Old/New Testament
7 మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “నేను నీకు తోడుగా ఉంటాను. ఫరోకు నీవు ఒక మహారాజులా[a] ఉంటావు. అహరోను నీ పక్షంగా మాట్లాడే మాటకారిగా[b] ఉంటాడు. 2 నీకు నేను ఆజ్ఞాపించేదంతా అహరోనుతో చెప్పు. నేను చెప్పే విషయాలన్నీ అతను రాజుతో చెబుతాడు. ఇక ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఈ దేశాన్ని వదిలిపోనిస్తాడు. 3 అయితే నేను ఫరోను మొండిగా చేస్తాను. (మీరు అతనితో చెప్పే సంగతులను అతడు లెక్క చేయడు) అప్పుడు నేను ఈజిప్టులో అనేక అద్భుతాలు చేస్తాను. అయినా అతను వినేందుకు నిరాకరిస్తాడు. 4 అందుచేత ఈజిప్టును నేను ఘోరంగా శిక్షిస్తాను. తర్వాత నా ప్రజలను ఆ దేశం నుండి నేను బయటకు నడిపిస్తాను. 5 అప్పుడు నేనే యెహోవాను అని ఈజిప్టు ప్రజలు తెలుసుకుంటారు. నేను వాళ్లకు వ్యతిరేకంగా ఉంటాను. నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. అప్పుడు నేనే నా ప్రజలను ఆ దేశంనుండి బయటకు నడిపిస్తాను.”
6 మోషే, అహరోనులు యెహోవా తమతో చెప్పిన ఈ మాటలకు విధేయులయ్యారు. 7 అప్పటికి మోషే వయస్సు 80 సంవత్సరాలు అహరోను వయస్సు 83 సంవత్సరాలు.
మోషే కర్ర పాము అవుతుంది
8 మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు: 9 “మీ శక్తి రుజువు చేయమని ఫరో మిమ్మల్ని అడుగుతాడు. ఒక అద్భుతం చేయమని మిమ్మల్ని అడుగుతాడు. అతని కర్ర నేలమీద పడవేయమని అహరోనుతో చెప్పు. ఫరో చూస్తూ ఉండగానే ఆ కర్ర పావు అవుతుంది.”
10 కనుక మోషే, అహరోను ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా చెప్పినట్టు చేసారు. అహరోను తన చేతి కర్రను కింద పడవేసాడు. ఫరో తన అధికారులతో కలసి చూస్తూ ఉండగానే ఆ కర్ర పాముగా అయింది.
11 కనుక రాజు తన విద్వాంసులను, మంత్రగాళ్లను పిలిపించాడు. వాళ్లు మంత్రాలు వేసి, అహరోను చేసినట్లే చేయగల్గారు. 12 వాళ్లు కూడా వారి కర్రలను నేల మీద పడవేసారు. ఆ కర్రలు పాములయ్యాయి, కాని అహరోను కర్ర వాళ్ల కర్రలను మింగేసింది. 13 అయినా సరే ప్రజలను వెళ్లనిచ్చేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఏమి జరుగుతుందని యెహోవా చెప్పాడో అలాగే ఇది జరిగింది. మోషే, అహరోనుల మాట వినేందుకు రాజు ఒప్పుకోలేదు.
నీళ్లు రక్తంగా మారటం
14 అప్పుడు మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఫరో మొండికెత్తాడు. ప్రజల్ని పోనిచ్చేందుకు ఫరో నిరాకరిస్తున్నాడు. 15 ఉదయాన్నే ఫరో నైలు నదికి వెళ్తాడు. నది ఒడ్డున అతని దగ్గరకు వెళ్లు. పాముగా మారిన ఆ కర్రను నీ వెంట తీసుకొనివెళ్లు. 16 అతనికి ఇలా చెప్పు: ‘హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపించాడు. అరణ్యంలో నన్ను ఆరాధించటానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని నీతో చెప్పమని యెహోవా నాతో చెప్పాడు. ఇప్పటివరకు నీవేమో యెహోవా మాట వినలేదు. 17 కనుక యెహోవా చెబుతున్నాడు, నేనే యెహోవానని చెప్పి నీవు ఇలా తెల్సుకొంటావు నా చేతిలో ఉన్న ఈ కర్రతో నైలు నది నీళ్లను నేను కొడతాను. నైలునది రక్తంగా మారిపోతుంది. 18 దానితో నదిలో చేపలన్నీ చస్తాయి, నది కుళ్లు కంపు కొడుతుంది. అంతటితో ఈజిప్టు వాళ్లు నదిలోని నీళ్లు తాగలేక పోతారు.’”
19 యెహోవా మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “వారి నదులు, కాలువలు, చెరువుల మీద, వారు నీరు నిల్వ చేసే ప్రతి స్థలం మీద తన చేతి కర్ర చాపాలని అహరోనుకు చెప్పు. అతను ఇలా చెయ్యగానే నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. చెక్క పాత్రలు, రాతి పాత్రల్లో ఉన్న నీళ్లతో సహా మొత్తం నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి.”
20 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే, అహరోనులు చేసారు. అతను కర్ర పైకెత్తి నైలునది నీళ్లమీద కొట్టాడు. ఫరో, అతని అధికారులు అందరి ముందు అతడు ఇలా చేసాడు. నదిలో నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి. 21 నదిలో చేపలు చచ్చాయి. నది కుళ్లు కంపు కొట్టడం మొదలయింది. అందుచేత ఈజిప్టు వాళ్లు ఆ నదిలో నీళ్లు తాగలేక పోయారు. ఈజిప్టు అంతా రక్తమయం అయిపోయింది.
22 మాంత్రికులు కూడ మాయలు చేసి అలాగే చేసారు. కనుక మోషే, అహరోనుల మాటను ఫరో లెక్కచేయలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది. 23 ఫరో ముఖం తిప్పుకొని తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. మోషే, అహరోనులు చేసిన దాన్ని ఫరో అలక్ష్యం చేసాడు.
24 ఈజిప్టు వాళ్లు నదిలో నీళ్లు త్రాగలేక పోయారు. అందుచేత తాగే నీళ్ల కోసం వాళ్లు ఆ నది చుట్టూ బావులు తవ్వారు.
కప్పలు
25 నైలు నది నీళ్లను యెహోవా మార్చేసిన తర్వాత ఏడు రోజులు గడిచాయి.
8 మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఫరో దగ్గరకు వెళ్లి, ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు, అని యెహోవా చెబుతున్నాడని అతనితో చెప్పు. 2 వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపేస్తాను 3 నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నదిలోనుంచి వచ్చి మీ ఇళ్లలో దూరుతాయి. అవి మీ పడక గదుల్లో పడకల మీద వుంటాయి. మీ అధికారుల ఇళ్లలో, మీ వంట పాత్రల్లో, నీళ్ల బానల్లో కప్పలే ఉంటాయి. 4 నీవు, నీ ప్రజలు, నీ అధికారులు అందరి మీదికీ కప్పలు వచ్చేస్తాయి.’”
5 అప్పుడు మోషేతో యెహోవా, “కాలువలు, నదులు, చెరువులు, అన్నింటి మీదికీ తన చేతి కర్రను ఎత్తమని అహరోనుతో చెప్పు. కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి” అని చెప్పాడు.
6 కనుక ఈజిప్టు జలాలపై అహరోను తన చేయి ఎత్తగా నీళ్లలో నుండి కప్పలు బయటకు వచ్చి, ఈజిప్టు దేశమంతా నిండిపోవటం మొదలయింది.
7 మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా అలాగే చేసారు, కనుక ఈజిప్టు మీదికి ఇంకా ఎక్కువ కప్పలు వచ్చాయి.
8 మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు, “నా దగ్గర్నుండి, నా ప్రజల దగ్గర్నుండి కప్పలను తీసివేయుమని యెహోవాను అడగండి. యెహోవాకు బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెళ్లనిస్తాను” అన్నాడు ఫరో.
9 ఫరోతో మోషే ఇలాగు చెప్పాడు, “కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో చెప్పు, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండిపోతాయి. (కప్పలు ఎప్పుడు నిన్ను వదిలి పోవాలనుకొంటున్నావు?)”
10 “రేపే” అన్నాడు ఫరో.
మోషే అన్నాడు: “నీవు చెప్పినట్టే జరుగుతుంది. మా దేవుడైన, యెహోవాలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరని నీవు తెలుసుకొంటావు. 11 నిన్ను, నీ ఇంటిని, నీ అధికారుల్ని, నీ ప్రజల్ను కప్పలు విడిచిపోతాయి. ఆ కప్పలు నదిలోనే ఉండిపోతాయి.”
12 మోషే, అహరోను ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయారు. ఫరో మీదికి ఆయన పంపిన కప్పల్నిగూర్చి మోషే యెహోవాకు మొరపెట్టాడు. 13 మోషే అడిగిన ప్రకారం దేవుడు చేసాడు. ఇళ్లలో, వాకిళ్లలో, పొలాల్లో కప్పలు చచ్చాయి. 14 అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది. 15 కప్పల బాధ వదలిపోవడం చూచి ఫరో మళ్లీ మొండికెత్తాడు. అతను ఏమి చెయ్యాలని మోషే అహరోనులు అడిగారో, అలా చేయలేదు. ఇదంతా సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
పేలు
16 యెహోవా మోషేతో ఇలా అన్నాడు “నీ కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టు ఈజిప్టుదేశ వ్యాప్తంగా దుమ్ము పేలు అవుతాయి. అని అహరోనుతో చెప్పు.”
17 వారు అలా చేసారు. అహరోను తన చేతి కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టాడు. ఈజిప్టు అంతటా దుమ్ము పేలు అయింది. మనుష్యుల మీద జంతువుల మీద పేలు ఎక్కేసాయి.
18 ఈజిప్టు మాంత్రికులు వారి మాయల్ని ప్రయోగించి వారు కూడ అలా చేయాలని ప్రయత్నం చేసారు. కానీ దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేక పోయారు. జంతువుల మీద, మనుష్యుల మీద పేలు అలాగే ఉండిపోయాయి.
19 కనుక ఇది యెహోవా శక్తివల్లే జరిగిందని మాంత్రికులు ఫరోతో చెప్పారు. కాని ఫరో వారు చెప్పింది ఒప్పుకోలేదు. ఇదీ సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
ఈగలు
20 యెహోవా మోషేతో ఇలా అన్నాడు, “ఉదయాన్నే లేచి ఫరో దగ్గరకు వెళ్లు. ఫరో నదికి వెళ్తాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్లనివ్వు’ అని యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. 21 ‘నీవు నా ప్రజల్ని వెళ్లనివ్వక పోతే, నీ ఇండ్లలోకి ఈగలు వచ్చేస్తాయి, నీ మీద, నీ అధికారుల మీద ఈగలు పట్టేస్తాయి. ఈజిప్టు గృహాలన్నీ ఈగలతో నిండిపోతాయి. ఈజిప్టు దేశమంతా ఈగలతో నిండిపోతుంది.’ 22 అయితే ఈజిప్టు ప్రజలను చూచినట్టు మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడను. నా ప్రజలు నివసిస్తున్న గోషెనులో మాత్రం ఈగలు ఉండవు. ఈ విధంగా నేను అంటే యెహోవాను ఈ భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకొంటావు. 23 కనుక రేపు నా ప్రజల్ని నీ ప్రజల కంటే వేరుగా చూస్తాను. అదే నా రుజువు.”
24 అందుచేత యెహోవా అలాగే చేసాడు. ఈజిప్టు మీదికి విస్తారంగా ఈగలు వచ్చేసాయి. ఫరో ఇంట్లోను, అతని అధికారుల ఇండ్లన్నింటిలోను ఈగలు ఉన్నాయి. ఈజిప్టు అంతటా ఈగలు ముసురుకొన్నాయి. ఈగలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. 25 కనుక మోషే అహరోనుల్ని ఫరో పిలిపించాడు. “ఈ దేశంలోనే ఇక్కడే మీ దేవునికి బలులు అర్పించండి” అని ఫరో వాళ్లతో చెప్పాడు.
26 కానీ మోషే అన్నాడు, “అలా చేయటం సరికాదు. మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించటం చాలా భయంకర విషయం అని ఈజిప్టు వాళ్లు అనుకొంటారు. ఈజిప్టు వాళ్లకు కనబడేటట్టు మేము గనుక ఇలా చేస్తే, ఈజిప్టు వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. 27 మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోకి వెళ్లనిచ్చి, అక్కడ మా యెహోవా దేవునికి బలులు అర్పించనివ్వు. యెహోవా మమ్మల్ని ఇలాగే చేయమన్నాడు.”
28 అందుకు ఫరో, “మీరు వెళ్లి అరణ్యంలో మీ యెహోవా దేవునికి బలులు అర్పించనిస్తాను. కానీ మీరు మాత్రం మూడు రోజుల ప్రయాణమంత దూరంకంటే ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇక పోయి నాకోసం ప్రార్థించు.” అని మోషేతో అన్నాడు.
29 “సరే రేపు నీ నుండి, నీ ప్రజలనుండి, నీ అధికారుల దగ్గర్నుండి ఈగలను తొలిగించమని నేను పోయి యెహోవాను వేడుకొంటాను. కాని, ప్రజలు బలులు అర్పించకుండా నీవు మాత్రం ఆపు చేయకూడదు” అన్నాడు మోషే.
30 కనుక మోషే ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయి యెహోవాకు ప్రార్థన చేసాడు. 31 మోషే కోరినట్టు యెహోవా చేసాడు. ఫరోనుండి, అతని ప్రజలనుండి అధికారుల నుండి ఈగలను యెహోవా తొలగించాడు. ఈగలు ఒక్కటి కూడా మిగుల లేదు. 32 అయితే ఫరో మళ్లీ మొండికెత్తి ప్రజలను వెళ్ల నివ్వలేదు.
దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం
(మార్కు 7:1-23)
15 కొందరు పరిసయ్యులు, శాస్త్రులు యెరూషలేము నుండి వచ్చి, 2 “మీ శిష్యులు భోజనానికి ముందు చేతులెందుకు కడుక్కోరు? పెద్దలు నియమించిన ఆచారాల్ని వాళ్ళెందుకు ఉల్లంఘిస్తున్నారు?” అని అడిగారు.
3 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞల్ని ఎందుకుల్లంఘిస్తున్నారు? 4 దేవుడు ‘తల్లి తండ్రుల్ని గౌరవించు’ అని అన్నాడు. అంతేకాక ‘తల్లి తండ్రుల్ని దూషించిన వానికి మరణ దండన వేయవలెను!’ అని కూడా చెప్పాడు. 5-6 కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో ‘మీ అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు కట్టాను’ అని అన్నవాడు, తల్లి తండ్రుల్ని గౌరవించనవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట. 7 మీరు మోసగాళ్ళు. యెషయా మిమ్మల్ని గురించి సరిగ్గా ముందే చెప్పాడు. అతడు,
8 ‘ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు.
కాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటాయి.
9 వాళ్ళ ఆరాధనలు వ్యర్థం!
వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’”(A)
అని అన్నాడు.
10 యేసు ప్రజల్ని తన దగ్గరకు రమ్మని పిలిచి వాళ్ళతో, “విని అర్థం చేసుకోండి. 11 మానవుని నోటిలోనికి వెళ్ళేదేదీ అతణ్ణి అపవిత్రం చెయ్యదు. అతని నోటినుండి వచ్చే మాటలు అతణ్ణి అపవిత్రం చేస్తాయి” అని అన్నాడు.
12 ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చి, “మీరన్నది విని పరిసయ్యులు కోపగించుకొన్నారని మీకు తెలుసా?” అని అడిగారు.
13 యేసు సమాధానంగా, “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో పెరికి వేయబడుతుంది. 14 వాళ్ళ విషయాన్ని వదిలెయ్యండి. వాళ్ళు గ్రుడ్డివాళ్ళు. కాని వారు ఇతరులకు దారి చూపుతూ ఉంటారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే యిద్దరూ గోతిలో పడ్తారు” అని అన్నాడు.
15 పేతురు, “ఆ ఉపమానాన్ని మాకు విడమరచి చెప్పండి” అని అడిగాడు.
16 యేసు, “మీక్కూడా అర్థంకాలేదా? 17 నోట్లోకి వెళ్ళినవి కడుపులోకి వెళ్ళి తదుపరి శరీరం నుండి బయటకు వెళ్తున్నాయని మీకు తెలియదా? 18 కాని నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే. 19 ఎందుకంటే, దురాలోచన, హత్య, లైంగిక అవినీతి, వ్యభిచారం, దొంగతనము, తప్పుడు సాక్ష్యము, అపనింద, మానవుని హృదయం నుండి వస్తాయి. 20 వీటి కారణంగా మానవుడు అపవిత్రమౌతున్నాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రం కాడు” అని అన్నాడు.
© 1997 Bible League International