Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 6-7

అప్పు ప్రమాదాలు

నా కుమారుడా, ఇంకొకని అప్పుకు బాధ్యునిగా ఉండకు. ఆ వ్యక్తి తన అప్పు చెల్లించలేనని చెబితే, అది నీవే చెల్లిస్తానని వాగ్దానం చేశావా? మరో మనిషి అప్పులకు నిన్ను నీవే బాధ్యునిగా చేసుకొన్నావా? అలాగైతే నీవు పట్టుబడ్డట్టే! నీ మాటలే నిన్ను చిక్కుల్లో పెట్టేశాయి! నీవు ఆ మనిషి శక్తి కింద ఉన్నావు. కనుక అతని దగ్గరకు వెళ్లి, నిన్ను నీవే విముక్తుని చేసుకో. అతని బాకీ నుండి నిన్ను విడిపించమని నీవు అతణ్ణి బ్రతిమాలు. నిద్రపోయి, విశ్రాంతి తీసుకోనేంతవరకు వేచి ఉండవద్దు. వేటగాని బారినుండి పారిపోతున్న లేడివలె ఆ ఉచ్చు నుండి తప్పించుకో. ఉచ్చులో నుండి పారిపోతున్న పక్షివలె, నిన్ను నీవే నిడుదల చేసుకో.

సోమరిగా ఉండుటవల్ల అపాయాలు

సోమరీ, నీవు చీమల దగ్గరకు వెళ్లి చీమలు ఏమి చేస్తుంటాయో చూడు. చీమ దగ్గర నేర్చుకో. చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు. కాని చీమ, దాని ఆహారాన్ని వేసవిలో కూర్చుకొంటుంది. చీమ, దాని ఆహారాన్ని దాచుకొంటుంది. చలికాలంలో దానికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది.

సోమరీ, ఇంకెంతనేపు నీవు అక్కడ పండుకొంటావు. నీ విశ్రాంతి నుండి నీవు యింకెప్పుడు లేస్తావు? 10 “నాకు ఇంకొంచెం నిద్ర కావాలి. యింకాకొంచెంసేపు నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను” అని సోమరి చెబుతాడు. 11 కాని అతడు నిద్రపోతాడు, మళ్లీ నిద్రపోతాడు; అతడు అతి దరిద్రుడవుతాడు. త్వరలోనే అతనికి ఏమీ ఉండదు. ఒక దొంగవాడు వచ్చి సమస్తం దోచుకున్నట్టు ఉంటుంది.

సమస్య కారకులు

12 దుర్మార్గుడు, పనికిమాలినవాడు అబద్ధాలు చెబుతాడు. చెడ్డ సంగతులే చెబుతాడు. 13 అతడు కన్నుగీటి, సూచనలు చేసి మనుష్యులను మోసం చేస్తాడు. 14 ఆ మనిషి దుర్మార్గుడు. ఎంతసేపూ అతడు దుర్మార్గపు పథకాలే వేస్తాడు. అన్నిచోట్లా అతడు చిక్కులు పెడుతుంటాడు. 15 కాని అతడు శిక్షించబడతాడు. కష్టం అతనికి అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అతడు త్వరగా నాశనం చేయబడతాడు. అతనికి ఎవరూ సహాయం చేయరు.

యెహోవా అసహ్యించుకొనే ఏడు సంగతులు

16 ఈ ఆరు విషయాలను యెహోవా అసహ్యించుకొంటాడు: కాదు ఏడును ఆయన అసహ్యించుకొంటాడు.
17     ఇతరులకంటే తానే మంచివాడు అనుకొనే మనిషి. అబద్దాలు చెప్పే మనిషి. నిర్దోషులను చంపే మనిషి.
18     చెడ్డపనులు చేయాలని త్వరపడే మనిషి. దుర్మార్గం చేయాలని కోరే మనిషి.
19     అబద్ధం వెంబడి అబద్ధం చెప్పే మనిషి. వాదాలకు పూనుకొని ప్రజల మధ్య కలహాలు పెట్టే మనిషి.

వ్యభిచారముకు విరోధంగా హెచ్చరిక

20 నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. మరియు నీ తల్లి ఉపదేశాలు మరువకు. 21 వారి మాటలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. వారి ఉపదేశములను నీ జీవితంలో ఒక భాగంగా చేసుకో. 22 నీవు ఎక్కడికి వెళ్లినా వారి ఉపదేశములు నీకు దారి చూపిస్తాయి. నీవు నిద్రపోయినప్పుడు అవి నిన్ను కనిపెట్టుకొని ఉంటాయి. మరియు నీవు మేల్కొన్నప్పుడు అవి నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాయి.

23 నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు, ఉపదేశములు నీకు సరైన దారి చూపించే వెలుగులా ఉంటాయి. నీవు జీవమార్గాన్ని వెంబడించేందుకు నిన్ను అవి సరిదిద్ది, నీకు శిక్షణ ఇస్తాయి. 24 నీవు చెడు స్త్రీ దగ్గరకు వెళ్లకుండా వారి ఉపదేశము నిన్ను వారిస్తుంది. తన భర్తను విడిచిపెట్టేసిన భార్య మెత్తటి మాటల నుండి వారి మాటలు నిన్ను కాపాడుతాయి. 25 ఆ స్త్రీ అందమైనది కావచ్చు. కాని ఆ అందం నీలో నిన్ను మండింపచేసి శోధించ నీయకు. ఆమె కండ్లను నిన్ను బంధించనియ్యకు. 26 ఒక వేశ్య ఖర్చు ఒక రొట్టె ముక్క కావచ్చు. కాని మరో పురుషుని భార్య నీ జీవితమంతా ఖర్చు చేయవచ్చు. 27 ఒకడు తన మీద నిప్పువేసుకుంటే అతని బట్టలు కూడా కాలిపోతాయి. 28 ఒకడు వేడి నిప్పుల మీద కాలు పెడితే అతని పాదం కాలుతుంది. 29 మరొకడి భార్యతో పండుకొనే ఏ మనిషి విషయమైనా ఇంతే. ఆ మనిషి నష్టపోతాడు.

30-31 ఒకడు ఆకలితో ఉండి తినుటకు భోజనం దొంగిలించవచ్చు. ఒకవేళ అతడు పట్టుబడితే అతడు దొంగిలించిన దానికి ఏడు రెట్లు అదనంగా చెల్లించాలి. అతనికి ఉన్న సమస్తం దీని మూలంగా ఖర్చు కావచ్చును. కాని ఇతరులు గ్రహిస్తారు. అతని మీద వారికి గల గౌరవం అంతా పోదు. 32 అయితే, వ్యభిచారం చేసే పురుషుడు బుద్ధిహీనుడు. అతడు తనకు తానే నాశనం చేసుకుంటాడు. తన నాశనానికి తానే కారణం అవుతాడు. 33 ప్రజలకు అతని మీద ఉన్న గౌరవం అంతా పోతుంది. మరియు ఆ అవమానాన్ని అతడు ఎన్నటికీ మరచిపోడు. 34 ఆ స్త్రీ యొక్క భర్తకు రోషం వస్తుంది. ఆ భర్తకు చాలా కోపం వస్తుంది. అవతలి వాడిని శిక్షించేందుకు ఇతడు చేయగలిగింది ఏదైనా చేసేస్తాడు. 35 ఏ విధంగా చెల్లించినా ఎంత డబ్బు చెల్లించినా అతని కోపాన్ని ఆపేందుకు చాలదు!

జ్ఞానము నిన్ను వ్యభిచారం నుండి కాపాడుతుంది

నా కుమారుడా, నా మాటలు జ్ఞాపకం ఉంచుకో నేను నీకు ఇచ్చే ఆజ్ఞలు మరువకు. నా ఆజ్ఞలకు విధేయుడవు కమ్ము, నీకు జీవం కలుగుతుంది. నా ఉపదేశాన్ని కనుపాపలాగ ఎంచుకో. (నీ జీవింతలోకెల్లా అతి ముఖ్యమైనది). నా ఆజ్ఞలను ఉపదేశాలను ఎల్లప్పుడూ నీతో ఉంచుకో. వాటిని నీ వ్రేళ్లకు కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. జ్ఞానాన్ని నీ సోదరిగా ఎంచు. తెలివిని నీ కుటుంబంలో ఒక భాగంగా చూసుకో. అప్పుడు అవి పరస్త్రీనుండి నిన్ను కాపాడుతాయి. నిన్ను పాపములోకి ఈడ్చివేయగల చక్కటి మాటలనుండి నిన్ను కాపాడతాయి.

ఒక రోజు నేను నా కిటికీలో నుండి బయటకు చూసాను. నాకు బుద్ధిలేని యువకులు చాలా మంది కనబడ్డారు. మరీ బుద్ధిలేని ఒక యువకుడిని నేను చూసాను. ఒక చెడ్డ స్త్రీ ఇంటి దగ్గర వీధిలోకి అతడు నడిచాడు. ఆ యువకుడు ఆ స్త్రీ ఇంటిమూలకు నడిచాడు. సూర్యుడు అస్తమిస్తూండగా దాదాపు చీకటి పడింది. రాత్రి మొదలవుతూంది. 10 ఆ స్త్రీ అతనిని కలుసుకొనేందుకు తన ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె వేశ్యలా బట్టలు ధరించింది. ఆమె అతనితో పాపం చేయటానికి ప్రయత్నిస్తుంది. 11 పాపం గూర్చి ఆమె లెక్కచేయలేదు. మంచి చెడును గూర్చి ఆమె లెక్క చేయలేదు. ఆమె తన ఇంటివద్ద ఎన్నడూ నిలిచి వుండదు. 12 కాని ఆమె వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా దొరుకుతారు అని చూస్తూ ఆమె అన్ని మూలలకూ వెళ్తుంది. 13 ఆమె ఆ యువకుడ్ని గట్టిగా పట్టేసి ముద్దు పెట్టుకుంది. సిగ్గులేకుండా ఆమె ఇలా చెప్పింది: 14 “ఈవేళ నేను సాంగత్య బలి అర్పించాలి. నేను ఇస్తానని వాగ్దానం చేసింది అంతా ఇచ్చేశాను. (ఇంకా నా దగ్గర భోజనం చాలా మిగిలి ఉంది). 15 అందుచేత నిన్ను కూడా నా దగ్గరకు రమ్మని ఆహ్వానించటానికి నేనిలా బయటకు వచ్చాను. నేను నీకోసం ఎంతో ఎంతో వెదికాను. ఇప్పుడు నీవు కనబడ్డావు! 16 నా మంచం మీద శుభ్రమైన దుప్పట్లు నేను పరిచాను. అవి చాలా, అందమైన ఈజిప్టు దుప్పట్లు. 17 నా మంచం మీద నేను పరిమళాలు, బోళం, అగరు దాల్చినచెక్క ఉపయోగించాను. 18 వచ్చేయి, తెల్లారే వరకు మనం వలపు తీర్చుకొందాం. రాత్రంతా మనం హాయిగా అనుభవించవచ్చు. 19 నా భర్త వెళ్లిపోయాడు. అతడు వ్యాపారం పని మీద వెళ్లిపోయాడు. 20 దీర్ఘప్రయాణానికి సరిపడినంత ధనం అతడు తీసుకొని వెళ్లాడు. రెండు వారాల వరకు అతడు తిరిగి ఇంటికి రాడు.”

21 ఆ యువకుని శోధించటానికి ఆ స్త్రీ ఆ మాటలు ప్రయోగించింది. ఆమె మెత్తని మాటలు అతణ్ణి మాయ చేశాయి. 22 ఆ యువకుడు ఉచ్చులోనికి ఆమెను వెంబడించాడు. వధకు తీసుకొనిపోబడుతున్న ఎద్దులా ఉన్నాడు అతడు. బోనులోనికి నడుస్తున్న జింకలా అతడు ఉన్నాడు. 23 దాని గుండెల్లోకి బాణం గుచ్చడానికి వేటగాడు సిద్దంగా ఉన్నట్టు ఉంది. వలలోకి ఎగురుతోన్న పక్షిలా ఉన్నాడు ఆ యువకుడు. అతడు చిక్కుకొన్న అపాయం అతనికి తెలియదు.

24 కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు గమనించండి. 25 చెడు స్త్రీని మిమ్మల్ని పట్టుకోనివ్వకండి. ఆమె మార్గాలు వెంబడించకండి. 26 ఆమె చాలా మంది పురుషులను పడ వేసింది. ఆమె చాలా మంది పురుషులను నాశనం చేసింది. 27 ఆమె ఇల్లు మరణ స్థానం. ఆమె మార్గం తిన్నగా మరణానికి నడిపిస్తుంది!

2 కొరింథీయులకు 2

అందువల్ల నేను మళ్ళీ మీ దగ్గరకువచ్చి మిమ్మల్ని దుఃఖపెట్టరాదని నిర్ణయించుకొన్నాను. నేను మిమ్మల్ని దుఃఖపెడితే, దుఃఖపడిన మీరు తప్ప నన్ను సంతోష పెట్టటానికి ఇతరులు ఎవరున్నారు? కనుక మీకా ఉత్తరం వ్రాసాను. నేను వచ్చినప్పుడు నన్ను సంతోషపెట్టాలనుకొన్నవాళ్ళు నాకు దుఃఖం కలిగించరాదని నా ఉద్దేశ్యం. నేను ఆనందంగా ఉంటే మీరు కూడా ఆనందిస్తారని నాకు తెలుసు. దుఃఖంతో కన్నీళ్ళు కారుస్తూ, వేదన పడుతూ మీకా ఉత్తరం వ్రాసాను. మీకు దుఃఖం కలిగించాలని కాదు. మీ పట్ల నాకున్న ప్రేమను మీకు తెలియ చెయ్యాలని అలా వ్రాసాను.

తప్పు చేసినవాణ్ణి క్షమించటం

ఎవరైనా దుఃఖం కలిగించి ఉంటే, అతడు నాకు కాదు, మీకు దుఃఖం కలిగించాడు. అందరికీ కాకున్నా మీలో కొందరికన్నా దుఃఖం కలిగించాడు. అతని పట్ల కఠినంగా ప్రవర్తించటం నాకు యిష్టం లేదు. మీలో చాలా మంది అతణ్ణి శిక్షించారు. అతనికి ఆ శిక్ష చాలు. అతణ్ణి క్షమించి ఓదార్చండి. అలా చెయ్యకపోతే అతడు ఇంకా ఎక్కువ దుఃఖంలో మునిగిపోతాడు. అతని పట్ల మీకున్న ప్రేమను అతనికి తెలియ చెయ్యమని వేడుకొంటున్నాను. మీరు పరీక్షకు నిలువగలరా లేదా అన్నది చూడాలని, దేవుని ఆజ్ఞల్ని అన్నివేళలా పాటిస్తారా లేదా అన్నది గమనించాలని నేను మీకా ఉత్తరం వ్రాసాను. 10 మీరు క్షమించినవాళ్ళను నేనూ క్షమిస్తాను. నేను క్షమించింది, నిజానికి నేను క్షమించవలసింది ఏదైనా ఉండి ఉంటే అది మీకోసం క్రీస్తు అంగీకారంతో క్షమించాను. 11 సాతాను కుట్రలు మనకు తెలియనివి కావు. వాడు మనల్ని మోసం చెయ్యరాదని ఇలా చేసాను.

క్రీస్తు ద్వారా విజయము

12 నేను క్రీస్తు సందేశం ప్రకటించటానికి త్రోయకు వెళ్ళాను. నా కోసం ప్రభువు ఎన్నో అవకాశాలు కలిగించాడు. 13 నా సోదరుడైన తీతు నాకు కనిపించలేదు. కనుక నా మనస్సుకు శాంతి కలుగలేదు. వాళ్ళ నుండి సెలవు తీసుకొని మాసిదోనియకు వెళ్ళాను.

14 దేవుడు, క్రీస్తు ద్వారా అన్ని వేళలా మనకు విజయం కలిగిస్తాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతతో ఉందాము. క్రీస్తు యొక్క జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అన్ని చోట్లా ఆయన వెదజల్లాడు. 15 రక్షింపబడేవాళ్ళకు, నాశనమవుతున్నవాళ్ళకు మనము క్రీస్తు పరిమళంగా ఉండేటట్లు దేవుడు మనల్ని ఉపయోగించాడు. 16 మన పరిమళము ఒకరికి మరణము కలిగిస్తే మరొకరికి అది జీవాన్నిస్తుంది. ఇది చెయ్యటానికి ఎవరు అర్హులు? 17 అనేకులు దైవసందేశాన్ని సంతలో అమ్మే సరకులా అమ్ముతున్నారు. మేము అలాంటివాళ్ళము కాదు. మేము క్రీస్తు సేవకులము. దేవుని సాక్షిగా చెపుతున్నాము. దేవుడే మమ్మల్ని పంపాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International