Old/New Testament
ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడటం
1 ఇది ఇశ్రాయేలు ప్రజలకు మోషే యిచ్చిన సందేశం. వారు యొర్దాను నదికి తూర్పువైపునగల అరణ్యంలో ఉన్నప్పుడు అతడు ఈ విషయాలు వారితో చెప్పాడు. వారు అరాబా లోయలో ఉన్నారు. ఇది సూపుకు అవతల పారాను అరణ్యమునకు, తోపెలు, లాబాను, హజెరోతు, దీజాహాబు పట్టణాలకు మధ్యవుంది.
2 హోరేబు కొండనుండి (సీనాయి) కాదేషు బర్నేయాకు శేయీరు కొండలద్వారా ప్రయాణం పదకొండు రోజులు మాత్రమే పడుతుంది. 3 అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పటినుండి ఈ స్థలంలో మోషే వీరితో మాట్లడినప్పటికి 40 సంవత్సరాలు పట్టింది. అది 40వ సంవత్సరం, 11వ నెల ఒకటవ తేది. వారితో చెప్పమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ మోషే వారితో మాట్లాడినప్పుడు చెప్పాడు. 4 ఇది సీహోనును, ఓగును యెహోవా ఓడించిన తర్వాత జరిగిన సంగతి. సీహోను అమోరీయుల రాజు. సీహోను హెష్బోనులో నివసించాడు. ఓగు బాషాను రాజు. ఓగు అష్పారోతు, ఎద్రేయిలో నివసించాడు. 5 ఇప్పుడు వారు యొర్దాను నదికి తూర్పున మోయాబు దేశంలో ఉన్నారు, మరియు దేవుడు ఆజ్ఞాపించిన విషయాలను మోషే వివరించటం మొదలుబెట్టాడు. మోషే ఇలా చెప్పాడు:
6 “మన దేవుడైన యెహోవా హోరేబు (సీనాయి) కొండమీద మనతో మాట్లాడాడు. ఆయన అన్నాడు, ‘ఈ కొండ దగ్గర మీరు యిప్పటికి చాలా కాలంనుండి నిలిచి ఉన్నారు. 7 కదిలిపోయేందుకు సర్వ సిద్ధంగా ఉండండి. అమోరీయుల కొండ దేశానికి, దాని చుట్టూవున్న యొర్దాను లోయ, కొండ దేశం, పశ్చిమ పల్లపు ప్రాంతాలు, నెగెవు, సముద్రతీర ప్రాంతం అన్ని చోట్లకూ వెళ్లండి, కనానీ ప్రజల దేశానికి వెళ్లండి, యూఫ్రటీసు మహానది వరకు లెబానోనుకు వెళ్లండి. 8 చూడండి, ఈ దేశమంతా నేను మీకు ఇచ్చాను. మీరు అందులో ప్రవేశించి ఆ దేశాన్ని మీ స్వాధీనం చేనుకోండి. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేసిన దేశం యిదే. వారికి, వారి సంతతివారికి ఈ దేశాన్ని యిస్తానని నేను వాగ్దానం చేశాను.’”
మోషే నాయకులను ఎంపిక చేయుట
9 అప్పుడు మోషే అన్నాడు: “‘ఆ సమయంలో నేను మీతో మాట్లాడినప్పుడు నేను ఒంటరిగా మీ విషయంలో శ్రద్ధ తీసుకోలేనని నేను చెప్పాను. 10 మీ దేవుడైన యెహోవా ఇంకా మరింతమంది ప్రజలను అధికం చేయటంతో నేడు మీరు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నారు. 11 మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకా 1,000 రెట్లు పెంచునుగాక! ఆయన మీకు చేసిన వాగ్దానం ప్రకారమే ఆయన మిమ్మల్ని ఆశీర్వాదించుగాక! 12 కానీ నేను మీ విషయం శ్రద్ధ తీసుకోలేను, నేనొక్కడనే మీ వివాదాలు తీర్చలేను. 13 కనుక ప్రతి వంశంనుండి కొందరు ప్రతినిధులను ఎన్నుకోండి, నేను వారిని మీమీద నాయకులుగా చేస్తాను. అవగాహన, అనుభవం ఉన్న జ్ఞానులను ఎన్నుకోండి’ అని మీతో చెప్పాను.
14 “దానికి అలా చేయటం ‘మంచిదే అనుకొంటున్నాము’ అని మీరు అన్నారు.
15 “కనుక మీరు మీ వంశాలనుండి ఎన్నుకొన్న అవగాహన, అనుభవమున్న జ్ఞానులను మీకు నాయకులుగా నేను చేసాను. వారిలో కొందరిని 1,000 మందికి నాయకులుగాను, కొందరిని 100 మందికి నాయకులుగాను, కొందరిని 50 మందికి నాయకులుగాను, కొందరిని 10 మందికి నాయకులుగాను నేను చేసాను. నేను వారిని మీ వంశాలకు అధికారాలుగా చేసాను.
16 “ఈ నాయకులను మీకు న్యాయమూర్తులుగా ఉండమని అప్పట్లో నేను వారితో చెప్పాను. ‘మీ ప్రజల వాదాలు వినండి. ఒక్కో వ్యాజ్యెమును సరిగ్గా విచారణ చేయండి. సమస్య ఇశ్రాయేలీయుల ఇద్దరి మధ్యకావచ్చును, లేక ఒక ఇశ్రాయేలు వ్యక్తికీ, మరో పరాయి వ్యక్తికీ మధ్య అయినా సరే పర్వాలేదు. మీరు ప్రతి వ్యాజ్యమును సరిగ్గా విచారణ చేయాలి. 17 మీరు విచారణ జరిపేటప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తికంటె ముఖ్యమైనవాడని మీరు తలచకూడదు. ప్రతివ్యక్తి పైనా ఒకే విధంగా విచారణ జరిగించాలి. మీ నిర్ణయం దేవుని నుండి వస్తుంది. కనుక, ఎవరిని గూర్చి భయపడవద్దు. అయితే మీరు విచారణ జరిపేందుకు ఒక వ్యాజ్యము కష్టతరంగా ఉంటే, దానిని నా దగ్గరకు తీసుకొని రండి. నేను దానిని విచారిస్తాను.’ 18 మీరు చేయాల్సిన ఇతర విషయాలన్నింటినీ ఆ సమయంలోనే నేను మీతో చెప్తాను.
గూఢచారులు కనాను వెళ్లటం
19 “అప్పుడు మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మనం చేసాము. మనం హోరేబు (సీనాయి) కొండను విడిచి, ఆమోరీయుల కొండ దేశంవైవు ప్రయాణం చేసాము. మీరు చూసిన ఆ మహా భయంకర అరణ్యం అంతటి గుండా మనం వెళ్లాము. కాదేషు బర్నేయాకు మనం వచ్చాం. 20 అప్పుడు నేను మీతో చెప్పాను: ‘ఇప్పుడు మీరు అమోరీయుల కొండ దేశానికి వచ్చారు. మన యెహోవా దేవుడు ఈ దేశాన్ని మనకు ఇస్తాడు. 21 చూడండి, అదిగో అదే ఆ దేశం. వెళ్లి ఆ దేశాన్ని మీ స్వంతం చేసుకోండి. మీరు ఇలా చేయాలని మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీతో చెప్పాడు. అందుచేత భయపడకండి, దేనిని గూర్చీ చింతపడకండి!’
22 “అప్పుడు మీరంతా నా దగ్గరకు వచ్చి ‘ఆ దేశాన్ని చూసేందుకు మనకంటే ముందుగా మనుష్యుల్ని పంపిద్దాము, వారు తిరిగి వచ్చి మనం వెళ్లాల్సిన మార్గం మనకు చెబుతారు. మనకు వచ్చే పట్టణాలను గూర్చి కూడ వారు చెప్పగలుగుతారు అన్నారు.’
23 “అది మంచి తలంపు అని నేను అనుకొన్నాను. కనుక ఒక్కోవంశం నుండి ఒకరి చొప్పున మీలోనుండి పన్నెండు మందిని నేను ఎన్నుకొన్నాను. 24 అప్పుడు ఆ మనుష్యులు బయల్దేరి ఆ కొండ దేశానికి వెళ్లారు. వారు ఎష్కోలు లోయకు వచ్చి దానిని పరిశోధించారు. 25 ఆ దేశంలోని ఫలాలు కొన్నింటిని తీసుకొని వారు మా దగ్గరకు తిరిగి తెచ్చారు. వారు మాకు సమాచారం అందిస్తూ ‘అది మన యెహోవా దేవుడు మనకు యిస్తున్న మంచి దేశం’ అని చెప్పారు.
26 “కాని ఆ దేశంలో ప్రవేంశించటానికి మీరు నిరాకరించారు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు నిరాకరించారు. 27 మీ గుడారాల్లో మీరు ఫిర్యాదులు చేసారు, మీరు అన్నారు: ‘యెహోవా మనలను ద్వేషిస్తున్నాడు. అమోరీయులు మనలను నాశనం చేసేటట్టు, వారికి మనలను అప్పగించటానికే ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. 28 ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్లగలము? మన సోదరులు (పన్నెండుమంది) తెచ్చిన సమాచారంతో వారు మనల్ని భయపెట్టారు. అక్కడి మనుష్యులు మనకంటే పెద్దవాళ్లు, ఎత్తయినవాళ్లు. పట్టణాలు పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తు ఉన్నాయి. అక్కడ రాక్షసుల్లాంటి మనుష్యుల్ని[a] మేము చూశాము’ అని వారు చెప్పారు.
29 “అప్పుడు నేను మీతో చెప్పాను: ‘దిగులు పడకండి. ఆ మనుష్యుల విషయం భయపడవద్దు. 30 మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్లి, మీ పక్షంగా పోరాడుతాడు. ఆయన ఈజిప్టులో చేసినట్టే దీన్నికూడ చేస్తాడు. ఆయన మీకు ముందుగా వెళ్లటం 31 అరణ్యములో మీరు చూశారు. ఒక మనిషి తన కుమారుని మోసినట్లు, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎలా మోసిందీ మీరు చూశారు. ఇంత దూరం ఈ స్థలానికి యెహోవా మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వచ్చాడు.’
32 “అయినప్పటికీ మీరు యింకా మీ దేపుడైన యెహోవాను విశ్వసించలేదు. 33 మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ పాళెము కోసం స్థలం చూసేందుకు ఆయన మీకు ముందుగా వెళ్లాడు. మీరు ఏ మార్గాన వెళ్లాల్సిందీ మీకు చూపెట్టేందుకు రాత్రివేళ అగ్నిలోను, పగటివేళ మేఘములోను ఆయన మీకు ముందు వెళ్లాడు.
కనానులోనికి ప్రవేశించేందుకు ప్రజలు అనుమతింపబడలేదు
34 “మీరు చెప్పింది యెహోవా విన్నాడు, ఆయనకు కోపం వచ్చింది. ఆయన ఒక గట్టి ప్రమాణం చేసాడు. ఆయన చెప్పాడు: 35 ‘ఇప్పుడు జీవిస్తున్న దుష్టప్రజలైన మీలో ఎవ్వరూ, నేను మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో ప్రవేశించరు. 36 యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రమే ఆ దేశాన్ని చూస్తాడు. కాలేబు నడిచిన భూమిని నేను అతనికి యిస్తాను. ఆ భూమిని అతని సంతతివారికి నేను యిస్తాను. ఎందుకంటే నేను ఆజ్ఞాపించినది అంతా కాలేబు జరిగించాడు గనుక’.
37 “మీ వల్ల యెహోవా నా మీదకూడా కోపగించాడు. నాతో ఆయన చెప్పాడు: ‘నీవు కూడా ఆ దేశంలో ప్రవేశించజాలవు. 38 అయితే నీ సహాయకుడును నూను కుమారుడైన యెహోషువ ఆ దేశంలోనికి వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అతడే వారిని నడిపిస్తాడు గనుక యెహోషువాను ప్రోత్సహించు.’ 39 మరియు యెహోవా మనతో చెప్పాడు; ‘మీ చిన్న పిల్లలను మీ శ్రతువులు ఎత్తికొనిపోతారని మీరు చెప్పారు గదా, కానీ ఆ పిల్లలే ఆ దేశంలో ప్రవేశిస్తారు. ఒక విషయం తప్పో? ఒప్పో? అని, తెలుసుకోలేనంత చిన్నవాళ్లు గనుక మీరు చేసిన తప్పుకు మీ పిల్లల్ని నేను నిందించను. కనుక వారికే ఆ దేశాన్ని నేను యిస్తాను. ఆ దేశాన్ని మీ పిల్లలే వారి స్వంతంగా తీసుకొంటారు. 40 కానీ మీరు మాత్రం వెనుకకు తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యానికే వెళ్లాలి.’
41 “అప్పుడు మీరు, ‘మోషే, మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము. అయితే యిదివరకు యెహావా దేవుడు మాకు ఆజ్ఞాపించిన ప్రకారం యిప్పుడు మేము వెళ్లి పోరాడుతాము’ అని అన్నారు.
“అప్పుడు మీరు ఒక్కొక్కరు యుద్ధ ఆయుధాలు ధరించారు. ఆ కొండ దేశంలో ప్రవేశించటం సులభం అని మీరు అనుకొన్నారు. 42 అయితే, ‘అక్కడికి వెళ్లి యుద్ధం చేయవద్దని ప్రజలతో చెప్పు, ఎందుకంటే నేను వారికి తోడుగా ఉండను, వారి శత్రువులు వారిని ఓడించేస్తారు’ అని యెహోవా నాతోచెప్పాడు.
43 “కనుక నేను మీతో మాట్లాడాను. కాని మీరు వినలేదు. యెహోవా ఆజ్ఞకు లోబడేందుకు మీరు నిరాకరించారు. మీ స్వంత శక్తి ప్రయోగించవచ్చని మీరనుకొన్నారు. 44 అందుచేత మీరు ఆ కొండ దేశం మీదికి వెళ్లారు. అప్పుడు ఆ కొండ దేశంలో నివసిస్తున్న అమోరీయులు మీ మీద యుద్ధానికి వచ్చారు. తేనెటీగల దండు మనుష్యులను తరిమినట్టు వారు మిమ్ములను తరిమారు. శేయీరునుండి హోర్మా వరకు మిమ్మల్ని తరిమి, అక్కడ వారు మిమ్మల్ని ఓడించారు. 45 అప్పుడు మీరు తిరిగివచ్చి యెహోవాకు మొర్ర పెట్టారు. కాని యెహోవా మీ మొర్ర వినలేదు. మీ మొర్ర వినటానికి ఆయన నిరాకరించాడు. 46 కనుక చాలా కాలం మీరు కాదేషులోనే ఉండిపోయారు.”
ఇశ్రాయేలీయులు ఎడారిలో సంచారం చేయటం
2 “అప్పుడు మనం తిరిగి ఎర్రసముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణం చేసాము. మనం చేయవలెనని యెహోవా నాతో చెప్పింది అదే. చాలా రోజుల వరకు మనం శేయారు[b] కొండ దేశం గుండా వెళ్లాము. 2 అప్పుడు నాతో యెహోవా అన్నాడు: 3 ‘మీరు ఈ కొండ దేశంగుండా చాలా తిరిగారు. ఉత్తర దిశగా తిరగండి. 4 మరియు మీకు ఇలా చెప్పమని ఆయన నాతో చెప్పాడు: మీరు శేయీరు దేశం గుండా దాటిపోతారు. ఈ దేశం మీ బంధువులైన ఏశావు సంతతివారికి చెందినది. వారు మీకు భయపడతారు. చాలా జాగ్రతగా ఉండండి. 5 వారితో యుద్ధం చేయకండి. వారి దేశంలో ఏమాత్రం ఒక్క అడుగు కూడ నేను మీకు యివ్వను. ఎందుకంటే శేయీరు కొండ దేశాన్ని ఏశావుకు స్వంతంగా ఉండేందుకు నేను యిచ్చాను. 6 అక్కడ మీరు తినే భోజనానికిగాని, త్రాగే నీటికిగాని మీరు ఏశావు ప్రజలకు వెల చెల్లించాలి. 7 మీరు చేసిన ప్రతిదానిలోనూ మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాడని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మహా ఎడారిలో మీరు నడవటం ఆయనకు తెలుసు. ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు గనుక మీకు అవసరమైనవి అన్నీ ఎల్లప్పుడూ మీకు దొరికాయి’
8 “కనుక శేయీరులో నివసించే మన బంధువులైన ఏశావు ప్రజలను మనం దాటిపోయాము. ఎలాతు, ఎసియోను గెబరు పట్టణాల నుండి యొర్దాను వెళ్ళే మార్గాన్ని మనం విడిచిపెట్టాం. మనం మళ్లుకొని మోయాబు అరణ్యానికి పోయే మార్గం మీద వెళ్లాము.
ఆర్ వద్ద ఇశ్రాయేలీయులు
9 “యెహోవా నాతో చెప్పాడు: ‘మోయాబు ప్రజలను తొందర పెట్టవద్దు. వారితో యుద్ధం ప్రారంభించవద్దు, వారి దేశంలో ఏ మాత్రం భూమి నేను మీకు యివ్వను. వారు లోతు సంతతివారు,[c] ఆరు పట్టణాన్ని నేను వారికి యిచ్చాను.’”
10 ఇంతకు ముందు ఎమీము ప్రజలు ఆర్‌లో నివసించారు. వారు బలాఢ్యులు, వారు చాలమంది ఉన్నారు. అనాకీము[d] ప్రజల్లాగే వారు చాలా ఎత్తయినవాళ్లు. 11 అనాకీయుల్లాగే ఎమీము కూడ రెఫాయిము ప్రజల్లో ఒక భాగం అనిచెప్పబడింది. కానీ మోయాబీ ప్రజలు వారిని ఎమీయులు అని పిల్చారు. 12 హోరీ ప్రజలు కూడ ఇంతకు ముందు శేయీరులో నివసించారు, కానీ ఏశావు ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. హోరీయులను ఏశావు ప్రజలు నాశనం చేసారు. అప్పుడు హోరీయులు అంతకు ముందు నివసించిన చోట ఏశావు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా స్వంతంగా యిచ్చిన దేశంలోని ప్రజలకు ఇశ్రాయేలీయులు చేసినట్టు వారు అక్కడ ఉన్నవారికి చేసారు.
13 “యెహోవా నాతో చెప్పాడు: ‘ఇప్పుడు లేచి, జెరెదు వాగు దాటి వెళ్లండి.’ కనుక మనం జెరెదువాగు దాటివెళ్లాం. 14 మనం కాదెషు బర్నెయ విడిచి జెరెదు వాగు దాటునాటికి 38 సంవత్సరాలు అయింది. ఆ తరం యుద్ధ వీరులంతా చనిపోయారు. ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. 15 ఆ మనుష్యులు అందరూ గతించి పోయేవరకు యెహోవా వారికి విరోధంగానే ఉన్నాడు.
16 “యుద్ధ వీరులంతా చనిపోయి ప్రజల మధ్య లేకుండా గతించిపోయిన తర్వాత 17 యెహోవా నాతో ఇలా చెప్పాడు: 18 ‘ఈ వేళ మీరు సరిహద్దు ఆర్‌వద్ద దాటి మోయాబులోనికి వెళ్లాలి. 19 మీరు అమ్మోనీయులను సమీపించినప్పుడు వారిని తొందర పెట్టవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, ఎందుకంటే వారి దేశం నేను మీకు యివ్వను. ఎందుకంటే వారు లోతు సంతానం. వారు స్వంతంగా ఉంచుకొనేందుకు ఆ దేశాన్ని నేను వారికి యిచ్చాను.’”
20 (ఆ దేశం రెఫాయిము ప్రజల దేశం అనికూడ చెప్పబడింది. వారు అంతకు ముందు అక్కడ నివసించిన ప్రజలు. అమ్మోనీయులు వారిని “జంజుమ్మీలు” అని పిలిచేవాళ్లు. 21 జంజుమ్మీ ప్రజలు చాలా బలం గలవారు, వాళ్లు చాలామంది ఉన్నారు. అనాకీము ప్రజల్లా వారు చాలా ఎత్తయిన మనుషులు. కానీ జంజుమ్మీలను నాశనం చేసేందుకు యెహోవా అమోనీయులకు సహాయంచేశాడు. అమ్మోనీయులు జంజుమ్మీల దేశాన్ని స్వాధీనం చేసుకొని యిప్పుడు అక్కడ నివసిస్తున్నారు. 22 శేయీరులో నివసించే ఏశావు ప్రజలకు (ఎదోమీలు) దేవుడు అలాగే చేశాడు. వారు అక్కడ నివసించే హోరీయులను నాశనం చేశారు. ఇంతకు ముందు హోరీయులు నివసించిన చోట యిప్పడు ఏశావు ప్రజలు నివసిస్తున్నారు. 23 క్రేతు ప్రజలలో కొందరికి దేవుడు అలాగే చేశాడు. గాజా చుట్టు పక్కల పట్టణాల్లో ఆవీయ ప్రజలు నివసించారు. అయితే క్రేతునుండి కొందరు ప్రజలు వచ్చి ఆవీయ ప్రజలను నాశనం చేశారు. క్రేతునుండి వచ్చిన ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని, ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు.)
అమ్మోరీయులతో యుద్ధం
24 “యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘ప్రయాణానికి సిద్ధపడండి. అర్నోను నది లోయ దాటి వెళ్లండి. హెష్బోను రాజు. అమ్మోరీవాడగు సీహోను మీద నేను మీకు జయాన్నిస్తాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు నేను మీకు శక్తిని యిస్తున్నాను. కనుక అతనితో యుద్ధంచేసి, అతని దేశాన్ని స్వాధీనం చేనుకోవటం మొదలుపెట్టండి. 25 ప్రపంచంలోని ప్రజలంతా మీ విషయం భయపడేలా చేయటం నేను ఈ వేళ ప్రారంభిస్తాను. మిమ్మల్ని గూర్చిన సమాచారం వారు విని, భయంతో వణకిపోతారు. వారు మిమ్మల్ని గూర్చి తలచినప్పుడు భయంతో వణికిపోతారు.’
26 “కెదెమోతు అరణ్యంనుండి హెష్బోను రాజైన సీహోను దగ్గరకు నేను వార్తాహరులను పంపించాను. వారు సీహోనుకు శాంతి సమాచారం తెలిపి, వారు చెప్పారు: 27 ‘నీ దేశంగుండా మమ్మల్ని వెళ్లనివ్వు. మేము మార్గంలోనే నడచి వెళ్తాము. మార్గంనుండి కుడికిగాని, ఎడమకుగాని మేము తొలగము. 28 మేము తినే భోజనానికి, తాగే నీళ్లకు వెండి నీకు చెల్లిస్తాము. మేము నీ దేశంలోనుండి నడచి వెళ్తాము, అంతే. 29 మా దేవుడైన యెహోవా మాకు యిస్తున్న దెశంలో ప్రవేశించేందుకే మేము యొర్దాను నది దాటేంతవరకు మమ్మల్ని నీ దేశంలోనుంచి వెళ్ల నివ్వు. ఇతరులు, అంటే శేయీరులో నివసించే ఏశావు ప్రజలు, ఆర్‌లో నివసించే మోయాబు ప్రజలు వారి దేశం బైటగా మమ్మల్ని వెళ్లనిచ్చారు.’
30 “కానీ హెష్బోను రాజైన సీహోను తన దేశంలోంచి మమ్మల్ని పోనివ్వలేదు. మీ దేవుడైన యెహోవా అతణ్ణి చాలా మొండికెత్తేటట్టు చేసాడు. సీహోను రాజును మీ అధికారంక్రింద ఉండటానికే యెహోవా ఇలా చేసాడు. ఇప్పుడు ఆయన దీనిని జరిగించాడు.
31 “సీహోను రాజును, ‘అతని దేశాన్ని నేను మీకు యిస్తున్నాను. ఇప్పుడు దేశాన్ని స్వాధీనం చేసుకోండి’ అని యెహోవా నాకు చెప్పాడు.
32 “అప్పుడు యాహసు దగ్గర మాతో యుద్ధం చేయటానికి సీహోను రాజు, ఆతని ప్రజలందరు బయల్దేరి వచ్చారు. 33 అయితే మన యెహోవా దేవుడు అతణ్ణి మనకు అప్పగించాడు. అతణ్ణి, అతని కుమారులను, ఆతని ప్రజలందరిని మనం ఓడించాము. 34 అప్పట్లో సీహోను రాజుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం పట్టుకొన్నాము. ప్రతి పట్టణంలో పురుషులను, స్త్రీలను, పిల్లలను ప్రజలందరినీ మనం పూర్తిగా నాశనం చేసాము. ఎవ్వరినీ మనం బతకనియ్యలేదు. 35 మనం పట్టుకొన్న పట్టణాల్లో పశువులను, విలువైన వస్తువులను మాత్రమే మనం తీసుకొన్నాము. 36 అర్నోను లోయ అంచులోని అరోయేరు పట్టణాన్ని, ఆ లోయ మధ్యలో ఉన్న మరో పట్టణాన్ని మనం ఓడించాము. అర్నోను లోయ, గిలాదుమధ్య ఉన్న పట్టాణాలన్నింటిని మనం ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఏ పట్టణం కూడా మన యెదుట నిలువలేకపోయింది. 37 కానీ అమ్మోనీయుల దగ్గరకు కూడ మీరు వెళ్లలేదు. యబ్బోకు నదీ తీరాలకుగాని, కొండ దేశంలోని పట్టణాలకుగాని మీరు వెళ్లలేదు. మన దేవుడైన యెహోవా మనకు ఇవ్వని ఏ స్థలం దగ్గరకూ మీరు వెళ్లలేదు.”
బాషాను ప్రజలతో యుద్ధం
3 “మనం మళ్లుకొని బాషాను మార్గంలో వెళ్లాము. బాషాను రాజు ఓగు, అతని ప్రజలందరు ఎద్రేయి దగ్గర మనతో యుద్ధం చేయటానికి వచ్చారు. 2 ‘ఓగును నేను మీకు అప్పగించాలని నిర్ణయించాను గనుక అతని గూర్బి భయపడవద్దు. అతని మనుష్యులందరిని, అతని దేశాన్ని నేను మీకు యిస్తాను. హెష్బోనులో ఏలుబడి చేసిన అమోరీ రాజు సీహోనుకు చేసినట్టే, అతన్ని కూడ మీరు ఓడిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు.
3 “కనుక బాషానురాజు ఓగును, అతని మనుష్యులందరిని మన యెహోవా దేవుడు మనకు అప్పగించాడు. అతని మనుష్యులు ఎవరూ మిగుల కుండా మనం అతన్ని ఓడించాము. 4 తర్వాత అప్పట్లో ఓగుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకొన్నాము. ఓగు ప్రజల పట్టణాలు అన్నింటినీ, బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతం అంతటిలో 60 పట్టణాలను మనం స్వాధీనం చేసుకొన్నాము. 5 ఎత్తయిన గోడలు, బలమైన కడ్డీలుగల గేట్లతో ఈ పట్టణాలు చాలా బలమైనవి. మరియు గోడలులేని పట్టణాలు కూడా చాలా ఉన్నాయి. 6 హెష్బోను రాజైన సీహోను పట్ణణాలకు మనం చేసినట్టే వీటినికూడా మనం నాశనం చేసాము. ప్రతి పట్టణాన్ని, వాటిలోని ప్రజలందరిని స్త్రీలు, పిల్లలను సహా మనం సమూలంగా నాశనం చేసాము. 7 అయితే ఆ పట్టణాల్లోని పశువులన్నింటినీ, విలువైన వస్తువులను మనకోసం ఉంచుకొన్నాము.
8 “ఈ విధంగా, అమోరీ ప్రజల ఇద్దరు రాజుల వద్దనుండి దేశాన్ని మన స్వాధీనం చేసుకొన్నాం. ఈ దేశాలు యొర్దాను నదికి తూర్పు వైపున ఉన్నాయి. అర్నోను లోయనుండి హెర్మోను పర్వతంవరకు ఉంది ఈ దేశం. 9 (హెర్మోను కొండను సీదోనీ ప్రజలు షిర్యోను అనీ, అమోరీలు శేనీరు అని పిలుస్తారు) 10 బాషాను అంతటిని సాలెకానుండి, ఎద్రేయివరకు, గిలాదు పీఠభూమిలోని పట్టణాలన్నింటినీ మనం మన స్వాధీనం చేసుకొన్నాం. సల్కా ఎద్రేయి బాషానులోని ఓగు రాజ్యంలో పట్టణాలు.”
11 (ఇంకా జీవించి ఉన్న కొద్దిమంది రెఫాయిము ప్రజల్లో బాషాను రాజు ఓగు ఒక్కడే. ఓగు మంచం ఇనుప మంచం. దాని పొడవు 13 అడుగులు, వెడల్పు 6 అడుగలు. అమ్మోనీ ప్రజలు నివసించే రబ్బా పట్టణంలో ఆ మంచం యింకా ఉంది.)
యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశం
12 “ఆ సమయంలో ఈ దేశాన్ని మన స్వంతం చేసుకొన్నాము. అర్నోను లోయ ప్రక్కగా అరోయేరు దేశాన్ని, గిలాదు కొండ దేశంలో సగం, వాటి పట్టణాలతోసహా రూబేను వంశంవారికి, గాదు వంశంవారికి నేను ఇచ్చాను. 13 గిలాదులో మిగతా సగం, బాషాను అంతా మనష్షే వంశంవారిలో సగం మందికి నేను ఇచ్చాను.”
(బాషాను ఓగు రాజ్యం. బాషానులో కొంత భాగం అర్గోబు అని పిలువబడింది. బాషాను ప్రాంతం రెఫాయిము దేశం అనికూడ పిలువబడింది). 14 గెషూరు, మయకాతీతు ప్రజల సరిహద్దువరకు గల మొత్తం అర్గోబు ప్రదేశం అంతా మనష్షే వంశీయుడైన యాయీరు పట్టుకొన్నాడు. ఈ ప్రాంతానికి యాయీరు తన స్వంత పేరు పెట్టుకొన్నాడు. హవ్వీత్‌యాయీరు అని పేరు పెట్టాడు. (నేటికీ ఆ ప్రాంతం బాషాను యాయీరు పట్టణాలు అని పిలువ బడుతుంది).
15 “గిలాదును నేను మాకీరుకు ఇచ్చాను. 16 మరియు రూబేను వంశానికి, గాదు వంశానికి గిలాదు వద్ద ప్రారంభం అవుతున్న దేశాన్ని నేను ఇచ్చాను. ఈ దేశం అర్నోను లోయనుండి యబ్బోకు నదివరకు ఉంది. (లోయ మధ్య భాగం ఒక సరిహద్దు. యబ్బోకు నది అమ్మోనీ ప్రజలకు సరిహద్దు) 17 పడమటి దిక్కున అరాబాలోని యొర్దాను నది వారి ప్రాంతానికి సరిహద్దు. ఈ ప్రాంతానికి ఉత్తరాన కిన్నెరెతు సరస్సు, దక్షిణాన అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) ఉన్నాయి. తూర్పున అది పిస్గా కొండచరియల క్రింద ఉంది.
18 “ఆ సమయంలో ఆ వంశాలకు నేను ఈ ఆజ్ఞయిచ్చాను: ‘మీరు నివసించడానికి యొర్దాను నదికి యివతలి ప్రక్క దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చాడు. అయితే యిప్పుడు మీ యుద్ధ వీరులు వారి ఆయుధాలు చేతపట్టి మిగతా ఇశ్రాయేలు వంశాలను నది దాటించాలి. 19 మీ భార్యలు, మీ చిన్నపిల్లలు, మీ పశువులు (మీకు పశువులు చాలా ఉన్నాయని నాకు తెలుసు) నేను మీకు యిచ్చిన ఈ పట్టణాల్లో యిక్కడ ఉండాలి. 20 అయితే మీ బంధువులైన ఇశ్రాయేలీయులకు యొర్దాను నదికి అవతల ప్రక్క యెహోవా యిస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకొనేంతవరకు మీరు వారికి సహాయం చేయాలి. ఇక్కడ మీకు శాంతి ఉన్నట్టుగానే అక్కడ వారికి యెహోవా శాంతి నిచ్చేంతవరకు వారికి సహాయం చేయండి. అప్పుడు నేను మీకు ఇచ్చిన ఈ దేశానికి మీరు తిరిగి రావచ్చును.’
21 “అప్పుడు యెహోషువతో నేను యిలా చెప్పాను: ‘మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకూ చేసిన వాటన్నింటినీ నీవు చూశావు. నీవు ప్రవేశించే రాజ్యాలన్నింటికీ యెహోవా అలాగే చేస్తాడు. 22 మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడుతాడు గనుక ఈ దేశాల రాజులకు నీవు భయపడవద్దు.’
మోషే కనానులో ప్రవేశించలేకపోవటం
23 “ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమలాడి, యిలా చెప్పాను, 24 ‘యెహోవా, నా ప్రభువా నేను నీ సేవకుడిని. నీవు చేసే ఆశ్చర్యకరమైన, శక్తివంతమైన విషయాలలో కొద్ది భాగం మాత్రమే నీవు నాకు చూపించావు అని నాకు తెలుసు. నీవు చేసిన శక్తివంతమైన మహత్కార్యాలను చేయగల దేవుడు ఆకాశంలో గాని భూమి మీదగాని లేడు. 25 యొర్దాను నదికి అవతల ప్రక్క ఉన్న ఆ మంచి దేశాన్ని, సౌందర్యవంతమైన ఆ కొండ దేశాన్ని, లెబానోనును చూడటానికి నన్ను అవతలకు దాటి వెళ్లనియ్యి అని నేను నీకు మనవి చేస్తున్నాను.’
26 “కానీ మీ మూలంగా యెహోవా నామీద కోపగించాడు. ఆయన నా మాట వినడానికి తిరస్కరించాడు. యెహోవా నాతో చెప్పాడు, ‘నీకు ఇది చాలు. ఈ విషయం నాతో యింకా చెప్పవద్దు. 27 పిస్గా కొండ శిఖరం మీదికి వెళ్లు. పడమర, ఉత్తరం, తూర్పు, దక్షిణం చూడు. నీవు నీ కళ్లతో చూడవచ్చు గాని నీవు మాత్రం ఎన్నటికీ యొర్దాను నది దాటి వెళ్లజాలవు. 28 నీవు తప్పక యెహోషువకు హెచ్చరికలు యివ్వాలి. అతణ్ణి ప్రోత్సహించి, బలపర్చు. ఎందుకంటే ప్రజలను యెహోషువ యొర్దాను నది దాటిస్తాడు. దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివసించేందుకు యెహోషువ వారిని నడిపిస్తాడు. ఈ దేశాన్నే నీవు చూస్తావు.’
29 “అందుచేత మేము బేత్పెయోరు అవతలివైపు లోయలో నిలిచిపోయాము.
యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం
(మత్తయి 20:17-19; లూకా 18:31-34)
32 యేసు, ఆయనతో ఉన్న వాళ్ళు అంతా యెరూషలేము వెళ్ళటానికి బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు దిగులుతో నడుస్తూ ఉన్నారు. యేసును అనుసరిస్తున్న యితరులు భయపడుతూ నడుస్తూ ఉన్నారు. యేసు మళ్ళీ తన శిష్యులను ప్రక్కకు పిలిచి తనకు జరుగనున్న వాటిని గురించి వాళ్ళకు చెప్పాడు. 33 ఆయన, “వినండి, మనం యెరూషలేము దాకా వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారునికి ద్రోహం జరుగుతుంది. ఆయన ప్రధానయాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. వాళ్ళాయనకు మరణ శిక్ష విధించి యూదులుకాని వాళ్ళకు అప్పగిస్తారు. 34 యూదులుకాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు. ఆయన్ని కొరడా దెబ్బలుకొడతారు. ఆ తర్వాత చంపివేస్తారు. మూడు రోజుల తర్వాత ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు.
యాకోబు మరియు యోహానుల నివేదన
(మత్తయి 20:20-28)
35 జెబెదయి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము అడిగింది చెయ్యమని కోరుతున్నాము” అని అన్నారు.
36 “ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు.
37 వాళ్ళు, “మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతి వైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చోనివ్వండి” అని అడిగారు.
38 యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగినదాన్ని మీరు త్రాగగలారా? నేను పొందిన బాప్తిస్మము మీరు పొందగలరా?” అని అడిగాడు.
39 “పొందగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందుదురు. 40 కాని నా కుడివైపు, లేక నా ఎడమ వైపు కూర్చోమనటానికి అనుమతి యిచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం నియమించబడ్డాయో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు” అని అన్నాడు.
41 ఇది విని మిగతా పది మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది. 42 యేసు వాళ్ళను దగ్గరకు పిలిచి, “యూదులుకాని వాళ్ళను పాలించ వలసిన ప్రభువులు, వాళ్ళపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్ళపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. 43 మీ విషయంలో అలా కాదు. మీలో అందరి కన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్ళందరికి సేవ చేయాలి. 44 మీలో ప్రాముఖ్యత పొందాలనుకొన్నవాడు మీ అందరికి బానిసగా ఉండాలి. 45 ఎందుకంటే మనుష్యకుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు. కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు” అని అన్నాడు.
గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం
(మత్తయి 20:29-34; లూకా 18:35-43)
46 ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు. 47 ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు.
48 చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు.
49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అని అన్నాడు.
వాళ్ళా గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు. 50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు.
51 యేసు, “ఏమి కావాలి?” అని అడిగాడు.
ఆ గ్రుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు.
52 యేసు, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. యిక వెళ్ళు” అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.
© 1997 Bible League International