఒక చచ్చిన కుక్కనో, లేక ఈగనో నీవు తరుము తున్నట్టుగా ఉంది. 15 యెహోవాయే న్యాయమూర్తిగా ఉండి నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చును గాక! యెహోవా నన్ను బలపర్చి నేను నిర్దోషినని నిరూపిస్తాడు. ఆయన నన్ను నీ బారినుండి రక్షిస్తాడు” అని రాజైన సౌలుతో దావీదు చెప్పాడు.
16 దావీదు తన మాట ముగించగానే, సౌలు “దావీదూ! నా కుమారుడా, అది నీ స్వరమేనా?” అంటూ ఏడ్వటం మొదలుపెట్టాడు. సౌలు చాలా ఏడ్చాడు. 17 “అవును నీవు చెప్పింది వాస్తవమే. నేనే తప్పు చేశాను. నీవు నాపట్ల చాలా మంచితనం చూపించావు. కాని నేనే నీపట్ల చెడుగా ప్రవర్తించాను. 18 నీవు చేసిన మంచి పనులన్నీ నాకు నీవు చెప్పావు. యెహోవా నన్ను నీ వద్దకు తీసుకుని వచ్చాడు. అయినా నీవు నన్ను చంపలేదు. 19 ఇది నీవు నా శత్రువు కాదని నిరూపిస్తుంది. శత్రువు చేజిక్కినపుడు మంచితనంతో ఎవరూ విడిచి పెట్టరు. శత్రువుకు ఎవరూ మేలు చేయరు. ఈ రోజు నీవు నాపట్ల ఇంత మంచిగా ప్రవర్తించినందుకు యెహోవా నీకు ప్రతిఫలం దయచేయును గాక! 20 నీవు ఖచ్చితంగా రాజువు అవుతావని నాకు తెలుసు. ఇశ్రాయేలు రాజ్యాన్ని నీవు పరిపాలిస్తావు. 21 ఇప్పుడు నాకొక మాట ఇవ్వు. యెహోవా నామం పేరిట నీవు నా సంతతి వారిని హతమార్చనని మాటయివ్వు. నా తండ్రి వంశం నుంచి నా పేరు తుడిచివేయనని నీవు నాకు ప్రమాణం చేసి చెప్పు.” అన్నాడు సౌలు.
22 కనుక సౌలుకు దావీదు వాగ్దానం చేసాడు. సౌలు కుటుంబాన్ని నాశనం చేయనని దావీదు వాగ్దానం చేశాడు. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వెళ్లాడు. దావీదు తన అనుచరులతో కొండ స్థలాలకు వెళ్లిపోయాడు.
పరిసయ్యులవలె ఉండవద్దు
12 అంతలో వేలమంది ప్రజలు సమావేశమవటం వలన ఒకళ్ళనొకళ్ళు త్రోసు కోవటం మొదలు పెట్టారు. యేసు మొదట తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడండి. 2 బయట పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు. 3 చీకట్లో మాట్లాడుకున్న మాటలు అందరికీ వినిపిస్తాయి. గది తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు ఇంటి కప్పుల మీదినుండి ప్రకటింపబడతాయి.
దేవునికి మాత్రమే భయపడుము
(మత్తయి 10:28-31)
4 “మిత్రులారా! నేను చెబుతున్నది వినండి: ఈ శరీరాన్ని చంపేవాళ్ళను చూసి భయపడకండి. దాన్ని చంపాక వాళ్ళేమీ చెయ్యలేరు. 5 ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారమున్న వానికి భయపడండి! ఔను, ఆయనకు భయపడుమని చెబుతున్నాను.
6 “రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్ముడు పోతాయి కదా! అయినా, ఒక్క పిచ్చుకనైనా దేవుడు మరచిపోలేదు. 7 మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. పిచ్చుకలకన్నా మీ విలువ ఎక్కువే! కనుక భయపడకండి.
నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవొద్దు
(మత్తయి 10:32-33; 12:32; 10:19-20)
8 “బహిరంగంగా నన్ను అంగీకరించిన వాణ్ణి మనుష్యకుమారుడు దేవదూతల సమక్షంలో అంగీకరిస్తాడని నేను చెబుతున్నాను. 9 కాని ప్రజల సమక్షంలో నన్ను కాదన్న వాణ్ణి మనుష్యకుమారుడు దేవుని సమక్షంలో కాదంటాడు.
10 “మనుష్యకుమారుణ్ణి దూషించిన వాణ్ణి దేవుడు క్షమించవచ్చునేమో కాని పవిత్రాత్మను దూషించినవాణ్ణి దేవుడు క్షమించడు.
11 “సమాజమందిరాల ముందు, లేక పాలకుల ముందు, లేక అధికారుల ముందు మిమ్మల్ని నిలబెడితే ఏ విధంగా మాట్లాడాలో, నిర్దోషులని ఏ విధంగా ఋజువు చేసుకోవాలో చింతించకండి. 12 మీరు ఏమి మాట్లాడాలో అప్పుడు పవిత్రాత్మ మీకు చెబుతాడు.”
పిసినారి ఉపమానం
13 ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.
14 యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు. 15 ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు.
16 ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది. 17 అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు.
18 “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో 19 ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు.
20 “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు.
21 “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”
మొదట దేవుని రాజ్యం
(మత్తయి 6:25-34, 19-21)
22 ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందువల్ల నేను చెప్పేదేమిటంటే జీవించటానికి ఏమి తినాలి? మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి? అని చింతించకండి. 23 మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది. 24 పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు. పంటకోయవు. వాటిదగ్గర ఎలాంటి ధాన్యపు కొట్లు లేవు. దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరాపక్షుల కన్నా విలువైన వాళ్ళు. 25 చింతించి తన జీవితాన్ని ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? 26 మీరింత చిన్న విషయం సాధించ లేనప్పుడు మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు?
27 “పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సొలొమోను రాజుకూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు. 28 మీలో కొంతకూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు కదా! మరి మిమ్మల్నెంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి.
29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి. 30 ప్రపంచం లోవున్న ప్రతి ఒక్కడూ వాటికోసం ప్రాకులాడుతాడు. మీ తండ్రికి మీకేవి అవసరమో తెలుసు. 31 ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు.
© 1997 Bible League International